భిన్న ప్రవృత్తుల సహజ దృశ్యాలు – నిడదవోలు మాలతి కథలు -శీలా సుభద్రాదేవి

 

ఆరు దశాబ్దాల సాహిత్యానుభవం ఉన్నా, వందకి పైగా కథల్ని రాసినా, గుర్తించేవాళ్ళు గుర్తిస్తారులే అనే నెపంతో సాహిత్యాన్ని పండించడమే తప్ప కీర్తికోసమో, భుజకీర్తుల కోసమో పాకులాడకుండా సాహిత్య రంగంలో అచ్చు పుస్తకరూపంలో కనిపించకపోవడంతో విస్మృత కథకురాలిగా మిగిలిపోయే ప్రమాదంకి దరిదాపుల్లో ఉన్న రచయిత్రులలో నిడదవోలు మాలతి ఒకరు. అంతర్జాల సంచారం చేసే యవతరం వారికి పరిచయం ఉండే ఉంటుంది కానీ మిగతావారికి మాలతి కథలు గుర్తుండడం కష్టమే.

1953లో గల్పిక రూపకథల్ని తెలుగు స్వతంత్రలో రాయటంతో ప్రారంభించిన కథానికా రచన 2016 వరకూ కొనసాగుతూనే ఉంది. నిడదవోలు మాలతి తన కథలన్నిటినీ ఆరు సంపుటాలుగా కూర్చి తన ‘బ్లాగు’లోనే పీడీఎఫ్‌ రూపంలో భద్రపరచుకున్నారు. ఇవి కాకుండా తన జ్ఞాపకాల్నీ, అనుభవాల్నీ ‘ఎన్నెమ్మ కతలు’గా అక్షరీకరించి నాలుగు సంపుటాలుగా కూర్చారు.

1954 నుండి 73లో అమెరికా ప్రయాణమై వెళ్ళిపోయే వరకూ సుమారు రెండు దశాబ్దాల కాలంలో రాసిన కథలు ముప్ఫయికి పైగా ఉన్నాయి. మిగతావన్నీ అమెరికా నేపథ్యంలో రాసినవి. అయితే వీరి కథలలోని పాత్రలు తిరిగి తిరిగి పలుమార్లు కథాంశంలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. సీత, సీతాపతి, తరుణి సంద్రాలు, మురారి, మురళి, కామాక్షి… ఇలా భారతదేశంలోనూ, విదేశంలోనూ ప్రధాన పాత్రలతో కలిసి కథను నడిపిస్తూనే ఉంటారు. అందువలన కథలన్నింటిలోనూ ఏకసూత్రత ఉండడం ఈ రచయిత్రి కథన శిల్పంలోని ఒక ప్రత్యేకత.

అంతేకాక, మూడొంతుల కథలను ఉత్తమ పురుషలోనే చెప్పటం వలన ఒక నవలగానో, ఆత్మకథగానో తన అనుభవాల్నే కథలుగా అక్షరీకరిస్తున్నారా అనే అనుభూతి పాఠకుడికి కలుగుతుంది. బహుశా పాఠకుడిని కూడా తన రచనలోకి మమేకం చేసేందుకే ఈ కథన శిల్పాన్ని మాలతి ఎంచుకున్నారేమో.

వాస్తవికతా, సామాజిక స్పృహ పేరుతో బీద, బడుగు జీవుల బతుకు చిత్రాల్ని కరుణార్దంగానో, బీభత్సంగానో చిత్రించే కథలు కావు. అబ్బాయి, అమ్మాయి ప్రేమ పేరుతో జరిపే సరససల్లాపాలూ ఉండవు. దాంపత్య జీవితంలోని అపార్ధాలు, అపోహలు, అనర్థాలూ ఉండవు. అయితే ఏమీ లేని నిస్సార కథలా ఈ రచయిత్రిని అనుకోవల్సింది లేదు. మానవీయ దృక్కోణంలో ఏ దేశమైనా సంస్కృతి, భాష, జీవనసరళిలో తేడా ఉండొచ్చు కానీ మౌలిక విలువల్లో తేడా ఉండదనే భావాన్ని చాలా కథలు పట్టి చూపుతాయి. ముఖ్యంగా తేడా అంతా తరాల మధ్య ఉండేది మాత్రమే అని నిర్ధారిస్తారు రచయిత్రి.

నిడదవోలు మాలి ప్రధానంగా రెండు పద్ధతుల్ని పాటించి కథల్ని రాశారు. కొన్నింటిని నెరేషన్‌ పద్ధతిలో చెప్పారు. మరికొన్ని కథల్ని సంభాషణా పద్ధతిలోనే రాశారు. కథని కథన పద్ధతిలో చెప్తూ సాగుతున్నా ఏదో హరికథలా కాకుండా పాఠకుడికి ఆసక్తి కలిగించేలా పరిసరాలను పరిచయం చేస్తూ, పాత్రల స్వభావాల్ని విడమరుస్తూ కథతోపాటు పాఠకుడినీ నడిపిస్తారు. మరికొన్ని కథల్ని ఏకవాక్య సంభాషణ రూపంలోనే మూడొంతుల కథని రాయటం చాలా వాటిల్లోనే గమనించవచ్చు. వరుసగా సంభాషణల్ని రాసినా రచయత్రి చెప్పదలచిన విషయం, కథలోని దృశ్యాన్నో, సంఘటననో విశ్లేషించే విధానం; ఎవరు ఏం మాట్లాడుతున్నారు, వారి వారి స్వభావ స్వరూపాలు పాఠకుడికి చెప్పకనే చెప్పినట్లుగా అర్థమవుతాయి.

మాలతి కథలలో మరొక ప్రత్యేకత, సీరియస్‌ విషయాన్ని సైతం హాస్యధోరణిలోనో, వ్యంగ్య ధోరణిలోనో వాతావరణాన్ని తేలికపరుస్తూ ఆలోచింపచేయడం. రావిశాస్త్రి, మునిమాణిక్యం వంటి తెలుగు రచయితలే కాక మేరీ కొరెల్లీ వంటి ఆంగ్ల రచయిత్రుల రచనల్లోని హాస్యం, శైలిలోని చమత్కారాలకు ప్రభావితురాలైనందుకేమో వీరి రచనలలోనూ సున్నితమైన వ్యంగ్యం, చమత్కారపు శైలీ పాఠకుడి పెదాల మీద సన్నని హాసరేఖను మెరిపిస్తాయి. లాయరు దగ్గరకు వీలునామా రాయించడానికి వెళ్ళిన కథా సందర్భం, చెయ్యి విరిగినప్పుడు కనీసం కాఫీ చేసేవారు కూడా లేక కప్పు కూడా పట్టుకోలేని ఒంటరితనపు అసహాయత్వపు అవస్థలలో కూడా హాస్యాన్ని పండించటం మాలతిగారికే చెల్లు. కథలు రాయటం మీద రాసిన ‘ఉభయతారకం’ కూడా ఒక వ్యంగ్యంపు చురకే.

మాలతి కథలలో మలుపులు, అపార్థాలు, అపోహలు కొట్టొచ్చినట్లు కనిపించవు. సహృదయుడూ, స్నేహశీలి, బంధుహితుడు అని అందరిచేతా అనిపించుకునే అతి మంచివాడి భార్య అంతరాంతరాల్లో నిజానికీ, ఫెమినిజానికీ మధ్య గింగిరాలు తిరిగే భావ సంచయం ఆ ఒక్క కథలోనే కాక దేవీపూజ (1987), ఆనందోబ్రహ్మ (2003) వంటి మరికొన్ని కథల్లో కూడా రెపరెపలాడుతుంది. వడ్లగింజలో బియ్యపుగింజలా దాంపత్యాలలో ఆ మాత్రం ఆటుపోటులుండడం సహజం అని కొందరు అనుకోవచ్చు. కానీ అందమైన గులాబీ పువ్వు చాటునున్న ముల్లు చేసిన గాయం కనిపించకపోవచ్చు. కానీ సున్నిత హృదయిని, విద్యావంతురాలైన భార్యకి కావలసినదేమిటో అర్థం చేసుకోకుండా, ఇతరులకు ప్రదర్శించేలా బహుమతులు, పార్టీలు మొదలైనవి కాదనేది అతి కోమలంగా తెలియచేసే కథలు ఇవి.

మరొక మంచికథ ‘రంగుతోలు’. ఇంటికి దగ్గర్లోని ఆడిటోరియంలో నాటక ప్రదర్శనకి వెళ్ళిన నీలవేణిని అక్కడ బయట చేతిలో టికెట్టు పట్టుకొని ఏడుస్తున్న మూడేళ్ళ పాప పరుగున వచ్చి కాళ్ళని చుట్టుకుంటుంది. చుట్టుపక్కల వారు పాపని పట్టించుకోలేదని నీలవేణిని నిరసనగా చూస్తారు. రంగుని బట్టి ఆ పాప నీలవేణికి చెందినదని భావిస్తారు. ఎప్పటికీ పాప కోసం ఎవరూ రాకపోయేసరికి నీలవేణి పాపని లోపలికి తీసుకువెళ్తుంది. నాటకం మధ్యలో వేదిక మీద పాత్రని చూసి ‘మామ్‌’ అని అరుస్తుంది. నాటకం పూర్తయ్యాక ఆ పాత్రధారిణి వచ్చి నీలవేణికి ధన్యవాదాలు తెలిపి పాపని తీసుకువెళ్తూ, ‘బేబీ సిట్టర్లకు’ డబ్బుపెట్టే స్థోమత లేదని తెలియజేస్తుంది. ఆమె ఆర్థిక పరిస్థితి, వర్ణ వివక్షలు వ్యక్తపరిచే కథ ఇది. అమెరికా వంటి ధనిక దేశంలో సకల జనులూ సమానమే అని గొంతులు చించుకున్న దేశంలో కూడా ‘వర్ణ భేదంతో కొందరు కొంచెం తక్కువ సమానం’ అనేది తెలియచేసే కథ. తిరిగి నీలవేణి ఇంటికి తిరిగి వస్తున్న సమయంలో ఆమెపై దాడి చేసిన ముగ్గురు కుర్రాళ్ళలో ఒక నల్లవాడు నీలవేణిని తనవారుగా భావించి ఆమెకి అడ్డువెళ్ళి సాయపడతాడు. ”తొలిసారి తన తోలు రంగు గురించి తలుపులు తొలిగాయి నీలవేణికి” అంటూ ముగింపును ఇస్తారు రచయిత్రి. నిడదవోలు మాలతి ఏ కథలోనూ జోక్యం కల్పించుకోరు. చెప్పటం వరకే ఆమె వంతు. పాఠకుడే కథలోకి తొంగిచూసి అవగాహన చేసుకోవాలి. ఈ పద్ధతి వీరి చాలా కథలలో ఉంటుంది. బహుశా రచయిత్రికి పాఠకుడి తెలివితేటల మీద అచంచలమైన విశ్వాసం.

‘నీలితెరల మాటున దోబూచులాట’ (2008) కథలో నీల అనే అమ్మాయికి రోజూ ఛాటింగ్‌ చేసే ఒక ఫ్రెండ్‌ తన వయసుది కాదని, చాలా పెద్దావిడే అని తెలుస్తుంది. చివర్లో ఆమెకు బదులుగా ఆమె తొమ్మిదేళ్ళ మనవడు మెయిల్‌ ఫ్రెండ్‌ అవుతాడు. ఈ తరహా కథలు ఇటీవల కాలంలో విషాదాంతాలుగానో, నెగటివ్‌గానో కొన్ని వస్తున్నాయి. కానీ ఇందులో ‘నాకు చిన్నారి ఫ్రెండ్‌ దొరికాడు’ అనుకోవటంతో పాజిటివ్‌గా ముగించారు రచయిత్రి. దేశ కాల పరిధుల్ని, వయోపరిమితుల్నీ అధిగమించే సాధనంగా ‘మెయిల్‌ ఛాటింగ్‌’ని నిరూపించటం కొసమెరుపు.

విదేశీ మోజుతో తమ ఆలోచనలు, అలవాట్లు తదనుగుణంగా మార్చేసుకున్న తర్వాతే విదేశీ యాత్ర తలపెట్టే వారిపై వ్యంగ్య చిత్రం ‘పై చదువులు’ కథ. విదేశాలలోని మంచిని ఒంటపట్టించుకోకుండా, జీవన విధానంలోని చెడుని స్వీకరించి గుడ్డిగా అనుకరించే వారిని వ్యంగ్య బాణాలతో చీల్చి చెండాడుతారు మాలతి.

నిడదవోలు మాలతి సంపుటీకరించుకున్న ఆరు సంపుటాలలో మొదటి మూడింటిలో ఎక్కువ కథలు విశాఖ నగర పరిసరాలలోనే ఆ వాతావరణాన్నీ, 1970 లోపున సామాజిక చిత్రణనీ, జీవన విధానాన్నీ పట్టి చూపుతాయి. తర్వాతి కథలు అమెరికాలో భారతీయ జీవన నేపథ్యంలో జరుగుతాయి. ముఖ్యంగా అక్కడి భారతీయ కుటుంబాలలోని దాంపత్య బంధాల వివిధ కోణాల్ని ఆవిష్కరించారు. అక్కడి జీవన పరిస్థితులు, స్నేహాలు, ఉద్యోగాలూ, వివక్షలు, ఆర్థికావసరాలు ఇలా ఎన్నెన్నో ప్రభావాలు కుటుంబ జీవితంపై ఏ విధంగా పనిచేస్తున్నాయనేది, వాటి మూలంగా ఎదుర్కొనే మానసిక సమస్యలు, తప్పనిసరిగా అలవరచుకున్న తెలివిడితనం ఈ కథలనిండా పరుచుకున్నాయి.

ఈ కథలలో విదేశీ జీవన విధానంతో పాటు అక్కడి పరిసరాల్ని పాఠకులకు పరిచయమయ్యేలా చేస్తారు. అదేవిధంగా ఒకటి రెండు కథల్లో ఇండియా వచ్చినప్పటి అనుభవాలతో రెండు జీవితాలలోని సారూప్యతని చాటేలా చూపుతారు.

1960 ప్రాంతాలలో తెలుగు రాష్ట్రాల నేపథ్యంలో రాసిన కథలే ఎక్కువగా ఉన్నాయి. విశాఖ ప్రాంతంలోని యారాడ కొండ, కాల్టెక్స్‌ ఆయిల్‌ రిఫైనరీ, బీచ్‌ రోడ్డు, కైలాసగిరి, విశాఖ సంపెంగల సురభిళం ఆ కథలన్నింటా మనల్ని చుట్టుముట్టేస్తాయి.

నాల్గవ సంపుటిలోని 1965లలో రాసిన కథలలో ముఖ్యంగా చిత్రమైన మనుషుల మనస్తత్వాల్ని విశ్లేషించిన కథగా ‘లోతు తెలియని ఈత’ను పేర్కొనవచ్చు. నవ్వు ఊపిరితిత్తులకు మంచిది అంటూ జీవితంలోని ఎగుడు దిగుళ్ళని సైతం నవ్వుతూ ఎగరగొట్టేసి నవ్వుతూ బతికిన ‘కమలిని’ చివరికి మృత్యువు మీద కూడా జోకులేస్తూ మరి నవ్వని స్థితికి వచ్చిన కథని కరుణార్ద్రంగా తీర్చిదిద్దిన విధానం మాలతి గారికే సాధ్యం.

అందుకే ”భాష విషయంలో మార్గదర్శకం రావిశాస్త్రి కథలు. ఏ కోణం తీసుకున్నా ఎంతో ప్రతిభావంతంగా తోస్తుంది. ఆ పద విన్యాసం, అదేవిధంగా థామస్‌ హార్డీ కథలలోని మలుపుల ఛాయలు బహుశా నా కథల్లో కనిపించి ఉండొచ్చు” అని నిజాయితీగా, నిష్కర్షగా చెప్పకుంటారు మాలతి.

‘అడవి దారంట’ కథ ఒక వచన కవితలా జీవన స్రవంతి పద్ధతిలో సాగుతుంది. ఒక రాత్రి అడవి దారంట ప్రయాణం కొనసాగిస్తూ చివరలో ఒక ముసలామెను కలిసినప్పుడు జీవన మాధుర్యాన్ని తెలుసుకోవడంతో ముగుస్తుంది. కానీ ఎక్కడా తెలుసుకున్న విషయాన్ని తెలుసుకున్నట్లుగా చెప్పకపోవడం మాలతి గారి కథన లక్షణం. పరిసరాల్ని వర్ణించే విధానాన్ని బట్టి, పాత్రల తీరుని బట్టి, చెప్పీ చెప్పక చెప్పే సంభాషణలలోని మార్మికతను బట్టి పాఠకుడికి అర్థమయ్యేలా రాసే విధానాన్ని రచయిత్రి తన శైలీ, శిల్పంగా సమకూర్చుకున్నారు.

మాలతి కథలలో పాత్రల మనోచిత్రణ, సంఘర్షణ, సమస్యలకు ఎంత ప్రాధాన్యం ఇస్తారో పరిసరాల చిత్రణకు కూడా అంతే ప్రాధాన్యం ఇస్తారు. అందువలన పాఠకుడికి కూడా ఆ పరిసరాలన్నీ పరిచయ ప్రాంతాలైపోతాయి. వీరి కథన శైలి ప్రధానంగా సంభాషణా ప్రాతినిధ్యం కలిగి ఉంటుంది. కనుక పాఠకుడి ఎదురుగానే కథ జరుగుతున్న అనుభూతి కలుగుతుంది.

అబ్బూరి రామకృష్ణారావుగారు చమత్కారంగా అన్న మాటని ఆధారంగా చేసుకుని, ఆయన మాటల్నే ముగింపుగా అల్లిన కథ ‘తృష్ణ’ (1970). బాలయ్య లైబ్రరీలో అటెండరుగా పనిచేస్తుంటాడు. అతనిపై అంతకుముందు పనిచేసిన చోట సరిగా హాజరుకాడనీ, దొంగతనం చేస్తాడని ఫిర్యాదులు ఉన్నాయి. సహోద్యోగులు ఆ విషయాలన్నీ చెప్తుంటారు. లైబ్రరీలో కొన్ని పుస్తకాలు పోవడంతో బాలయ్యపై దొంగతనం మోపి అతని ఇంటిని సోదా చేస్తే కొన్ని పుస్తకాలు దొరుకుతాయి. కానీ అవేవీ పోయిన పుస్తకాలలోనివి కావు. వేయి పడగలు మాత్రమే అందులోనిదని నిర్ణయిస్తారు. ఆ తర్వాత చాలా కాలానికి బాలయ్య కనిపించి పాత పుస్తకాల షాపు నడుపుతున్నానని చెప్తాడు. ”అయితే ఇప్పుడు నువ్వు ఎన్నైనా పుస్తకాలు చదువుకోవచ్చు” అని ప్రధాన పాత్ర అంటే బాలయ్య నవ్వి ”ఇప్పుడు పుస్తకాలు నాకు అమ్ముకునే సరుకు మాత్రమే. మిఠాయి దుకాణం వాడిలా చుట్టూ పరుచుకు కూచుంటానంతే. చదివే తీరిక లేదు” అంటాడు. తీరా కథని ముగిస్తారు. ఉద్యోగంలో ఉన్నప్పుడు చదువుకోవాలనే తృష్ణే బాలయ్యను లైబ్రరీలోని పుస్తకాలు తీసుకెళ్ళి చదివాక తిరిగి తీసుకొచ్చి షెల్ఫులో పెట్టి దొంగతనం ముద్ర వేయించుకునేలా చేసింది కదా!

ఇటువంటి అటెండరు కథే ‘విషప్పురుగు’. అటెండరుని చూసి అతని మీద ఏవేవో కల్పించుకుని బెదిరిపోయే సహోద్యోగులు అతనిపై కక్ష సాధించడానికి ప్రయత్నం లేకుండానే ఆయుధంగా మారిన ‘హెచ్చెమ్‌’ కథ. అసలైన విషప్పురుగు కన్నా ప్రమాదకరమైన మనుషుల కథ.

‘శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు’ అనే వాక్యాన్ని ఆధారం చేసుకుని రెండు గల్పికలు అల్లడమే కాకుండా ఒక దానిలో రెండు మూడు విధాలుగా ముగింపులు చెప్పడం రచయిత్రి రచనా విన్యాసానికి మచ్చుతునక. ”నాకు కథకి సాధారణంగా ప్రేరణ, ఒక వాక్యం, ఒక స్పందనా చాలు. ఆ తర్వాత మిగిలిన కథంతా కట్టుకథే” అంటారు మాలతి. దానికి ఉదాహరణగా ”శివునాజ్ఞ”, ”తృష్ణ”లను చెప్పుకోవచ్చు.

అందరూ చెప్పేది కాక ఇంకా చెప్పగలిగినది ఏదైనా ఉంటేనే కథ రాయాలంటారు మాలతి.  అమెరికాకి బంధువుల్ని పిలిపించుకున్న వాళ్ళు ఏదోరకంగా మాటలతో మాయచేసి అక్కడే ఉంటూ చదువుకుంటూ, ఖాళీ సమయంలో పనులు చేసుకుంటూ ఇంటికి కూడా పదో పరకో పంపవచ్చు అన్నట్లుగా మాట్లాడి తమ ఇంట్లో ఖర్చు లేకుండా నమ్మకమైన పనివాళ్ళను ఆత్మీయతతో కొనే విధానాన్ని కొనుక్కోబడిన వాళ్ళను గురించి రాసిన కథ ‘కొనేమనిషి’ (1976).

‘డాలరుకో గుప్పెడు రూకలు’ కథలో చాలాకాలానికి భార్యాపిల్లలతో స్వదేశం వచ్చిన ఎన్నారై ఇండియాలో షాపులూ, పాఠశాలలూ అన్నీ తిరిగి చూస్తారు. ఇండియాలో దిగిన దగ్గర నుంచి టీనేజీ పిల్ల సుశీకి కూలివాడితో మొదలుకొని ప్రతిచోట పదికీ, ఇరవైకీ బేరాలు చేసి తల్లిదండ్రులు రూపాయలు పొదుపు చేసినట్లుగా మురిసిపోవటం అంతుపట్టదు. మాటిమాటికీ డాలర్లలో అయితే ఎంత అని అడుగుతుంది. తిరిగి అమెరికా వెళ్ళాక ఒక షాపులోకి వెళ్తారు. ఇండియాలో 650 రూపాయల ‘షాల్‌’ బేరమాడి 420కి కొన్నలాంటిదే ఆ షాపులో 150 డాలర్లని చెప్పటం చూసి ‘అంటే ఎన్ని రూపాయలు?’ అనుకుని దీన్ని దోపిడీ అని ఎందుకనరో అనుకుంటుంది సూ (సుశీ). సినిమా, రెస్టారెంటు ఖర్చు ఎన్ని రూపాయలు అని ప్రశ్నించుకుంది సూ. ”మనం ఇక్కడ డాలర్లలో సంపాదించి డాలర్లలో ఖర్చుపెడతాం” అంటుంది తల్లి. సూ ప్రశ్నలోని అంతరార్థం, తల్లి సమాధానం పాఠకులకు బాగానే అర్థమౌతుంది.

మాలతి కథలు నేల విడిచిన కథలు కావు. మూలాల్ని స్పృశిస్తూ వర్తమానంలో బతుకుతూ మనిషిగా బతకడానికి కావలసిన మనసుని తడుముకోవాల్సిన వాస్తవ కథలు, మనసు కథలు, మనిషి కథలు, మానవ నైజాన్ని బట్టబయలు చేసే కథలు, పాజిటివ్‌ థింకింగ్‌ను ప్రేరేపించే కథలు. అందుకే ”సాంఘిక ప్రయోజనం గల కథ రాస్తున్నానన్న స్పృహతో రాయలేదు. పాఠకుడు మనిషిలా స్పందింపచేయడమే నా ధ్యేయం కానీ అతడిని సంస్కరించడం కాదు” అంటారు రచయిత్రి.

కొన్ని కథలు తనలో తానే జీవన మననం చేసుకోవటంలా ఉంటాయి. వాటిని కథలుగా కన్నా గల్పికల్లాగో, మ్యూజింగ్స్‌లాగో ఉన్నాయనిపిస్తుంది. దేనిలోనైనా మానవ సంబంధాలు, మానవ స్వభావాలు, ఆర్థిక సంబంధాలు, స్నేహాల్ని అవసరార్ధం వాడుకునే అవకాశవాదం ఇవన్నింటి వెనక నేపథ్యంలో ఒక తాత్విక చింతన ఆర్తిగా పరుచుకొని ఉంటుంది.

అందుకే మరికొన్ని కథలలో నిజానికి స్త్రీకి కావలసినదేమిటి. లైంగిక స్వేచ్ఛా, జీవన స్వేచ్ఛా, ఆర్థిక స్వేచ్ఛా అనే ప్రశ్నలు పాఠకుడిలోను తలెత్తుతాయి. దాంపత్య జీవితంలో భార్యకి కావలసినది కోరుకున్నది కాక సమస్తం కొనిపెట్టి, బయట తిప్పి, తినిపిస్తే తృప్తి పడిపోతుందా? భార్యని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నాననే ప్రదర్శనలతో నిజానికీ, అబద్ధానికీ మధ్య జరిగే దాంపత్య బంధం ఎలాంటిది? భార్యకి బాహ్యమైనవి అందించి అంతరంగాన్ని పట్టించుకోని స్త్రీ జనోద్ధరణ చేస్తున్నామనుకునే వారిని ఎలా చూడాలి?

అమెరికా జీవితాన్ని పంచరంగుల కలల్లో కూర్చోబెట్టినవీ, ఇండియాలో భార్యాపిల్లల్ని ఉంచి అన్నీ అమర్చుతున్నానని భ్రమింపచేసినవీ, విదేశాల్లో సమాజోద్ధరణలో మునిగిపోయామనటం సమర్ధనీయమేనా? ఇలా ఎన్నో ప్రశ్నలు, సంశయాలు. రెండు సంస్కృతుల మధ్య, రెండు విభిన్న అంతరంగాల మధ్య రెండు సంప్రదాయాల మధ్య గుండెలోనో, గొంతుకలోనో కొట్లాడేలాంటి సున్నితమైన, సర్రున కోసే గరిక నూగులాంటి సమస్యల్ని చర్చించిన కథలు నిడదవోలు మాలతి కథలు. ఇవన్నీ నిజానికీ, ఫెమినిజానికీ, మానవతకూ మధ్య ఊగిసలాడే వాస్తవ ప్రతిబింబాలు.

మాలతికి భాష మీద మోజు కూడా ఎక్కువే. మామూలుగా సాధారణ సరళ సంభాషణలే రాసినా ఆవేశం వచ్చినప్పుడో, ఆవేదన కలిగినప్పుడో, ఆనందం కలిగినప్పుడో ఉండుండి కథలో ఎక్కడో వ్యంగ్యాన్ని ప్రదర్శించటానికో, చిరాకుని చెప్పటానికో ఒక దీర్ఘ సమాసాన్ని చొప్పించుతారు. అంతేకాదు అవసరమైనప్పుడు సంస్కృత శ్లోకాల్ని కూడా సందర్భానుసారం వాడతారు.

కొన్ని కథలు చదువుతున్నప్పుడు రచయిత్రి పాఠకులకు బోధించే ఉద్దేశంతో కాకపోయినా ఒక్కొక్కప్పుడు అసహాయ పరిస్థితిలో నిరాశా నిస్పృహలను పారద్రోలి మానసిక బలాన్ని ఎలా పుంజుకోవాలో అర్థమవుతుంది.

కథలలో మూడవ వంతు కథల్ని ఉత్తమ పురుషలోనే రాశారు. అన్నింటిలోనూ ‘నేను’ పాత్ర నెమ్మదైనది, మితభాషి. తొందరగా స్నేహితులను సమకూర్చుకోలేనిది. నలుగురిలోనూ చొచ్చుకుపోయి మాట్లాడలేనిది. ప్రకృతి ప్రేమికురాలు. ఎవరైనా తనను నొప్పించినా, వ్యంగ్యంగా ఏమైనా అంటున్నా గభాలున వారికి ఎదురు సమాధానం చెప్పలేనిదిగానే ఉంటుంది. ఈ కథలన్నింటిలోనూ ‘నేను’ పాత్రతో సమానంగా ఉండే పాత్ర ‘సంద్రాలు’. ప్రతీ సంఘటనలోనూ, సంఘర్షణలోనూ ‘నేను’ను మందలిస్తూనో, మానవ నైజాన్ని విప్పి చెబుతూనో, సమస్యని తీర్చటానికో, ఏ పరిస్థితుల్లో ఎలా నడుచుకోవాలో బోధిస్తూనో, అన్నింటికీ మౌనంగా ఉన్నప్పుడు తీవ్రంగా కోప్పడుతూనో ఒక ప్రాణమిత్రురాలిగా కథంతా విస్తరించుకొని ఉంటుంది. సంద్రాలు సంభాషణా తీరు అంతా ఉత్తరాంధ్ర మాండలికంలోనే ఉంటుంది. ఈ మొత్తం కథలన్నీ చదివాక ‘నేను’ పాత్ర ద్వారా చెప్పలేని విషయాల్ని సంద్రాలుతో పూర్తి చేయించడం చూస్తుంటే ‘నేను’ పాత్ర యొక్క లోపలి మనిషి (insider) గానే సంద్రాలు పాత్రని సృష్టించినట్లుగా కనిపిస్తుంది. ఇలా అన్ని కథల్ని ఒక పాత్రని, మరొక లోపలి మనిషి పాత్రని కలిపి కథని నడిపించడం ఒక కొత్త టెక్నిక్‌గా చెప్పుకోవచ్చు.

‘నేను’ పాత్ర మూలాలే కాక ‘నేను’ సృష్టికర్త రచయిత్రి మూలాలు కూడా విశాఖ పరిసరాలే. రచయిత్రికి విశాఖ నగరంలోని అణువణువూ ప్రీతిపాత్రాలే. ముఖ్యంగా సముద్రమూ, సంపంగితో సహా. అందుకే సముద్రాన్ని ‘సంద్రాలు’ పాత్రగా తీర్చి ఉత్తరాంధ్ర మాండలికాన్ని చెప్పించడం కూడా ఒక విశేషమే. నలభై, యాభై ఏళ్ళ క్రితం ఈ పరిసరాల్ని విడిచిపెట్టినా ఆ మాండలికాన్ని ఆ సురభిళాల సొబగును ఇటీవల కథలలో కూడా సజీవంగా ఉంచగలుగుతున్నారంటే రచయిత్రికి ఈ ప్రాంతం ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే.

ఒక కథలో అమ్మమ్మ ఇంటికి బరంపురం వెళ్ళినపుడు అమ్మమ్మ తన నేస్తం గురించి చెప్పిన విషయం తప్పక పేర్కొనవలసిందే. శ్రీకాకుళం జిల్లాకు దగ్గరగా ఉండే ఒరిస్సా బోర్డర్‌లోనూ ఒకప్పుడు ఉన్న ప్రత్యేక విశేషం- ఇద్దరు బాల్య మిత్రులు దేవుడి గుడిలో దైవసాక్షిగా ఒకరితో ఒకరు నేస్తం కడతారు. నేస్తం కట్టిన తరువాత వారు పేర్లతో పిలుచుకోరు. ‘నేస్తం’ అనే ఎవరికైనా చెబుతారు. ఒకరినొకరు ‘మీరు’ అని మన్నించుకుంటారు. జీవితాంతం నేస్తాలుగానే ఉంటారు. సాధారణంగా బాలికలలోనే ఈ నేస్త బంధనం ఉన్నట్లుగా తెలుసు. బాల్యంలో కొంతకాలం శ్రీకాకుళం జిల్లాలోని గ్రామంలో నివసించటం వలన వ్యాసకర్తకి కూడా ఈ విచిత్ర బంధం అనుభవమే.

జీవితం పొడవునా పరిచయమైన వారి గుర్తులు భద్రపరచుకోవాలనే తపన కల పాత్ర మురళి తన గుర్తును మాత్రం ఎక్కడా మిగల్చకుండా ఆకస్మిక మరణం పొందిన కథ ‘జ్ఞాపక చిహ్నం’ గుండెని చెమ్మగిల్లజేస్తుంది. మానవ సంబంధాన్ని అపురూపంగా చూపిన కథ. కోటి కలలతో అమెరికాలో అడుగుపెట్టిన ధరణి, భర్త అపురూప ప్రేమకి మైమరచిపోతుంది. కాలక్రమేణా ప్రాజెక్టులు లేక ఉద్యోగం పోయి తగిన ఉద్యోగం లేదనే సాకుతో కంప్యూటర్‌ గేమ్స్‌తో కాలక్షేపం చేసి ధరణి సంపాదనతో గడుపుతాడు. కనీసం ఇంటి పనిలోనైనా సాయంగా ఉండడు. భర్త తీరుతో విసుగెత్తిన ధరణి ‘ఎవరో వచ్చి ఉద్యోగం ఇస్తారని అమెరికన్లు ఎదురుచూస్తూ కూర్చోరు. నువ్వు

ఉద్యోగం సంపాదించుకున్నాక వస్తానని’ వెళ్ళిపోతుంది. ‘నీకోసం’ కథలో రచయిత్రి అమెరికన్లు ఎంత వయసు వచ్చినా తమ కాళ్ళమీద తాము నిలబడాలని ఏదో ఒక పనిలో నిమగ్నమయ్యే ఒక మంచి లక్షణాన్ని ఈ కథలో చూపుతుంది.

అమెరికా జీవన విధానాన్నీ, భారతీయ జీవన విధానాన్నీ అన్ని విధాలా బేరీజు వేస్తూ వాటిలోని వైవిధ్యాల్నీ, సాదృశ్యాల్నీ, మానవ నైజాల్నీ ప్రతిభావంతంగా ఆవిష్కరించారు.

శ్రీరంగవల్లి పేరుతో కథలు రాసే వేదవల్లి మరణిస్తే ఆమె భర్త శ్రీరంగశయనం వైనాలు వైనాలుగా భార్య తనకు ఎంత అణకువగా ఉండేదో, నోరెత్తకుండా ఉత్తమ ఇల్లాలుగా ఉండేదో వచ్చినవారందరికీ చెప్పేవాడు. ఆ చెప్పడంలో ఆమెపై పొగడ్తకన్నా అతనెంత వేధించుకు తిన్నాడో అనేది ధ్వనించేది వినేవారికి. తాను చెప్పే కబుర్లు విని కథలు రాసి పేరు తెచ్చుకుందనీ, తాను చెప్తేనే ఆమెకు సన్మానాలు జరిగాయనీ అంటున్న తండ్రి మాటలు విన్నప్పుడల్లా తల్లి ముఖం మసకబారి పోతోందని కొడుకు చక్రధరం బాధపడ్డాడని పలుమార్లు రచయిత్రి చెప్పటంలో సందర్భానుసారం వ్యంగ్య గర్భితంగానే ఆ విషయాన్ని ప్రకటిస్తుంది. అధ్యాపకురాలైన వేదవల్లి కాలేజి నుండి వచ్చి, స్నేహితులతో పేకాడుతున్న తమకోసం వేడి వేడి పకోడీలు వేసిచ్చి, వంట చేసేదని కీర్తిస్తున్న తండ్రి మాటలు విని చక్రధరం తన భార్య వెనక పనిలో సాయం చేయడానికి వెళ్తాడు. కొడుకుని తీక్షణంగా చూసి శ్రీరంగశయనం తన స్నేహితుని వితంతు చెల్లెల్ని వివాహం చేసుకోవాలనుకుంటున్నానని తన విశాల హృదయాన్ని ప్రకటిస్తాడు. అది విని చక్రధరం ”ఆమె అంటే గౌరవమే కానీ మీరు ఆశపడ్తున్నంత ఉత్తమ ఇల్లాలు కాబోదేమో” ఉత్తమ ఇల్లాలని వత్తి పలుకుతూ అంటాడు. చక్రధరం తన తల్లికి శిష్యురాలైన తన భార్య గౌతమిలో తల్లిని స్పష్టంగా చూశాడని ముగిస్తారు. ”ఉత్తమ ఇల్లాలు” కథలో రచయిత్రి స్త్రీ చైతన్యాన్నీ, స్త్రీ వాద దృక్పథాన్నీ, పిడికిలి బిగించి ఉద్యమ స్ఫూర్తిగానే చెప్పనవసరం లేదని, ఈ రకంగా మార్మికంగా కూడా పాఠకులకు సరళ సంభాషణలతోనూ అవగాహన కలిగించవచ్చుననేది మాలతి కథలు చదివితే అర్థమవుతుంది.

వందకు పైగా కథల్ని పీడీఎఫ్‌ ఫార్మాట్‌లో తన బ్లాగులో అందించటమే కాకుండా tethulika wordpress.com లో ‘ఊసుపోక’ శీర్షికన తన జీవితానుభవాలు, జ్ఞాపకాల్ని ధారావాహికంగా ప్రచురించారు. వీటినన్నింటినీ (సుమారు 120) నాలుగు సంపుటాలుగా తీర్చి ‘ఎన్నెమ్మ కతలు’ రూపంలో బ్లాగులో భద్రపరిచారు.

వీటికి ముందుమాటగా యస్‌.నారాయణస్వామి ”వ్యక్తిగత అనుభవాల్ని శోధించి, మధించి, ఆ మధనం లోంచి జీవిత సత్యమనే అమృతాన్ని ఆవిష్కరించినపుడు అది నిజమైన డయాస్పోరా సాహిత్యమవుతుంది. ఇటువంటి సాహిత్యం నివాసులకీ, ప్రవాసులకీ మధ్య వారధిగా ఉపయోగపడుతుంది. ఎన్నెమ్మ కతలకి విశాలమైన జీవితానుభవం ఆవరణ కాగా లోతైన పరిశీలన వీటికి పునాది” అని ప్రశంసించారు.

నిడదవోలు మాలతి కథలు 1973 లోపున మాత్రమే ఎక్కువగా వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. తర్వాత ఆమె ప్రవాసురాలు కావటంతో ఆమె రచనలు ఇక్కడ పాఠకులకు అందుబాటులోకి రాకుండా పోయాయి. అంతర్జాల సంచారం చేసేవారికి తప్ప ఇంత విస్తృతంగా కథలు రాసినట్లు గ్రంథ రూపంలో మాత్రమే చదవగల పాఠకులకు తెలియకపోవటంతో కనమరుగయ్యాయి.

”మొదట్నుంచీ జీవితాన్ని గురించి మీమాంస, సదసదృంశయాలు ఉండేవి. రకరకాల ఇతివృత్తాలు తీసుకుని ఇతివృత్తానికి తగిన శైలిలో ఆవిష్కరించటం నాకు ఇష్టం. ఒకే అంశాన్ని భిన్న దృక్కోణాలలో ఆవిష్కరించగలగటం, ఇతివృత్తాలలో వైవిధ్యం చూపడం మంచి కథకుడి లక్షణంగా భావిస్తాను” అని చెప్పే నిడదవోలు మాలతి రచనలన్నీ ఈ ధోరణిలోనే సాగాయని పాఠకులకు స్పష్టంగా అర్థమవుతుంది.

ప్రచురణ సంస్థలు ఎవరైనా పూనుకొని నిడదవోలు మాలతి ఎంపిక చేసిన కథల్ని పుస్తక రూపంలోకి తెచ్చినట్లయితే సాహితీ లోకానికి ప్రవాసంలో విరబూసిన విశాఖ సంపంగి పరిమళాల్ని అందించిన వారవుతారు. ఎవరైనా ఆ పరిమళాల్ని ఆఘ్రాణించాలనుకుంటే tethulika wordpress.com కి వెళ్ళి హాయిగా హృదయానికి హత్తుకోవచ్చును.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.