మబ్బుల అడవిలో దాగున్న

సరోజినీ ప్రేమ్‌చంద్‌
శిలాలోలిత

రిసెర్చ్‌ చేస్తున్న రోజుల్లో కవయిత్రుల పుస్తకాలు ఎక్కడ దొరికినా చాలా సంతోషంగా అన్పించేది. కొత్తకొత్త కవిత్వాల కోసం అన్వేషిస్తుండేదానిని. ఫుట్‌పాత్‌ మీద పుస్తకాలు వెతుకుతుంటే ఈ ‘మబ్బుల అడవి’ అనే కవిత్వ సంకలనం దొరికింది. సరోజినీ ప్రేమ్‌చంద్‌ పేరు కూడా వినలేదప్పటికి, పుస్తకం తిరగేస్తుంటే అద్భుతమైన కవితావాక్యాలు కన్పించాయి.
‘మనం మండే కుంపట్లలా
కళ్ళు మిరుమిట్లు గొలుపుతూ
పదును బెట్టిన పదాలనిగ్గుతో
నిజానిజాల మధ్య నీడలను
నిష్కర్షగా తోలేస్తుంటే,
ఎన్నేళ్ళనుంచో చివచివలాడుతున్న
మన గాయాలను
ప్రేక్షకుల ఎదుటే కడిగేస్తుంటే,
……………
రోజుకో కవిత
చెమ్చాడు కాకరరసంలా
అహంకార జాడ్యానికి
అసమాన చికిత్సని
మా సవినయ మనవి.
స్త్రీల కవిత్వాన్ని, చిన్నచూపు చేసే వ్యవస్థ తీరును ఈ కవితలో చాలాచోట్ల పదునుగా విమర్శిస్తుంది. మంచి కవిత్వ ముంది ఇందులో. సాధారణంగా రకరకాల పూలమీద అందమైన పూలమీద కవిత్వాన్ని చూస్తాం. సరోజిని ‘గడ్డిపూల’ మీద కవిత రాసింది. ఏక గణసంఖ్యలోనే గడ్డిపూలమీద రాశారింత వరకూ. స్త్రీని గడ్డిపూలతో పోల్చింది
‘తలదించకు గడ్డిపూవూ
రెమ్మలమాటునదాగి
వణికిపోకు
పేరులెన్నయినా పూవులొక్కటే/
ఆ చిగురుటాకుల పరదాలు వదిలారా/
నీ భావనా వీచికలను
నవలోకపుటంచులదాకా
ఎగురవేయి’ అనేస్తారు.
ఎమిలీ డికిన్‌సన్‌, గులాం అహమ్మద్‌, షెల్లీ కవితలకు స్వేచ్ఛాను వాదాలు కొన్ని చేసారు.
‘నగరంలో నలుగురు’ – అనే కవితలో నలుగురు స్త్రీల అంతస్సంఘర్షణ గొప్ప కవితాత్మకతతో చిత్రించారు. విద్యార్థిని, ఉద్యోగిని, పనిమనిషి, బామ్మ గారు వీళ్ళ జీవిత నేపథ్యాన్ని వివరిస్తూ సామాజిక చిత్రాన్ని కళ్ళ ముందుంచారు. ‘దాంపత్యం’ మీద వ్యంగ్యోక్తి కవిత.
స్త్రీలలోని అంతర్ముఖ చైతన్యపు వానజల్లుల్ని అవిశ్రాంత ప్రస్థానమంటూ ‘స్వయంవరించు’ కవితలో అద్భుతంగా వర్ణించింది.
‘ఆవిర్లు లోలోపల ఎగిసి
పీడిస్తున్నాయి
సలసల మరిగిన కన్నీరు
సమాజ ముఖాన్ని కాల్చివేస్తున్నది
ముసుగులు తొలగుతున్నాయి
వికృత రణాల ప్రదర్శన జరుగుతున్నది.
మైక్రోఫామిలీలు, బాంధవ్యాల లేమి, సంకుచితమైన మనుషులకు డబ్బే ప్రధానమనుకునే తత్వాల్ని ‘చిన్నచిన్న గూళ్ళు’ కవిత ఆవిష్కరించింది.
ప్రజాస్వామిక విలువలు కావాలని, రాజకీయ దురంధరుల అవినీతి వాక్యాలిక చెల్లవనే నిర్ణయ ప్రకటనకు ‘యువత యిచ్చిన సందేశం’లో చూస్తాం. ‘అనగనగా ఒక అమ్మ’ కవితలో కూడా అమ్మను గురించి కొత్తగా భావోద్వేగంగా, ఆలోచన కలిగించేట్లుగా కవిత్వీకరించింది. మనిషి లేనప్పుడు వాళ్ళ గురించి అవతలి వాళ్ళు మాట్లాడే మానవరీతిని గమ్మత్తుగా చిత్రించినది. ‘తెలియనిది’ అనేది ప్రయోగవైచిత్రి చేసిన కవిత. కొత్త టెక్నిక్‌తో రాశారు. భాషతో పదాలతో ఆడుకోవడం, భావగాఢతతో కవిత్వీకరించడం కన్పించింది.
ఈ పుస్తకంలో వున్న అడ్రస్‌ను బట్టి ఈ కవయిత్రి మద్రాసులో వుంటున్నారని తెలుస్తోంది. అంతకు మించి వివరాలు తెలీదు. ముఖపరిచయమూ, ముఖచిత్రమూ, మనిషి జీవన చిత్రమూ యిచ్చుకోవడాలు స్త్రీలలో తక్కువనడానికి ఇదీ ఒక నిదర్శనమే. అనుకోకుండా ఒక గొప్ప కవిత్వాన్ని చదివిన రసానుభూతిని పొందినందుకు, పరిచయం చేయ గలిగి నందుకు మాత్రం సంతోషిస్తున్నాను.
ఆనాటి రచయిత్రులు
ఒకే ఒక్క మల్లెపువ్వు అపురూపంగా అందించే సువాసనలా, ఒక గులాబీ స్పర్శ కలిగించే సుఖంలా మధురానుభూతిని కలిగిస్తాయి ఆచంట శారదాదేవి గారి కథానికలు. జీవితానుభవాల సూక్ష్మరూపాలు ఈ కథానికలు. జీవితాన్ని విస్తృతంగా, విశ్లేషణా పూర్వకంగా చిత్రించే పెద్ద కథలు కావు. ఆకాశంలో మిణుకు మిణుకు మనే నక్షత్రాల్లాగ, అనంతాకాశంలో ఒంటరి నక్షత్రంలాగా సంభ్రమాన్నీ, ఆవేదననీ కలిగించే కథానికలు వీరివి.
వీరి కథా వస్తువులన్నీ దాదాపు, స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించేవే. వివాహ వ్యవస్థపై ఆధారపడిన మన పురుషాధిక్యసమాజంలో, స్త్రీల నిస్సహాయ పరిస్థితినీ, నిశ్శబ్ద చైతన్యావస్థనీ సున్నితంగా, సమర్థవంతంగా చిత్రించిన శారదాదేవి గారి కథానికలలో ప్రత్యేకించి చెప్పుకోదగిన వెన్నో ఉన్నాయి. ”పగడాలు, ”జారిన నక్షత్రం, ”జాలి గుండె”, ”దిగుడుబావి”, ”నిద్రలేని రాత్రి”, ”బ్రతుకు తీపి”, మొదలైనవి. అయితే, 1960 లోనూ 1969 లోనూ వచ్చిన రెండు కథాసంపుటాల్లోనూ చోటుచేసుకున్న ”ఒక్కరోజు” అనే కథానికని మరీ ముఖ్యంగా చెప్పుకోవాలి. మధ్య తరగతి సంసారాల్లో వివాహిత -స్త్రీ సామాన్యంగా పొందే అనుభవాన్ని చిత్రించిన ఈ చిన్న కథలో’ జీవితతత్వాన్నీ, ఆనందానికి సూక్ష్మమార్గాన్నీ సునాయాసంగా సూచించడం ఈ రచయిత్రి ప్రతిభకి తార్కాణం. ”పగడాలు”, మొదలైన మంచి కథలు తెలుగు పాఠకులనేకమందికి గుర్తున్నవే. ”ఒక్కరోజు” మరోసారి గుర్తుచేసుకోదగిన కథానిక.
”స్త్రీ హృదయంలో ఉండే అనుస్యూత సంస్కృతి, అజ్ఞాత వాంఛలు, అవ్యక్త భావ తరంగములు, అసమాన లాలిత్యము, అవ్యాజ కారుణ్యము, అఖండ త్యాగము – చక్కగా నిరూపించారు….” అని ప్రశంసించారు జస్టిస్‌ రాజమన్నారు. శారదాదేవి గారు కథలకు ముందుమాటలో. ”ఈమె ఆంటన్‌ చెహోవ్‌, కాథరీన్‌ మాన్స్‌ఫీల్డ్‌ వంటి కథకులకోవకు చెందిన ”రచయిత్రి అని శ్రీబుచ్చిబాబు కీర్తించారు. అంతే కాదు, ”సమాజం ప్రతిపాదించిన నైతిక నియమాలని అతిక్రమించకుండా, కొత్తకోణాలనుండి అనుభవాన్ని కాంక్షించడం, మెళకువతో అనుభూతిని పొందడం, ఎప్పుడూ ఏదో వొక ఆదర్శం లక్ష్యంగా ఉంచుకుని, అది లభ్యంకాక పోయినా కూడా, విముఖతతో శూన్యంలోకి దిగజారిపోకుండా, జీవితపుటంచులను పరామర్శిస్తూ ప్రాకృతిక ఆనందాన్ని సాధించగలగలాన్న ఉబలాటం – ఇవీ ప్రతి కథలోనూ వ్యక్తమవుతుంది”-అని విశ్లేషించారు బుచ్చిబాబు. ఇందుకు చక్కని ఉదాహరణ ”ఒక్కరోజు” కథ.
”… అనవసరమైన వర్ణనలు, వ్యాఖ్యానాలు, సిద్ధాంతాలు, చమత్కారమైన సంభాషణల కూర్పు కోసం పెనుగులాట, దిగ్భ్రమ కలిగించే ముగింపులు, కృత్రిమ మనస్తత్వ నిరూపణం, భాషతో కుస్తీలు, నిర్మాణంలో కసరత్తు, ఇవి లేకపోవడం, వీటిలో నిజాయితీ, వీటి అందం. శారదాదేవికి జీవితంలోతులు తెలుసు…” అని శారదాదేవిగారి రచనాశైలినీ, కథానికల విశిష్టతనీ స్పష్టం చేశారు బుచ్చిబాబు గారు.
”ఒక్కరోజు” కథలో ఆ ‘నిజాయితీ’, ‘అందం’ కనిపిస్తాయి. ‘కథ ఏముంది ఇందులో’ అనిపించే, మామూలు కథలా కనిపించే ఈ కథానికలో ఒక అమూల్యమైన జీవన సూత్రం లభిస్తుంది. ఇంట్లో నిత్య కృత్యాలతో, పతిసేవతో, పిల్లలసేవతో సతమతమయే గృహిణికి క్షణం తీరిక ఉండదనే విషయం ఎవరికీ పట్టదు. నిద్ర బద్ధకం వదలక పోయినా పొద్దున్నే లేవక తప్పదు. ప్రతిరోజూ యథావిధిగా పనులు నిర్వర్తించాల్సిందే. ”ప్రతి రోజూ ఏదో మార్పు వస్తుందని వట్టి భ్రమ. కాస్త మార్పు కోసం స్నేహితురాలితో కలిసి మల్లెతోటలోకి వెళ్లాలనుకుంటే ఏ పూటకాపూటే ఏదో ఒక అడ్డంకి. పిల్లవాడికి జ్వరమో, భర్త అవసరాలో ఏదో ఒకటి. భర్త స్వయంగా ఏ పనీ చేసుకోడు. అన్నీ అందివ్వాలి, అన్నీ వెతికివ్వాలి. ”కొంచెం ఇవన్నీ చూడకూడదూ! పుస్తకం చేతిలో పట్టుకుని నిద్రపోకపోతే!” అంటాడు భర్త. భర్త వల్లించే ఈ మామూలు పాఠం ఆ గృహిణికి కంఠతావచ్చు. రాత్రి కాగానే, ”పొద్దున్న అనవసరంగా విసుక్కున్నా” అనీ, ”రేపటి నుంచి నిన్ను ఒక్క మాట అంటే ఒట్టు” అనీ అంటాడు ప్రేమగా. ”రేపు వస్తుంది. ఈ వేళ చేయలేకపోయిన వెన్నో రేపు చేయవచ్చు… నిన్న, ఇవాళ, రేపు- వీటిలో నిజంగా ఏమీలేదు… కాని ఈ రాత్రి, ఈ చల్లదనం, ఈ ఆశలేకపోతే!…” అనుకుంటుంది ఆ గృహిణి. జీవితంలో కలిగే నిస్పృహని ఏరోజు కారోజు నవ్వుకుంటూనే దిగమింగుతూ ఆశాజీవిగా బ్రతుకు సాగిస్తుంది ఆ యిల్లాలు.
విద్యావంతులూ, ఉద్యోగస్థులూ అయిన స్త్రీల సంఖ్య పెరుగుతున్న ఈ రోజుల్లో కూడా చాలా మంది గృహిణుల పరిస్థితి శారదాదేవిగారు చిత్రించినట్లు గానే ఉంది నేటికీ. సుఖ జీవనం సాగించాలంటే, స్త్రీలకే కాదు, పురుషులకైనా ఇటువంటి సదవగాహనతో కూడిన ఆశావాదం అవసరమే.
అబ్బూరిఛాయాదేవి

Share
This entry was posted in మనోభావం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.