వెనక్కే నడుద్దామా?

కొండేపూడి నిర్మల
దాదాపు గంటనుంచే నా బుర్ర తింటోంది ఎదురింటి బాలా త్రిపుర సుందరి. ముచ్చటకీ ముచ్చటకీ మధ్య ఊపిరి పీల్చుకునే విరామం యిచ్చినాగాని పారిపోవడానికి సిద్ధంగా వున్నాను. విరామం యివ్వదల్చు కోలేదు. ఉన్న పళాన 
జెయింట్‌వీల్‌ ఎక్కించి కసిదీరా తిప్పుతున్నంత గందరగోళంగా వుంది. తను మాట్లాడుతుంటే. అక్కడికీ ఒకసారి లేచి వొంటింట్లోకి వెళ్ళి డబ్బాలు సీసాలు అనవసరంగా సర్ద్దాను. పక్కనే నిలబడి మాట్లాడింది. బుట్టలో వున్న కూరగాయల్ని తరిగి ఫ్రిజ్‌లో పడేశాను. తిరుగుతూ మాట్లాడింది. మేడ మీద ఎండిన సన్నజాజి కొమ్మలు కత్తిరించాను. పిట్టగోడ మీద కూచుని మాట్లాడింది. పేపరు తీసి చూడ్డానికి వృధా ప్రయత్నం చేశాను. చదివితే చంపుతా అన్నట్టు నా వంకే చూస్తూ మాట్లాడింది. చేసేదేంలేక ఒడ్డున పడేసిన చేపలాగా నోరు తెరిచి వింటూ కూచు న్నాను. విని విని విని అడిగాను. ఇంతకూ నన్నేం చెయ్య మంటావు? పెళ్ళి సంబంధం చూడండి, చాలు- అన్లేదు.
ఆ మాట అన్నందుకు ఏడాది క్రితం కొన్ని ప్రయత్నాలు చేశాను. ఎందుకోగాని కుదరలేదు. ఒక పక్క పబ్బుల కల్చరూ, డేటింగులూ, ప్రీమారిటల్‌ మదర్సూ, హోమో సెక్సువాలిటీలూ దేశం నిండా నడచి పోతుంటే కొందరికి తోడు దొరకడం లేదు. ఇది చిన్న సమస్యేం కాదు. పిల్లల్ని అమ్మా నాన్నలు, అమ్మానాన్నల్ని పిల్లలు కేవలం పెళ్ళి కుదరక దూషించుకోడంనాకు తెలుసు.
బాలా త్రిపురసుందరి (37) సమస్య ఏ కోవలోకి వస్తుందో అర్ధం కావడం లేదు. మీకు తెలిస్తే చెప్పండి.
”అక్కలిద్దరికీ పెళ్ళి చేశాడండీ మా నాన్న. నాకు చెయ్యడు చూశారా! నేనంటే ద్వేషం. ఎందుకనుకున్నారు? తనని మించిపోతున్నానని, ఇంట్లో చాకిరి కోసం ఆపేశాడు. అమ్మకి కాన్సరు వస్తే చేశాను. ఎలాగోలా చచ్చింది. పీడా వొదిలింది. ఇలా అంటున్నానేమిటా అనుకుంటున్నారా? ఔను నా సుఖం చూడనివాళ్ళని నేనెందుకు గౌరవించాలి. గౌరవించను. ఆవిడ పోయాకే నాకు ఎమ్మేలో సీటొచ్చింది. అక్కల పెళ్ళికి సాయం చేసిన మేనమామలున్నారు. వాళ్ళు నా పెళ్ళి పట్టించకోరు. వాళ్ళ పిల్లల జాతకాలు ఎలా వున్నాయో నేను చెప్పాల్ట. చచ్చినా చెప్పను. ఆ పెద్దపిల్ల జాతకంలో అష్టమ శని వుంది. నువ్వుల దానం చేయించాలి. నాకేం పట్టింది నేను చెప్పను. మా నాన్న వున్నాడు చూశారా? ఆయన నా పెళ్ళి సంబంధాలు చూస్తున్నా డనుకున్నారా? అంతా డ్రామా? మీతో మాట్లాడ్డానికి అదొక వంక. ఆ వంకతో గుళ్ళ చుట్టూ తిరుగు తుంటాడు. ఎందుకంటే డబ్బు లేదు. ఇంగ్లీషు రాదు. కంప్యూటర్‌ పెళ్ళి కొడుకున్ని తేలేడు. ఇంకేం చేస్తాడు. మొన్నొకడ్ని తెచ్చాడు. కుజ దోషం వాడిని. అసలు వాడి మొహం చూడగానే అర్ధమయింది. వాడి ఎడమ కంట్లో పుట్టు మచ్చ వుంది. అది అపశకునం. నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను. ట్రావెలింగు ఏజెన్సీలో చేస్తున్నపుడు ఆ మేనేజరు ఇంట్రస్టుగా మాట్లాడేవాడు. తీరా అడిగాను. డైరెక్టుగా కాదు లెండి. నక్షత్రం ఏమిటి? అన్నాను. చెప్పాడు. మా జాతకాలు చూశాను. బానే కలిశాయి. పెళ్ళి విషయం కదిలించాను. ఏం మాయరోగం వచ్చిందో తెలీదు. మాట్లాడ్డమే మానేశాడు.
ఉషామోహన్‌ ఆస్పత్రిలోనూ అంతే. ఇద్దరు నన్ను ఇష్టపడ్డారు. ఒకరి జీతం బావుండే జీవితం ఎలాగూ బావుంటుంది కదా అనుకుని పెళ్ళి ప్రయత్నం చేశాను. కానీ వాడు ఇంకెవర్నో లవ్‌ చేస్తున్నాడు. ఆవిడకి ఎప్పుడో పెళ్ళయింది. పైగా వాళ్ళిద్దరి జాతకాలూ అస్సలు కలవ్వు. అయినా లవ్‌ చెయ్యడం మాన్లేదు. దేవుడికి నమస్కారం చేసి శాపం పెట్టాను. ఆవిడకి అబార్షనయింది. ఆఫీసుకి రావడం లేదు. లైన్‌ క్లియర్‌ అయింది అనుకున్నాను. కానీ ఇప్పుడు వాడు ఇంకో రిసెప్షనిస్టుతో తిరుగుతున్నాడు. ఛీ ఈ మగాళ్ళంతా మోసం అనుకుని ఉద్యోగం రిజైన్‌ చేశాను.
మ్యారేజీ బ్యూరోలో టైపిస్టుగా చేరాను. అక్కడికి వచ్చిన సంబంధాల్లో ఒక్కటి కూడా నేను ప్రయత్నించుకోకూడదట, అలా చేస్తే రూ.10,000 కట్టాలట. ముందుగా నిబంధన పెట్టారు. ఇంకెలా మరి, మానే శాను. లిటిల్‌ బర్డ్స్‌ స్కూల్‌లో సెక్రటరీగా చేరాను. ప్రిన్సిపాల్‌ కోతిలాగా వుంటాడు. ధనూ రాశిలో పుట్టినవాడు అలా ఎలా వున్నాడో నాకు ఆశ్చర్యం. నిజానికి బావుండాలి కదా. సరే పోన్లే అని వాడితో పెళ్ళి మాటలు మాట్లాడాను. నా నక్షత్రం వల్ల వాడికి వ్యాపారం బాగా కలిసి వస్తుందని కూడా చెప్పాను. విన్లేదు తింగర వెధవ.తెల్లతోలు వుంది కదాని ఆ ఇంగ్లీషు టీచర్‌ వెనక పడతాడు. ఏం చెయ్యమంటారో మీరే చెప్పండి. మనశ్శాంతిగా వుండటానికి గుళ్ళోకి వెడతానా, అక్కడి పూజారిగాడు నన్ను చూసి దేవీ పాటలు పాడతాడు. అబ్బ విసుగొచ్చేస్తోంది.
నిద్ర లేచిన దగ్గర్నించీ నాన్న మొహం చూడాలి. పుట్టినప్పటి నుంచీ ఇప్పటివరకూ ఒకటే మొహం చూసి చూసి బోరు కొట్టదా? మీరే చెప్పండి. అసలు ఆయనిది విపత్తార. అంటే పిల్లల్ని కష్టాల్లో పడేసే తార. నా వరకు నేను వొండుకు తిని పక్కింటి టైలరింగు క్లాసుకి వెళ్ళిపోతా. ఆయన తిండీ తిప్పలూ నాకు తెలీదు. తిరగనివ్వండి. గుళ్ళ చుట్టూ గోపురాల చుట్టూ తిరిగి ప్రసాదం తెచ్చుకుంటాడుగా. అవి తింటాడులెండి…”
ఎలాగోలా పెళ్ళి చేసుకోవాలనే తొందరలో బాలాత్రిపుర ఏమిటేమిటో అయిపోతోంది. మనసునిండా ద్వేషం నింపుకుంటోంది.
ఆ మాట కూడా చెప్పాను.
”ఒడ్డున కూర్చున్న వాళ్ళకేం తెలుస్తాయి లెండి. మునుగుతున్న వాడి బాధ” అంది.
కావచ్చు నిజంగానే ఇప్పటికీ తనంతట తను జీవితభాగస్వామిని వెతుక్కోవాలంటే సరయిన, విశ్వసనీయమైన వేదిక ఏదీ లేదు.
చాలామంది యువతీ యువకుల మాదిరి బాలా త్రిపుర సుందరికి పెళ్ళి ఒక్కటే సమస్య కాదు. జ్యోతిష్యం, గ్రహాలు, రాసులు, వాస్తులు-అవేే జీవితమనుకోవడం అసలు సమస్య.
ఇది వ్యక్తిగత సమస్యకాదు. బహుళ జనుల భావావేశాల సమస్య కాదు. కళాత్మక రూపంలో కనిపించే వంచన. భయంకరమైన నిర్భంధం.
పెంపకం ద్వారా సగం అభిప్రాయాలు ఏర్పడితే, ప్రముఖ విశ్వవిద్యాలయం యిచ్చిన పట్ట భద్రత వల్ల దానికి సాధికారత వస్తుంది. (బాలా త్రిపుర సుందరి పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయంలో జ్యోతిష్యం పోస్టు గ్రాడ్యుయేషన్‌ చేసింది). అంతవరకూ అలంకరణ కోసం ధరించే ఉంగరాలు, గొలుసులు ఇపుడు జెమాలజీ నిపుణుల సూచనద్వారా అష్ట ఐశ్వర్య సాధనాలుగా మారాయి. ఇంటింటికొక విషం సీసా చొప్పున టీవి సీరియళ్ళలో కనిపంచే అమానవ విలువలు ద్వారా శాపాలు పెట్టడం నేర్చుకుంది. రేపెప్పుడో విజయ వంతంగా బాణామతి నేర్పబడును అని బోర్డు కనబడితే కార్పోరేట్‌ కాలేజీల్లోనూ దాన్ని సిలబస్‌ చేసుకుని కోచింగు సెంటర్లు పెట్టేస్తారు. ఎవరి పెరట్లోనో కాసిన బొప్పాయిపండు వినాయకుడి తొండం లాగానూ, పొట్లకాయ హనుమంతుడి తోక లాగానూ వుందనే వార్తను చూసిన కళ్ళకి మన ఇంట్లో కూడా అలాంటి విచిత్రాలు జరిగితే బావుండని పిస్తుంది. ఈ ధోరణిని ప్రశ్నించడానికి వ్యతిరేకించడానికి ఎవరి ఆసరా కనిపించదు. క్రమ క్రమంగా హేతువాదుల సంఖ్య మైనారిటీ వర్గంగా మారిపోతోంది. ఇది ప్రజా వుద్యమాలకు కూడా పెద్ద దెబ్బ. కాబట్టి ఎటువంటి వరుడు కావాలో బాలాత్రిపుర సుందరికి తెలీదు.
ఎటువంటి విలువలు కావాలో సమాజానికీ అర్ధం కాదు. బాలా త్రిపుర ఇలాగే పుట్ట లేదు. తయారు చేయబడింది. సమాజం కూడా అంతే. అత్యంత ప్రేమతో మనమే ఈ దిశకు ఈడ్చుకొచ్చాం.

Share
This entry was posted in మృదంగం. Bookmark the permalink.

2 Responses to వెనక్కే నడుద్దామా?

  1. “కళాత్మక రూపంలో కనిపించే వంచన.” నిజమే కానీ ఏంచేద్దాం ఈ వంచనలోనూ ఆనందం లేదే!

  2. నిజమే. హేతువాద ఉద్యమము ఈ రోజుల్లో అంత బలంగా వుండక అన్నీ మూఢనమ్మకాలే చెలామణీ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.