‘Until the lion learns how to write, every story glorifies the hunter’ – African Proverb.
రామాయణ, మహాభారతాలు, పురాణాలు, భగవద్గీత, మనుస్మృతి, పద్దెనిమిది పురాణాలు బ్రాహ్మణీయ వర్గాలు తమ వాదానికి అనుకూలంగా, తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి, దైవపరమైన ఆమోదం ఉందని ప్రజల్ని నమ్మించడానికి రాయబడిన సాహిత్యం. కాలక్రమణిక (షష్ట్రతీశీఅశీశ్రీశీస్త్రవ) ప్రకారం చూస్తే, ఇవన్నీ బౌద్దాన్ని అంతమొందించి దాని స్థానంలో వైదిక హిందూ మతాన్ని (బ్రాహ్మణ వాదాన్ని) తిరిగి ప్రతిష్టించుకునే క్రమంలో సుమారు క్రీస్తు శకం ఒకటో శతాబ్దం తర్వాత రాసుకున్నవని అర్థమౌతుంది. కులాల పుట్టుకను దైవపరమైన విషయంగా చెబుతూ, సృష్టికర్త వివిధ శరీర అవయవాల నుంచి నాలుగు వర్ణాలు పుట్టాయని పేర్కొన్న వేదాలు అపౌరుషేయాలు (ప్రశ్నించడానికి వీల్లేని) అని షరతులు విధించిన వైదిక సాహిత్యాన్ని బుద్ధుడు ప్రశ్నించాడు. అంతేకాకుండా బ్రాహ్మణాధిక్యతను, కర్మ కాండల పేరుతో పురోహిత వర్గం సాగించే అహేతుకతను మొత్తంగా అశాస్త్రీయ వాదాన్ని బుద్ధుడు ప్రశ్నించి స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా ప్రత్యామ్నాయ వ్యవస్థను ఏర్పాటు చేసాడు. ఆధ్యాత్మిక రంగంలో ఉన్న నిరంకుశ ధోరణికి బౌద్ధం సవాలు విసిరి జ్ఞానం అందరిదీ అని చెప్పింది.
బుద్ధుని సిద్ధాంతాన్ని బింబిసారుడు, అశోకుడు, కనిష్కుడు, హర్షవర్ధనుడు వంటి పాలకవర్గం అధికారికంగా ప్రచారం చేయడం వలన ప్రాచీన కాలంలో బౌద్ధం వేగంగా దూసుకువెళ్ళింది. అశోకుడు తన రాజ్యాన్ని బౌద్ధ రాజ్యంగా ప్రకటించి అక్కడ బ్రాహ్మణ మతంలో ఉండే యజ్ఞయాగాలు, క్రతువులకు స్థానంలేదని వాటిని నిషేధించాడు. దీంతో బ్రాహ్మణ పూజారి వర్గం జీవన భృతిని కోల్పోయింది. బౌద్ధం అధికార మతమయ్యాక అనేక రకాలుగా అసంతృప్తికి గురైన బ్రాహ్మణ వర్గం పుష్యమిత్ర శుంగుడి రూపంలో ప్రతీకార చర్యకు పాల్పడింది. పుష్యమిత్రుడు అశోకుని మునిమనవడైన బృహదద్రుడి రాజ్యంలో సైన్యాధికారి. అతను కుట్రతో రాజుని చంపి రాత్రికి రాత్రి మౌర్య సామ్రాజ్యాన్ని అధిష్టించాడు. బౌద్ధ విప్లవంతో బ్రాహ్మణ వర్గం పోగొట్టుకున్న ప్రభావాన్ని తిరిగి పొందడానికి తన అధికారాన్ని, శక్తియుక్తులను ఉపయోగించాడు. పుష్యమిత్రుడే సుమతీ భార్గవ అనే బ్రాహ్మణ పండితుడి చేత మనుస్మృతిని రాయించాడు. మనుస్మృతి ద్వారా బౌద్ధం ప్రవేశపెట్టిన సమత, కరుణ, ప్రజ్ఞ వంటి భావనలకు విరుద్ధమైన సామాజిక అసమానతల్ని, స్త్రీ అణచివేతను తిరిగి పునరుద్ధరించాడు. నిజానికి స్త్రీలు, శూద్రుల విషయంలో మరింత కఠినతరం చేశారనవచ్చు. మనుస్మృతి మామూలు సాహిత్య గ్రంథం కాదు. అది ఒక రకంగా శిక్షా స్మృతి లాంటిది. దాన్ని ఈ దేశంలో శతాబ్దాల తరబడి పాటిస్తూనే ఉన్నారు. అందుకే ప్రముఖ Iఅసశీశ్రీశీస్త్రఱర్ వెండీ డోనిగర్ భారత రాజ్యాంగం అమలులోకి వచ్చేవరకు ఈ దేశంలో మనుస్మృతి శిక్షాస్మృతిగా చెలామణి అయిందని పేర్కొంది. పుష్యమిత్రుడిలాగా రాజ్యాధికారాన్ని పొందకపోయినప్పటికీ తర్వాత బ్రాహ్మణ పురోహిత వర్గం రాజస్థానాలలో మంత్రులుగానూ, ముఖ్య సలహాదారులుగానూ ఉండి తమ వర్గ ప్రయోజనాలను నెరవేర్చుకున్నారు. కుల వ్యవస్థని స్థిరీకరిస్తూ, సామాజిక అసమానతలకు దైవపరమైన ఆమోదం ఉందని ప్రజల్ని నమ్మించడానికి భగవద్గీత, ఇతిహాసాలైన రామాయణ, మహాభారతాలు, పద్దెనిమిది పురాణాలు ఈ క్రమంలోనే రచించడం జరిగింది. భౌతికంగా బౌద్దాన్ని అంతమొందించడానికి ఒకవైపు బౌద్ధ భిక్షువులను హతమారుస్తూ విహారాలనూ, చైత్యాలనూ హిందూ దేవాలయాలుగా మారుస్తూ, మరోవైపు బ్రాహ్మణ వాదాన్ని పునరుద్ధరించడానికి తమకు అనుకూలమైన సాహిత్యాన్ని సృష్టించారు. ద్విముఖ వ్యూహంతో నడిచిన ఈ బ్రాహ్మణవాద పునరుజ్జీవన దశని అంబేద్కర్ ‘Counter Revolution’ అంటాడు.
బ్రాహ్మణ మత సాహిత్యమంతా పూర్తిగా అహేతుకంగా, కల్లబొల్లి కట్టుకథలతో నిండి ఉండి వారి సన్నాయి నొక్కులకు విష్ణుమూర్తి అనే దేవుడి దశావతారాలను అడ్డం పెట్టుకోవడం చూస్తాం. బ్రాహ్మణ వాదులు ‘ధర్మాన్ని’ (అంటే తమ కులాధిపత్యాన్ని) కాపాడడానికి విష్ణువు ఆయా రూపాలలో పుట్టాడనే మరో కొత్త కథని పురాణాల ద్వారా సృష్టించారు. వారిదంతా ‘లిఖిత పూర్వకమైన కుట్ర’ అనవచ్చు. వారి సాహిత్యంలో ‘ధర్మం’ అంటే కులపరమైన అసమానతలు ఎల్లకాలం కొనసాగి వారి పీఠాలు చెక్కుచెదరకుండా ఉండడమే!
ఉదాహరణకు తన శూద్ర వర్ణ ధర్మానికి భిన్నంగా తపస్సు చేసుకుంటున్న శంభూకుడిని రాముడు చంపి వర్ణ ధర్మాన్ని కాపాడడం వంటిదన్నమాట. అయితే పురాణ లిఖిత సాహిత్యానికి సమాంతరంగా అనార్క, బ్రాహ్మణేతర జాతులు బ్రాహ్మణ సాహిత్యాన్ని భిన్నమైన కథనాలతో తమ ఆకాంక్షలను, ప్రాపంచిక దృక్పథాన్ని చాటుతూ మౌఖిక సాహిత్యాన్ని సృష్టించుకున్నారు. వీరి మౌఖిక సాహిత్యమంతా కథలు, కళారూపాలలో ఉండడం వలన ‘జానపద సాహిత్యం’గా ‘పామరుల కళలు’గా దీన్ని బ్రాహ్మణ సాహిత్యకారులు తక్కువ చేయడం తెలిసిందే. బ్రాహ్మణ సాహిత్యంలోని ప్రముఖ పాత్రలైన రాముడు, కృష్ణుడు వంటి పాత్రలన్నీ వర్ణ ధర్మాన్ని ప్రతిష్టించేవిగా పాజిటివ్‌గా ఉంటే అనార్య జాతుల మౌఖిక సాహిత్యంలో అవే పాత్రలు దుర్మార్గంగా కనిపించడం విశేషం. బ్రాహ్మణ సాహిత్యం రాముడు చంపిన రావణుడిని రాక్షసుడంటే, అనార్యల జానపద మౌఖిక సాహిత్యం రావణుడిని గొప్ప ఆత్మగౌరవం ఉన్న పోరాట యోధుడిగానూ, రాముడిని పిరికిపందగానూ చిత్రిస్తుంది. బ్రాహ్మణుల మహాభారతం కృష్ణుడిని గొప్ప అవతార పురుషుడిగా చిత్రిస్తే అనార్యుల మౌఖిక సాహిత్యం ‘కపట నాటక సూత్రధారి’గా చిత్రిస్తుంది. జానపద కళా రూపమైన ‘అల్లీరాణి కథ’లో మోసంతో అల్లీరాణిని ఓడించారని కృష్ణుడిని, అర్జునుడిని కధకుడు బండబూతులు తిడతాడు. ఇది వ్యాస భారతంలోని ‘ప్రమీలార్జునీయం’ అనే కథకు జానపద, బ్రహ్మణేతర సాహిత్య రూపం. అలాగే నరకుడు, మహిషాసురుడు, శూర్పణఖ, జాంబవతి. అల్లీరాణి, హిడింబి వంటి పాత్రలు బ్రాహ్మణ సాహిత్యంలో నెగిటివ్‌గానూ, జానపద సాహిత్యంలో పాజిటివ్‌గానూ కనిపిస్తాయి ‘తూర్పు రామాయణం’, ‘ఎల్లమ్మ కథ’ వంటివి ఈ కోవలోకి వస్తాయి. అలాగే వైదిక సాహిత్యం కులాల పుట్టుకకు, దైవికమైన కట్టుకథలను అల్లితే అవైదిక మౌఖిక సాహిత్యం తమదైన దృక్పథంతో కుల పురాణాలను రూపొందించి తమ జాతులలో ఆత్మ గౌరవాన్ని ప్రోది చేయడానికి ప్రయత్నించిందని చెప్పాలి. ఈ సాహిత్యాన్ని పరిశీలిస్తే బ్రాహ్మణేతరుల అనార్య జాతుల దృక్పథం మనకు అర్థమవుతుంది. మౌఖిక సాహిత్యాన్ని పామర సాహిత్యంగా తీసి పారేయడం కూడా బ్రాహ్మణ వాద నైజమే. అందుకే ఫూలే, అంబేద్కర్‌లు పురాణ సాహిత్యాన్ని బ్రాహ్మణేతర దృష్టి నుంచి వ్యాఖ్యానించారు. మన దక్షిణాదిలో భాగ్యరెడ్డి వర్మ కూడా అదే తరహాలో బ్రాహ్మణ సాహిత్యాన్ని విశ్లేషించాడు. నిజానికి లిఖిత సాహిత్యం కంటే జానపద మౌఖిక సాహిత్యమే రాసిలోనూ, వాసిలోనూ ఎక్కువ.
అసలు రామాయణ, మహాభారతాలు, పురాణ కథలు నిజంగా చరిత్రలో జరిగాయా, లేదా అనేదానికంటే అవి ఏ లక్ష్యాలతో, ఎవరి ప్రయోజనాల కోసం రాయబడ్డాయనేది ఆలోచించవలసిన విషయం. అలాగే జానపద మౌఖిక సాహిత్యం దానికి భిన్నమైన కథనాలను, దృక్పథాన్ని కలిగి ఉండడం వెనుక చరిత్రలో అనార్యులైన నేటి పీడిత కులాలు పొందిన అణచివేత లేదా? దీంతోపాటు హిందూ మత సాహిత్యంలో కనిపించే నాయకులు (సురులు) ప్రస్తుతం ఎవరి ప్రతినిధులుగా ఉన్నారు? వారి దృష్టిలో ‘రాక్షసులు’, ‘మొరటు’ వారిగా చెప్పబడ్డ వారు (అసురులు) ఎవరి ప్రతినిధులుగా ఉన్నారు? అనేది స్పష్టమే. పరస్పర శత్రు కూటాలైన బ్రాహ్మణ వర్గం, దానిచే పీడనకు గురైన బ్రాహ్మణేతర వర్గాల మధ్య ఉన్న సంఘర్షణకు వారి వారి సాహిత్యాలు అద్దం పడుతున్నాయనేది కాదనలేని అంశం. అంబేద్కర్ భారతదేశ చరిత్ర మొత్తం బౌద్ధానికి, హిందూ మతానికి మధ్య జరిగిన పరస్పర ఘర్షణ అని అంటాడు. బౌద్ధం అన్ని కాలాలలో ప్రబలంగా లేకపోయినప్పటికీ బ్రాహ్మణ, బ్రాహ్మణేతర వర్గాలు భిన్న ధృవాలుగా ఉండి, నిరంతరం ఘర్షణ పడుతూ తమ సాహిత్యాల ద్వారా వారి దృక్పథాలను వ్యక్తపరిచాయనేది స్పష్టం.