మానవుడే మహనీయుడా!? -ఆదూరి హైమవతి

 

దేవుడు-

‘ఏంటీ మనిషి! తానే గొప్పనుకుంటాడు. నన్ను కనీసం తలవనైనా తలవడు! చిత్రం!’

మనిషి-

‘నేను అన్నీ సాధించగలను. నాతోటి వారికి మేలూ చేయగలను. కీడూ చేయగలను. నాకు సరిసాటి ఎవ్వరూ లేరు. నా వలన సాయం పొందినవారంతా నన్ను ‘మీరు మా దేవుడు!’ అని పొగుడుతూ, నా నామస్మరణ చేస్తారు. అలాగే నా వలన బాధపడ్డ వారంతా నన్ను ‘దయ్యంగాడు, పిశాచం, నరరూప రాక్షసుడు’ అంటూ తిడతారు. కనుక నేనే దేవునికంటే, దెయ్యంకంటే గొప్ప’.

దయ్యం-

‘రాను రానూ నేనంటే ఈ మనుషులకు దడ పోయింది. వెనక నా పేరెత్తితేనే భయంతో గడగడా వణికిపోయేవారు. ఇప్పుడు ఈ మనుషులను చూసి మా జాతే భయంతో వణుకుతోంది. మేము చేయలేనివెన్నో ఈ మనిషి చేస్తున్నాడు’.

పూజారి గర్భగుడి తలుపు తీసి వింతగా దేవుని విగ్రహం వైపు చూశాడు. ఈ రోజు విగ్రహంలో చిరునవ్వు కనిపించదేం. ఏమైంది? అనుకుంటూ తన నిత్యకృత్యం చేస్తూనే తన ఆలోచనల్లో మునిగిపోయాడు. ‘ఇంత సేవలు, అభిషేకాలూ, నైవేద్యాలూ, నిత్యపూజలూ, సహస్రనామ అష్టోత్తరాలూ చేస్తున్నా ఏనాడూ ఒక్క మారైనా నాకు దర్శనం ఇవ్వడేం దేవుడు. నేను మరీ భక్తిహీనుణ్ణా! లేక దైవదర్శనానికి తగని వాడినా! కాక నా సేవల్లో ఏదైనా లోపమో, నా పవిత్రతలో పాపమో ఉందా!’ అనుకున్నాడు అభిషేకం చేస్తూ.

పూజారి కొడుకు వచ్చి – ”నాన్నా! నీవెప్పుడైనా దేవుణ్ణి చూశావా? రోజూ ఇలా నీళ్ళైనా తాగకుండా అభిషేకాలూ, పూజలూ చేస్తున్నావే! ఒక్కమారైనా దైవదర్శనం అయిందా?” అన్నాడు పూలహారాలు తెచ్చిన గంప పక్కనే ఉంచుతూ. ”హుష్‌! ఇప్పుడవన్నీ మాట్లాడకు, దేవుడు వింటాడు”.

”ఆయన వినాలనే! విని నీకు కనిపిస్తాడనే! నీకంటే భక్తులుంటారని అనుకోను”

”నోరు ముయ్యరా! వివేకానందుడు రామకృష్ణ పరమహంసను అడిగినట్లుగా నీవు దేవుడ్ని చూశావా అని అడుగుతావట్రా! పాపం కాదూ” అంటూ టపటపా తన చెంపలు తానే వాయించుకున్నాడు.

”ఎందుకని తప్పు నాయనా! మనం చేస్తున్న పూజలు నిజంగా ఆ దేవుడు గ్రహిస్తుంటే, మన ప్రసాదాలు స్వీకరిస్తుంటే కనీసం నీకైనా ఒక్కమారు కనిపించాలి కదా! లేకపోతే దేవుడున్నాడని ఎలా నమ్ముతాం?” ”మాట్లాడకు. ఆయన వింటాడు. అలా మాట్లాడడం దోషం, దైవదూషణ”. ”ఎలా వింటాడు? చెవులకు అడ్డంగా పూలమాలలూ, కండువా కప్పేవు కదా! కళ్ళకు అడ్డంగా నామాలు పెట్టావు కదా!! విననూ లేడు, చూడనూ లేడు. అలా మాట్లాడడం దోషం, దైవదూషణ అంటున్నావే, నేనేం ఆయన్ని తిట్టడం లేదే. నీవు మా నాయనవు. నా కంటికి కనిపిస్తున్నావు. నాతో మాట్లాడుతున్నావు. అలాగే ఆయనా కనీసం నీకైనా కనిపించి, ఏదో ఒకటి మాట్లాడి ఆయన ఉనికిని నిరూపించుకోవాలి కదా. నేనిక వెళుతున్నా, ఇంటినుండీ ప్రసాదం తెస్తాను. చూపులాయనకూ, త్రేన్పులు మనకూ కదా!” అంటూ వెళ్ళాడా కుర్రాడు. ఆధునిక యువకుడు. రీజనింగ్లో ప్రథముడు. ఋజువులుంటేనే నమ్మకం, లేదంటే బూటకం.

”విన్నారా స్వామీ! మీరు ఒక్క పూజారికైనా, ఒక్క భక్తునికైనా ఈ కలియుగంలో కనిపించవచ్చు కదా!”

”ఎలా కనిపిస్తానయ్యా నారదా! ఈ కిరీటం, నగలూ, పట్టు వస్త్రాలూ వేసుకుని వెళ్ళి కనిపిస్తే అసలు నన్ను దేవుడని నమ్ముతారా? ఎవరో డ్రామా వేషగాడనుకోరూ. పోనీ మానవునిలా వస్త్రధారణ వేసుకుని వెళితే ‘కోతలు కోయకు నీవు దేవుడివా’ అని పరాచికాలాడరూ. నాకూ కనిపించాలనే ఉంటుందయ్యా, ఐతే ఏ వేషంలో వెళ్ళాలీ అనేదే నా బాధ. కలలో కనిపిస్తే అంతా భ్రమ అనుకుంటారు. పెద్ద చిక్కొచ్చి పడిందయ్యా”.

”నిజమే స్వామీ! ఈ కలియుగంలో మానవులు దేన్నీ నమ్మరు. తల్లీ, తండ్రీ, భార్య, పిల్లలూ… అందరిపైనా అపనమ్మకమే. చివరకు తమను తామే నమ్మరు. అయినా మానవుడు చాలా ఎదిగిపోయాడు”.

”పోన్లెండి స్వామీ. ఎన్నడూ లేనిది అంత దిగాలుగా ఉన్నారు ఇందుకా? ఎప్పుడూ చిరునవ్వే మీ ముఖారవిందంలో చూసేవాడ్ని” ఆశ్చర్యంగా అంటున్న నారదుని వైపు నిస్సారంగా చూసి దేవుడన్నాడు-

”ఏంటో నారదా! ఈ కలియుగ మానవులకి భక్తి ప్రపత్తులూ తగ్గిపోతున్నాయి. దేవుడంటే ఏ కోశానా నమ్మకం కనిపించదు”

”ఎలా కనిపిస్తుంది స్వామీ! ప్రహ్లాదుడు ‘పంకజనయనా, సంకటహరణా, నారాయణా, హరి నారాయణా’ అని పాడగానే వెళ్ళి కొండమీంచి త్రోసేసినా, మంటల్లో వేసినా వెళ్ళి కాపాడావు. చేతులతో పట్టుకుని దించావు. ఎనిమిదేళ్ళ ధృవుడు అరణ్యాలకొచ్చి ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అని ప్రార్థించగానే వెళ్ళి కనిపించి, నక్షత్ర లోకంలో ‘ధృవతార’ను చేశావు. దర్శనాలిచ్చి వారి విశ్వాసాన్ని పెంచావు. ఇప్పుడేమో కలియుగమని నీవు అసలు మానవులకు దర్శనం ఇవ్వటమే మానేశావు. ఏ రూపంలో కనిపించాలా అనే మీమాంశలో అసలు కనిపించడమే లేదు కదా. అందుకే వారు తమకు సాయం చేసిన మనుషులనే ‘దేవుడని’ ప్రేమగా పిలుస్తూ గౌరవించుకుంటున్నారు. ఐనా మానవులు మీ దర్శనానికి వస్తూనే ఉన్నారుగా స్వామీ! అటు చూడండి ప్రభూ” అంటూ నారదుడు భూమికేసి చూపిన దిశకు తల తిప్పాడు దేవుడు.

ఒక దృశ్యం.

”అయ్యా! మీరు మా పాలిట దేవుడయ్యా. మా చర్మంతో చెప్పులు కుట్టించి ఇచ్చినా మీ ఋణం తీర్చుకోలేమయ్యా. మా ఒక్కగానొక్క కొడుకును కాపాడారు” అంటూ ఒకాయన చేతులు పట్టుకొని మరొకాయన అంటున్నాడు.

మరో దృశ్యం.

”బాబు గోరండా! మీరే బాబయ్యా మా దేవులు. మా ముకాన బెమ్మ రాసిన రాతని సెరిపేసి, మా పిలగాల్లకు సదూకునే దోవ సూపిన్రు. ఇయ్యాల మురికోడలో ఉండే మా పిలగాల్లు పెద్ద సదూలు సదూకుని కాళోజీకెల్లి, ఇత్తిరీ తోమిన బట్లేచుకుని, పొత్తకాలెత్తుకుని ఎల్తుంటే సావీ… మా పేనాలు సంతోసకంతో ఇదై పోతుండాయయ్యో. మా వోడొకడు ఇస్కూల్‌ పంతులైతే, మరొక పిలగాడు ఆపీచులో

ఉద్దోగం సేత్తున్నడయ్యా. ఇల్లకాడ గిన్నెల్తోముకునే ఆడంగి పిల్లలు పొత్తకాలెత్తుకుని ఇస్కూల్‌ కెల్తండరయ్యా. మా పిల్లొకత్తి సర్కారీ దావకానాలో తెల్లగవునేచుకుని ‘నర్సీ’ పని సేత్తుంటే సూసేంకి మా కల్లు సాలకుండేయి దొరా. మీ పోటో ఎట్టుకు పూజ్జేచుకుంటాం దొరా! మా దేవులు దొరా మీరు” ”ఎక్కువా తక్కువా లేదు. చదువుకుంటే అన్నీ తెలుస్తాయి. అంతా సమానమే. చదువు వల్లనే అన్నీ లభిస్తాయి. అంతా దేవునిదయే తల్లీ”

ఇంకో దృశ్యం…

”మీరే కాదేంటీ మాకీ ఇల్లు కట్టిచ్చిచ్చిండ్రు. యండా వానలకి యాతన్లు పడుతుంటిమి గద్దోరా! మీ పోటో పూజకాడెట్టుకుని పూజ్జేసుకుంటున్నం దొరా. మా ఆడపిల్లోల్లు మరుగు లేక రాత్రయిందాక ఎంత యాత్న పడుతుండ్రో దొర. మాకు మరుగుదొడ్లు కట్టిచ్చిండ్రు. నీరిచ్చిండ్రు. మీరే దొరా! మా పాల్టి దేవుడు”.

”తప్పమ్మా అలా అనకు. అందరం దేవుని బిడ్డలమే” అంటూ ఆ ముదుసలిని బుజ్జగిస్తూ వెళ్ళాడతగాడు.

”చూడు నారదా! చూడు! నేను సృష్టించిన మనిషి దేవుడట. మరి నేనెవర్నీ?”

”స్వామీ! ఒక్కమాట. మరేమీ అనుకోరుగా. మీరేమో గత జన్మలో చేసిన వారి కర్మకొద్దీ జరుగుతుంది, ‘ప్రారబ్ద కర్మ’ పరిపక్వమయ్యే వరకూ నేనూ ఏమీ చేయలేను’ అంటూ నాన్చుతారాయె. మనుషులు తోటి మనుషులకు ఇలా చేతనైనా సాయం చేస్తూ వారి రాతలనే మార్చేస్తున్నారు. అందుకే మానవుడే దేవుడైపోయాడు. ఐనా ఇటు చూడండి స్వామీ ఒక్కమారు” నారదుడు చేయి చూపినవైపు చూశాడు దేవుడు.

అదో కళాశాల. ఆడ, మగ పిల్లలంతా చేతుల్లో పుస్తకాలతో హుషారుగా గేటు దాటి లోపలికెళ్తున్నారు.

”ఏంటోనే నర్మదా! నాకీ రోజు చాలా భయంగా ఉందే. ఇంటికెళ్ళిపోదామే. ఆ కిరాతకుడు ఏం చేస్తాడోనని గుండె దడదడలాడుతున్నదే”.

”అంత భయమెందుకే. క్లాసులో ఏమైనా అన్నా, చేసినా అందరూ ఉంటారు కదా. ఇదే ఆఖరి రోజు. రేపట్నుంచీ పరీక్షలు. ఈ చివరి రోజున మనం విద్య గడించిన ఈ వాగ్దేవీ క్షేత్రాన్ని, శారదా నిలయాన్ని, భారతీ భవనాన్ని, మన తరగతి గదిని చివరాఖరుగా చూసి ఈ ఒక్కరోజూ మన బెంచీమీద కూర్చుని వెళదామే. మాలతీ! ఏం భయం లేదులే” అంటూ నడక ఆపి నిల్చున్న స్నేహితురాలి చెయ్యిపట్టి ముందుకు సాగింది నర్మద.

”నర్మదా! వద్దే ప్లీజ్‌ వెళ్ళిపోదామే. వాడు ఉత్త రాక్షసుడే. ఎంతటి దుష్కార్యాన్నయినా చేయడానికి వెనుకాడడే. వాడి నాన్న కట్టించిన కాలేజీ అని వాడికి గొప్ప. తాను గొప్ప ధనికుని కొడుకని కండకావరం. తానేమి చేసినా చెల్లుతుందనీ, తనకు ఏ అడ్డు లేదనీ ధీమా”.

”అతని నాన్న హాస్పిటలైజ్డ్‌ కదా. ఆ బాధలో ఉంటాడులేవే”

”వాడికా బాధేముండదే. పిశాచాలకు పితృభక్తి కూడానా? వాళ్ళ నాన్నకు కిడ్నీ సమస్యట. మా ఫాదర్‌ చెప్పారు. ఆయన కేసు డీల్‌ చేసే టీంలో మా ఫాదరూ ఉన్నారు. ఎవరైనా కిడ్నీ ఇస్తేనే ఆయన జీవిస్తాడట. వెధవ పనులు చేస్తూ రాక్షసుడిలా బతక్కపోతే తండ్రికి ఒక కిడ్నీ ఇచ్చి బతికించవచ్చు కదా ఈ దయ్యం గాడు”.

”పోన్లేవే ఇతను చిన్నవాడు, యువకుడు. వాళ్ళ డాడీ ఓల్డ్‌ మ్యాన్‌. ఇతగాడికింకా ఎంతో జీవితం ఉంది కదా అందుకని అయ్యుంటుంది. అయినా నీకు ఇటీవల పాజిటివ్‌ థింకింగ్‌ పోతోంది”.

”పోవే నీవెప్పుడూ ఎవర్నీ, ఎంత శత్రువునైనా ఏమీ అననివ్వవు. వాడు నిన్నెన్ని విధాల వేధించాడే. నిన్ను క్లాస్‌లోకి రాకుండా అడ్డుకున్నాడు. నీ పేరు బోర్డుమీద రాయించాడు. ఎన్నో లవ్‌ లెటర్స్‌ రాశాడు. ఫోన్లు చేసి నానా చెత్త వాగాడు. వాడి లవ్‌ని యాక్సెప్ట్‌ చేయమని పోరాడాడు. వాడు మారి ఉంటాడనే నమ్మకం నాకు లేదే. ఐనా నీకు ఆ రాక్షసుని పట్ల సాఫ్ట్‌ కార్నర్‌”.

”పోన్లేవే పద వెళ్దాం. చివరిరోజున మన తరగతి గదికి వీడ్కోలు చెబ్దాం.”. ఇద్దరూ వెళ్ళి క్లాస్‌ గుమ్మం దాటి మూలగా ఉన్న వారి సీటు దగ్గరకెళ్ళారు. తన స్నేహితులందర్నీ పలకరిస్తూ తాము కూర్చునే బల్లదగ్గరకెళ్ళారు. ఆ కాలేజీలో ఇద్దరేసి కూర్చునే బెంచీలు, వాటిముందు డెస్కులూ ఉంటాయి. నర్మదా, మాలతీ ఇద్దరూ ఒకే బల్లమీద ఆ మూడేళ్ళ నుంచీ కూర్చుంటున్నారు. నర్మద ముందుగా గోడ దగ్గరకెళ్ళి కూర్చున్నాక మాలతి వస్తుంది. సాధారణంగా తాను కూర్చునే బెంచీ వెనక్కు నెట్టి కూర్చుంటుంది నర్మద. ఆ రోజు తన చేతిలో బుక్స్‌ బల్ల మీద పెట్టి వెనుక ఉన్న ఉమను పలకరిద్దామని డెస్క్‌ను ముందుకు నెట్టింది.

ఏం జరిగిందో తెల్సుకునేలోగానే పైనున్న చిన్న వెంటిలేటర్‌ (కిటికీ)లోనుంచీ యాసిడ్‌ బాటిల్‌ నర్మద మీద పడడం, పెద్ద కేక! ఆమె వెనక్కు వంగగా తలమీంచీ, తొడల నుంచీ క్రిందికి కారి కాలిపోయి మండడం జరిగిపోయింది.

క్లాసంతా కేకలతో, హాహాకారాలతో నిండిపోయింది. ఆడ, మగ పిల్లలంతా అటూ, ఇటూ పరుగెట్టడం, తొక్కిసలాట! ఎవ్వరికీ ఏం చేయాలో తోచలేదు. ముందుగా తేరుకున్న మాలతి తన తండ్రికి మొబైల్‌ నుంచి ఫోన్‌ చేసి విషయం చెప్పి అంబులెన్స్‌ పంపమంది. ఆ తర్వాత పోలీస్‌స్టేషన్‌కు ఫోన్‌ చేసింది. ”అందరూ వీడ్ని పట్టుకోండి. పోలీసులకు అప్పగిద్దాం. ఇదో ఈ రాక్షసుడే మా నర్మద మీద యాసిడ్‌ పోశాడు. వీడే వీడే” అంటూ పెద్దగా అరవసాగింది.

ఇంతలో పోలీస్‌ వ్యాన్‌ శబ్దం, అంబులెన్స్‌ హారన్స్‌ వినిపించాయి. అంతే ఒక్కసారిగా మగపిల్లలంతా బయటికి ఒకరినొకరు త్రోసుకుంటూ పరుగెత్తసాగారు. ఆ రాక్షసుడు రాజేంద్ర ఎలా తప్పించుకోవాలో తెలీక, రెండో అంతస్థు నుంచి క్రిందికి దూకేశాడు. క్షణాల్లో ప్రశాంతంగా ఉన్న కాలేజి వాతావరణమంతా తిరునాళ్ళ సంతలా మారిపోయింది.

”ఓహో! మనకంటే మానవ రాక్షసులే ఎక్కువ. అందుకే మనమంటే మనుషులకు భయం పోయింది. మనం మన జాతి వారిని ఇలా కాల్చడం, చంపడం చేయలేదు. మన జాతి రాజులైన హిరణ్యకశ్యపుడు, హిరణ్యాక్షుడు, మొదలైన వారంతా ఇతర జాతివారైన మానవులను, దేవతలనూ హింసించారు కానీ, మన జాతి రాక్షసులను ఏమీ చేయలేదు. నిజమే మనకంటే మానవులే పెద్ద రక్కసులు. తమ జాతిని తామే హింసించుకుంటున్నారు. అందుకే మనకా పని తప్పిపోయి, హాయిగా చూస్తూ ఆనందిస్తున్నాం” రాక్షస నాయకుడు తన పరివారంతో అంటున్నాడు.

”మీకు హెచ్చరిక. ఈ మానవులు మనం కనిపిస్తే మనలనూ చంపుతారేమో జాగ్రత్తగా వ్యవహరించండి. వారి జోలికి వెళ్ళకండి. మనం నివసించే ఈ ఊడలమర్రి క్రింద తమ జాతి మనిషినొకణ్ణి చంపి పెట్రోలు పోసి కాల్చేసిన నాడే మానవులంటే నాకూ దడ మొదలైంది” అని కూడా చెప్పాడు.

”స్వామీ! మరోమారు అటు చూడండి. మానవుడు రాక్షసుడైపోయాడని రాక్షస జాతంతా భయపడుతున్నది. కానీ మానవుడు దేవుడైపోయాడని దేవతలు బాధపడుతున్నారు. ఎందుకు దేవుడైపోయాడో చూడండి” అంటూ నారదుడు దేవుడ్ని మరో మారు భూలోకం వైపు చూడమన్నాడు.

”అంకుల్‌! అసలు మీరెలా నర్మద కిడ్నీలు, గుండె, కళ్ళు ఆ దుష్ట రాక్షసుడికీ, వాళ్ళ నాన్నకూ ఇచ్చారు? చెప్పండి” అంటూ నర్మద తండ్రి తారకరావుని పట్టుకుని కుదిపేస్తూ అరుస్తున్న మాలతిని చూసి ప్రశాంతంగా ఇలా అన్నారాయన.

”అమ్మా! కూల్‌డౌన్‌. పోయిన మా కుమార్తె నర్మద ఎలానూ తిరిగి రాదు. ఆమె మరణం మా జీవితాల్లో ఎప్పటికీ ఆరని మంటే. దానికి కారణమైన వాడు చనిపోయినంత మాత్రాన మాకేం ఒరుగుతుంది చెప్పు. అందుకే అతడికీ, అతని నాన్నకూ అవయవదానం చేశాం. నర్మద అవయవాలు వారిలో ఉన్నంతకాలం వారు నర్మదను మరువలేరు. కృతజ్ఞతతో ఆమెను గుర్తు చేసుకుంటూనే ఉంటారు. అంతకంటే వారికి ఏ శిక్షా అవసరం లేదని నా నమ్మకం. మరొకరి పట్ల అతడు అలా ప్రవర్తించకుండా జీవితాంతం మంచిగా మారే అవకాశం ఉంది కదా!”

”అసలు వాడు క్రిందికి దూకినప్పుడే చచ్చేవాడు. కానీ వాడు ఆ అంబులెన్స్‌ పైన పడి బ్రతికాడు. బోర్లాపడడం వల్ల వాడి కళ్ళల్లోకీ, పొట్టలోకీ గాజు పెంకులు గుచ్చుకుపోయాయట. పిశాచం బతికాడు”.

”ఊర్కో మాలతీ! ఎవర్నీ ద్వేషించకు. మాకింతే రాసి ఉంది”

”అంకుల్‌! నర్మదా అంతే. ఎవర్నీ ఏమీ అననిచ్చేది కాదు. మీరూనూ…’

”ఔనమ్మా! ద్వేషించినంత మాత్రాన ఒరిగేదేం లేదుగా”.

”అపకారికి ఉపకారము నెపమెన్నక చేయువాడు నేర్పరి సుమతీ! అనే సూక్తి మీరు రుజువు చేశారు అంకుల్‌” అంది మాలతి కళ్ళు తుడుచుకుంటూ.

”దేవుడున్నాడో లేదో కానీ దేవుడనే వాడుంటే మీకంటే గొప్పవాడనుకోము అంకుల్‌” అంటూ ఆ కాలేజి పిల్లలంతా అన్నారు.

”చూడండి స్వామీ! మానవుడు దేవుడయ్యాడా లేదా?”

”నిజమే నారదా! అంత అపకారం చేసిన వాడికీ ఇలా జీవం పోశాడు ఆ తండ్రి అంత బాధలోనూ”

”అంతే కాదు స్వామీ! మీరిచ్చిన అవయవాలు చెడిపోతే ఎవరికైనా మానవ వైద్యులు ఇంకొకరివి మార్చి జీవితాన్నిస్తున్నారు. లేనివారికి సాయం చేస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకుంటున్నారు. మరి మానవులే దేవుళ్ళైపోలేదా. ఇంకా మీరు కొండలను సృష్టిస్తే వీళ్ళు వాటిని పిండి కొట్టి చక్కని రోడ్లు, ఎత్తైన భవనాలూ నిర్మించుకుంటున్నారు. మీరు నదులను సృష్టిస్తే వాళ్ళు వాటి నీటిని నిలువ చేసి తటాకాల్లో ఉంచుకుని సాగునీటికీ, త్రాగునీటికీ వాడుకుంటున్నారు. ఇంకా నదులను అనుసంధానం చేసి నీరు సముద్రపు ఉప్పు నీటిలో కలవకుండా త్రాగునీటికీ, సాగునీటికీ ఇబ్బంది లేకుండా చేసుకుంటున్నారు. మీరు గ్రహాలను సృష్టిస్తే వారు వాటి పైకి ఉపగ్రహాలను పంపి వాటి ఆనుపానులు తెల్సుకుంటున్నారు. మీరు ఒకే చెట్టుకు ఒకే రకం పండ్లను సృష్టిస్తే, వీళ్ళు అనేక రకాల పండ్లను ఒకే చెట్టుకు కాయిస్తున్నారు. మీరు సముద్రాన్ని సృష్టిస్తే వాళ్ళు ఆ ఉప్పు నీళ్ళను మంచినీళ్ళుగా మార్చుకుని వాడుకుంటున్నారు. అందుకే వాళ్ళు దేవుళ్ళూ అయ్యారు. రాక్షసుల్లా దుష్కృత్యాలు చేయడం వల్ల రాక్షసులూ అయ్యారు. అయినా దేవాలయాలకు క్యూ కట్టి, శివరాత్రికి శివాలయాలకూ, వైకుంఠ ఏకాదశికి విష్ణాలయాలకూ వస్తూనే ఉన్నారుగా. మిమ్మల్నెక్కడ మరచారు స్వామీ? మానవుడు మహనీయుడయ్యాడు. మీ సృష్టే కదా! మీ బిడ్డలు గొప్పవారయ్యారని సంతోషించండి. ప్రహ్లాదుడు మంచివాడని తెలీక విష్ణుభక్తుడయ్యాడని కోపించిన హిరణ్యకశ్యపుడిలా బాధపడకండి స్వామీ! మానవుడూ మీ వాడే కదా!” అంటూ ముగించాడు నారదుడు.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.