అబ్బో ఎప్పటి మాట 50 సంవత్సరాల నాటి మాట.
మా తాత, నాన్న మా సీతారామపురం నుండి నరసాపురానికి పడవలెక్కి దొరల స్కూల్ టెయిలర్ హై స్కూల్ (అల్లూరి సీతారామరాజు చదువుకున్న స్కూల్)కి ఎలా వెళ్ళేవారో కథలు కథలుగా చెప్పినప్పటి మాట. మా ఊరికి కరెంట్ రాని రోజులు సాయంత్రాలు కొంచెం సేపు లాంతర్లు వెలిగించుకుని 7 గంటలకల్లా అన్నీ ముగించేసుకుని వీథరుగు వాకిట్లో మడత మంచాలేసుకుని ముసుగులేసి పడుకున్నప్పటి రోజులు నక్షత్రాల వెలుగు తప్ప మరే వెలుగూ ఉండని చీకటి రోజులు. మా చిన్నాన్నలిద్దరు పడవల మీద స్కూలుకి వెళ్ళే వాళ్ళమని మాకు చెప్పేవాళ్ళు.
నా ఎలిమెంటరీ చదువంతా మా వీథరుగు మీద ఉండే స్కూల్లోనే. సూర్యప్రభ గారని ఓ టీచర్ ఎక్కడి నుండో వచ్చి మాకు చదువు చెప్పేవారు. నిజానికి క్లాసులో కూర్చుని బుద్ధిగా చదువుకున్న జ్ఞాపకాలేవీ నాకు లేవు.
ఆరోతరగతి చదవాలంటే మా ఊరునుండి రోడ్డు వరకు ఒక కిలోమీటర్, అక్కడి నుండి పెద్ద సీతారామపురం వెళ్ళాలంటే మరో కిలోమీటర్ నడవాల్సిందే.
మా ఊరు చిన్న సీతారామపురం. రెండు సీతారామపురాలకి మధ్యలో కాలువ ఉంటుంది. కాలువలో పారే నీళ్ళు గోదావరివే. ఈ కాలువ కాళీపట్నం దగ్గర ఉప్పుటేరు ద్వారా సముద్రంలో కలుస్తుందన్నమాట. ఎర్రబస్సు, లవ్వు అని మొదలెట్టి గోదాట్లో ముంచుతున్నారేంటి అనుకుంటున్నారా? వస్తున్నా …
నేను మా ఊరి నుండి నడుచుకుంటూ పెద్ద సీతారామపురం లోని హై స్కూల్‌కి వెళ్ళేదాన్ని.
అప్పుడప్పుడే ఎర్ర బస్సులు నడవడం మొదలైంది. రోడ్డు మీద ఎర్రబస్సు కనబడగానే అమ్మో! భూతం అంటూ రోడ్డు దిగి తోటల్లోకి పారిపోయేవాళ్ళం. స్పీడ్‌గా వచ్చే బస్సును చూసి ఝడుసుకునేవాళ్ళం. ఆరోడ్డు మీద రోజుకి ఒకటో రెండో బస్సులొచ్చేవి. కరంట్ స్తంభాలకు తల ఆనించి బస్సు చప్పుడు కోసం వినేవాళ్ళం. గమ్మత్తుగా ఏదో శబ్దం వినబడేది. అంతే మనం రోడ్డు మీంచి పరుగో పరుగు.
ఎర్ర బస్సుతో నా మొదటి అనుభవాలివి. మెలమెల్లగా అలవాటైంది.
ఒకసారి మా నాన్న నన్ను నరసాపురం స్కూల్లో జాయిన్ చెయ్యడానికి ఎర్ర బస్సులో ఎక్కించినప్పుడు నేను భయపడుతూనే ఎక్కాను. నా జీవితంలో నేనెక్కిన మోటారు వాహనం ఎర్ర బస్సే అని గర్వంగా చెబుతాను. బస్సులోకి ఎక్కి నోరెళ్ళబట్టి చూస్తూండిపోయాను. లోపల మెత్తటి సీట్లు. హాయిగా కూర్చోవచ్చనమాట. చాలా పొడుగ్గా బోలెడన్ని సీట్లున్నాయి. ఒకాయన వచ్చి టికెట్ అని అడుగుతుంటే టికెట్ అంటే ఏంటి నాన్న అని మా నాన్ననడిగితే డబ్బులియ్యాలి. మనం డబ్బులిస్తే చిన్న కాయితం ఇస్తాడు. అదే టికెట్. డబ్బులెందుకియ్యాలి. ఇది గవర్నమెణ్ణోడిది అందుకే డబ్బులియ్యాలి అన్నాడు మా నాన్న.
ఆర్టీసీ అంటే తెలియదు కానీ, గవర్నమెంట్ తెలుసు మా నాన్నకి. మేమెక్కాకా బస్సు బయలుదేరింది. నేను డ్రైవర్ వెనక కిటికీ పక్కన కూర్చున్నాను. తల బయటికి పెట్టి చూస్తుంటే ఓ పిల్లా తలకాయ లోపల పెట్టుకో అని అరిచాడు డ్రైవర్. దబ్బున తల లోపలికి తీసుకున్నాను. బస్సు మా ఊరి కాలవ పక్క నుండి వెళుతుంటే కాలవ మాతో పరుగెడుతున్నట్టనిపించింది. కాలవేనా దూరంగా పంటపొలాలు, తాటి చెట్లు, కొబ్బరి చెట్లూ అన్ని బస్సుతో పాటు పరుగెత్తుతున్నట్టనిపించింది. నాన్న బస్సుతో పాటు అన్నీ పరుగెత్తుతున్నాయ్ అని గట్టిగా అరిస్తే బస్సులో అందరూ ఘోళ్ళున నవ్వారు. బస్సు మమ్మల్ని రాయపేట దగ్గర దింపేసి దుమ్ము రేపుకుంటూ బజారులోకి వెళ్ళిపోయింది. అలా ఎర్రబస్సు నా జీవితంలో ప్రవేశించింది. మా సీతారామపురం నుండి నరసాపురం వెళ్ళాలంటే ఐదు కిలోమీటర్లు నడవాలి. నేను చాలా సార్లు నడిచే వెళ్ళేదాన్ని. బస్సు టికెట్‌కి డబ్బులిచ్చేవాళ్ళు కాదు మా ఇంట్లో. వాళ్ళ దగ్గర ఉండేవి కావు. కొన్నిసార్లు గుర్రబ్బండి, కొన్ని సార్లు అబ్బాయిల్ని లిఫ్ట్ అడిగి సైకిళ్ళ మీద వెళ్ళేదాన్ని. కొంచెం పెద్దయ్యాకా కొన్ని డబ్బులిచ్చేవాళ్ళు. అప్పుడు హాయిగా బస్సెక్కి రయ్యంటూ వెళ్ళేదాన్ని. ఆరోతరగతి నుండి డిగ్రీ వరకు ఒక దశాబ్దం పాటు ఎర్ర బస్సు నన్ను ఊరేగించింది. ఎర్ర బస్సులో ఎన్ని ప్రేమ కథలో నేను ఎప్పుడూ కో-ఎడ్యుకేషన్‌లో చదువుకోలేదు. చదువంతా ఆడపిల్లల్తోటే. అయితే మొగల్తూరు నుండి చాలామంది అబ్బాయిలు శ్రీ.వై.ఎన్.ఎం కాలేజీలో చదివే వాళ్ళు (కో-ఎడ్యుకేషన్) మా బస్సులో ఉండేవాళ్ళు. వాళ్ళు మాకు బీటేసేవారు. తొలి ప్రేమలకు సాక్షి ఎర్ర బస్సేకదా. నేను డిగ్రీలో ఉన్నప్పుడు చిరంజీవి వాళ్ళ ఊరు పాత కాలవ నుండి ఎర్రబస్సులో వచ్చేవాడు. మేము సీతారామపురంలో ఎక్కేవాళ్ళం.
చిరంజీవి ఎప్పుడూ డోర్లో నిలబడి అమ్మాయిల కళ్ళల్లో పడాలని తాపత్రయపడేవాడు. మేము రాయపేటలో దిగిపోయేవాళ్ళం. మాతోపాటు దిగి మళ్ళీ ఎక్కేవాడు. వాళ్ళు బస్టాండు దాకా వెళ్ళాలి. ఎర్రబస్సులో నాకో రెండు ప్రేమ కథలున్నాయి. ఇప్పుడు తలుచుకుంటే భలే సరదాగా ఉంటుంది. ఒక ప్రేమికుడు ఘాటుగా ప్రేమించాడు కానీ కట్నం గట్రా తీసుకుని వేరే పెళ్ళి చేసుకున్నాడు. ఇప్పుడతను లేడు చనిపోయాడు.
ఇంకో ప్రేమ మొదలవుతుందనే అనుమానంతో అంతరించిపోయింది.
1975లో డిగ్రీ పూర్తి చేసి ఛలో హైదరాబాద్ అంటూ హైదరాబాద్‌కి వచ్చేసి వరకూ నా అనుబంధం ఎర్రబస్సుతో కొనసాగింది. ఇక్కడికి వచ్చాకా రంగు రంగుల బస్సులు, ట్రైలర్ బస్సులు, డబుల్ డెక్కర్ బస్సులు, అబ్బో గొప్ప వైవిధ్యం. లాల్ బస్సుతో పాటు రంగురంగుల బస్సుల్లో హైదరాబాదులో సిటీ బస్సుల్లో తిరిగిన అనుభవాలు మరెప్పుడైనా.