కన్నబిడ్డ సమాధి రాయి మీద ”Beloved” అన్న ఏడు అక్షరాల పదాన్ని చెక్కడానికి, పది నిమిషాల పాటు స్మశానంలోనే తన మానాన్ని ఖరీదు చేసుకున్న అమ్మ కథని ఎప్పుడైనా చదివారా?
అవును. మీరు చదివింది నిజమే. పదానికి పది నిమిషాల మానాన్ని ఖరీదు కట్టి తన చేతులతో తాను చంపుకున్న ప్రియమైన కూతురు గుర్తుగా ”దీవశ్రీశీఙవస” అని సమాధి రాయి మీద చెక్కించిన అమ్మ కథ ఇది. ”…… Beloved” అని చెక్కించాలని ఉన్నా ఆ రెండు పదాల ఖరీదుని చెల్లించుకునే శక్తి ఆమెకి లేదు. (ఇక్కడ ఒక పదం ఖరీదు అక్షరాలా పది నిమిషాలపాటు శీలాన్ని అక్షరాలని చెక్కేవాడికి అర్పించుకోవడం).
బతుకులోకన్నా మరణంలోనే సుఖాన్ని చూసిన వారి గురించి చదివేకొద్దీ మన కళ్ళకి అలవాటు పడనంత కన్నీటి ధార మన కళ్ళనుండి కురుస్తూనే ఉంటుంది. రెండేళ్ళ పాపని తనకై తాను రంపంతో కోసి ప్రాణం తీసిన అమ్మ గురించి చదువుతున్నప్పుడు పుస్తకం అయిపోయేవరకూ ఆ అమ్మమీదే జాలి మనకెందుకు కలుగుతుంది?
సమాధానం కావాలంటే సాహిత్యంలో పులిట్జర్… నోబెల్ బహుమతులని పొందిన ప్రఖ్యాత రచయిత్రి టోనీ మారిసన్ రాసిన ”Beloved” నవల చదవండి. వీలుంటే చదవడం కాదు… వీలు చేసుకుని చదవాల్సిన పుస్తకాలలో ప్రథమ వరుసలో నిలిచే పుస్తకాల్లో ఒకటి ఇది.
ఇందులో కథ ఏమిటంటే…
సెతే అనే నల్లజాతి మహిళ స్వీట్ హోమ్ అనబడే ఒక వ్యవసాయ క్షేత్రంలో తన భర్తతోపాటు పనిచేస్తూ ఉండేది. వారికి ఇద్దరు మగపిల్లలు, ఒక ఆడపిల్ల. ఆ క్షేత్రం యొక్క యజమాని వారిని చక్కగా చూసుకునేవాడు. ఆయన మరణంతో అతని భార్యకి దగ్గరి బంధువు ఒకరు ఆ క్షేత్రానికి యజమానిగా అయ్యి అక్కడ పనిచేసేవారిని అత్యంత దారుణ హింసలకు గురిచేస్తూ ఉంటాడు. అదలా ఉండగా సెతే భర్త హెల్లె కనిపించకుండా పోతాడు. అప్పటికే అతను అయిదు సంవత్సరాల పాటు తన ఆదివారాలని త్యాగం చేసిన కష్టంతో తన అమ్మను బానిసత్వం నుండి విముక్తి చేసి వేరే చోటికి పంపేస్తాడు. ఆమెతో పాటుగా తన ముగ్గురు పిల్లలనీ పంపేస్తుంది అప్పటికే మరోసారి గర్భిణిగా ఉన్న సెతే. అటుపై తను కూడా అక్కడినుంచి తప్పించుకుని తన అత్త దగ్గరకు చేరాలనుకుంటుంది ఆమె. ఆ ప్రయాణంలో మరో ఆడపిల్లను కంటుంది ఆమె.
కానీ ఆమెనే వెతుక్కుంటూ వచ్చిన యజమాని బారిన పడి తన పిల్లలు బానిస బతుకులో పడకుండా తన పిల్లలని చంపడానికి చేసిన ప్రయత్నంలో తన రెండేళ్ళ పెద్దకూతురిని రంపంతో చంపుకుంటుంది. ఆమెకేదో వెర్రి ఉందని భావించి ఆ యజమాని వెనక్కి వెళ్ళిపోతాడు. ఆ కూతురి సమాధిమీద ”Beloved” అని రాయిస్తుంది సెతే. కొంతకాలానికి మగపిల్లలిద్దరూ ఎక్కడికో వెళ్ళిపోతారు. అత్త కూడా చనిపోవడంతో చిన్న కూతురు డెన్వర్‌తో పాటు ఉంటుంది.
సెతేతో పాటే అదే క్షేత్రంలో పనిచేస్తున్న పాల్ డి అని పిలవబడే వ్యక్తి 18 ఏళ్ళ తరువాత ఆమెని కలుసుకుని ఈ తల్లీకూతుళ్ళతో పాటే ఉండిపోతాడు. ఇదిలా ఉండగా ”Beloved” అని పిలవబడే యువతి వీళ్ళ దగ్గరికి వస్తుంది. ఆమెని చూసిన సెతేకి చనిపోయిన తన పెద్ద కూతురు గుర్తుకువచ్చి మనసు వ్యాకులతకి గురవుతూ ఉంటుంది. ఆ పిల్ల ఇప్పటికి బతికి ఉంటే ఏ వయసు ఉంటుందో ఇప్పుడొచ్చిన పిల్లకి అంతే వయసు ఉంటుంది. ఆ ”దీవశ్రీశీఙవస”ని చనిపోయిన పెద్ద కూతురే అలా వచ్చిందన్న భావనలోకి వెళ్ళిపోతుంది సెతే. దాంతో ఆ వచ్చిన యువతి బాగోగులు చూసుకోవడం తన బాధ్యతగా భావిస్తుంది.
గతం నుండి ప్రాణం పోసుకుని వచ్చినట్లున్న ”దీవశ్రీశీఙవస” ప్రవర్తన సెతేని మానసికంగా చిత్రవధకి గురి చేస్తున్నట్లుగా అనిపిస్తుంది. పాల్ డి ని సెడ్యూస్ చేసి, అతనికి సెతే తన కూతుర్ని చంపుకుందన్న నిజం తెలిసేలా చేసి అతన్ని ఆ ఇల్లు విడిచివెళ్ళేలా చేస్తుంది. ఇక సెతే మనసంతా ”దీవశ్రీశీఙవస” మీదే స్థిరపడి తన ఉద్యోగాన్ని కూడా కోల్పోతుంది. ”దీవశ్రీశీఙవస” వల్ల వీళ్ళు తమ జీవితాలని ఎలా కోల్పోయారు, చివరకు ”Beloved” ఎలా వెళ్ళిపోతుంది… అసలు ”దీవశ్రీశీఙవస” అని నిజంగా ఎవరైనా ఉన్నారా లేదా అన్నదే ఈ కథ. చదువుతున్నంతసేపూ మన ప్రాణాలని మెలిపెట్టి పిండేసే ఒక వ్యథ.
అసలు ”Beloved” నిజంగా ఉందా? ఆమె తన తల్లి దగ్గరకు రావడం అన్నది వాస్తవమా… లేదా సెతే యొక్క మానసిక స్థితి నుండి పుట్టుకు వచ్చిన ప్రతీకనా? అన్న విషయం పాఠకుల ఊహకే వదిలేస్తుంది రచయిత్రి. తన కూతురిని తాను చంపుకున్న ఒక భయానక స్మృతి, ఒక యువతి రూపంలో వచ్చి ప్రతీకారం తీర్చుకుంటున్నట్లుగా అనిపించటంలోనే ఒక తల్లి తన పిల్లల పట్ల ఎంతటి ప్రేమని నింపుకుని ఉంటుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది.
నిజానికి దీన్ని కథ అని అనకూడదు. ఎందుకంటే ఇది అకస్మాత్తుగా ఒక మనిషి ఊహల్లో ఊపిరి పోసుకుని అక్షరంగా మారిన కథ కాదు కాబట్టి. ఇది నిజంగా జరిగిన సంఘటన నుండి పుట్టిన కథ కాబట్టి. 1856లో కెంటకీ ప్లాంటేషన్ నుండి మార్గరెట్ గార్నర్ అనే ఒక నల్లజాతి మహిళ, తన భర్త మరియు పిల్లలతో కలపి తప్పించుకుంది. కానీ వారి యజమాని వారి ఆచూకీ కనిపెట్టి వారిని తీసుకు వెళ్ళటానికి వచ్చాడు. కానీ తనని పునర్నిర్బంధించేలోపు తన కుమార్తెను బానిసత్వపు బారిన పడేయకూడదని భావించిన ఆమె తన కుమార్తెను చంపుకుంది. ఈ సంఘటనని టోనీ మారిసన్ ”దీవశ్రీశీఙవస” అనే అద్భుతమైన విషాదకావ్యంగా మన ముందుకు తెచ్చింది.
ఇందులో ఒక తల్లి తన కూతురుని చంపుకుంది ద్వేషంతో కాదు, తన అపారమైన ప్రేమతో. బతికి నరకం చూడడం కన్నా చచ్చిపోయి సుఖంగా ఉండటమే తన బిడ్డకి నిజమైన స్వేచ్ఛ అన్న ఆలోచనతో.
అంతేకదా మరి! ఒక రంపపు కోతతో పాప చనిపోయింది కానీ సెతేకి మాత్రం జీవితాంతం రంపపు కోతే మిగిలిపోయింది. అంతకన్నా బాధాకరమైన విషయం మరొకటి ఉంటుందా? తమ స్వేచ్ఛ అన్నది తమలాంటి మనుషుల కాలికింద చెప్పులా పడి ఉన్నప్పుడు… దేహంగా మనడం కన్నా పంచభూతాల్లో కలిసిపోవడంలోనే తన బిడ్డలకి నిజమైన స్వేచ్ఛని ఇవ్వవచ్చు అనుకున్న తల్లికి నిజాయితీగా ఇవ్వబడిన అక్షర నీరాజనం ఈ పుస్తకం.
అణచివేత, క్రూరత్వం అన్నవి మనిషి యొక్క ఆత్మని ఎంతలా దోచుకుంటాయి అన్న ప్రశ్నకి ఒక సమాధానంలా అనిపిస్తుంది ఈ నవల. మనలోని ఒక జాతి గతం నుండి నేటివరకూ దోచుకోవడం అన్నది మనమందరమూ తలదించుకోవాల్సిన విషయమే.
మన మనస్సు యొక్క స్వేచ్ఛ అన్నది మన శరీరం మరియు ఆత్మచే అనుభవించబడకపోతే ఆ బ్రతుకు ఎప్పుడూ మరణంగానే కొనసాగుతుంది. మానవజాతిలో తాము అధికులం అనుకునే క్రూరమైన శక్తులచే అణచివేయబడుతూ వారికి ఊడిగం చేయడంకన్నా మరణాన్నే తమ ధిక్కారంగా అనుకున్నప్పుడు ఆ మరణం వారి మనసుల మీద నవ్వు పూయించే విజయమే అవుతుంది.
తనలోని ఆత్మను కోల్పోయి… తమ బిడ్డల ఆత్మఘోషని అనుక్షణం తానే భరిస్తూ సరళమైన ప్రాథమిక అవసరాల కోసం అడుగడుగునా పోరాడుతున్న ఒక తల్లి తన పిల్లలకి తన బానిసత్వం వారసత్వంగా దక్కకూడదని వారికి మరణశాసనం రాయడం ఏ విధంగా నేరం అనిపిస్తుంది. అనుక్షణం తన గతంతో పెనుగులాడడం కన్నా నరకం ఇంకేముంటుంది?
150 ఏళ్ళ క్రితం ఉన్న సమాజాన్ని మనకి కళ్ళకి కట్టినట్లు రాయడం చేయి తిరిగిన రచయితలకి ఎవరికైనా అతి సులువైన పనే. కానీ అప్పటి సమాజం మొత్తాన్నీ ఒక చిన్న పుస్తకంలో తెచ్చేసి దాన్ని ఒక ఇతిహాసంలో తరతరాలూ తలుచుకునేలా రాయడం మాత్రం ఈ రచయిత్రి సాధించిన మానవీయ విజయం అనే చెప్పాలి.
ఇది సమూహాలుగా విడిపోయిన మనిషి కథ.
స్వేచ్ఛని బంధించిన మనిషి కథ.
చరిత్ర పుటల్లో మనిషే మరకైన కథ
కన్నీరింకని మనిషిని… మనిషిని చేసే కథ
బానిసత్వం అన్నది మానవ సమాజం మీద ఎంత గాఢమైన మరక వేసిందో అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం చదివితే చాలు. మనల్ని తీవ్రంగా దిగ్భ్రాంతికి గురిచేసేలా చేసి అడుగడుగునా మన అంతరాలని కదిలించేసేలాంటి కథనమిది. నిజ జీవితాల్లో ఇలాంటి ఎన్నో సంఘటనలు మరుగున పడిపోతూ ఉంటాయి. ఇలాంటి ఏ ఒక్క ఘటననో ”టోనీ మారిసన్” లాంటి రచయిత్రుల మనసుని తాకి తరతరాల చరిత్ర పుటల్లో ఒక కొత్త అధ్యాయాన్ని లిఖించుకుంటాయి.
ఈ మధ్యనే మరణించిన టోనీ మారిసన్ అమెరికాలో జన్మించారు. సమకాలీన రచయిత్రుల్లో అగ్రగణ్యురాలు. ఈమె సాహిత్యానికి నోబెల్, పులిట్జర్, గ్రామీ వంటి అనేక ప్రపంచ ప్రసిద్ధ పురస్కారాలు లభించాయి. Song of Solomon, Tar Baby & The Bluest Eye మొదలైనవి ఈమె ఇతర ప్రముఖ రచనలు.