ప్రియమైన సత్యవతి గారికి,
నమస్తే. దినదిన ప్రవర్థమానంగా భూమిక చాలా ఆసక్తిదాయకంగా, ప్రయోజనకరంగా రాణిస్తోంది. అభినందనలు.
అబ్బూరి ఛాయాదేవి గారి గురించి మీ అశ్రు నివాళి హృదయాలను స్పృశించింది. మీ వంటి స్నేహితురాలు
ఉండడం ఎవరికైనా వరమే. ఛాయాదేవి గారు మీకు బాధ్యతలు అప్పజెప్పడం ఆమె సునిశిత దూరదృష్టిని తెలియచెపుతుంది.
ఛాయాదేవి గారితో నేను సన్నిహితంగా ఉండేదాన్ని. ఆమె స్నేహశీలి. మృదుభాషి. ధైర్యవంతురాలు. స్థిత ప్రజ్ఞురాలు. ఎప్పుడూ చిరునవ్వుతో, హాస్యోక్తులతో చురుగ్గా ఉండేవారు. ఉత్తర ప్రత్యుత్తరాలు అర్థవంతంగా ఉండేవి. ఢిల్లీలో, హైదరాబాద్‌లో ఆమెను కలుసుకుని ఎంతో సమయం గడిపాను. ”నెలకూన” అనే నా అనువాద గ్రంథానికి పరిచయ వ్యాక్యాలు వ్రాశారు. ”గీతాంజలి” ఆవిష్కరించారు. వ్యక్తిగతంగా ఎన్నో మధురమైన జ్ఞాపకాలు పోగు చేసుకున్నాను.
ఆమె మరణం సాహిత్య లోకానికి తీరని లోటు. వ్యక్తిగతంగా కూడా మనమెంతో పోగొట్టుకున్నాం. ఆమె స్నేహ పరిమళం శాశ్వతం, కాని ఆమె ఇక లేదన్న భావం బాధాకరం. ఒక మంచి వ్యక్తిని, మానవతా వాదిని కోల్పోయాం. ఆమె ఏ లోకంలో ఉన్నా ప్రశాంతంగా, హాయిగా ఉండాలని కోరుకుంటున్నా.
– జె.భాగ్యలక్ష్మి