”మీరు స్నానం చేస్తున్నప్పుడు కమలాకర్ నుండి ఫోనొచ్చింది. రేపు వాళ్ళ మనవడికి పంచెలు కట్టిస్తారట. మనల్ని తప్పక రావాలని రిక్వెస్ట్ చేశాడు”, స్నానాల గది నుంచి తల తుడుచుకుంటూ బయటికొచ్చిన భర్తతో అంది అన్సీ అనబడే అనసూయ. సీనియర్ సిటిజన్ వర్గంలోకి మూడేళ్ళ క్రితం చేరిన రమాకాంత్ అద్దం ముందు నిల్చొని తలపైనున్న వెండి తీగల్ని నల్లరంగు పూర్తిగా కప్పేసిందో లేదో అని తలని అటూ ఇటూ తిప్పుతూ, జుత్తుని పైకి లేపుతూ రంగు మూలాల్లోకి చేరిందో లేదో పరిశీలించుకుంటున్నాడు.
చెప్పిన విషయం విన్నాడో లేదోనన్న అనుమానంతో ”వాట్సప్‌లో వివరాలు పంపుతానని చెప్పాడు” అని ఒక బాణం విసిరింది అన్సీ. దీంతో మొదటి విషయం విన్నదీ లేనిదీ ఖచ్చితంగా తెలిసిపోతుందన్న ధీమాతో. రమాకాంత్ దృష్టి తల వెంట్రుకల నుండి మీసాలపైకి సారించాడు. పెదిమలని పైకీ, క్రిందికీ సాగదీస్తూ పక్కలకు తిప్పుతూ ఎక్కడైన వెండితీగ మిగిలిందేమోనన్న ఇన్వెస్టిగేషన్లో ఉన్నాడు. ఈ తయారీ అంతా తెల్లారి సాయంత్రం జరగబోయే ఒక పార్టీకోసం. అరవై మూడు వయస్సుని అటు ఇటు మార్చి ముప్ఫయ్యారులోకి దూరిపోవాలని ఆయన ప్రయాస.
”ఏమో చెబుతున్నట్టున్నావ్?” అడుగులేసుకుంటూ అన్సీ ముందుకొచ్చి తలవంచి నిల్చున్నాడు. విధేయతతో నిల్చున్నాడేమో అనుకుంటే పొరపాటే! జుత్తుకు రంగు వేసుకున్నప్పుడల్లా అలా ఉత్సాహంతో అద్దంలో ఎవరి ప్రమేయం లేకుండా తను చూసుకునే పరిశీలన పూర్తయ్యాక ఆమె ముందుకొచ్చి ఎక్స్టర్నల్ ఎగ్జామినర్‌కి చూపి రంగు ఎంత నప్పిందో మార్కులేయించుకోవడం సంసారంలో నెలకి రెండుసార్లు జరిగే భాగోతమే.
చెప్పిన మూడు వాక్యాలు గురి తప్పిన తూటాలని అన్సీకి అర్థమయిపోయింది. నల్లరంగు దట్టింపుని మొక్కుబడిగా చూసి తొంభై అయిదు మార్కులేసి ఓర్పును రీఛార్జ్ చేసుకొని మాటల్ని ఏమీ మార్చకుండా మూడు వాక్యాలను అన్సీ రిపీట్ చేసింది.
”రేపా? మనం రేపటికి కమిట్ అయ్యాంగా? ఈ పార్టీకెలా వెళతాం? ఇంతకీ ఈ పార్టీ ఎక్కడా?” రమాకాంత్ ఆరాలు.
”వాట్సప్‌లో మీకు వివరాలు పంపుతానన్నాడు. చూసుకోండి. ఈ పార్టీలతో వేగలేక విసిగిపోతున్నా. హాయిగా ఉండే ఆదివారాలు సోది వారాలయ్యాయి. గత మూడేళ్ళనుంచి ఒక్క ఆదివారం కూడా మనం ఇంట్లో తీరిగ్గా లేం. నాలుగు మంచి పుస్తకాలు చదువుకొందామంటే సమయం దొరకడం లేదు…”
రమాకాంత్ సెల్‌ఫోన్ ”మై ఆగయా హు…” అని శబ్దం చేస్తే, ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ పోటీలో ‘ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్’ అన్నంత వేగంగా వాట్సప్ తెరిచాడు. అందమైన అక్షరాలతో, పువ్వులు, తీగలు, పక్షుల నేపథ్యంలో ఆంగ్లంలో ఆహ్వానం. చదివాడు. మొహం అదోలా పెట్టాడు. అన్సీ మొగుడి చేష్టల్ని గమనిస్తోంది. తనలో తాను చిన్నగా నవ్వుకుంటోంది.
‘ఇంపాసిబుల్… మనం రేపు వెళ్ళేదొకవైపైతే దానికి పూర్తి వ్యతిరేక దిశలో ఈ పార్టీ. అటు పదిహేను కిలోమీటర్లు వెళితే, ఇటు సుమారుగా ఇరవై కిలోమీటర్లు. హైదరాబాద్ ట్రాఫిక్ అభిమన్యుని పద్మవ్యూహానికి పదిరెట్లు ఎక్కువే! మొదటిదానికే మనకెలాగూ కన్ఫర్మ్ చేశాం కదా… దానికే వెళ్దాం’ విసుగుతో అన్సీ వైపు చూస్తూ అన్నాడు రమాకాంత్.
‘ఇంతకీ పార్టీ దేనికట?’ అసలు విషయాన్ని కదిలిస్తూ అన్సీ.
‘ఎక్కడ… పైనే దృష్టి పెట్టా. దేనికోసమని చూడనేలేదు’
ఓం… బ్రూమ్… క్రీం… మంత్రాల్లా పెద్దబ్బాయి అమెరికా నుండి పంపిన స్మార్ట్ ఫోన్‌పై నాలుగు గజిబిజి సెక్యూరిటీ గీతల్ని వేలితో చకచకా గీసి సమాచార లోకంలోకి మళ్ళీ ప్రవేశించాడు.
‘దీనిక్కూడా ఫంక్షనే!’ రమాకాంత్ మొహంలో ఆశ్చర్య చిహ్నాలు.
‘నాకేమైనా చెబుతారా? మీలో మీరే మాట్లాడుకుంటారా?’ అసహనంతో అన్సీ.
‘జర్మనీ మనవడికి పైజమా కట్టిస్తారట’
‘అదేం ఫంక్షన్? నాతో పంచెలన్నట్లు గుర్తు.’
‘ఎందుకంత ఆశ్చర్యం? ఈ మధ్య పిల్లలకి పంచెలని కట్టడంలేదా? ఆ రోజు ఒక్క పూటే, కాదు కాదు ఓ రెండు మూడు గంటలే కదా పిల్లలకి కట్టి తిప్పేది, నానా హంగామా చేసేది…’
”పంచెలకి ఓ అర్ధం ఉంది. ఈ పైజమాలేంటి. సిల్లీగా లేదూ?’
‘పిచ్చి అన్సీ. పిల్లాడి తల్లిది పంజాబ్ కదా. వాళ్ళు ధోవతులను కడతారా? అయినా పంచె కట్టినంత మాత్రాన జీవితాల్లో పంచెల్ని కడతారనుకోవడం పొరపాటు. ఇప్పుడు జరిగే పెళ్ళిళ్ళలో పెళ్ళి కొడుకులు నార్త్ ఇండియన్ షేర్వాణిలను వేసుకుంటున్నారు. ఈ నియోరిచ్ పిల్లలు జీవితంలో ఒక్కసారైనా లుంగీలని, పంచెల్ని కట్టరు. నేను పందెం కడతా నీతో. పంచెకంటే పైజమాలు కట్టే అవకాశాలే ఎక్కవ కదా. కొంచెం భిన్నంగా లేదూ? గుడ్, సమ్‌థింగ్ డిఫరెంట్…’
‘రెండు ఫంక్షన్లకి రావడం మాత్రం నా వల్ల కాదు. ట్రాఫిక్‌లో అంతా గందరగోళంగా ఉంటుంది. ఏదో ఒక్కటి నువ్వే సెలక్ట్ చెయ్’ అన్సీ అల్టిమేటం.
‘చెరోవైపు వెళదామా? నువ్వు నాకంటే కారు బాగా నడుపుతావు. ఈ రెండిట్లో నీకు ఏది బాగా అనిపిస్తే దానికి కార్లో వెళ్ళు. నేను క్యాబ్‌లో వెళతా. రెండూ వ్యతిరేక దిశల్లో ఉన్నాయి. పదకొండున్నరకల్లా ఇంటికి చేరుకునే ప్రయత్నం చేద్దాం. రెండు ఫంక్షన్లని చూసినట్లుగా ఉంటుంది. పిలిచిన వారిద్దరూ సంతోషిస్తారు’.
‘ఇంతకీ ఆ మొదటి ఫంక్షనేంటి? అది కూడా ‘సమ్‌థింగ్ డిఫరెంట్’గా ఉందా?’ ఐడియాకి అంగీకారం తెలుపుతూ అన్సీ ప్రశ్న.
‘వాట్సప్‌లో వచ్చిన ఆహ్వానాన్ని నాకు ఫార్వర్డ్ చేస్తానన్నావ్. మరిచిపోయినట్లున్నావ్’ మృదువుగా మాటలతో మొట్టికాయలు వేసింది.
‘నీకు చెప్పాను కదా. విననట్టున్నావ్. అది కూడా డిఫరెంట్‌గా ఉంది. నీకు బాగా నచ్చుతుంది. చీరల్ని చూడడానికి మంచి అవకాశం. దీన్ని ఐదుగురు పేరెంట్స్ కలిసి ఆడపిల్లలకి సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్నారు. జాయింట్ ప్రోగ్రాం కావున పెద్ద లెవల్లో స్టార్ హోటల్లో పెట్టారు’.
‘అసలు విషయం చెప్పు’ అసహనంతో అన్సీ.
వివరాలు చెప్పాడు.
‘అంటే ఐదేళ్ళ క్రితం చీరల్ని కట్టించిన ఐదుగురమ్మాయిలకి రేపు మళ్ళీ చీర కట్టిస్తారన్నమాట. డబ్బులు బాగా
ఉన్నట్టున్నాయ్. ఏదో ఒక క్రేజీ ఐడియా వస్తే చాలు…’
‘ఇక్కడ చీరలో కాస్త తేడా ఉంది. చీర చీరే కదా! ఇంకేం తేడా ఉంటుందో?’ వ్యంగ్యంగా అన్సీ.
‘అప్పుడు ఆ అమ్మాయిలు విదేశాల్లో ఉంటున్న పేరెంట్స్‌తో కలిసి టీనేజ్‌లో ఇండియా వచ్చారు. అందరూ కలుసుకొన్నప్పుడు ఏదో సరదా కోసమని అమ్మాయిలకు చీరలు కట్టించారు. అమ్మాయిలు పెరిగిపోయారు. ఇప్పుడు నవ యువత. కొంత భిన్నంగా ఉండాలని తొమ్మిది గజాల చీరల్ని కట్టిస్తారట’.
అన్సీకి ఈ మాటల్ని వినగానే తల తిరిగిపోతుందని ముందే ఊహించి రమాకాంత్ నీళ్ళ గ్లాస్ పట్టుకుని దగ్గరికి చేరాడు. గతంలో ఇలాంటి ఫంక్షన్ల గురించి చెప్పినప్పుడు అన్సీకి కళ్ళు తిరిగితే నీళ్ళ కోసమని బెడ్ రూమ్ నుండి కిచెన్ వరకు పరిగెత్తాల్సి వచ్చింది. అనుభవాన్ని సత్వర నివారణ కోసం ముందుగానే సిద్ధమయ్యాడు. గ్లాస్‌ని గభాల్న అందుకుని ఏకధాటిలో నీళ్ళు తాగింది. అన్సీకి కొంత ఉపశమనం.
‘ఆహ్వానం గురించి చెబితేనే ఇంత అసౌకర్యంగా ఫీలయ్యావు. రేపు ఈ ఫంక్షన్‌ని ఒక్కదానివే చూడగలుగుతావా? ఎందుకైనా మంచిది. ముందు వరసల్లో కూర్చో. స్టేజిపై జరిగే తతంగం చూసి పడిపోతే నలుగురు అందుబాటులో
ఉంటారు. తెలిసినవారి దగ్గర కూర్చో సుమీ.’
‘నేను సంభాళించుకుంటాన్లే కానీ నీ సంగతి చూసుకో. రిటర్న్ గిఫ్ట్ తలా ఒక పైజమా ఇస్తారేమో. ఇచ్చిన దాన్ని వేసుకునే అక్కడినుంచి కదలాలేమో? ఎందుకైనా మంచిది ఒక ప్లాస్టిక్ సంచిని వెంట ఉంచుకోండి. విప్పిన ప్యాంట్‌ని పెట్టుకోవడానికి’.
ఇద్దరూ కడుపునిండా నవ్వుకొన్నారు. ఒక జత కళ్ళల్లో తడి. మరో జత కళ్ళ నుండి నీళ్ళు కారాయి.
ఆదివారం. ఆటపాటల వారం. మానవజాతికి ఆప్యాయమైన వారం. అలసట తీర్చి సోమవారానికి (తదుపరి నాలుగు రోజులకి కూడా) సంసిద్ధం చేసే కుటుంబ దినం. ఎవరి దిష్టి తగిలిందో ఏమో ఆదివారానికి తూటు పడింది. అన్ని ఫంక్షన్లు ఒక్కుమ్మడిగా దాడి చేస్తున్నాయి. పెళ్ళిళ్ళు, పుట్టినరోజులు (ఏ వారం పుట్టినా దగ్గరి ఆదివారమే పుట్టినరోజు) పంచె-చీర కట్టడాలు, రజతోత్సవాలు, గోల్డెన్ జూబ్లీలు, వెడ్డింగ్ డేస్, షష్ఠి పూర్తిలు… పెళ్ళి నిశ్చయాలు, గృహప్రవేశాలు, కారు పూజలు… ఇంకా ఇంకా… ఎన్నో… మరెన్నో.. మూకుమ్మడి దాడి. ఆదివారం గజగజలాడింది. కాదు కాదు, వివిఐపి దినంగా ఎదిగింది. చాలా పొగరు వచ్చింది. ఆ రోజు ఎన్నో కార్యక్రమాలున్నాయని విర్రవీగే రోజుకంటే మరింత ప్రకాశవంతంగా వెలుతురుని విసిరింది.
అనసూయకి కారు నడపడం సరదా. జెండర్ గోడని పదిహేనేళ్ళ క్రితమే బద్దలుకొట్టి డ్రైవింగ్ లైసెన్స్ తీసుకుంది, రమాకాంత్‌ని మించిపోయింది. ఇద్దరి ఫంక్షన్లు సాయంత్రం ఏడున్నరకే. అన్సీ క్యాబ్‌ని పిలిచి రమాకాంత్‌ని సాగనంపింది. తను కార్లో దూరింది. అద్దంలో మొహం చూసుకొంది.
ఎందుకైనా మంచిదని రమాకాంత్ ‘గందం సిస్టర్స్’ బట్టల దుకాణం వారి ప్లాస్టిక్ సంచిని రుమాల్లా మడిచి జేబులో పెట్టుకున్నాడు.
‘నన్ను ఛేదించుకుని మీరు ముందుకు పోలేరు’ అని బక్కపలచగా ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ నిజాం కాలంలో ఘోరతపస్సు చేసి ఒక విశిష్ట వరాన్ని పొందింది. అయితే ఆ వరం 1991వ సంవత్సరం తరువాతే అమల్లోకి వస్తుందని ఒక షరతుతో దొరికింది. ‘అంతకాలం వేచి చూడాలా? నేనుండలేను. నీవు ఈ షరతుని సడలించకపోతే నా తపస్సుని తీవ్రతరం చేస్తాను’ అని ఆ దేవతని ట్రాఫిక్ బెదిరించింది. ‘నీవు వేచి ఉండాల్సిందే. నిన్ను ప్రజలు నిత్యం స్మరించుకోవాలంటే, నీ ఉనికి ప్రతిభావంతంగా ఉండాలంటే, ఎప్పుడు అడుగు బయటపెట్టాలన్నా మొదట జనం నీ పేరు పలుకుతారు. నీకొక మహాకాలం రాబోతోంది. అది చిరస్థాయిగా ఉంటుంది’ వరప్రసాద దేవి ఊరడించింది. పాచికలు పారనందున ట్రాఫిక్ ఎర్ర దీపాన్ని ముందుంచుకొని ఎన్నో సంవత్సరాలు ఓపికపట్టి చెప్పిన సంవత్సర రాకకై ఉత్సాహంతో ఎదురుచూసింది.
1991 సంవత్సరంలో మన దేశంలో ఆర్థిక సంస్కరణలు ఉప్నెనలా మొదలయ్యాయి. అన్ని పట్టణాల్లో వాహనాల సంఖ్య అదిరిపోయింది. ట్రాఫిక్‌కి మంచి రోజులొచ్చాయి. ఓపికతో ఉన్నందుకు మంచి గుర్తింపే వచ్చింది. దేవతలని తలుచుకోకున్నా బయటకు అడుగు పెట్టేముందు అందరూ ట్రాఫిక్‌నే స్మరించుకొంటున్నారు.
అన్సీ ఎనిమిదింపావుకి, రమాకాంత్ ఎనిమిది నలభైకి చేరుకొన్నారు. ఆలస్యంగా చేరుకొన్నందుకు ఇద్దరూ మనసుల్లో బాధపడ్డారు. ట్రాఫిక్ కోసం ఎక్కువ సమయాన్నుంచినా చెప్పిన టైంకి చేరుకోనందుకు చింతిస్తూ హాళ్ళవైపు అడుగులేశారు. కార్యక్రమాలు మొదలయ్యుంటాయని ఇద్దరూ టెన్షన్ పడ్డారు కూడా.
హాల్లోకి అడుగుపెట్టిన అన్సీకి అసలు ప్రోగ్రాం ఉందా లేదా అన్న అనుమానం కలిగింది. స్టేజిపై అలంకరణ చేస్తున్నవాళ్ళని అడిగితే కరక్ట్ హాల్‌కి చేరుకొన్నారని నిర్ధారించారు. హాల్లో నాలుగువైపులా చూసింది. ఓ నలుగురు కనిపించారు. అయిదుగురికి ‘ఎర్లీ బర్డ్’ బహుమతులిస్తే, అన్సీకి ఆఖరుది దొరుకుతుంది. కూర్చొని బ్యాగ్‌లోంచి చిన్ని బాటిల్ తీసి గొంతు తడుపుకొంది.
రమాకాంత్ చేరుకునేసరికి హాల్లో ఓ ఇరవై మంది కనబడ్డారు. వర్కర్లు ఇంకా అలంకరణ చేస్తున్నారేమోననుకొన్నాడు. అందరూ పైజామాల్లో కనబడితే అలా భావించాడు.
‘రమాకాంత్..’ దూరంగా ఒకతను కేకేశాడు.
మనిషిని గుర్తించి ‘ఓహ్… నువ్వా…’ దగ్గరికెళ్ళి చేయి కలిపాడు. ఇంకొందరు కూడా వచ్చి చేయి కలిపారు. కొత్తవాళ్ళతో పరిచయాలు.
‘ఏంటి? మీరు పాంట్ వేసుకుని వచ్చారు. ఇన్విటేషన్ చూళ్ళేదా? ఈ రోజు డ్రెస్ కోడ్ పైజామానే!’
‘అయ్యో! చూళ్ళేదే.’ చూసినా మీలా జోకర్లలా నేనెలాగూ రాలేను అని అందామనుకొన్నా మాటల్ని పెదిమల్ని దాటనీయలేదు. నేను వేసుకోకుండా పైజామాని రిటర్న్ గిఫ్ట్‌గా తీసుకెళ్దామని సంచి కూడా తెచ్చుకొన్నాను అన్న మాటలు కూడా బయటికి రాలేదు.
అన్సీ హాలు ద్వారంవైపే చూపుల్ని సీసీటీవీ కెమెరాలా పొజిషన్ చేసింది తెలిసిన వారెవరైనా వస్తారేమోనని. రెండు నిమిషాలు కెమెరా కళ్ళు అలానే కదలకుండా చూస్తున్నాయి. ఫ్రేమ్‌లోకి ఎవరూ రాలేదు. మరో నిమిషం అయ్యాక ఓ నలభై మంది ప్రవేశించారు. స్పెషల్ బస్సులో వచ్చిన రద్దీలా ఉంది. ఆ గుంపులో ఐదుగురు అమ్మాయిలు తొమ్మిది గజాల చీరల్లో అందాల్ని పెంచుకొని, మేకప్ ఆభరణాలతో మరింత సొగసుగా కనబడుతూ గలగల నవ్వుతూ స్టేజి పక్కనున్న గదిలోకి దూరిపోయారు.
‘మీరొక్కరే కనబడుతున్నారు. మీవారు రాలేదా?’ ఒకరి పలకరింపు ప్రశ్న
‘రమాకాంత్ పైజామా పార్టీకి వెళ్ళారు. నేనిక్కడికి వచ్చాను’ అన్నాక ఒక్కసారిగా నాలిక్కరుచుకొంది. ‘రెండు పార్టీలున్నాయి ఈ రోజు. ఇద్దరూ మాకు బాగా తెలిసినవాళ్ళే. అందుకే చెరోవైపు పంచుకొన్నాం.’
సమయం తొమ్మిదిన్నర.
రెండు వేదికలపై డెకొరేషన్ వేగంగా జరిగిపోయింది. బంధువులు, మిత్రులు తుంపరలా, అప్పుడప్పుడూ వాన చినుకుల్లా చేరుకొంటున్నారు. వచ్చినవారి సంఖ్యని మించి బల్బులు వెలుగుతున్నాయి హాల్లో. తెలుగు హిట్టుపాటొకటి అరుస్తోంది తీవ్రస్థాయిలో. సంగీతం, సాహిత్యం జోడుగా చచ్చిన పాటది. పిల్లలు స్టెప్పులేస్తున్నారు. పేరెంట్స్‌కి మాత్రం వాళ్ళ పిల్లల్లో చిట్టి ప్రభుదేవానే కనబడుతున్నాడు.
రమాకాంత్లాగే మరో నలుగురు పాంట్తోనే వచ్చారు. హమ్మయ్య అనుకొన్నాడు. తానొక్కడే అయితే ఎబ్బెట్టుగా ఉండేది. నాతోపాటు కొందరున్నారు అన్న ధైర్యం వచ్చింది. మందలో కలిసిపోనందుకు కాస్త విచారించినా, తాను వాట్సప్ సందేశంలో డ్రెస్ కోడ్ ఎలా మిస్సయ్యాననేది ఇంకా మింగుడుపడలేదు. అన్సీ వెళ్ళినచోట కూడా ఇలాంటిదేమైనా ఉందేమోనని సెల్లో ఆహ్వానాన్ని చూశాడు. అలాంటిదేమీ లేనందున కాస్త తేలికపడ్డాడు.
అమ్మాయిల పేర్లని అనౌన్స్ చేస్తున్నకొద్దీ ఒక్కొక్కరూ ర్యాంప్‌పై నడిచిన రీతిలో హుందాగా అడుగులేస్తూ తొమ్మిది గజాల చీరలో కొత్త అందాలని దిద్దుకొని నమస్కరించి శిల్ప భంగిమల్లో ఫ్రీజ్ అయిపోయారు. ఎంట్రీలు మాత్రం తెలుగు హీరోయిన్లకి ఏ మాత్రం తీసిపోలేదు.
చప్పట్లు, కుర్రాళ్ళ విజిల్స్. ఇంకా… ఇంకా… అరుపులతో హాలంతా అదుపుదాటిన డెసిబెల్స్తో మారుమ్రోగింది. క్షణాలని డిజిటల్ ఫోటోల్లో, వీడియో రికార్డింగుల్లో బంధిస్తున్నారు. ఆపై సోలో, డబల్, ట్రిపుల్, గ్రూప్ ఫోటోల సెషన్స్ పరంపర… గంటసేపు కదులుతున్న కాలాన్ని కెమెరాల్లో నిక్షిప్తం చేశారు. మర్నాడు ఇవన్నీ ఎలా దూరతీరాలని చేరతాయో మనం చెప్పుకొనే అవసరం లేదు.
‘ఫుడ్ రెడీ’, ప్రకటన.
‘వెళ్ళేముందు మీ రిటర్న్ గిఫ్ట్ తీసుకోవడం మరచిపోకండి’ ఇంకో ప్రకటన.
మైకు లాక్కొని ఉఫ్ ఉఫ్ అని గట్టిగా ఊది మరో మనిషి ప్రకటన. ‘కొలతలు పంపినవారికి పైజమాలు రెడీగా ఉన్నాయి. పాకెట్‌పై మీ పేర్లు రాసి ఉన్నాయి. కొలతలు పంపనివారికి మాత్రం ఫ్రీ సైజువి ఉన్నాయి. దయచేసి కలెక్ట్ చేసుకోండి’ ప్రకటించినతనే తన ప్రకటనకి నవ్వాపులేకపోయాడు.
ప్రకటన ముగిసిందో లేదో కొలతలు ఇవ్వనివారు టేబుల్ దగ్గరికి ఒలింపిక్ పోటీ లెవల్లో పరిగెత్తారు. పోలీసులుంటే లాఠీఛార్జి చేసేవారు. అప్పటివరకు ఉన్న సంస్కారం హుష్ కాకిలా ఎగిరిపోయింది. గోదాట్లో కనబడకుండా కలిసిపోయింది. ఆ తొక్కిసలాటలో ఒక సూపర్ సీనియర్ సిటిజన్ దబాల్న పడిపోయాడు. చేతిలో ఉన్న పైజామా పాకెట్ దూరంగా పడిపోయింది. గుంపులోని ఓ మనిషాకారం ఆ పాకెట్ని ఠక్కున తీసుకొని గేటుద్వారా బయటికెళ్ళిపోయింది.
జేబులోని ప్లాస్టిక్ కవర్ తీసి పాకెట్ని దాంట్లోకి జారవిడిచాడు. రిటర్న్ గిఫ్ట్‌తో ఇంటికి వెళ్తున్నందుకు ఆయన మొహంపై సంతోషం తాండవం కాకున్నా నృత్యం చేసింది. ‘యస్.. ఐ గాటిట్…’ పెద్ద వికెట్‌ని తీసుకొన్న చిన్న బౌలర్ బిగించిన పిడికిలిలా తన చేతిని ఆకాశానికెత్తాడు.
మోకాళ్ళ నొప్పులున్న మహిళలంతా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్నారు. కొందరిళ్ళల్లో వాళ్ళ బామ్మలు ఇంకా కడుతున్న తొమ్మిది గజాల చీరల గురించి ముచ్చటించుకుంటున్నారు. ఈ పిల్లల సంగతి వారికి చెబితే ఎంత సంతోషిస్తారోనని తెల్లారి చెప్పడానికి పథకాలు వేసుకుంటున్నారు.
‘వెళ్ళేముందు మీరు రిటర్న్ గిఫ్ట్‌తో పాటు డిస్కౌంట్ ఓచర్లని తీసుకోవడం మరచిపోవద్దు. ‘బ్రదర్స్ అండ్ సిస్టర్స్’ షాప్ వారి కౌంటర్ ఆ మూలన పెట్టారు. ఈ పార్టీకి హాజరైన వారికి ప్రత్యేకంగా తొమ్మిది గజాల చీరలపై ముప్ఫై శాతం డిస్కౌంట్… రెండు కొంటే నలభై… మూడు కొంటే యాభై…’ తబ్బిబ్బై ప్రకటించాడు.
మెల్లగా తినే చేతుల కదలికల్లో వేగం పెరిగింది. ప్రకటన మాటలు ఎనర్జీ బూస్టర్‌గా పనిచేశాయి. త్వరగా ముగించి మహిళలందరూ చకచకా కౌంటర్వైపు అడుగులేశారు.
అన్సీ ఇంటికి చేరేసరికి రమాకాంత్ నిద్రపోయి ఉన్నాడు. లుంగీకి బదులు పైజమా కనబడింది. గట్టిగా నవ్వితే లేస్తాడేమోనని మరో గదిలోకి వెళ్ళి తలుపేసుకొని ఎంతోసేపు నవ్వుకొంది. పైజమా గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వాగడంలేదు. ఆ రాత్రిలో ఇంకా కొన్ని గంటలే మిగిలాయని అన్సీ అదే గదిలో పడుకొంది.
… … …
పదిహేను రోజుల తర్వాత ఓ శనివారపు ఉదయం. సెల్లు పిలిచింది. రమాకాంత్ ఉత్సాహంతో అందుకొన్నాడు. అన్సీవైపు చూసి కన్నుకొట్టి స్పీకర్ నొక్కాడు. ఒకరోజు ముందు పిలిచే కొత్త సంస్కారానికి అలవాటుపడ్డ నగర జీవితం.
కుశల ప్రశ్నలు ముగిసాయి.
‘రేపు సాయంత్రం పార్టీ.. మీరిద్దరూ తప్పక రావాలి’.
‘ఇంతకూ పార్టీ ఎందుకో చెప్పలేదు’ రమాకాంత్ ఉబలాటం.
‘మా అమ్మాయికి చెవులు కుట్టించడం’ కాస్త నామోషీ పడుతూ తండ్రి.
‘అదేంటి? రెండేళ్ళ క్రితం ఈ ఫంక్షన్‌ని మీరు చేశారుగా. మేమిద్దరం అటెండయ్యాం కూడా. బాగా గుర్తుంది మాకు’. శభాష్ అన్నట్లుగా అన్సీ చేతివేళ్ళతో మెచ్చుకొంది.
‘అవునవును. కరక్టే. మీరిద్దరూ వచ్చారు. అదే అమ్మాయి ఇప్పుడు తన స్నేహితురాళ్ళకి చెవుల నిండా రంద్రాలున్నాయని, తనకీ కావాలని అడిగింది. రెండు చెవులకి మరో మూడు రంధ్రాలు కావాలంటోంది’.
‘గుడ్. వాళ్ళ సంతోషమే మన సంతోషం కదా! తప్పక వస్తాం. వివరాలని పంపండి’.
అన్సీ, రమాకాంత్లు నవ్వుకోకుండా ఉంటారా?
‘ఏమయ్యింది? ఇప్పుడే వస్తామని వారికి కన్ఫర్మ్ చేశారు కదా!’
‘భయంగా ఉందే! రిటర్న్ గిఫ్ట్ అని అందర్నీ కూచోబెట్టి చెవులని పొడుస్తారేమో?…’