భూమిక హెల్ప్‌లైన్‌ : మూడేళ్ళ ప్రయాణం

కె.హేమంత

భూమిక హెల్ప్‌లైన్‌ ఆక్స్‌ఫామ్‌ వారి ఆర్థిక సహాయంతో ఎంతో సమర్థవంతంగా నిర్వహించబడుతున్న విషయం అందరికీ విదితమే. అయితే ఆక్స్‌ఫామ్‌ వారు ఈమధ్య కొత్తగా చేపట్టిన DFID ప్రాజెక్ట్‌ కింద ”సివిల్‌ సొసైటీ రిసోర్స్‌ ఫెసిలిటీ” గా బాధ్యతలు నిర్వహించేందుకు భూమిక హెల్ప్‌లైన్‌ను ఎంచుకొనడం జరిగింది. ఇది గత మూడు సంవత్సరాలుగా భూమిక చేస్తున్న కృషికి గుర్తింపుగా మనం భావించవచ్చు. ఈ ప్రాజెక్టుపై భాగస్వాములతో అవగాహనా సదస్సు మరియు గడిచిన మూడు సంవత్సరాలలో భూమిక హెల్ప్‌లైన్‌పై విశ్లేషణా సదస్సు ఏప్రిల్‌ 27న సెలెబ్రిటీ క్లబ్‌లో నిర్వహించడం జరిగింది.
భూమిక హెల్ప్‌లైన్‌ కో-ఆర్డినేటర్‌ కొండవీటి సత్యవతి సమావేశం ప్రారంభిస్తూ ప్రాజెక్టు గురించి కొద్దిగా వివరించారు. ఆక్స్‌ఫామ్‌ వారు చేపట్టిన Stop violence against women (VAW) (మహిళలపై హింసను నిర్మూలిద్దాం) కార్యక్రమంలో భాగంగానే భూమిక హెల్ప్‌లైన్‌ నిర్వహించబడుతోంది. ఈ మధ్య కాలంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో స్త్రీలపై జరుగుతున్న హింసాత్మక సంఘటనలు మరింతగా పెరగటం మనం చూస్తూనే వున్నాం. పూర్వంలా కాక నేటి స్త్రీలు తమ మనోభావా లను స్పష్టంగా తెలియజేయటం, అణిగి మణిగి వుండకపోవటం అనేవి ఇందుకు ఒక కారణం కావచ్చు. ఇది ఎంతవరకు నిజం అనేవి కూడా మనం లోతుగా చర్చించవలసి వుంది. ప్రస్తుతం మనం ప్రస్తావిస్తున్న DFID ప్రాజెక్టు ముఖ్య వుద్దేశ్యం (“Promoting violence free lives for women from marginalized communities in India) సమాజంలో అంచులను నెట్టివేయబడిన వర్గాల స్త్రీలకు హింసలేని జీవితం అందజేయడం. ఈ ప్రాజెక్టుపై మరిన్ని వివరాలను సత్యవతిగారు పరిచయాల తరువాత తెలియజేశారు.
దళిత స్త్రీ శకి, హైదరాబాదు, ఎ.పి.వుమెన్స్‌ నెట్‌వర్క్‌ హైదరాబాదు, రెడ్స్‌ తూర్పుగోదావరి, కృషి కరీంనగర్‌, ఎస్‌వైఓ వరంగల్‌, అస్మిత హైదరాబాదు, రంగారెడ్డి జిల్లా, పీస్‌ వరంగల్‌, షహీన్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌ పాతబస్తీ, హైదరాబాదు, సెర్ప్‌ ఇందిరా (కాంతి పథం)ఎస్‌విఎఎస్‌ తూర్పుగోదావరి మొదలగు సంస్థల ప్రతినిధులు, ప్రముఖ రచయిత్రులు, లాయర్లు ఇంకా హెల్ప్‌లైన్‌ వాలంటీర్లు మొత్తం కలిపి సుమారు 75-80 మంది ఈ సమావేశాలకు హజరయ్యారు.
పరిచయాల సమయంలో సెంట్రల్‌ యూనివర్సిటీలో ఆంగ్ల ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సునీతారాణిగారు మాట్లాడుతూ విద్యార్ధులలో ”స్త్రీలపై హింస” అనే అంశంపై అవగాహన కలిగించేలా కృషి చేయాల్సిన అవసరం చాలా వుందని వుద్ఘాటించారు. తమ యూనివర్సిటీలో జరిగిన ఒక సంఘటనను ఈ సందర్భంగా ఆమె వివరించారు. ఆడపిల్లలు మగపిల్లలు రెండు వేర్వేరు గ్రూపులుగా ఏర్పడి జరుగుతున్న చర్చా గోష్టిలో భాగంగా ఎంతమంది తమ తల్లులు హింస లేదా వివక్షను ఎదుర్కొనడం గమనించారని ప్రశ్నించడం జరిగింది. ఇందుకు సమాధానంగా దాదాపు 90% మగపిల్లలు తమ తల్లులు ఇంట్లో హింస ఎదుర్కొంటు న్నారని తమ భార్యలను కొట్టో, భయపెట్టో తమ అదుపాజ్ఞ లలో వుంచుకొనడం అనేది సమాజంలో భర్తల బాధ్యతగా భావిస్తున్నట్లు వారు చెప్పు కొచ్చారు. ఉన్నత చదువులు చదువుతున్న నేటి యువతలో కూడా ఇటువంటి ఆలోచనా ధోరణి ఇంకా ప్రబలుతూ వుందంటే దాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు మహిళలపై హింస మూలాలు ఎంత లోతుగా వేళ్ళూనుకొని వున్నాయో.
SWARD సంస్థ నిర్వాహకురాలు శివకుమారి మాట్లాడుతూ ప్రత్యక్ష కౌన్సిలింగు అనేది ఒక్కొక్కసారి కౌన్సిలర్లను కూడా ఒత్తిడికి గురిచేస్తుందని చెప్పారు. SWARD కంట్రోల్‌రూమ్‌ లోని మహిళా పోలీస్‌ స్టేషన్లో ఒక కౌన్సిలింగు సెంటర్‌ నిర్వహిస్తున్నామని చెప్పారు. సర్వోదయ యూత్‌ ఆర్గనైజేషన్‌ నుండి వచ్చిన పి. దామోదర్‌ గారు మాట్లాడుతూ తమ సంస్థ వినియోగదారుల హక్కులు, ఇంకా గిరిజన హక్కుల అంశాలపై పనిచేస్తుందని తెలియజేశారు. ఎ.పి. వుమెన్స్‌ నెట్‌వర్క్‌ ద్వారా ష్ట్రజూఈఐ సంస్థనుండి వచ్చిన శ్యామల గారు మాట్లాడుతూ తామొక కౌన్సిలింగు సెంటర్‌ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. వీరితో పాటు ఇంకా సమావేశాలలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ తమ గురించి, తమ సంస్థల గురించి వివరించారు. పరిచయాలు, టీ విరామం తరువాత కొండవీటి సత్యవతి DFID ప్రాజెక్టు నేపధ్యం గురించి మరింత స్పష్టంగా వివరించారు.
భారతీయ స్త్రీలు అని ప్రస్తావించినప్పుడు వీరిని ఒకే గ్రూపుగా మనం వర్గీకరించకూడదు. ఎందుకంటే వివిధ సామాజిక వర్గాలనుండి, కులాల నుండి వచ్చే స్త్రీలు ఎదుర్కొనే సమస్యలు, వివక్ష విభిన్న కోణాలలో, స్థాయిల్లో వుంటుంది. ఇది సాహితీ వర్గాల్లోనే కాక మామూలు సామాజిక పోకడలో కూడా కొట్టొచ్చినట్టు కనబడుతుంది. అందువల్ల ప్రస్తుత D FID ప్రాజెక్టు సమాజంలో అంచులకు నెట్టివేయబడ్డ వర్గాల స్త్రీలకు హింసలేని జీవితం అందించడం అనే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తుంది. ఈ వర్గాలకు చెందిన స్త్రీలకు హింసను ఎదిరించటానికి గాని, వివక్షను ప్రశ్నించడానికి కాని అనుకూలించే సౌకర్యాలు, న్యాయ సహాయం, ఇంకా చేయూతనందించే సదుపాయాలు అందుబాటులో లేవనేది నగ్న సత్యం.
DFID రిపోర్టు ప్రకారం జీవన ప్రమాణాల స్థాయిలో మనదేశానిది 137వ ర్యాంకు. మనదేశంలో పేద ప్రజలలో 70% మంది స్త్రీలే. స్త్రీల జీవనకాలం 44% కాగా, స్త్రీ అక్షరాస్యత కేవలం 46% మాత్రమే. నేటి సైంటిఫిక్‌ యుగంలో వివిధ రంగాలలో మేధోపరంగా, ఆర్థికపరంగా మనదేశం ఎంతో అభివృద్ధి చెందింది. కానీ ప్రసవ సమయంలో మనదేశంలో మరణిస్తున్న స్త్రీల సంఖ్య చాలా ఎక్కువ. నోబెల్‌ బహుమతి గ్రహీత డా. అమర్త్యసేన్‌ చెప్పిన ప్రకారం 39.76% స్త్రీలు మనదేశంలో జన్మించకుండానే తప్పిపోతున్నారు. భారతదేశంలో పురుషుల, స్త్రీల సెక్స్‌ రేషియో 1000 :927 గా వుంది. ప్రసవ సమయంలో స్త్రీల మరణాలు, ఇంకా శిశు మరణాలు లింగ నిర్ధారణ పరీక్షలు ఈ సెక్స్‌ రేషియో పడిపోవడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. లైంగిక అత్యాచారం, వావి వరుసలు మరిచి కూతుర్లు, చెల్లెళ్లపై లైంగిక అత్యాచారం, ఆడపిల్లలు కరువై ఒకే స్త్రీని పదిమంది పెళ్ళాడటం, చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి లైంగిక వృత్తిలోకి బలవంతంగా దింపడం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో లైంగిక నేరాలు పెచ్చరిల్లడానికి ఈ పడిపోతున్న సెక్స్‌రేషియో ఒక ప్రధాన కారణం.
ప్రధాన స్రవంతి ప్రసార మాధ్యమాలన్నీ మన రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను ఎంతో ఆశావహంగా చూపిస్తున్నా వాస్తవం ఇందుకు పూర్తి వ్యతిరేకంగా వుంది. మనదేశం మొత్తం మీద హింసలో ఆంధ్రప్రదేశ్‌ ప్రధమస్థానంలో వుంది. ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ మొదటిస్థానంలో వుంది. పట్టణాల్లోనే కాక పల్లెల్లో కూడా స్త్రీలు ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తోంది. ఇటువంటి పరిస్థితులలో హింసను మనం ఎలా తగ్గించగలం. ఈ DFID ప్రోగ్రాం ఏ విధంగా వుపయోగకర మార్పును తీసుకు రాగలదో చూద్దాం.
21వ శతాబ్దంలో, అరవై ఏళ్ళ స్వాతంత్య్ర చరిత్రలో నేటికీ మన పార్లమెంట్లో స్త్రీల ప్రాతినిధ్యం 9% మాత్రమే. ఇది స్త్రీల సమస్యలపై పాలకుల, రాజకీయ నాయకుల నిజాయితీ లేని తనాన్ని సూచిస్తుంది. స్త్రీల సమస్యల విషయానికొచ్చేసరికి మహిళా నాయకులు కూడా మగవారిలా ఆలోచించడం మొదలుపెట్టి స్త్రీలకు బదులుగా కేవలం వారి వారి పార్టీ ప్రతినిధులుగా మాత్రమే మిగిలిపోతున్నారు. ఒక ప్రణాళికను లేదా ప్రతిపాదనను ప్రభావితం చేయాలంటే దానికి తగిన ప్రాతినిధ్యం పార్లమెంటులో వుండాలి. పార్లమెంటులో 33% మహిళా ప్రాతినిధ్యం కొరకు కూడా ప్రాజెక్టు ద్వారా కృషి చేయడం జరుగుతుంది.
ముందుగా చెప్పుకున్నట్టు ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం అంచులకు నెట్టివేయబడిన వర్గాల స్త్రీలు. సమాజం వల్ల, సామాజిక వర్గీకరణ వల్ల, రాజ్యం వల్ల, వివక్షకు గురౌతున్న మహిళలను అంచులకు నెట్టివేయబడిన స్త్రీలుగా గుర్తించడం జరుగుతుంది. హింసను భరించడం అనేది ఈ స్త్రీల జీవితాలలో ఆనవాయితీగా మారింది. ఈ స్త్రీలను సామాజికంగా, వివక్ష పూరితంగా పక్కకు నెట్టివేయడం (Social Exclusion) అనే దురాచారాన్ని రూపుమాపటం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశ్యం.
మౌనంగా హింసను భరించడం, జెండర్‌ సమానత్వం పట్ల ప్రభుత్వ, ప్రయివేట్‌ వ్యవస్థలలో నెలకొన్న నిర్లక్ష్య వైఖరి, న్యాయవ్యవస్థ పట్ల మహిళల్లో కరువవుతున్న భరోసా, సరైన ప్రత్యామ్నాయ సహాయ సదుపాయాలు లేకపోవటం మొదలైన మహిళల పట్ల పెరుగుతున్న హింసకు దానిని బాధితులు మౌనంగా భరించటానికి గల కారణాలుగా చెప్పుకోవచ్చు. న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేనపుడు, ఒక వేళ ఎవరైనా హింసను ఎదిరించి నిలబడ్డా తగిన ప్రత్యామ్నాయ సదుపాయాలు లేక భవిష్యత్తు పట్ల భయం అనిశ్చితి వల్ల స్త్రీలు హింసను, వివక్షను మౌనంగా సహిస్తూ, భరిస్తూ వుంటారు. ఇటీవలి రికార్డులు ప్రకారం మహిళలపై హింస కారణంగా నమోదైన మొత్తం కేసులలో కేవలం ఒక శాతం కన్నా తక్కువ కేసులు మాత్రమే పరిష్కారమయ్యాయంటే దీన్నిబట్టే అర్థం చేసుకోవచ్చు మన న్యాయవ్యవస్థ బాధిత మహిళలకు కల్పిస్తున్న భరోసా ఏపాటిదో.
హింస, లేక వివక్షకు బాధితులైన మహిళల సహాయార్థం ప్రభుత్వం ఏర్పరచిరని సహాయ సదుపాయాలు అంతంత మాత్రంగానే వున్నాయి. ప్రభుత్వ నిర్వహణలో వున్న కొన్ని సహాయ కేంద్రాలు సరైన నిర్వహణ లేక దయనీయ స్థితిలో నిరుపయోగంగా వున్నాయి. ఆది నుంచీ స్త్రీలపై కుటుంబం, కులం, మతం, రాజ్యం యొక్క ఆధిపత్య ధోరణి రాజ్యమేలుతోంది. ఇంతటి ఆంక్షల మధ్య, మరొకరి పెత్తనంలో జీవించే స్త్రీల జీవితాలు సహజంగానే ఒత్తిడికి గురౌతూ వుంటాయి. అందువల్లనే హింసకు గురెన స్త్రీలు హింసను ఎదిరించడానికి భయపడుతూ వుంటారు. ఇంట్లో స్త్రీలు ఎంత హింసకు గురైనా కూడా అది బయటకు చెప్పుకోరు. ఎందుకంటే కుటుంబ పరువు పోతుందని ఒకవేళ ఏ స్త్రీ అయినా చెప్పుకున్నా కుటుంబ పరువు తీస్తోందని సమాజం కూడా ఆమె పట్ల చిన్నచూపు చూసే పరిస్థితులే మనకు ఎక్కువగా కనపడతాయి. ఇలా కుటుంబ పరువు అనే భారం స్త్రీలు మాత్రమే ఎందుకు మోయాలి? అలాగే హింస చేసే వారిని తప్పు పట్టకుండా హింసను భరించే వారికే హింసను కప్పిపుచ్చే భారం కూడా ఎందుకు ఉండాలి?
సామాజిక పరంగా, కుటుంబ పరంగా స్త్రీలపై హింస/వివక్ష కొనసాగుతున్న అసమానతలను చెరిపివేసే దిశగా ఈఓ|ఈ ప్రోగ్రాం కృషి చేస్తుంది. ఇందుకు ముందుగా స్త్రీలపై హింసను అంగీకరించకుండా వుండే విధంగా ముందుగా కుటుంబ సభ్యులను చైతన్యపరుస్తుంది. ఆపై సమాజంలో ప్రతి ఒక్కరు స్త్రీలపై జరుగుతున్న హింసను గుర్తించి, ప్రశ్నించే విధంగా కూడా ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పు కలింగించే దిశగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అలాగే హింసను ఎదిరించి, వ్యతిరేకించి న్యాయపరంగా, సామాజిక పరంగా పోరాడాలనుకునే, లేదా మరో దారి లేక హింస నుండి బయట పడాలనుకునే స్త్రీల కొరకు వారికి కావలసిన తగు ప్రత్యామ్నాయ సదుపాయాలు కల్పించేలా, అలాగే అవి సక్రమంగా పనిచేసి, బాధితులకు అందుబాటులో వుండే విధంగా చూడటం అనేది ఈ ప్రోగాంలో ఒక ముఖ్య భాగం. అలాగే, స్త్రీల శ్రేయస్సు కోరే, సహకారం అందించే చట్టాలు చాలా వున్నాయి. కాని వాటిని వుపయోగించుకునే విధంగా నేటి పరిస్థితులు లేవు. చాలా సందర్భాలలో తమకు ఫలానా అధికారం లేదా హక్కు ఫలానా చట్టం ద్వారా అందుబాటులో వుంది అనే విషయాలు చాలా మందికి స్త్రీలకు తెలియదు. ఉదాహరణకు గృహహింస చట్టం క్రింద భర్త ఇంట్లో వుండే పూర్తి అధికారం హక్కు భార్యకు వుంది, అది అద్దె ఇల్లయినా సరే ఆ ఇంట్లో నుంచి ఆమెను వెళ్ళగొట్టే హక్కు అత్తమామలకే కాదు భర్త కూడా లేదు. కాని చట్టంలో వున్న ఈ సదుపాయం గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇలా స్త్రీలకు ఉపయోగకరంగా వుండే చట్టాలను మరింత సమర్థవంతంగా ప్రజలలోకి తీసుకువెళ్ళే ప్రయత్నం ఈ ప్రోగ్రాం ద్వారా జరుగుతుంది.
కుటుంబ స్థాయిలో మొదలుకొని, వర్గ స్థాయికి, గ్రామ స్థాయికి, ఆపై సామాజిక స్థాయిలో స్త్రీలపై హింసను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించే విధంగా వివిధ కార్యక్రమాల ద్వారా భాగస్వామి సంస్థలు (Partner Organization) పని చేయవలసి వుంటుంది. వారు పనిచేసేచోట స్థానికంగా స్త్రీలపై హింస వివక్షకు సంబంధించిన ప్రధాన అంశాలను గుర్తించి తగు విధంగా సమస్య పరిష్కారం కోసం కృషి చేయవలసి వుంటుంది. ఆ క్రమంలో ఎదురయ్యే ఆటుపోటులను గుర్తించి అవి అధిగమించటంలో అందరూ కలిసి చర్చించి సమన్వయపరచుకొనే విధంగా అలాగే భాగస్వాములకు అవసరమైన సహాయ సహకారాలను అందించటం ”సివిల్‌ సొసైటీ రిసోర్స్‌ ఫెసిలిటీ” ప్రధాన బాధ్యత అని ముగిస్తూ సత్యవతి భాగస్వామి సంస్థల ప్రతినిధులను మాట్లాడవలసిందిగా కోరారు.
ముందుగా SWARD సంస్థ ప్రతినిధి శివకుమారి గారు మాట్లాడుతూ హింసకు బాధితులైన 80% స్త్రీలు చివరి ఆశగా పోలీస్‌ స్టేషన్‌ను ఆశ్రయిస్తారు. చాలా సందర్భాలలో వీరికి తగు విధమైన దిశానిర్దేశం, సహాయ సహకారాలు పోలీసుల నుండి అందవు. చాలా చోట్ల నిర్లక్ష్య ధోరణి కనిపిస్తుంది. ఒకసారి కార్యక్రమంలో భాగంగా జైపూర్‌లోని పోలీస్‌ స్టేషన్‌ను సందర్శించడం జరిగింది. అక్కడ పోలీస్‌ స్టేషన్‌కు అనుసంధానంగా ఒక కౌన్సిలింగు సెంటర్‌, ఒక తాత్కాలిక వసతి గృహం (Short stay home) నిర్వహించబడుతున్నవి. ఈ విధమైన ఏర్పాటు ప్రతి పోలీస్‌ స్టేషనుకు వుంటే బాధిత స్త్రీలకు చాలా వుపయోగకరంగా వుంటుంది అని చెప్పారు. ఈ దిశగా కృషి చేసేటప్పుడు అధికారులను కూడా కలుపుకుని పనిచేయగలిగితే మంచి ఫలితాలను సాధించవచ్చు అని చెప్పారు.
షహీన్‌ రిసోర్స్‌ సెంటర్‌ ఫర్‌ వుమెన్‌ అనే సంస్థ హైదరాబాద్‌ పాత బస్తీలోని ముస్లిం మహిళల సమస్యల పరిష్కారం అభివృద్ధి కోసం పనిచేస్తోంది. పాత బస్తీలోని నిరుపేద ముస్లిం కుటుంబాలలోని బాలికలు కుటుంబ సభ్యులవల్ల కూడా లైంగిక అత్యాచారాలకు గురౌతున్నారు. ఆర్ధిక ఇబ్బందులలో కూరుకు పోయి అప్పులు తీర్చుకొనడం కోసం కన్న బిడ్డలను అరబ్‌ షేకులకు అమ్ముకోవటం అనేది కూడా ఇక్కడ సామాన్య విషయమే. అందువల్లే ఇక్కడ బాల్యవివాహాలు, చిన్నపిల్లలను బలవంతంగా లైంగిక వృత్తిలోకి దింపడం అనేవి సాధారణ విషయాలు. షహీన్‌ సంస్థ ఇక్కడి ముస్లిం మహిళల సమస్యలను గుర్తించి వారికి తగిన సహాయం అందించడం, బాధిత మహిళలలో ఆత్మవిశ్వాసం పెంపొందించి ఆర్థికంగా స్వతంత్రులుగా జీవించే అవకాశం కల్పించటం కోసం వారికి అనువైన వృత్తి విద్యలు నేర్పటం, వంటి కార్యక్రమాలు చేపడుతుంది. ప్రస్తుతం తమ సంస్థ 14, 15 ఏళ్ళ బాలికలకు ట్రాఫికింగు గురించి తెలియచేసి, ఆడపిల్లలు తమను తాము ఎలా రక్షించుకోవాలి అనే అంశాలపై సమ్మర్‌ క్యాంప్‌లు నిర్వహిస్తున్నట్లు, షహీన్‌ ప్రతినిధి సుల్తానా తెలియజేశారు.
రెడ్స్‌ (REDS) సంస్థవారు అనంతపూర్‌లో మహిళల కోసం కౌన్సిలింగు సెంటర్‌ నిర్వహిస్తున్నారు. సంస్థ నిర్వాహకురాలు భానుజ మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో ST, ముస్లిం మహిళల ట్రాఫికింగు చాలా పెరిగిందన్నారు. పేదరికం, తెలిసీ తెలియని వయస్సులో ఆకర్షణకు లోనై డబ్బు, వ్యామోహాల మోజుతో ఆడప్లిలలు ట్రాఫికింగు బారిన పడుతున్నారు. ప్రభుత్వ నిర్వహణలోని తాత్కాలిక వసతి గృహాల పనితీరు విషయంలో తనకు ఎదురైన అనుభవాన్ని భానుజ సభికులతో పంచుకున్నారు. ఒకసారి పూనేలోని వ్యభిచార గృహాల నుండి జిల్లాకు చెందిన 60 మందికి పైగా బాలికలను రక్షించటం జరిగింది. ఇలా తీసుకువచ్చిన బాలికలను ప్రభుత్వ తాత్కాలిక వసతి గృహాలకు పంపటం జరిగింది. తర్వాత ఒకసారి ఈ బాలికలను చూడటానికి భానుజ వెళ్ళారు. అక్కడికి వెళ్ళినాక తెలిసింది కొంతమంది గోడ దూకి పారిపోయారని మిగతావారి మాటల బట్టి తెలిసిందేంటంటే అక్కడ ఆ వసతి గృహంలో వారు ప్రత్యక్ష నరకం అనుభవిస్తున్నారు. సరిగ్గా ఒక మనిషి కూర్చోటానికి కూడా వీలులేని స్థలంలో వుంటూ మరుగుదొడ్డి పక్కనే తిండి, పడక రెండూ. చాలీచాలని భోజనం ఒక పూట మాత్రమే. ఆకలి బాధ తట్టుకోలేక తమలో కొంతమంది పారిపోయారని మిగిలినవారు తెలియజేశారు. ఇటువంటి దైన్యజీవితాలను ప్రతి రోజూ చూస్తూ మతి చలించకుండా, ధైర్యంగా సమస్యను పరిష్కరించటానికి చాలా రాటుదేలాలని భానుజ తెలియజేశారు. భానుజ మాటలు చాలామందిని కన్నీరు పెట్టించాయి.
చట్టాల అమలులో జాప్యం వల్ల కలిగే పరిణామాల గురించి ఒక ఉదాహరణతో మరో ప్రతినిధి శ్యామల తెలియజేశారు. గృహహింస చట్టం ప్రకారం రెండు నెలలలో కేసు పరిష్కారం కావాలి. ఒక కేసు 6వ నెల గర్భవతి అయిన బాధిత మహిళ గృహహింస చట్టం కింద తన ప్రసవానికి వైద్య ఖర్చులు, భర్తనుండి భరణం కోరుతూ కేసు వేసింది. ప్రస్తుతం ఆమె బిడ్డకు ఏడవ నెల, ఇంకా ఆమె కేసు పరిష్కారం కాలేదు. మరొక కేసు ట్రాఫికింగు నుంచి రక్షింపబడ్డ మహిళలకు ప్రత్యామ్నాయ వృత్తులు చేపట్టడం కోసం ప్రోత్సాహకంగా ప్రభుత్వం ఒక్కొక్కరికి రూ. 5000/- పొందే అవకాశం కల్పిస్తోంది. అయితే దీనికి ప్రొటెక్షన్‌ ఆఫీసరు అనుమతి ఇవ్వాలి. కాని ఒక రక్షణాధికారి 5000/- తనకు లంచం ఇస్తే కాని కాగితం ఇవ్వనన్నాడు. ఇలా చట్టాలు, ప్రభుత్వ పథకాలు నిర్వీర్యమౌతున్న సంఘటనలే ఎక్కువగా వున్నాయన్నారు శ్యామల. వీరితో పాటు ఇంకా చాలా మంది ప్రతినిధులు తమ అనుభవాలను పంచుకున్నారు. అలాగే స్త్రీలకు వుద్దేశించబడి చేసిన చట్టాలు, ప్రభుత్వ పథకాలు సరైన విధంగా అమలయ్యేలా చూడటం మనందరి కర్తవ్యం అన్నారు. అంతేకాకుండా ప్రత్యామ్నాయ, తాత్కాలిక వసతి గృహాల విస్తృత ఏర్పాటు అవి సక్రమంగా పనిజేసి అందులో ఏ మహిళైనా సరే కనీసం ఒకరోజన్నా వుండగలిగే సదుపాయం కల్పించేలా కృషి చేయాలని కూడా అందరూ అంగీకరించడంతో కార్యక్రమం ముగిసింది. వివిధ స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో పాటు, ప్రముఖ రచయిత్రులెందరో ఈ సమావేశంలో పాల్గొన్నారు.అబ్బూరి ఛాయాదేవి, ఘంటశాల నిర్మల, శిలాలోలిత, తురగా జానకీరాణి, దేవకీదేవి, ఆర్‌.శాంతసుందరి, వారణాసి నాగాలక్ష్మి తదితర రచయిత్రులు ఎంతో ఉత్సాహంగా చర్చల్లో పాల్గొన్నారు.
భోజనాల అనంతరం భూమిక హెల్ప్‌లైన్‌ రివ్యూ మీటింగు ప్రారంభమైంది.
భూమిక హెల్ప్‌లైన్‌ కోఆర్డినేటర్‌ కొండవీటి సత్యవతి సభను ప్రారంభించారు. ముందుగా హెల్ప్‌లైన్‌ మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు సంతోషం వ్యక్తపరిచారు. ఒకసారి భూమిక హెల్ప్‌లైన్‌ ప్రారంభ దినాలని గుర్తు చేసుకున్నారు. ఎన్నో సందేహాలు, అనుమానాల, మధ్య ఒకింత ఉత్కంఠతోనే హెల్ప్‌లైన్‌ ప్రారంభించడం జరిగిందన్నారు. కేవలం ఫోన్‌ ద్వారా సలహాలందించటం వల్ల ఎంత వరకు బాధితులకు వుపయోగపడు తుందనే అనుమానాలు ఎక్కువగానే వుండేవన్నారు. కానీ ప్రారంభ సంవత్సరంలోనే వెయ్యికి పైగా కాల్స్‌ రావడంతో హెల్ప్‌లైన్‌ అవసరం, ఆవశ్యకతలపై మరింత నమ్మకం కుదిరింది. సమాజంలో వివిధ స్థాయిలలో హింస, వివక్షకు బలౌతున్న నిస్సహాయ మహిళలకు తగిన చేయూత నందించడం కోసం ఉద్దేశించబడిన హెల్ప్‌లైన్‌ పరిధులు గత మూడు సంవత్సరాలలో మరింతగా విస్తరించాయి. మహిళలపై అమలవుతున్న గృహహింస వికృత పార్శ్వాలు ఎంత లోతుగా వేళ్లూనుకుపోయాయో అవగతమౌతూ వచ్చాయి.
మొదటి సంవత్సరంలో ఎక్కుగా పట్టణ ప్రాంతాలనుండి మాత్రమే కాల్స్‌ వచ్చేవి. ఎక్కువగా విజయవాడ, హైద్రాబాద్‌, విశాఖపట్నం, తిరుపతి, వరంగల్‌ వంటి చోట్ల నుండి మాత్రమే స్పందన లభించింది. ఇది గమనించి హెల్ప్‌లైన్‌ టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 2908 ప్రచారం కోసం వివిధ కార్యక్రమాలు చేపట్టాం. అందులో భాగంగా హెల్ప్‌లైను నంబరు, వివరాలతో కూడిన స్టిక్కర్లు, పోస్టర్లు వాలంటీర్ల సాయంతో పంచడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సులపై, టీవీ9, ఈటీవీ2 లలో ప్రచారం కల్పించడం ద్వారా భూమిక హెల్ప్‌లైను గురించి మరింత మందికి తెలిసే అవకాశం ఏర్పడింది. ప్రస్తుతం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుండి కాల్స్‌ వస్తున్నాయి.
మొదట్లో ఎక్కువగా అత్తమామల వేధింపులు, కట్నం కోసం వేధింపులు, కోర్టు కేసులకు సంబంధించిన సలహాల కోసం కాల్స్‌ వస్తుండేవి. హెల్ప్‌లైను గురించి మరింత ప్రచారం లభించే కొద్దీ హెల్ప్‌లైనుకు వచ్చే కాల్స్‌లో వైవిధ్యం చోటు చేసుకుంది. ప్రస్తుతం న్యాయ సంబంధిత కేసులు, వివాహేతర సంబంధాలకు సంబంధించిన కేసులు, లైంగిక వేధింపుల కేసులు, కట్నం కోసం వేధింపుల కేసులు, బాల్య వివాహాలకు సంబంధించిన ఫిర్యాదులు, వైద్య సలహాలు ఇంకా కెరీర్‌ కౌన్సిలింగుతో పాటు ఒక మంచి సమాచార కేంద్రంగా కూడా భూమిక హెల్ప్‌లైను పనిచేస్తోంది. హెల్ప్‌లైను ప్రచారం కోసం అప్పుడప్పుడు వివిధ ప్రసార మాధ్యమాలలో కొన్ని అవగాహనా కార్యక్రమాలు నిర్వహించడం, జరుగుతూంటుంది. అటువంటప్పుడు ఒక్కోసారి రోజుకు 200లకు పైగా కాల్స్‌ అటెండ్‌ అవ్వాల్సి వస్తుంది.
ప్రస్తుతం భూమిక హెల్ప్‌లైను ఉ|| 8 గం|| నుండి రా|| 11గం|| వరకు పనిచేస్తోంది. మూడు షిఫ్టులలో ముగ్గురు కౌన్సిలర్లు పనిచేస్తున్నారు. సోమ, శని వారాలలో ప్రత్యేకంగా న్యాయసలహా, సంప్రదింపుల కోసం నేరుగా లాయర్లతోనే మాట్లాడే అవకాశం కూడా వుంది. కొన్ని సందర్భాలలో సహాయం కోసం కాల్‌ చేసేవారు తీవ్రమైన మానసిక ఒత్తిడితో మాట్లాడలేని స్థితిలో ఏమీ చెప్పకుండా ఏడుస్తూ వుండిపోతారు. అటువంటి సందర్భాలలో, కౌన్సిలరు చాలా ఓపికగా (అటునుండి స్పందన లేకపోయినా) ధైర్యం చెప్పి, భరోసా యిచ్చి మెల్లగా బాధిత స్త్రీలచేత మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఇందు కోసం ఒక్కోసారి 15-20 నిముషాలు ఇంకా ఎక్కువ సమయం కూడా పట్టే సందర్భాలుంటాయి. కాని ఒకసారి మాట్లాడటం మొదలుపెట్టాక బాధితులు ఒక్కొక్కటిగా తమ సమస్యలను చెప్పుకొస్తారు. కొన్ని సందర్భాలలో కేవలం తమ బాధలను మరొకరికి చెప్పుకొని సాంత్వన పొందటం కోసమే కాల్‌ చేస్తారు.
అటువంటి సమయాలలో కౌన్సిలరు వారు చెప్పిందంతా విని వారికి కావలసిన మానసిక ధైర్యాన్ని అందించడంలో తోడ్పతారు. ఇలా చాలా సందర్భాలలో కాల్స్‌ కోసం అరగంట పైగా కూడా మాట్లాడవలసి వస్తుంది. అటువంటప్పుడు సహజంగానే మిగతావారికి ఫోను ఎంగేజ్‌లో వుండటం జరుగుతుంది. హెల్ప్‌లైన్‌ కాలర్స్‌ అవసరాలకు అనుగుణంగా వుండేందుకు కాల్‌ సమయంపై పరిమితులుండవు. సహాయం కోరే ఏ స్త్రీ అయినా ఎంతసేపైనా మాట్లాడే అవకాశం బహుశా భూమిక హెల్ప్‌లైను మాత్రమే కల్పిస్తూ వుండవచ్చు. ప్రభుత్వ హెల్ప్‌లైను మాత్రం మూడు నిముషాల తర్వాత దానంతటదే కట్‌ అయిపోతుంది. భూమిక హెల్ప్‌లైనుకు కాల్‌ చేసే వారి వివరాలు పూర్తిగా గోప్యంగా వుంచబడుతాయి. అలాగే వివరాలు ఇవ్వటం ఇష్టంలేని వారిపై ఎటువంటి బలవంతం వుండదు. అవసరాన్ని బట్టి ఫాలో అప్‌ కోసం మాత్రం పేరు, వూరు వంటి కొన్ని ప్రాథమిక వివరాలు మాత్రమే అడగటం జరుగుతుంది.
భూమిక హెల్ప్‌లైను ద్వారా సహాయం పొందిన చాలా మంది మళ్ళీ ఫోన్‌ చేసి కృతజ్ఞతలు తెలియజేస్తారు. కొంతమంది వ్యక్తిగతంగా వచ్చి ధన్యవాదాలు తెలుపుతామని అడుగుతూ వుంటారు. అది హెల్ప్‌లైను సిద్ధాంతాలకు వ్యతిరేకం కాబట్టి అందుకు మేం అంగీకరించం అని సత్యవతిగారు వివరించారు. సమావేశాలలో పాల్గొన్న మేరీ కుమారి మాదిగ మాట్లాడుతూ అణగారిన వర్గాలకు చెందిన మహిళలకు హెల్ప్‌లైను నంబరు గుర్తు పెట్టుకోవటం, ఫోనులో మాట్లాడి సలహా పొందటం అనేది చాలా కష్టమైన పని అని, మరేదైనా విధంగా ఆ వర్గాలకు సంబంధించిన మహిళలకు కూడా హెల్ప్‌లైను సదుపాయాలు అందించగలిగితే బావుంటుందని ఆ విధంగా ఆలోచించవలసిందిగా సూచించారు. ఈ విషయాన్ని సత్యవతిగారు అంగీకరించారు. అలాగే కార్పోరేట్‌ రంగంలో కూడా చదువుకుని ఉన్నత ఉద్యోగాలలో వున్న స్త్రీలు కూడా తీవ్రమైన గృహహింసకు, వివక్షకు గురౌతూ సహిస్తున్న సందర్భాలు తమ దృష్టికి వచ్చాయని. అణగారిన వర్గాల స్త్రీలు, అలాగే కార్పోరేట్‌ రంగంలో వివక్షను ఎదుర్కొంటున్న స్త్రీలకు కూడా హెల్ప్‌లైను ద్వారా సహాయ సహకారాలు అందేలా చూడవలసిన అవసరం ఎంతో వుందంటూ సత్యవతిగారు కార్యక్రమాన్ని ముగించారు.
భూమిక హెల్ప్‌లైను ద్వారా నేటి వరకు ఎంతో మంది స్త్రీలు తమ సమస్యలకు పరిష్కారం పొందగలిగారు. సమస్య క్లిష్టతను బట్టి హెల్ప్‌లైను ద్వారా అందించబడే సహాయం ఆధారపడి వుంటుంది. భూమిక పాఠకుల అవగాహన కోసం హెల్ప్‌లైను ద్వారా పరిష్కరించబడిన కొన్ని కేసులను పేర్లు మార్చి వివరిస్తున్నాం.
విదేశాలలో వేధింపులకు గురిచేస్తున్న భర్త నుండి విముక్తి
మంచి ఆలోచన వుండి దారి చూపగలిగే వారైతే పరోక్షంగా కూడా క్లిష్ట సమస్యకు పరిష్కారం చూపవచ్చనే దానికి భాగ్యలక్ష్మి గారి కథే మంచి ఉదాహరణ. పొన్నూరు నుండి భాగ్యలక్ష్మి గారు ఒకరోజు భూమిక హెల్ప్‌లైనుకు ఫోను చేసి విదేశాలలో వుంటున్న తన కూతురి దుర్భర జీవితం గురించి వివరించారు. విదేశాలలో మంచి వుద్యోగం, మంచి చదువు, సాంప్రదాయ కుటుంబం అని అబ్బాయి తల్లిదండ్రులు చెప్పగానే ఏమీ ఆలోచించకుండా డాక్టరు చదువుకున్న కూతురు శశిరేఖనిచ్చి పెళ్ళి చేసారు. పెళ్ళైన కొద్ది రోజులకే రేఖ భర్తతో కలిసి కోటి ఆశలతో కన్నవారినీ, స్వదేశాన్ని వీడి వెళ్ళింది. రోజులు గడుస్తున్నా భర్త ఉద్యోగానికి వెళ్ళకపోవడం, పైగా వ్యసనాలకి బానిసగా మారిపోవడంతో రేఖ ఆశలన్నీ అడియాసలయ్యాయి. కఠిన వాస్తవాలను అంగీకరించిన రేఖ తన భర్తను మంచిగా మార్చుకోవటానికి విఫల ప్రయత్నము చేసింది. అతను ఆమె మాట వినకపోవటమే కాక తిరిగి మరింతగా హింసించేవాడు. ఇది కాకుండా అతను డ్రగ్సుకు బానిసయ్యాడని తెలిసి మరింత కృంగిపోయింది. ఇంట్లో ఆర్థికపరిస్థితి క్షీణించడంతో ఒక హాస్పిటల్లో డాక్టరుగా జాయినయ్యింది.
రేఖ సంపాదనను ఆమె భర్త పూర్తిగా అనుభవించడం మొదలుపెట్టాడు. దీనికి తోడు ఇతరులతో లైంగిక సంబంధాలు కూడా మొదలయ్యాయి. ఎప్పటికైనా భర్తలో మార్పు వస్తుందనే నమ్మకంతో వున్న రేఖకు యిది మరో పెద్ద ఎదురుదెబ్బ. భర్తనుండి వేధింపులు ఎక్కువయ్యాయి. ఆర్థికంగా, లైంగికంగా మానసికంగా వేధింపులకు గురి చేస్తూనేవున్నాడు. జరుగుతున్న విషయాలన్నీ రేఖ తన తల్లిదండ్రుల నుంచి కూడా దాచిపెట్టింది. అయితే స్నేహితుల ద్వారా రేఖ పరిస్థితిని తెలుసుకున్న భాగ్యలక్ష్మిగారు వెంటనే కూతురుకు ఫోన్‌చేసి అన్ని వివరాలు కనుక్కున్నారు. తన కూతురు ఊరు కాని ఊరులో నా అనేవారు లేని విదేశాలలో జీవన్మరణ పరిస్థితిలో చిక్కుకున్నదని భాగ్యలక్ష్మిగారికి అర్థం అయ్యింది.
కూతుర్ని రక్షించుకోవటానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అనే సందిగ్ధావస్థలో వుండగా టీవి9 నవీన కార్యక్రమంలో భూమిక హెల్ప్‌లైను టోల్‌ ఫ్రీ నంబరు 1800 425 2908 చూసి ఒకసారి ప్రయత్నించి చూద్దాం తనకు ఎటువంటి సహాయం అందించగలరో అనే ఉద్దేశ్యంతో హెల్ప్‌లైనుకు కాల్‌ చేసారు. మొదటిసారి ఫోన్‌ చేసినపుడు హెల్ప్‌లైన్‌ ఆశయాలు, వుద్దేశ్యాలు, పనిచేసే విధానం, ఏవిధంగా సహాయం పొందవచ్చు వంటి వివరాలన్నీ అడిగి తెలుసుకున్నారు. సమస్యల్లో వున్న స్త్రీలకోసం భూమిక హెల్ప్‌లైను పనిచేస్తుందని బాధిత స్త్రీల వివరాలు గోప్యంగా వుంచడమే కాక వారి వ్యక్తిగత భావాలు, అభిప్రాయాలు, అవసరాలకు అనుగుణంగా సలహాలు, సూచనలు, అందజేస్తామని కౌన్సిలరు భాగ్యలక్ష్మిగారికి వివరించారు.
మర్నాడు భాగ్యలక్ష్మిగారు హెల్ప్‌లైనుకు ఫోనుచేసి తన అల్లుడి వల్ల కూతురు పడుతున్న కష్టాల గురించి వివరించారు. అయితే కూతురి స్థితి వల్ల తల్లడిల్లిపోయిన భాగ్యలక్ష్మిగారు భావోద్వేగానికి గురౌతున్నట్లు గ్రహించిన కౌన్సిలర్‌ ముందుగా భాగ్యలక్ష్మి గారికి ధైర్యం చెపుతూ మానసిన స్థైర్యాన్ని అందించారు. ఆపై సమస్య పట్ల రేఖ అభిప్రాయం కనుక్కోమని, వీలైతే ఆమె చేత హెల్ప్‌లైనుకు కాల్‌ చేయించమని సలహా యిచ్చారు. మరుసటిరోజు భాగ్యలక్ష్మిగారు కొంత ధైర్యంగా మాట్లాడారు. తాను రేఖతో మాట్లాడానని, తను భర్త నుండి విడిపోవాలని కోరుకుంటున్నట్లు, ఇకనైనా తన జీవితం సంతోషంగా, ప్రశాంతంగా గడపాలని తను కోరుతున్నట్లు భాగ్యలక్ష్మిగారు తెలియజేశారు. అయితే విడాకులు తీసుకుంటారా, తాత్కాలికంగా విడిపోతారా లేక మారిటల్‌ కౌన్సిలింగు తీసుకున్న తరువాత ఆలోచిస్తారా అనే కొన్ని సూచనలు ఆమెకు తెలియజేశారు హెల్ప్‌లైను కౌన్సిలర్‌. ఈ విషయాన్ని కూతుర్నడిగి చెప్తానన్నారు భాగ్యలక్ష్మిగారు.
తమ సంసార జీవితంలో ఎదురౌతున్న ఒడిదుడుకులను అధిగమించటానికి పోస్ట్‌ మారిటల్‌ కౌన్సిలింగు తీసుకుందామన్న రేఖ సూచనకు తీవ్రంగా స్పందించిన ఆమె భర్త ఆమెను చాలా క్రూరంగా కొట్టి తిట్టడం ప్రారంభించాడని భాగ్యలక్ష్మిగారు రెండు రోజుల తర్వాత ఫోన్‌ చేసి చెప్పారు. సమస్య మరింత తీవ్రరూపం దాల్చడంతో ఈ కేసును హెల్ప్‌లైను ప్యానల్‌ అడ్వకేటు కాంతి గారిని సంప్రదించి వారి సలహా సూచనలు తీసుకోవటం జరిగింది. కాంతి గారి సలహా మేరకు భాగ్యలక్ష్మిగారు మళ్ళీ కాల్‌ చేసినపుడు లోక్‌ అదాలత్‌లో రేఖ పేరున కేసు వెయ్యమని అలాగే అక్కడ తను ఎదుర్కొంటున్న సమస్యలను కాగితంపై వ్రాసి ముందుగా కౌన్సిలింగు అడిగి ఆపై డైవర్స్‌ కోసం అప్లై చేయమని కౌన్సిలరు సూచించారు. కేసు ఫైల్‌ చేసిన తరువాత 4 వారాలుగా కోర్టుకు వెళ్ళడం కొన్ని ఇబ్బందులు రావడం మళ్ళీ హెల్ప్‌లైనుకు ఫోన్‌ చేసి అడ్వకేటు సలహా తీసుకోవడం యిలా కొంతకాలం గడిచింది.
అయితే జూన్‌లో రేఖ కోర్టుకు హాజరుకాలేని పరిస్థితి ఏర్పడడంతో హెల్ప్‌లైను అడ్వకేటు సలహా మేరకు రేఖ జులైలో ఇండియా రాగలదని కావున కేసు అప్పటికి వాయిదా వెయ్యమని లోక్‌ అదాలత్‌ సెక్రటరీ గారికి వుత్తరం రాశారు. వారి కోరిక మేరకు కోర్టు జులై 22కి వాయిదా వేసింది. జులై 22న భార్యాభర్తలను ముందుగా కౌన్సిలింగుకు పంపారు. దాని వల్ల ఏ విధమైన ప్రయోజనం లేకపోయేసరికి ఇరువురి అంగీకారంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. తన భర్త పెట్టే ఎన్నో వేధింపుల నుండి బయటకు రాగల్గినందుకు రేఖ చాలా సంతోషించింది. యికనైనా జీవితం సంతోషంగా గడపటానికి ప్రయత్నిస్తానని తనకు అన్ని విధాలా సాయపడిన, అన్ని సమయాల్లో సలహాలందించి తొందరగా సమస్య పరిష్కారమయ్యేలా చేసినందుకు హెల్ప్‌లైనుకు ధన్యవాదాలు తెలిపింది. ఇది భూమిక హెల్ప్‌లైను ద్వారా పరిష్కృతమైన మొట్టమొదటి కేసు.
కన్నతండ్రి వల్ల లైంగిక వేధింపుల నుండి కూతుర్లను రక్షించిన తల్లి
ఆగస్టు 2006లో సీతమ్మ హెల్ప్‌లైనుకు ఫోను చేసారు. తనకు పెళ్ళై 20 సంవత్సరాలైందని, 18, 17 సం|| వయస్సు గల ఇద్దరాడ పిల్లలున్నాని తన భర్త గవర్నమెంటు ఉద్యోగస్తుడని, అతని లైంగిక వేధింపుల నుండి తన ఇద్దరు కూతుర్లను ఇంతకాలం కాపాడుకుంటూ వచ్చానని, కాని ఇలా ఎంతకాలం వారిని రక్షించగలనో తెలియకుండా వుంది, అందుకే ఇద్దరు పిల్లలను తీసుకుని ఇంట్లోనించి పారిపోయి వచ్చేశానని, కాని తన భర్త ఎలాగైన తమను పట్టుకుంటాడు కాబట్టి, అతని నుంచి తప్పించుకునేందుకు ఏదైనా షార్ట్‌ స్టే హోమ్‌ (తాత్కాలిక వసతి గృహం)లో చేర్పించాల్సిందిగా కోరారు. వెంటనే కౌన్సిలరు ఆమెకు తగిన మానసిక స్థైర్యాన్ని అందిస్తూనే వారికి వుపయోగకరంగా వుండే కొన్ని షార్ట్‌ స్టే హోమ్‌ల ఫోన్‌ నంబర్స్‌ యిచ్చి మళ్లీ కాల్‌ చేయమని కౌన్సిలర్‌ సూచించారు. ఇంతలో కౌన్సిలరే కొన్ని షార్ట్‌ స్టే హోమ్‌లకు ఫోన్‌ చేసి షెల్టర్‌ కోసం అడిగారు. అప్పుడు ఒక షార్ట్‌ స్టే హోమ్‌ వారు వెంటనే స్పందించి ఆశ్రయం యివ్వడానికి అంగీకరించారు. ఆ విధంగా సీతమ్మగారిని, వారి యద్దరు పిల్లలతో సహా షార్ట్‌ స్టే హోమ్‌కు పంపడం జరిగింది. ఆ తరువాత ఆమె భర్తపై కేసు ఫైల్‌ చేసింది. ఆపదలో ఆదుకున్నందుకు ఆమె భూమికకు ధన్యవాదాలు తెలియజేశారు.
గృహ నిర్భంధం నుండి విముక్తి పొందిన మహిళ
ఆగస్టు 2006లో శ్రీశైలం నుండి రమణి ఫోన్‌ చేసి భర్త మామల వల్ల తన కూతురు పడుతున్న అగచాట్ల గురించి యిలా వివరించారు.
రమణి పెళ్ళై ఆరు నెలలయ్యింది. అత్తగారు లేరు. భర్త, మామ మాత్రమే వుంటున్నారు. తండ్రి మాటలు విని రమ భర్త ఎప్పుడూ రమను కొడుతూ తిడుతూ వుంటారు. చివరికి ఒక రోజు రమని రూంలో పెట్టి బంధించి తిండికూడా పెట్టడం మానేశారు. ఫోన్‌లో కూడా మాట్లాడనివ్వటం లేదని రమణి కన్నీళ్ళ మధ్య తన బాధను వ్యక్తం చేశారు. వారి మీద కేసు పెట్టాలంటే ఆ వూర్లో వారు చాలా పలుకుబడి వున్నవారిని అందుకే భయంగా వుందని చెప్పారు. కౌన్సిలర్‌ రమణి గురించి మరికొన్ని వివరాలు అంటే రమి ఎంత వరకు చదువుకుంది, పెళ్ళికి ముందు ఎలావుండేది, ఏం చేసేది ఇలాంటి చిన్న చిన్న విషయాలు అడిగి తెల్సుకున్నారు. అలాగే వీలైతే రమ చేత మాట్లాడించవలసిందిగా రమణిగారికి సూచించారు. రెండు రోజుల్లో రమణి ఫోన్‌ చేసి కౌన్సిలరుకు తన సమస్యను వివరించింది. భార్య భర్తల మధ్య ఎటువంటి సంబంధం వుంది, అందులో మామగారి ప్రమేయం ఎంతవరకు వుంది అన్న అంశాలు కౌన్సిలర్‌ రమను అడిగి తెల్సుకున్నారు.రమ చెప్పిన దాన్ని బట్టి మామగారి అనుమతి లేకుండా రమ భర్త ఏ పనీ చేయడు. ఆఖరికి భార్యతో మాట్లాడలన్నా మామగారి అనుమతి తప్పనిసరి. ఇప్పుడు కొత్తగా భార్యాభర్తల మధ్య ఉన్న లైంగిక సంబంధ అంశాలను కూడా మామగారు అడిగి తెల్సుకోవడంతో రమ చాలా భయపడింది. తన భర్తకు ఉద్యోగం లేదు. మామగారు ఏం చెపితే అవి చేయాలి. గత 8 వారాలుగా తాను అత్తవారింట్లో గృహ నిర్భంధంలో వున్నానని రమ తెలియజేసింది. కౌన్సిలరు రమకు ధైర్యం చెప్పి మానసిక స్థైర్యం కలుగజేస్తూ తన ముందున్న వివిధ ప్రత్యామ్నాయాలను తెలియజేసి తను ఏం చేయాలనుకుంటుందో నిర్ణయించుకోమని కౌన్సిలరు చెప్పారు. తనను గృహనిర్భంధం చేసి హింసిస్తున్న భర్త, మామగారిపై కేసు పెట్టాలని ఆ రమ నిర్ణయించుకుంది. అప్పుడు వెంటనే దగ్గరలో వున్న పోలీస్‌ స్టేషను నెంబరు యిచ్చి వారికి ఫోన్‌ చేయమని సలహా యిచ్చారు.
కౌన్సిలరు యిచ్చిన ధైర్యంతో రమ పోలీస్‌ వారికి ఫోన్‌ చేసి తన పరిస్థితిని వివరించింది. వెంటనే పోలీస్‌ వారు చొరవ తీసుకుని రమ వున్న ఇంటికి వెళ్ళి అక్కడున్న ఆమె భర్త మామలను అరెస్టు చేసి రమను తన తల్లిదండ్రుల దగ్గరకు పంపించారు. గృహనిర్భంధం నుండి బయటపడిన (గృహహింస చట్టం)తో పాటు విడాకులకు కూడా అప్లై చేసుకుంది. తన కూతురిని గృహనిర్భంధం నుండి బయటకు తీసుకురావడమే కాక హింసించే భర్త, మామల బారి నుండి బయట పడే మార్గం చూపినందుకు రమణిగారు ఎంతో సంతోషంగా తన కృతజ్ఞతలు తెలియజేశారు.
పొరుగు రాష్ట్రంలో చిక్కుకున్న మహిళకు సహాయం
భూమిక హెల్ప్‌లైనుకు మన రాష్ట్రం నుండే కాక పొరుగు రాష్ట్రాల నుండి ముఖ్యంగా తమిళనాడు, కేరళ నుండి కూడా కాల్స్‌ వస్తూ వుంటాయి. మన రాష్ట్రానికి చెందిన పేద మహిళలు ఇతర రాష్ట్రాలకు, పొరుగు దేశాలకు పనిని వెతుక్కుంటూ వెళతారు. వీరిలో ఎక్కువ శాతం మంది దళారుల మోసాలకు గురౌతూ వుంటారు. అటువంటి కేసు ఒకటి కేరళ రాజధాని త్రివేండ్రం నుండి వచ్చింది.
ఆగస్టు 2007లో త్రివేండ్రంలోని ”అభయ” షార్ట్‌ స్టే హోమ్‌ నుండి శోభ అనే కౌన్సిలరు ఫోన్‌ చేసి విజయవాడలో వున్న షార్ట్‌ స్టే హోమ్‌ల వివరాలు అడిగి వాటి ఫోన్‌ నంబర్లు తీసుకున్నారు. అదే రోజు మధ్యాహ్నం ఆమె మళ్ళీ కాల్‌ చేశారు. అప్పుడు భూమిక కౌన్సిలరు కేసు వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేరళ గవర్నమెంటు హాస్పిటలు వారు ఒక అమ్మాయిని తీసుకువచ్చి అభయ షార్ట్‌ స్టే హోమ్‌లో జాయిన్‌ చేశారని, ఆమె నాలుగు రోజుల క్రితం ఒక బిడ్డను ప్రసవించినట్టు చెప్పారు. భాష తెలియక పోవడంవల్ల ఏ వివరాలు తెల్సుకోలేక పోయినట్లు చెప్పారు. అప్పుడు భూమిక కౌన్సిలరు ఆ అమ్మాయితో మాట్లాడి వివరాలు కనుక్కున్నారు.
భర్తతో గొడవ పడి విడిపోయిన రేణుక ఆరునెలల క్రితం తన అన్నగారితో కలిసి కేరళ వెళ్ళింది. రేణుక వాళ్ళ అక్క తిరువూరులో వుందని, అన్న తనను హాస్పిటల్లో వదలి పెట్టి మరలా వస్తానని చెప్పి వెళ్ళాడని చెప్పింది. కాని ఆమె మాటలు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా వున్నాయి. తన యింటి అడ్రస్సు కూడా చెప్పలేకపోయింది. వెంటనే కౌన్సిలరు అభయ వారితో మాట్లాడి రేణుకను ఎక్కడకు పంపాలో మరలా తెలియ జేస్తామని చెప్పారు. తరువాత ఈ కేసు గురించి కౌన్సిలరు కో-ఆర్డినేటరుతో చర్చించి వుమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ వారి సహాయం కోరారు. ఎస్‌ఐతో మాట్లాడినపుడు వారినుండి ఎటువంటి సానుకూల స్పందన రాలేదు.
పరిస్థితి తెల్సుకున్న కోఆర్డినేటరు ఆక్స్‌ఫామ్‌ గిరిజ గారితో మాట్లాడారు. త్రివేండ్రం కాల్‌ చేసి కేసు వివరాలు కనుక్కున్నారు. ఆపై వారు రేణుకను మేజిస్ట్రేట్‌ ముందు హజరు పరచి, హెల్త్‌ చెకప్‌కి పంపించి ఆ తర్వాత ఎ.పి. పంపిస్తామని చెప్పారు. మర్నాడు కోఆర్డినేటరు మరలా త్రివేండ్రంకు కాల్‌ చేసినపుడు రేణుక తన పాపను చూడటానికి తీసుకు వెళ్ళారని చెప్పారు. ఆ తర్వాత రోజు కోఆర్డినేటర్‌ వుమెన్‌ ప్రొటెక్షన్‌ సెల్‌ డి.ఐ.జి. ఉమాపతి గారితో స్వయంగా మాట్లాడి కేసును వివరించారు. డి.ఐ.జి. గారు వెంటనే స్పందించి తగిన చర్య తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మర్నాడు కోఆర్డినేటరు డి.ఐ.జి. గారికి కాల్‌ చేసి కేసు పురోగతి గురించి అడిగి తెల్సుకున్నారు. ఎ.పి. పోలీస్‌ ద్వారా కేరళ పోలీస్‌ వారికి రేణుక వివరాలు ఫాక్స్‌ ద్వారా తెలియజేశారు. అలాగే ఒక లేడీ కానిస్టేబుల్‌నిచ్చి ఎ.పి.లోని విజయవాడకు పంపించమని కోరుతూ మరో ఫాక్స్‌ పంపుతున్నట్టు తెలియజేశారు. ఆ తర్వాత ఈ విషయాన్ని త్రివేండ్రం వారికి కాల్‌ చేసి ఈ విషయాన్ని వివరించారు భూమిక కౌన్సిలరు. వారు కూడా దానికి అంగీకరించారు. అయితే రేణుక ఆరోగ్య పరిస్థితి కుదుట పడేవరకూ ఆగవలసిందిగా సూచించారు. ఒక నెల తరువాత భూమిక కౌన్సిలరు, త్రివేండ్రం కాల్‌ చేసినపుడు రేణుకను వాళ్ళ అన్నగారు వచ్చి తీసుకువెళ్ళినట్లుగా తెలియజేశారు.
108 రిఫరెన్సు ద్వారా పరిష్కరించిన కేసు
భూమిక హెల్ప్‌లైనుకు అనేక మంది రిఫరెన్స్‌ ద్వారా కాల్‌ చేస్తారు. ప్రస్తుత కేసు 108 జూఖష్ట్ర| ఎమర్జెన్సీ సర్వ్వీసు ద్వారా హెల్ప్‌లైనుకు రిఫర్‌ చేసిన కేసు. సెప్టెంబర్‌ 2007లో ఒకనాటి మధ్యాహ్నం 108లో పోలీస్‌ డిస్‌పాచ్‌ ఆఫీసరుగా పనిచేసే జాన్‌సన్‌గారు ఫోన్‌ చేసి తమకు రాజమండ్రి నుంచి కేసు వచ్చిందని బాధితురాలితో కాన్ఫరెన్స్‌ కాల్‌ ఏర్పాటు చేశారు. ఆమె మాట్లాడుతున్నపుడు ఆమెకు తెలుగు రాదని కౌన్సిలరుకు అర్థమైంది. తాను ఒరిస్సా నుండి వచ్చానని తనకు తెలుగు రాదని, కొద్దిగా హిందీ మాట్లాడగలనని స్వప్న చెప్పింది. స్వప్న యిచ్చిన వివరాల ప్రకారం ఆమెది ప్రేమ వివాహం తన భర్త పనికి వెళ్ళినప్పుడు అత్త మామలు తనను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పింది. ఆ రోజు ఇద్దరూ కలిసి తన మీద దాడిచేసి ఇంట్లో నుండి బయటకు తరిమేశారని, గాయాలతో పరిగెత్తుకు వచ్చి పక్కింట్లో పడిపోయినట్లు చెప్పింది. అక్కడ వున్న ఒక పత్రికా విలేఖరి 108 వారి ఫోన్‌ చేశారు. వెంటనే కౌన్సిలరు కోఆర్డినేటరుకు లైన్‌ కనెక్ట్‌ చేశారు. అప్పుడు కోఆర్డినేటరు 108 సహాయంతో ఆ అమ్మాయి భర్తతో కాన్ఫరెన్సులో మాట్లాడి విషయం తెలియజేసి ఫోన్‌ ద్వారానే కౌన్సిలింగు యిచ్చారు. మరోసారి ఇలా జరగకుండా జాగ్రత్త పడవలసిందిగా అతనిని హెచ్చరించారు. అతనుకూడా సానుకూలంగా స్పందించాడు. ఆ తర్వాత దంపతులిద్దరూ హెల్ప్‌లైనుకు కాల్‌ చేసి అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
అర్థరాత్రి దారితప్పిన మహిళలకు చేయూత
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో చైల్డ్‌ లైన్‌ (1098) వారి నుండి భూమిక హెల్ప్‌లైనుకు ఒక కాల్‌ వచ్చింది. పంజగుట్ట పోలీస్‌ స్టేషను వారు ఆశ్రయం కల్పించవలసిందంటూ ఒక మహిళను తమ వద్దకు పంపారని చెప్పారు. ఆ మహిళ వయస్సు 30 సంవత్సరాలు కాగా చైల్డ్‌ లైను నియమాల ప్రకారం 18 సం||లు మించిన వారికి ఆశ్రయం కల్పించడం కుదరదు. అందువల్ల వారు భూమిక హెల్ప్‌లైను సహాయం కోరారు. ఆమెను ఏదైనా షార్ట్‌ స్టే హోమ్‌కు పంపించడానిక హెల్ప్‌లైను సహాయం కోరారు. మరిన్ని వివరాల కోసం కౌన్సిలరు బాధిత మహిళతో మాట్లాడటానికి ప్రయత్నించారు. 30 ఏళ్ళ సవిత వరంగల్‌ నుండి ఉద్యోగాన్వేషణలో హైదరాబాద్‌ వచ్చింది. కొన్ని నెలలు హాస్టల్స్‌లో వుంది. అక్కడి వారితో ఇబ్బందులు ఏర్పడి హాస్టల్‌ వీడి బయటకు వచ్చేసింది. రాత్రి పూట సూట్‌కేసుతో పంజగుట్ట పోలీస్‌ వారికి అనుమానాస్పదంగా కనబడింది. విషయం ఆరా తీయగా సరైన సమాధానం రాకపోవటంతో వారు ఆమెను చైల్డ్‌లైనుకు పంపించారు. కౌన్సిలరు సవితతో మాట్లాడటానికి ప్రయత్నించగా మానసిక స్థితిమతం లేని కారణంగా ఆమె మాటల్లో తడబాటును గమనించారు.
తన దగ్గర అందుబాటులో వున్న అన్ని షార్ట్‌ స్టే హోమ్స్‌కు కౌన్సిలరు ఫోన్‌ చేసి సవితకు ఆశ్రయం కల్పించటానికి ప్రయత్నం చేశారు. చేతన్‌ షార్ట్‌ స్టే హోమ్‌ వారు ఆశ్రయమివ్వటానికి ముందుకొచ్చారు. కాని సవిత అక్కడికెళ్లటానికి ఒప్పుకోలేదు. తనను మానసికంగా ఆందోళన చెందుతున్న కారణంగా ఆ రాత్రికి చైల్డ్‌లైనులోనే వుంచాల్సివచ్చింది. మరుసటి రోజు ఉదయమే కౌన్సిలరు ఛైల్డ్‌లైన్‌ వారిని సంప్రదించగా సవిత ఉదయం ఆరు గంటలకే బయటకు వెళ్ళిపోయిందని తెలిపారు. కౌన్సిలరు చైల్డ్‌లైన్‌ కోఆర్డినేటర్‌తో మాట్లాడి తన సెల్‌ నెంబరు తీసుకున్నారు. సవిత సెల్‌కు కాల్‌ చేసి మాట్లాడగా అంతకు ముందు రోజు హెల్ప్‌లైను నుండి పొందిన సమాచారం ఆధారంగా కొన్ని షార్ట్‌ స్టే హోమ్‌లను సంప్రదిస్తున్నానని చెప్పింది. చివరకు వుమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్‌ఫేర్‌ శాఖ వారిని కలిసి వారి ద్వారా ఒక హోమ్‌లో ఆశ్రయం పొందానని చెప్పింది. అప్పటికీ సాయంత్రం 6:30 అయ్యింది. ఆ హోమ్‌ ఇన్‌చార్జ్‌ హేమంత్‌గారి నంబరు తీసుకుని ఆయనతో మాట్లాడారు. కౌన్సిలరు ఈ విషయాన్ని చైల్డ్‌లైను వారికి కూడా తెలియజేశారు. అయితే సవితకు సాయంగా ఎవరినైనా పంపవలసిందిగా కోరారు. చైల్డ్‌లైను ఉద్యోగి శుభానీ గారు రాత్రి 8:30 గం|| సవితను మనో చైతన్య హ్యూమన్‌ సర్వీస్‌ సొసైటీ షెల్టర్‌ హోమ్‌కు తీసుకువెళ్ళారు. ఈ షెల్టరు హోమ్‌ వారి నియమాల ప్రకారం బాధితులకు సంబంధించి ఎవరైనా బంధువులు వచ్చేవరకు బయటకు పంపరని తెలిసింది. ఇది తెలిసిన సవిత పొద్దున్నే ఇంటర్వూకెళ్ళాలి ఇక్కడ వుండలేనంటూ బయటికి వచ్చేసింది. రాత్రి 10:30 గం|| శుభానీగారు హెల్ప్‌లైనుకు ఫోన్‌ చేసి విషయం చెప్పారు. కౌన్సిలరు ద్వారా పరిస్థితి గ్రహించిన కోఆర్డినేటరు రాత్రి 12 గం|| వరకూ సవితకు ఆశ్రయం కోసం ప్రయత్నించారు. ఈ మధ్యలో హెల్ప్‌లైను వాలంటీరు లక్ష్మిగారిని సంప్రదించగా ఆ రాత్రికి సవితకు ఆశ్రయం కల్పించడానికి ఒప్పుకుని స్వయంగా వెళ్ళి ఆమెను తీసుకు రావటానికి ముందుకొచ్చారు. అదే సమయంలో 100 నంబరుకు ఫోన్‌ చేసి విషయం తెలియజేసి రాత్రికి ఆశ్రయం కోసం పోలీస్‌ వారితో కూడా మాట్లాడారు. పెట్రోలింగు పోలీసులు వెళ్ళి ఆ రాత్రికి ఆమెను వుమెన్‌ పోలీస్‌ స్టేషనులో వుంచారు. చివరకు ఆ రాత్రివేళ ఆమెను భద్రంగా ఒక చోటకు చేర్చగలిగాం.
మర్నాడు ఉదయమేముంబొయ్‌లో వుండే సవిత తల్లిదండ్రులను సంప్రదించి విషయం తెలియజేశారు హెల్ప్‌లైన్‌ కౌన్సిలరు. అప్పటికి వారు ముంబయిలో వున్నారని వెంటనే బయలుదేరి హైద్రాబాద్‌ వచ్చేస్తామని చెప్పారు. ఈ లోగా మళ్ళీ సుభానీ గారిని సంప్రదించి సవిత అడ్రసు చెప్పి వాళ్ళ యింటికి పంపే ఏర్పాటు చేయవలసిందిగా సూచించారు. అదే రోజు సవితకు కౌన్సిలింగు చేసి వరంగల్‌ వెళ్ళిపోవలసిందిగా సలహా యిచ్చారు. సవిత ఒప్పుకోవడంతో ఆమెను సురక్షితంగా తన యింటికి పంపేయగలిగాం. ప్రస్తుతం తాను సంతోషంగా, ప్రశాంతంగా వున్నానని సవిత కాల్‌చేసి చెప్పింది. చైల్డ్‌లైను సభ్యుడు సుభానీ గారికి హెల్ప్‌లైను ద్వారా ధన్యవాదాలు తెలుపవలసిందిగా కోరింది.
ఢిల్లీ నుండి హైద్రాబాద్‌ వరకూ….
ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఢిల్లీ నుండి మమత ఫోన్‌ చేశారు. భర్త నుండి వేధింపులు భరించలేక యింటినుండి వచ్చేశానని ఈ విషయం కుటుంబ సభ్యులు ఎవరికీ తెలియదని చెప్పారు. ఢిల్లీనుండి హైద్రాబాద్‌ ఎలా రావాలి. ఎక్కడ ఉండాలి అని భయపడుతూ కంగారుగా అడిగారు. ముందుగా ఆమెకు ధైర్యాన్నిచ్చి కంగారు పడవద్దని కౌన్సిలింగు చేసి హైద్రాబాద్‌ రావటానికి కావల్సిన ఏర్పాట్లు చేస్తాం ఒక అరగంట తరువాత ఫోన్‌ చేయవలసిందిగా హెల్ప్‌లైన్‌ కౌన్సిలరు సూచించారు. విషయాన్ని కౌన్సిలరు వెంటనే కోఆర్డినేటరు దృష్టికి తీసుకెళ్ళారు. కోఆర్డినేటరు సూచన మేరకు ఆన్‌లైన్‌ బుకింగు ద్వారా న్యూఢిల్లీ నుండి సికింద్రాబాద్‌కు ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌లో టికెట్‌ బుక్‌ చేసి మమత కాల్‌కోసం ఎదురు చూశారు.
అరగంటం తరువాత మమత మళ్ళీ ఫోన్‌ చేసారు. టికెట్‌ వివరాలు తెలియజేసి భూమిక ఐ.డి. వుపయోగించి టికెట్‌ తీసుకోవడానికి అవసరమైన సూచనలిచ్చారు. అలాగే హైద్రాబాద్‌లో ఎక్కడ వుండాలనుకుంటున్నారని కౌన్సిలరు ప్రశ్నించారు. తనకు ఎవరి దగ్గరకు వెళ్ళడం ఇష్టం లేదని, కొంతకాలం ఏదైనా హోమ్‌లో వుంటానని చెప్పింది. మమత కోరిక మేరకు హెల్ప్‌లైను కౌన్సిలరు అంకురం, చేతన్‌ షార్ట్‌ స్టే హోమ్‌, స్పందన షార్ట్‌ స్టే హోమ్‌లను సంప్రదించి వారి అనుమతి తీసుకుని వుంచారు. మర్నాడు సాయంత్రం మమత ఎ.పి.ఎక్స్‌ప్రెస్‌లో హైద్రాబాద్‌ చేరుకుంది.
ఈ విషయం తెలుసుకున్న ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనతో హెల్ప్‌లైనుకు కాల్‌చేసి మమత వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయమని కోరుతూ వచ్చారు. అయితే మమత మాత్రం తన గురించి తన కుటుంబ సభ్యులకు ఏ వివరాలు ఇవ్వవద్దని కోరింది. అందువల్ల మమత కుటుంబీకులకు ఆమె క్షేమంగా వుందని మాత్రమే చెప్పవలసి వచ్చింది. హెల్ప్‌లైను కౌన్సిలరు కూడా ట్రైను వచ్చే సమయానికి స్టేషనుకెళ్ళి మమతను రిసీవ్‌ చేసుకున్నారు. ఆ సమయంలో కౌన్సిలరు తనకోసం రావడంతో మమత ఎంతో సంతోషించింది. అయితే ఇంటికి వెళ్ళకుండా షార్ట్‌ స్టే హోమ్‌లో వుండటానికే ఆమె మొగ్గు చూపింది. అప్పుడు కౌన్సిలరు ఆమెను అంకురం తీసుకెళ్తానని చెప్పారు. అయితే తాను ఒకసారి తల్లితో మాట్లాడిన తర్వాత మమత మనసు మార్చుకుని తాను ఇంటికి వెళ్తానని అమ్మను, అక్కను చూడాలని వుందని అనడంతో కౌన్సిలరు అందుకంగీకరించి ఆమెను ఆటోలో ఇంటికి పంపించారు. రెండురోజుల తర్వాత మమత ఫోన్‌ చేసి షార్ట్‌ స్టే హోమ్‌ల వివరాలు అడిగి తెల్సుకుంది. ఆ తర్వాత మళ్ళీ ఫోన్‌ చేసి తను స్పందన షార్ట్‌ స్టే హోమ్‌కి వెళ్తున్నట్లు చెప్పింది. ఢిల్లీ నుండి తనను హైద్రాబాదుకు తీసుకొచ్చినందుకు హెల్ప్‌లైనుకు కృతజ్ఞతలు తెలియజేసింది.
అర్థరాత్రి ఒంటరి మహిళ
ఫిబ్రవరి 2009లో ఒకసారి అఫ్‌జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషనునుండి ఎస్‌ఐ మోహనరావుగారు కాల్‌ చేసారు. నైట్‌ డ్యూటీలో వుండగా రోడ్డు మీద ఒక 30 సం||ల వయస్సున్న కొద్దిగా మతిస్థిమితం లేని యువతి కనపడితే పోలీస్‌ స్టేషనుకు తీసుకు వచ్చామని చెప్పారు. ఆమెను ఏదైనా షెల్టరు హోమ్‌కు పంపడానికి భూమిక హెల్ప్‌లైను సహాయం కోరారు. కౌన్సిలరు కోరిక మేరకు ఆ అమ్మాయి చేత ఫోన్‌లో మాట్లాడించారు.
కడప నుండి వచ్చిన లక్ష్మికి 18 సం|| క్రితం పెళ్ళైంది. ముగ్గురు పిల్లలు కూడా వున్నారు. తన తల్లి, భర్త వల్ల తనకు ఇబ్బందులు ఎదురయ్యాయని అవి తప్పించుకోటానికే తాను యింటి నుండి పారిపోయినట్లు చెప్పింది. అయితే ఆమె మానసిక స్థితి గురించి ముందుగానే పోలీసులు హెచ్చరించడం వల్ల కౌన్సిలరు ఆ దిశగా ఆమెకు కౌన్సిలింగు యిచ్చి ఆమెకు ధైర్యం చెప్పారు. అలాగే పోలీస్‌ స్టేషను నంబర్లు తీసుకుని మళ్ళీ ఫోన్‌ చేస్తామని చెప్పారు. ఆ తర్వాత స్నేహసదన్‌, స్టేట్‌ హోమ్‌ కౌన్సిలరు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అయితే ఆ సమయంలో తమ వాహనం రిపేరులో వున్నందున ఎవరైనా ఆ అమ్మాయిని తీసుకు రావల్సిందిగా కోరారు. విషయం కోఆర్డినేటర్‌కు తెలియజేసి వారి అనుమతితో కౌన్సిలరు అఫ్జల్‌గంజ్‌ పోలీస్‌ స్టేషనుకెళ్ళి అక్కడినుండి లక్ష్మిని చేతన్‌ షార్ట్‌ స్టే హోమ్‌కు తీసుకెళ్ళారు. ప్రస్తుతం ఆమె ఇంకా అక్కడే ఆశ్రయం పొందుతోంది. ఇలా లెక్కలేనన్ని కేసుల్లో ఎంతోమంది బాధిత మహిళలకు హెల్ప్‌లైన్‌ అండగా, ఆసరాగా వుంది.

Share
This entry was posted in ప్రత్యేక వ్యాసాలు. Bookmark the permalink.

2 Responses to భూమిక హెల్ప్‌లైన్‌ : మూడేళ్ళ ప్రయాణం

  1. భూమిక చేస్తున్న సేవ ఎనలేనిది. ఈమధ్య నేను మీ నంబరు ఒకరికిస్తే, వారు భూమిక తో మాట్లాడి తమ సంతృప్తి వ్యక్త పరచారు. మీప్రయత్నం అనేకమందికి చేయూతనివ్వాలని కోరుకుంటున్నా.

  2. అభినందనలు….అసలు అలాటి అవసరమే రాకూడదు, కానీ వచ్చినవారికి భూమిక సాయం – గట్టి ఆసరా అవ్వాలని కోరుకుంటూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో