స్త్రీ వాదం మొదలవకముందే స్త్రీల పట్ల సహానుభూతితో రచనలు చేసిన అబ్బూరి ఛాయాదేవి గారు బహుముఖ ప్రజ్ఞావంతురాలు. కథ, నవల, వ్యాసం, యాత్రాచరిత్ర, విమర్శ, కాలమ్ రచయిత్రిగా విభిన్న ప్రక్రియల్లో రచనలు చేసి తనదైన ముద్ర వేశారు.
పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, పురుషాహంకార ధోరణిని ధిక్కరిస్తూ రాసిన ఆమె రచనలు స్త్రీల వెన్నుదట్టి నిలుస్తాయి.
కొంతమంది రచయిత్రులు రచనలు వేరు, జీవితం వేరు. రచనల్లో ఎన్నో ఆదర్శాలను వల్లిస్తారు. కానీ తద్విరుద్ధంగా జీవిస్తారు. కానీ, ఛాయాదేవి గారు అలా కాదు. ఆమె రచన, జీవితం వేర్వేరు కాదు.
ఇప్పుడంటే స్త్రీలు చదువుకోవడం, ఉద్యోగం చేయడం మామూలే. కానీ, ఇరవయ్యవ శతాబ్దం తొలినాళ్ళలో స్త్రీల చదువు, ఉద్యోగం రెండూ సాహసకృత్యాలుగా భావించే కాలంలోనే ఛాయాదేవి గారు బి.ఎ. చదివి, పొలిటికల్ సైన్స్, లైబ్రరీ సైన్స్‌లో డిప్లొమా చేశారు. ఢిల్లీలో లైబ్రేరియన్‌గా పనిచేసారు.
కథ, నవల, వ్యాసం ఇలా ఎన్నో ప్రక్రియల్లో ఛాయాదేవి గారు రచనలు చేసినా, కథా రచయిత్రిగానే ఆవిడకు గుర్తింపు లభించింది. ఛాయాదేవి గారు అనగానే అందరికీ ‘బోన్సాయ్ బ్రతుకు’ కథ గుర్తుకు వస్తుంది. బోన్సాయ్ మొక్కలు అందరికీ తెలిసినవే. ఆరుబయట శాఖోపశాఖలుగా, పెద్ద పెద్ద ఊడలతో మహా వృక్షంగా విస్తరిల్లిన మర్రిచెట్టు లాంటి చెట్టు కూడా కుండీలో చిన్న మొక్కగా కుంచించుకుపోయి
ఉంటుంది. చెప్పాలంటే మరుగుజ్జు మొక్కలా చిన్న చిన్న కొమ్మలతో కుండీకే పరిమితమౌతుంది.
పితృస్వామ్య సమాజంలో స్త్రీలు కూడా అంతే. ఎంతోమంది కళాకారిణులు, ప్రతిభావంతులు పెళ్ళి తర్వాత తమ సమస్త శక్తులను మరచిపోయి కేవలం గృహిణులుగానే మిగిలిపోతున్నారు. ఇప్పటికి కూడా సినిమా హీరోయిన్లను ‘వెంటాడే ప్రశ్న పెళ్ళి తర్వాత నటిస్తారా లేదా?’. ఈ ప్రశ్న హీరోలకు వర్తించదు. భర్తల నిరాదరణ వలన పెళ్ళయ్యాక తమలోని కళలను, ప్రతిభను చంపేసుకున్న స్త్రీలు మన కళ్ళముందు ఎంతోమంది కన్పిస్తారు. పితృస్వామ్య పదఘట్టనల కింద నలిగిపోయే స్త్రీలకు ప్రతీక బోన్సాయ్ బతుకు కథ.
ఆకాశంలో సగం అని ఎన్ని అతిశయోక్తులు పలికినా, వాస్తవ సమాజంలో మాత్రం స్త్రీ పురుషుల అసమానత కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆధునిక యుగంలోనూ ఇంటిపని, వంటపని స్త్రీల వంతే. ఇప్పుడు కొంతమంది పురుషులు ఈ పనులను కొంతవరకు చేస్తున్నారు కానీ, పొద్దున్న లేచి కాఫీ కలపడం దగ్గరనుంచి, రాత్రి పాలు తోడు పెట్టేంతవరకు స్త్రీలకు క్షణం తీరిక ఉండదు. కాసేపు ఆదమరిచి నిద్రపోదామంటే అనేక పనులు. ఇప్పుడు ఆధునిక స్త్రీకి ఈ పనులు ద్విగుణితం. ఇటు ఇంట్లో పనులు చేయాలి, అటు ఆఫీసు పనులు చేయాలి. పిల్లల్ని ట్యూషన్లో దింపాలి. వాళ్ళకు ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకువెళ్ళాలి. ఇంటి పన్నులు, కరెంటు బిల్లులు కట్టాలి. ఏదో సామెత చెప్పినట్లు చావడానికి కూడా తీరిక ఉండదు ఆమెకు.
ఈ నిరంతర పనుల మధ్య విరామం లాగా ప్రశాంతంగా నిద్రపోవాలని చాలామంది స్త్రీలు అనుకొంటారు. కానీ అది వారికి నెరవేరని కల. చదువుకొంటున్నప్పుడు నిద్ర ఉండదు, పెళ్ళయ్యాక కొత్తలో నిద్ర ఉండదు, ఆ తర్వాత పిల్లల పెంపకంలో నిద్ర ఉండదు. పిల్లల పరీక్షలు, చదువులు,
ఉద్యోగాలు, వాళ్ళ పెళ్ళిళ్ళు… అనేక రకాల ఒత్తిళ్ళు. వీటితో సరిగా నిద్ర పట్టనే పట్టదు. ‘సుఖాంతం’ కథా నాయికది కూడా ఇదే పరిస్థితి. చిన్నప్పటినుంచి నిద్రకు కరవు వాచిపోతుంది. జీవితంలో ఎప్పుడూ ప్రశాంతంగా నిద్రపోలేదు. చివరకు విసుగు వచ్చి ఒకరోజు రాత్రి నిత్ర మాత్రలు వేసుకుని పడుకుంటుంది. సగటు స్త్రీకి ప్రతీక సుఖాంతం కథానాయిక. కథలో ఎక్కడా నాయిక పేరుండదు. స్వగతంలా సాగుతుంది కథంతా.
‘బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో కొడుకు స్త్రీలని రక్షిస్తారు. స్త్రీకి స్వాతంత్య్రం లేదు’ అని మనువు అంటాడు. కానీ అన్నివేళలా స్వేచ్ఛగా జీవించాలనుకొంటుంది ఆధునిక స్త్రీ. ‘తన మార్గం’లో వర్ధనమ్మ అరవై ఏళ్ళ స్త్రీ. సంప్రదాయం ప్రకారం కొడుకు దగ్గర ఉండాల్సిన వయసు. కానీ ఆత్మగౌరవం గల వర్ధనమ్మ ఎవరి దగ్గరా ఉండకుండా తన సొంత ఇంట్లో ఉంటుంది. కానీ కొడుకులకు తన తల్లి ఒక్కతే స్వేచ్ఛగా ఉండడం నచ్చదు. కూతురికీ అంతే. అందరూ తమ దగ్గరకు వచ్చి ఉండమంటారు. కూతురు పండగకి, పబ్బానికి రమ్మని పిలుస్తుంది కానీ ఆమె ఎక్కడికీ వెళ్ళదు. ఒంటరిగా జీవించడమే తన మార్గం అనుకుంటుంది. తన మార్గంలోనే పయనిస్తుంది.
ఇప్పుడు సమాజంలో ఒంటరి స్త్రీలు అనేకమంది ఉన్నారు. ఇలా జీవించడం గొప్పేమిటి అని ప్రశ్నించవచ్చు. కానీ కొన్ని దశాబ్దాల క్రితం సంప్రదాయాల పట్టు సడలని ఆ కాలంలో ఒక్కరే జీవించడానికి ఎంత గుండె దిటవు కావాలి. ఛాయాదేవి గారి కథా నాయికలందరూ సాహసవంతులే, సంఘం నియమాలను ధిక్కరించే వీరవనితలే.
‘తన మార్గం’ పేరుతో ఛాయాదేవి గారి కథా సంపుటి వచ్చింది. ఈ కథా సంపుటికే సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఈ కథలో వర్థనమ్మ ఒక్కతే సినిమాకు వెళ్తుంది. అక్కడ అటుకులు కొనుక్కుంటుంది. మన సంఘంలో ఒక విధమైన సంప్రదాయాలు, ఆచారాలు ఉన్నాయి. అరవై ఏళ్ళు వస్తే ముసలి వాళ్ళ కింద లెక్క. వాళ్ళు రామా కృష్ణా అనుకోవాలి కానీ సినిమాలకు వెళ్ళకూడదు, షికార్లు చేయకూడదు. వాళ్ళకు మనసులో అలాంటి కోరికలు ఉండకూడదు. కానీ ఛాయాదేవి గారి కథల్లోని స్త్రీలందరూ సొంత ఇష్టాలు, వాటిని నెరవేర్చుకునే సామర్ధ్యం గలవారే. ఆత్మగౌరవం కలిగి ఉంటే స్త్రీలను ఎవరూ ఏమీ చేయలేరని ఛాయాదేవి గారు సందేశమిస్తారు.
మహిళలు ఉద్యోగాలు చేయడం తప్పనిసరైపోయిన ఇరవయ్యవ శతాబ్దంలో ఆఫీసులో లైంగిక వేధింపుల నెదుర్కొంటున్న స్త్రీల గురించి ‘కర్త, కర్మ, క్రియ’ కథలో చిత్రీకరించారు. ఈ కథను రాసి అంతర్జాతీయ మహిళా సంవత్సరానికి అంకితం చేసారు. కాలానికంటే ముందు పయనించిన రచయిత్రి ఛాయాదేవి గారు.
పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీ మీద, ఆమె శరీరం మీద పెత్తనం చేసేది పురుషులే. వారి దృష్టిలో స్త్రీలంటే శరీరాలే. అందాల పోటీల్లో ప్రదర్శనా వస్తువులు. వస్తువుల ప్రకటనలకు నమూనాలు మహిళలే. వారి శరీరాలపై వారికి హక్కు లేదు. వారి అనుమతి లేకుండానే అత్యాచారాలు చేస్తారు. యాసిడ్లు పోస్తారు. ప్రేమించలేదని కత్తిపోట్లు పొడుస్తారు.
స్త్రీల శరీరాలపై అత్యాచారాలు చేసి హింసించినా, పురుషుల అకృత్యాలకు గాయపడిన స్త్రీలపై మరింత నిందాబాణాలు విసురుతారు. ఎవరో చేసిన దాడికి స్త్రీ శరీరం మైలపడిందని ఇంచుమించు వెలివేసినట్లు చూస్తారు. చెడిపోయిన స్త్రీ అని ముద్ర వేస్తారు. ఈ భ్రమలన్నీ బద్దలు చేస్తూ 1965 నాటికే ‘ప్రయాణం’ అన్న కథను రాసారు. ఒక ఆడపిల్ల తనపై అత్యాచారం జరిగినంత మాత్రాన ఆత్మహత్య చేసుకోనక్కర్లేదని, ఇంటిని పరిత్యజించి వెళ్ళనక్కరలేదని, జరిగినదాన్ని ఒక దుస్సంఘటనగా భావించి, సహృదయుడైన వ్యక్తిని పెళ్ళి చేసుకోవచ్చని ఈ కథలో చెప్తారు ఛాయాదేవి గారు.
స్త్రీకి శీలమే సర్వస్వం. అది లేకపోతే ప్రాణం పోయినంత పనవుతుందనే పితృస్వామ్య సమాజంలో పాతుకుపోయిన భావజాలాన్ని నిర్ద్వంద్వంగా ఖండించారు ఆమె ఈ కథలో.
‘శ్రీమతి-ఉద్యోగిని’ కథ కూడా ఆలోచింపదగ్గది. స్త్రీలు ఉద్యోగాలు చేస్తే స్వావలంబన ఉంటుంది, స్వేచ్ఛ లభిస్తుంది అని ఆశించిన స్త్రీలకు వాళ్ళ కలలు కల్లలని, పురుషుడికున్న విశ్రాంతి స్త్రీలకు లేదని ఈ కథ ద్వారా చెప్తారు.
ఛాయాదేవిగారు కేవలం స్త్రీ సమస్యలపైనే తన కలాన్ని ఎక్కుపెట్టలేదు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం అందించాల్సిన పాలకుల బాధ్యత ఎప్పుడో విస్మరించబడింది. విద్య, వైద్యం ఏనాడో వ్యాపారమయమై పోయాయి. ప్రభుత్వ ఆసుపత్రిలోని నిర్వాహణా లోపాలను, సేవా దృక్పథం లేని, వైద్యుల ధనార్జనా తత్పరతను, అవినీతిని, లంచగొండితనాన్ని కె.శివారెడ్డి ఆసుపత్రి గీతంలో అక్షరీకరిస్తారు. కార్పొరేట్ ఆస్పత్రి వైద్యుల ధనదాహాన్ని, వ్యాపార దృక్పథాన్ని ‘ఆఖరికి అయిదు నక్షత్రాలు’ కథలో చీల్చి చెండాడతారు ఛాయాదేవిగారు.
ఉపగ్రహానికి స్వయం ప్రకాశం ఉండదు. ఏదో ఒక గ్రహం చుట్టూ తిరుగుతుంటుంది. పురుషాధిక్య ప్రపంచంలో స్త్రీలు కూడా ఉపగ్రహాలలాంటివారే. ఎంతసేపూ భర్తకు నచ్చినట్లుగా బ్రతుకుతూ, వారికనుగుణంగా జీవించే వారిని గురించి ‘ఉపగ్రహం’ అనే కథ రాశారు. ఈ కథలో కథానారుకుకకు భర్తతో కలిసి సినిమా చూడాలనే ఆసక్తి. కానీ భర్తకు సినిమా చూడడం ఇష్టముండదు. భార్య ఇష్టాన్ని గౌరవించడం తెలీదు. భార్య సినిమా టిక్కెట్లు ముందుగా తెప్పించి సినిమాకు వెళ్దామని భర్తను బ్రతిమాలినా ససేమిరా ఒప్పుకోడు. చివరకు భార్య ఆ టికెట్లు చించి పడేస్తుంది.
సంసారాల్లో భార్య మాటకు విలువ లేకపోవడం, ఎంతసేపూ భర్త చెప్పినట్లుగా వింటూ భర్త అనే గ్రహం చుట్టూ తిరిగే
ఉపగ్రహమే స్త్రీ అంటారు. ఆ స్థితిలో నుంచి స్త్రీలందరూ స్వయం ప్రకాశంలోకి రావాలని అంటారు. ‘పరిధి దాటిన వేళ’ ఆయన కీర్తి వెనక ఈ రెండు కథలు పురుషాధిక్యతను సూచించేవే. ఎంత కష్టపడినా ఆమె చాకిరీ ఇంటివరకే పరిమితమైపోవడం ఆమె చాకిరీకి గుర్తింపు లేకపోవడం ‘ఆయన కీర్తి వెనక’ కథా వస్తువు.
‘పరిధి దాటిన వేళ’లో స్త్రీలు నియమితమైన వేళకు ఇంటికి రావాలి. ఎప్పుడూ బయటికి వెళ్ళనివాళ్ళు వెళ్తే వాళ్ళు సాధారణ సమయానికి ఇంటికి రాకపోతే ఇంటిల్లిపాదీ ఆమెను నానా రకాలుగా ఎలా సాధిస్తారో రచయిత్రి ఈ కథలో చెప్తారు.
ఛాయాదేవి గారి కథలన్నింటిలో పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీల పట్ల చూపిస్తున్న వివక్ష, పురుషాధిక్య భావం, అసమానతలు ప్రతిబింబిస్తాయి. స్త్రీలలో ఒక గొప్ప ఆత్మగౌరవ భావాన్ని, చైతన్యాన్ని ఉద్ధరింపచేస్తాయి. ఛాయాదేవి గారు కథలే కాదు ‘మృత్యుంజయ’ అనే నవల కూడా రచించారు. వ్యాసాలు రాసారు. చైనా వెళ్ళొచ్చాక అక్కడి విశేషాలతో, అనుభవాలతో కూర్చిన ఛాయాచిత్ర కథనాన్ని ప్రచురించారు. ‘మాత’ వంటి స్త్రీల పత్రికలకు సంపాదకురాలిగా పనిచేశారు. ఎన్నో పుస్తకాలపై సమీక్షలు రాసారు. స్పెఫాన్త్వైక్ కథలకు అనుసరణ చేసారు. వీరి కధలు హిందీ, మరాఠీ, తమిళం, స్పానిష్ భాషల్లోకి అనువదింపబడ్డాయి. అనేక తెలుగు, ఆంగ్ల సంకలనాల్లో వీరి కథలు పొందుపరచబడ్డాయి.
ఛాయాదేవి గారికి దుర్గాబాయి దేశ్‌ముఖ్ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి పురస్కారం, సుశీలా నారాయణరెడ్డి సాహిత్య పురస్కారం, పి.వి.నరసింహారావు మెమోరియల్ అవార్డు, అజో-విభో-కందాళం ఫౌండేషన్ వారి ప్రతిభా వైజయంతి జీవితకాల సాధన పురస్కారం లభించాయి.
పితృస్వామ్యం దోపిడీ నుండి విముక్తులై, పురుషాధిక్యం ఛాయ నుండి తప్పించుకొని, స్త్రీలందరూ స్వయం ప్రకాశితులై, స్వీయ వ్యక్తిత్వ సూర్య భాసమానులై వెలగాలని ఛాయాదేవిగారి ఆకాంక్ష..
సమాజంలో గొప్ప రచయిత్రులు ఉంటారు కానీ మంచి రచయిత్రులు అరుదు. ఆవిడ రచనలు ఎంత నిజాయితీగా ఉంటాయో మనిషి కూడా అంతే నిర్మలంగా ఉంటారు. వెన్నెలలాంటి చిరునవ్వుతో, నుదుట పెద్దబొట్టుతో, ప్రతి ఒక్కరినీ నవ్వుతూ పలకరించే ఛాయాదేవిగారు అందరితో ఆత్మీయంగా ఉంటారు. మన అమ్మలాగా, మన కుటుంబ సభ్యురాలిగా అనిపిస్తారు.
అంత గొప్ప రచయిత్రి అయినా కొంచెం కూడా గర్వం లేని సరళ స్వభావురాలు. తెలుగు సాహిత్య రంగంలో తనదైన ముద్ర వేసిన ఛాయాదేవిగారు ఆత్మకు శాంతి కలగాలని నివాళులర్పిస్తూ…