బ్రతుకునిచ్చేది నల్లమల, ఉసురు తీసేది యురేనియం -డా. కె.బాబూరావు

 

తెలంగాణలో యురేనియం అలజడి మళ్ళీ మొదలయింది. 2005లో నల్గొండ జిల్లాలోని పెద్దగట్టు, లంబాపూర్‌లలో ప్రతిపాదించిన యురేనియం తవ్వకాలనీ, మొదట మల్లాపురం, తరువాత శేరిపల్లిలలో ప్రతిపాదించిన యురేనియం శుద్ధి కర్మాగారాన్నీ, ప్రజల తీవ్ర వ్యతిరేకత నేపథ్యంలో పక్కన బెట్టారు. అది మళ్ళీ ముందుకొస్తోంది. దాన్ని చిట్రియాల్‌కు కూడా విస్తరించే అవకాశమూ కనిపిస్తున్నది. ఇప్పుడు నాగర్‌కర్నూల్‌, నల్గొండ జిల్లాలలో విస్తరించిన నల్లమల అడవులలో యురేనియం అన్వేషణ ప్రతిపాదన ముందుకు తెచ్చింది కేంద్ర అణుశక్తి శాఖ సంస్థ, అణు ఖనిజ విభాగం. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు అనుబంధంగా ఉన్న అటవీ సలహా కమిటీ, నల్లమలలో 83 చదరపు కిలోమీటర్ల అడవిలో, 4000 బోరులు తవ్వి, యురేనియం అన్వేషించడానికి, జాతీయ దృష్టిలో కీలకమైన ప్రాముఖ్యత కారణంగా, సూత్రప్రాయ అనుమతి ఇస్తున్నట్లు నిర్ణయించింది. అదే విషయాన్ని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ అధికారి, ఈ ఏడాది జులై 19న, తెలంగాణా రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శికి లేఖలో తెలియజేసి, తదుపరి అనుమతుల కోసం, తమ మంత్రిత్వ శాఖకు ఫారం ‘సి’లో దరఖాస్తు పంపాలని కోరారు. మరి రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఏమాలోచిస్తున్నది, పురోగతి ఏమిటి అన్నది సందిగ్ధం. ఇప్పటికే అనుమతికి అంగీకారం తెలిపేశారా? ప్రజాగ్రహాన్ని గమనించి తాత్సారం చేస్తున్నారా? నాగర్‌ కర్నూల్‌, నల్గొండ జిల్లాలను యురేనియం గనుల మయం చేస్తారా? బొందల గడ్డలుగా మారుస్తారా?

నల్లమల విధ్వంసం దేశ ప్రయోజనమా?

అనుమతి ఇవ్వడంలో దేశ ప్రయోజనాలు లేవన్నది సుస్పష్టం. అందుకు బలమైన శాస్త్రీయ కారణాలున్నాయి. ప్రపంచవ్యాప్త అనుభవాలున్నాయి. ఈ ప్రతిపాదన నల్లమల అడవిని బహుళ శకలీకరణకు గురిచేసి, అక్కడ నివసించే చెంచులకూ, జీవజాతులకు ఆవాస వినాశనం చేస్తుంది. విధ్వంసం 83 చదరపు కిలోమీటర్లకు పరిమితం కాదు. వాతావరణ సంక్షేభం అదుపు తప్పుతున్న ఈ సమయంలో భూమికి ఊపిరితిత్తులైన అడవులను కాపాడుకోవాలి. ఐక్యరాజ్యసమితి వాతావరణ సంక్షేభాన్ని అదుపు చేయడానికి, దేశాలన్నింటినీ సన్నద్ధం చేయడానికి చేయిస్తున్న, శాస్త్రీయ అధ్యయనాల పరంపరలో, కొత్తది ”వాతావరణ మార్పు-నేల” నివేదికను, ఐరాస ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల మండలి ”ఐపిసిసి”, ఆగస్టు 8, 2019న జెనీవాలో విడుదల చేసింది. గాలిలో బొగ్గుపులుసు వాయువుని తొలగించడంలో అడవుల పాత్రనీ, అడవుల విధ్వంసాన్నీ ఆపి, క్షీణిస్తున్న అడవులను పునరుద్ధరించవలసిన ఆవశ్యకతనూ నొక్కి చెప్పింది. ఆ నివేదిక

భూసంబంధ పర్యావరణ వ్యవస్థ అందించే సేవల విలువని 75-85 లక్షల కోట్ల డాలర్లు (2011 నాటి డాలర్లు)గా అంచనా వేసి, అది ప్రపంచ దేశాల మొత్తం జిడిపి కంటే ఎక్కువని పేర్కొంది. కానీ ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి కోసం, 1990 తర్వాత 3 శాతం అడవులను కోల్పోయాం. మన రాజకీయం, తాత్కాలిక ప్రయోజనాలకు, శాశ్వత సహజ సంపదను బలిపెడుతున్నది. పెట్టుబడి ప్రయోజనాలు ప్రకృతి విఘాతంగా పరిణమిస్తున్నాయి. ఈ వికృత ధోరణుల పర్యవసానమే నల్లమలకు, తెలంగాణకు యురేనియం విపత్తు.

అడవులను కాపాడుకోవలసిన ఆవశ్యకతపై ఐపిసిసికి శాస్త్రవేత్తలు సమర్పించిన 5 ప్రధాన అంశాలను నివేదికలో చేర్చారు. అవి :

1. అడవులలో నిక్షిప్తమైన కర్బనం (3 లక్షల కోట్ల టన్నులు), వాడుకోగల అవకాశమున్న బొగ్గు, చమురు, సహజ వాయువు నిక్షేపాలలో నిబిడమైన కర్బనం (2.7 లక్షల కోట్ల టన్నులు) కంటే ఎక్కువ. పారిస్‌ ఒప్పందం ప్రకారం ఉష్ణోగ్రత పెరుగుదలను 1.5 డిగ్రీలకు మించకుండా ఉంచడానికి ఈ శతాబ్దపు కర్బన బడ్జెట్‌ కేవలం 7500 కోట్ల టన్నులు మాత్రమే. అడవులను ధ్వంసం చేస్తే విడుదలయ్యే కర్బనం, పారిస్‌ ఒప్పందాన్ని విఫలం చేస్తుంది.

2. మానవ చర్యలు ఏటా విడుదల చేస్తున్న దాదాపు 4000 కోట్ల టన్నుల బొగ్గుపులుసు వాయువులో, 30 శాతం వరకూ అడవులు తొలగిస్తాయి, సముద్రాలు 25 శాతం తొలగిస్తాయి. మిగిలినది గాలిలోనే వేల సంవత్సరాలపాటు మిగిలి ఉండి భూతాపం పెంచుతుంది. అదుపు తప్పుతున్న భూతాపం నుండి రోణకు అడవులను సంరక్షించడం ఆవశ్యకం.

3. చిత్తశుద్దితో పారిస్‌ ఒప్పందం అమలుకు, క్షీణిస్తున్న అడవులను పునరుద్ధరించవలసిన అవసరం ఉంది. అడవులను విస్తరించి పునర్వైభవం కల్పిస్తే అవి అదనంగా 18 శాతం వరకూ కర్బనాన్ని తొలగించి ప్రమాదస్థాయిని తగ్గించగలవు.

4. భూతాపానికి జీవ ఇంధనం సమాధానం కాదు. కట్టెలను ఇంధనంగా వాడి, విడుదలైన బొగ్గుపులుసు వాయువుని సాంకేతికతతో తొలగించి, భూమిలో నిక్షిప్తం చేద్దామనే ఆలోచన ఇంకా ఆచరణ యోగ్య దశకు చేరలేదు. నిరంతరంగా గాలిలోని కర్బనాన్ని తొలగించే

ఉష్ణమండల అడవులను సంరక్షించుకోవడమే ప్రయోజనకరం.

5. ఉష్ణమండల అడవులు (నల్లమల లాంటివి) సహజమైన ఎసి యంత్రంలా పనిచేసి పరిసర ఉష్ణోగ్రతలను చల్లబరుస్తాయి. అడవులను తొలగిస్తే పరిసర ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల వరకూ పెరగవచ్చు. అడవులను వ్యవసాయ భూములుగా మార్చిన ప్రాంతాలపై జరిపిన అధ్యయనాలు, స్థానిక వర్షపాతంలో మార్పులను గుర్తించాయి. ఆహార ఉత్పత్తిపై ప్రభావం పడింది.

సుమేరియన్‌, గ్రీక్‌, రోమన్‌ నాగరికతల పతనంలో అడవుల విధ్వంసం పాత్ర చారిత్రక సత్యం… ఇప్పుడు బ్రెజిల్‌ దేశంలో అమెజాన్‌ అడవులు తగలబడుతుంటే ప్రపంచమంతా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ఫ్రాన్స్‌లో జి7 దేశాల సమావేశం సందర్భంగా ప్రజలు అడవులను కాపాడే సత్వర చర్యలు కోరుతూ ప్రదర్శనలు చేస్తున్నారు. నల్లమల అడవులు తెలుగు రాష్ట్రాల వారసత్వ సహజ సంపద, జీవ వైవిధ్యానికి నెలవు. హరిత హారం అడవులకు ప్రత్యామ్నాయం కాదన్న విషయం ఐపిసిసి స్పష్టం చేసింది. అణుశక్తి, హరిత శక్తి కాదు. క్లైమేట్‌ సంక్షోభానికి పరిష్కారం కాదు.

గత 30 సంవత్సరాలలో తెలంగాణా రాష్ట్ర ప్రాంతంలో మరలించిన దాదాపు 56 వేల హెక్టార్ల అడవిలో, గనులకు (36 వేలు), థర్మల్‌ విద్యుత్‌కు (6 వేలు), నీటి పారుదలకు (6 వేలు), రక్షణ అవసరాలకు (6 వేలు) ప్రధానం. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రాంతంలో దాదాపు 68 వేల హెక్టార్ల అడవి భూములను అభివృద్ది కోసమంటూ మరలించారు. అందులో గనుల కోసం 29 వేల హెక్టార్లు, నీటి పారుదల కోసం 30 వేల హెక్టార్లు ప్రధాన మరలింపులు. ఇవి సవరించిన భారత ప్రభుత్వ అధికారిక సమాచారం.

అడవులలోని చెట్లు తమ జీవక్రియలో ఆకుల ద్వారా వదిలే నీటి ఆవిరి సృష్టించే, ఆకాశ వాహిని వందలాది కిలోమీటర్ల వరకూ విస్తరించి వానలు కురుస్తుంది. ఆకాశవాహిని సముద్రాలపైని నీటి ఆవిరిని నేలపైకి తరలిస్తుంది. అడవుల నిర్మూలన అంటే భూమికి గుండు కొట్టించడమే. అడవులు లేక ఆకాశవాహిని ఎండిపోతుంది. వర్షపాతంలో మార్పులొచ్చి క్షామ ప్రాంతాలు పెరుగుతాయి. దాంతో ఆహారపు కొరత తప్పదు. ఒక చెట్టు ఒక రోజులో నీటి ఆవిరి వెలువరింపు ద్వారా కలిగించే చల్లదనం, ఒక రోజులో, రెండు ఇళ్ళల్లో వాడే ఎసి యంత్రాలు చల్లబరచడానికి సమానం. 70 యూనిట్ల విద్యుత్‌ వాడి పొందగలిగే చల్లదనం, ఒక్క చెట్టు ఇవ్వగలదు. విద్యుత్‌ కోసం చెట్లను తొలగించడం మూర్ఖత్వం.

అడవుల నిర్మూలన క్లైమేట్‌పై చూపే ప్రభావం పైన, పలు అధ్యయనాలు జరిగాయి. అమెజాన్‌ అడవుల నరికివేత, కరేబియన్‌ దీవులలోనూ, మధ్య ప్రాచ్య అమెరికాలోనూ, వర్షపాతాన్ని తగ్గించినట్లు గుర్తించారు. ఇండోనేషియా లోని బోర్నియో దీవిలో జరిగిన విస్తృత అటవీ నిర్మూలన ఆ దీవిలో ఉష్ణోగ్రతలు పెరగడానికీ, వర్షపాతం తగ్గడానికీ కారణమని పరిశోధనలు నిర్ధారిస్తున్నాయి. ఇలా ఎన్నో

ఉదాహరణలున్నాయి.

అడవులు జీవ వ్యవస్థ :

అడవులంటే కేవలం చెట్ల సముదాయం కాదు. అదొక పర్యావరణ, జీవవ్యవస్థ, ఎన్నో జీవులకు బతుకునిచ్చే ఆవాసం. జీవుల అంతర్‌ సంబంధాలు అడవిని నిర్వచిస్తాయి. నల్లమలలోని జీవులలో పులి అగ్రస్థాయి వేటాడే జంతువు. వేట – వేటాడే జంతువుల మధ్య సమతుల్యత ప్రభావం, అడవుల పైన

ఉంటుంది. రాబర్ట్‌ పెయిన్‌ అనే జీవ శాస్త్రవేత్త ఈ సంబంధానికి ‘ట్రాఫిక్‌ కాస్కేడ్‌’ అని నామకరణం చేశాడు. అంటే ఒక వేటాడే జంతువు ప్రభావం, వేట జంతువులపైన అంచెలంచెలుగా విస్తరించడం. దీనికి ప్రముఖ ఉదాహరణ, అమెరికాలోని యెల్లోస్టోన్‌ వనంలో, క్షీణిస్తున్న వృక్ష సంపదను పునరుద్ధరించడానికి, మనుషుల వేటతో అంతరించి పోయిన తోడేళ్ళ స్థానంలో వేరే అడవుల నుండి సేకరించిన కొత్త తోడేళ్ళను, 1995లో ప్రయోగపూర్వకంగా ప్రవేశపెట్టారు. తరువాత గణనీయమైన మార్పులను గమనించారు.

తోడేళ్ళు రాగానే ఎర్రలేళ్ళ ప్రవర్తనలో మార్పులొచ్చాయి. అవి సులువుగా వేటకు దొరికే లోయ ప్రాంతాల నుండి తప్పించుకు తిరగడం మొదలెట్టాయి. దాంతో వాగుల అంచులలో మొక్కలు పెరిగే అవకాశం మెరుగై, ఆరేళ్ళలోనే అవి చెట్లై, ఒడ్డు కోసుకుపోవడం ఆపాయి. చెట్లపై పక్షులు చేరాయి. గట్టు స్థిరపడడంతో, వాగు వెడల్పు తగ్గి నీటి ప్రవాహం పక్కలకు సంచరించడం మాని గట్లమధ్యనే స్థిరంగా ప్రవహించింది. నీటి ఇంజనీర్లయిన ఉభయచర జీవులు బీవర్ల సంఖ్య పెరిగి, అవి ప్రవాహంపై డాములు కట్టి, జలాశయాలను ఏర్పరచడంతో చేపలకు, కప్పలకు, సరీసృపాలు మొదలైన జీవులకు ఆవాసం దొరికింది. కొత్తగా పెరిగిన చెట్లపైకి పక్షులు చేరాయి. తోడేళ్ళు, చిన్న వేట జంతువు కోయోట్ల సంఖ్యను నియంత్రించడంతో, చిన్న క్షీరదాలైన ఎలుకలకూ, కుందేళ్ళకూ జీవించే అవకాశం మెరుగైంది. వాటికోసం నక్కలు, నీటి కుక్కలు, డేగలు చేరాయి. అవి తిని వదిలేసిన కబేళరాల కోసం గద్దలు, బొంత కాకులు చేరాయి. రకరకాలుగా జీవ వైవిధ్యం పెరిగింది. కేవలం లేళ్ళ సంఖ్య తగ్గించాలంటే వాటిని తుపాకులతో కాల్చి చంపవచ్చు. వాటి ప్రవర్తనలో మార్పు తేలేము. అది తోడేళ్ళను ప్రవేశపెట్టడంతో సాధ్యమయింది. ఈ ప్రయోగంపై ఎన్నో పరిశోధనా పత్రాలు, పుస్తకాలు వచ్చాయి.

నల్లమలలో యురేనియం తవ్వకాలు, పులులకూ, ఇతర వేట జంతువులకూ ఆవాసాన్ని కుదించి, వత్తిడి పెంచి, పునరుత్పత్తి శక్తి నశింపచేసే ప్రమాదముంది. అడవులలో పులులను చూడడానికి జరుగుతున్న పర్యాటకం వల్ల, పులులు వత్తిడికి గురై వాటి పునరుత్పత్తి శక్తి తగ్గుతున్నదని, పరిశోధనా సంస్థ ‘సిసిఎంబి’ వెలువరించిన జులై 2019 నివేదిక తెలుపుతున్నది. పులులు నశిస్తే, నల్లమల అడవుల శోభకి ముగింపే. భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ప్రాజెక్ట్‌ టైగర్‌’ అర్థ రహితం.

జీవ వైవిధ్య వినాశనం :

ప్రపంచాన్ని కుదిపేస్తున్న సమస్య జీవ వైవిధ్య వినాశనం. ఇప్పుడు జరుగుతున్న 6వ జీవ మహా వినాశనం. ఇది పూర్తిగా మానవ ప్రేరితం. ముందు జరిగిన 5 మహా వినాశనాలు భూమిపైన జరిగిన సహజ ఉత్పాతాల వల్ల జరిగాయి. ఐరాస సదస్సులు, నివేదికలు ఇప్పటికే హెచ్చరికలు చేసి ప్రమాద ఘంటికలు మోగించాయి. పది లక్షల జీవులు అంతరింపుకి దగ్గరలో ఉన్నాయి. కీటకాలు పదేళ్ళలో 25 శాతం నశిస్తాయనీ, 2050 నాటికి 50 శాతం నశిస్తాయనీ, శతాబ్దాంతానికి పూర్తిగా కనుమరుగవుతాయనీ పరిశోధనలు చెబుతున్నాయి. ఇవన్నీ నశిస్తే మనిషికి మనుగడ ఉండదు. జీవులందించే వెలలేని ప్రకృతి సేవల ముందు, మానవ ఆర్థిక వ్యవస్థ పేలవం. ప్రగతి పేరుతో, మనిషి తన ఆవాసానికే ముప్పు తెచ్చుకుంటున్నాడు. భూమి జీవనివాస యోగ్యత కోల్పోతున్నది. ఇప్పుడు మనకు కావలసింది అదనపు విద్యుత్‌ కాదు, విజ్ఞత.

యురేనియం కోసం పసలేని సమర్ధనలు :

అన్వేషణకి సమర్ధనగా అర్జీలో అణు ఖనిజ విభాగం వాదనకి ప్రాతిపదిక, అణు విద్యుదుత్పాదన పెంచడమే. అంతర్జాతీయ సగటు విద్యుత్‌ వినియోగం 2600 యూనిట్లు ఉండగా భారత సగటు వార్షిక వినియోగం 917.2 యూనిట్లు మాత్రమేనని కాలం చెల్లిన అంకెలిచ్చారు. భారగ సగటు వినియోగం 2017-18 సంవత్సరంలో 1,149 యూనిట్లకు, ప్రపంచ సగటు విద్యుత్‌ వాడకం దాదాపు 3400 యూనిట్లకు పెరిగాయి. ప్రపంచంలోని మొత్తం విద్యుదుత్పత్తిలో 70 శాతం చైనా, అమెరికాలు చేస్తాయి. ముఖ్యంగా అణు విద్యుత్‌ ద్వారా భారత వార్షిక సగటు వినియోగాన్ని అంతర్జాతీయ స్థాయికి పెంచలేమన్నది నిజం. ఇప్పుడున్న ఉత్పత్తి సామర్ధ్యం మూడురెట్లు పెంచితే గానీ అది సాధ్యంకాదు. కేవలం 1.9 శాతమే ఉన్న అణు విద్యుత్‌ని మూడు రెట్లు పెంచినా, అది 5.7 శాతం మించదు. యురేనియం, పునరుత్పత్తి లేని అణు ఇంధనం. ఇప్పుడు ప్రపంచంలో దాదాపు 450 అణు రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వాటిని రెట్టింపు చేయాలంటే లభ్యమయ్యే యురేనియం 20 సంవత్సరాలకే సరిపోతుందని ద ఇకాలజిస్ట్‌ అనే ప్రముఖ పత్రిక ఇచ్చిన సమాచారం. ఫాస్ట్‌ బ్రీడర్‌ రియాక్టర్‌తో ఇంధన సమస్యని అధిగమించవచ్చని దశాబ్దాలుగా చెబుతున్నా, ఇంతవరకూ అది ఎక్కడా ఆచరణకు నోచుకోలేదు.

అణుశక్తి ప్రస్తుత స్థాపిత సామర్ధ్యం మొత్తం విద్యుదుత్పత్తి సామర్ధ్యంలో కేవలం 1.9 శాతం మాత్రమే. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ 2018 నివేదికలో ఇచ్చిన అంచనాలు, ప్రపంచంలో విద్యుత్తులో అణు విద్యుత్‌ వాటా తగ్గుతూ, 2050 నాటికి 5.6 శాతంకి దిగిపోతుందని చెబుతున్నాయి. ప్రస్తుతం అణుశక్తి వాటా 11 శాతంలోపు. అణు విద్యుత్‌ యూనిట్‌ ధర ప్రజలు భరించలేరు. కొవ్వాడలో ప్రతిపాదించిన అణు విద్యుత్‌ కర్మాగారం ఉత్పత్తి చేసే విద్యుత్‌ యూనిట్‌ ధర 20 నుండి 32 రూపాయల వరకూ ఉంటుందని అమెరికా దేశపు ‘శక్తి ఆర్థిక మరియు విత్త విశ్లేషణ సంస్థ’ (ఐఇఇఎఫ్‌ఎ) అంచనాలు వేసింది. నిర్మాణ పెట్టుబడి 4 లక్షల కోట్ల రూపాయల పైబడి.

రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ మండలి సమావేశంలో నల్లమలలో అన్వేషణ అనుమతి కోసం, అణు ఖనిజ విభాగం, ఎలాంటి యంత్రాలనూ అడవిలోకి తీసుకువెళ్ళమనీ, ఒక్క చెట్టు కొమ్మను కూడా నరకమనీ, అడవి జంతువులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి చర్యలూ చేపట్టమనీ హామీ ఇచ్చింది. పర్యావరణ మంత్రిత్వ శాఖ అనుమతికి వెళ్ళినపుడు అణు ఖనిజ విభాగం మాట మార్చింది. అక్కడ సూత్రప్రాయ అనుమతి పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి పెట్టుకున్న అర్జీలో 3 అంగుళాల బోరులు 1000, 7 అంగుళాల బోరులు 3000ను 75 మీటర్ల లోతుకి తవ్వుతామని ప్రతిపాదించారు. కానీ వాటిని ఎక్కడెక్కడ తవ్వుతారో వివరించలేదు. అక్కడికి బోరు తవ్వే యంత్రాలను ఎలా చేరుస్తారు? వాటికి ఎంత చోటు కావాలి? తవ్వే ముందు వాటిని ఏర్పాటు చేయడానికి కావలసిన చోటు ఎంత? అందుకోసం తాత్కాలికంగా వాడే భూమి మొత్తం కేవలం 10 చదరపు మీటర్లుగా చూపుతున్నారు. బోరు యంత్రాలు చేసే శబ్దం 40 డెసిబెల్స్‌ మాత్రమేనట! ఇదంతా హాస్యాస్పదంగా, అర్జీ పరిశీలించే అటవీ అధికారులను ఆట పట్టిస్తున్నట్లుగా ఉంది. ఇన్ని అసత్యాల ఆధారంగా అనుమతికి ప్రయత్నిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ నియమాలను పాటిస్తుందా?

యురేనియంతో ప్రపంచవ్యాప్త విషాదం :

ప్రపంచంలో ఎక్కడ యురేనియం తవ్వి తీసినా అది అక్కడి ప్రజలకు విషాదమే మిగిల్చింది. అమెరికాలో రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో, అణు బాంబు తయారీ కోసం, యురేనియం తవ్వకాలు మొదలయ్యాయి. యురేనియం ఖనిజం, దేశ మూలవాసి తెగలకు ప్రత్యేకించి రక్షిత ప్రాంతాలలోనే ఉంది. వారు దేశం కోసం తమ ప్రాంతాలను యురేనియం తవ్వకాలకు ఇచ్చారు. గనులలో పనిచేశారు. ప్రజలకు, గని కార్మికులకు యురేనియం దుష్ప్రభావాలను వివరించలేదు.

ఎలాంటి నియంత్రణ లేక, వేలాది గనులను తవ్వి వ్యర్థాలను అక్కడే వదిలేశారు. ఈనాటికీ అక్కడి ప్రజలు రేడియేషన్‌ దుష్ప్రభావాలను అనుభవిస్తూనే ఉన్నారు. వేలాది మంది అనారోగ్యంతో మరణించారు. న్యూ మెక్సికో రాష్ట్రంలోని చర్చ్‌రాక్‌లో జులై 16, 1979న అకస్మాత్తుగా యురేనియం వ్యర్థాల చెరువు కట్ట తెగి 1100 టన్నుల అణుధార్మిక వ్యర్థం, 9 కోట్ల గాలన్ల వ్యర్థ జలాలు బయటకు విడుదలై రియో పుఎర్కొ నదివైపు ప్రవహించి నది నీటిని విషమయం చేశాయి. మొదటి అణుబాంబు పరీక్ష తరువాత ఆ స్థాయి అణుధార్మికత విడుదల కావడం అదే మొదటిసారి. వ్యర్థాల చెరువుల కట్టలు తెగడం తరచుగా జరిగే ప్రమాదం. ఇంకో పెద్ద ప్రమాదం 1994లో దక్షిణ ఆస్ట్రేలియాలో తెగిన ఒలింపిక్‌ డ్యాం. దాని నుండి 50 లక్షల ఘనపు మీటర్ల వ్యర్థం బయటపడి నీటిని, నేలని కలుషితం చేసింది.

ప్రముఖంగా యురేనియం ఉత్పత్తి చేస్తున్న దేశాలు కజకిస్తాన్‌, కెనడా, ఆస్ట్రేలియా, నమీబియా, నైగర్‌, రష్యా,

ఉజ్బెకిస్తాన్‌, చైనా, ఉక్రెయిన్‌, అమెరికా, ఇండియా. అమెరికా ఉత్పత్తిని పూర్తిగా తగ్గించింది. అవసరమైన 80 శాతం పైగా యురేనియం దిగుమతి చేసుకుంటున్నది. అతి విషాదం నైగర్‌ది. ఫ్రాన్స్‌ తమ అణు విద్యుత్‌ కోసం నైగర్‌లో యురేనియం తవ్వి తీస్తుంది. నైగర్‌లో 16.6 శాతం మందికే విద్యుత్‌ లభ్యం. యురేనియం తవ్వకాల దుష్ఫలితాలు బీద నైగర్‌ జాతీయుల పాలు, విద్యుత్‌ వెలుగులు సంపన్న ఫ్రాన్స్‌ దేశస్థులకు. మన దేశంలో జాదూగోడ, కడప జిల్లా తుమ్మలపల్లి ప్రాంతంలో జరిగిన, జరుగుతున్న విధ్వంసం తెలిసినదే. మన దేశంలో యురేనియం తవ్వి తీసే హక్కుని ప్రభుత్వం యురేనియం కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌కు కట్టబెట్టింది. దేశానికి యురేనియం ముఖ్యమైన అవసరమనే మిషతో చట్టాలను, నియమాలను ఖాతరు చేయక పరిసరాలను విధ్వంసం చేస్తూ, సైన్సుని వక్రీకరిస్తూ బాధిత ఆదివాసీ ప్రజల జీవితాలను విద్యుత్‌ వెలుగులకు బలిపెడుతోంది. ప్రపంచం మొత్తంలో మొదటిసారి యురేనియం తవ్వకాలు ఆదివాసి ప్రాంతం కాని కడపలో జరుగుతున్నాయి. అదికూడా, ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహించే ప్రజల మధ్య. కానీ ఇక్కడా ఎలాంటి నియంత్రణ లేక యధేచ్ఛగా భూగర్భ జలాలను విషమయం చేసి వ్యవసాయానికి కూడా పనికిరాని దశకు చేర్చినా, అధికార వ్యవస్థ, నియంత్రణ సంస్థలూ, రాజకీయమూ యు.సి.ఐ.ఎల్‌ ను కట్టడి చేయలేకపోయాయి. ప్రేక్షక పాత్ర పోషిస్తూ వచ్చాయి. పర్యావరణ అనుమతిలో తొమ్మిది నియమాలను ఉల్లంఘించారని సాక్షాత్తూ పర్యావరణ మంత్రిత్వ శాఖే నమోదు చేసినా చర్యలు శూన్యం. ప్రజల సొమ్ముతో నడిచే సంస్థ ప్రజలకే శాపంగా పరిణమిస్తే ప్రజలకు దిక్కేది. 2019 ఆగస్టులో కలెక్టర్‌ నిర్వహించిన సమావేశంలో బాధిత గ్రామాల రైతులు నిస్పృహతో నష్టపరిహారమిస్తే గ్రామాలు వీడిపోయేందుకు సంసిద్ధత తెలియచేశారు. తెలంగాణా ప్రజల నెత్తిన ఇలాంటి విధ్వంసకర పరిశ్రమను పెట్టడం జాతి ప్రయోజనమా? ప్రముఖ మనస్తత్వవేత్త, రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో, జర్మన్‌ వైద్యులు తమ వృత్తి ధర్మం, ప్రాణాలు కాపాడడాన్ని వదలి, కాన్సెంట్రేషన్‌ క్యాంపులలో హంతకులుగా మారడాన్ని విశ్లేషించి ‘నాజీ డాక్టర్స్‌’ అనే పుస్తకాన్ని రాసిన 93 సంవత్సరాల రాబర్ట్‌ జె. లిప్టన్‌, హార్వర్డ్‌ విశ్వ విద్యాలయ ప్రొఫెసర్‌ నవోమి ఒరెస్కేస్‌తో కలిసి అణుశక్తిపై జులై 30న రాసిన వ్యాసంలో ‘అంతిమ వినాశనం కోసం రూపకల్పన జరిగిన సాంకేతికకు జీవితాలను మెరుగుపరిచే మరు రూపమివ్వచ్చనే తప్పుడు భ్రమల నుండి మనం విముక్తం కావాలి’ అని రాశారు. అణు విద్యుత్తూ, అణు బాంబు ఒకే నాణానికి ఇరు పార్శ్వాలు.

ప్రత్యామ్నాయాలు :

ప్రమాద రహిత ప్రత్యామ్నాయాలు సౌర, పవన శక్తులకు అవకాశాలెన్నో ఉండగా, ప్రథమ శ్రేణి అడవులను విధ్వంసం చేసి, ఆదిమ తెగ చెంచులను నిర్వాసితులను చేసి, నల్లవాగు, దిండి, కృష్ణా నదులను విషమయం చేసి, పరిసర ప్రజల బ్రతుకులను పణంగా పెట్టి యురేనియంను అన్వేషించి తవ్వి తీయడం, జాతి ప్రయోజనాల కోసమా? యురేనియం కార్పొరేషన్‌ నిఘా అధికారి నివేదిక ఆపాదించినట్లు కాంట్రాక్టర్ల లాభాల కోసమా? అణుశక్తి సంస్థల అధికారుల పదోన్నతుల కోసమా? వాతావరణ సంక్షోభాన్ని నివారించడంలో అణుశక్తి పాత్ర స్వల్పం. 2019 సంవత్సరపు బ్రిటిష్‌ పెట్రోలియం సంస్థ ‘ప్రపంచ శక్తి దృక్పథం’ నివేదిక ప్రకారం ప్రపంచ శక్తి అవసరాలలో అణుశక్తి వాటా 2040 నాటికి 6 శాతం మించదు. అతి తక్కువ ఖర్చుతో, అతి త్వరలో నిర్మించి, ఉత్పత్తి చేయగల ప్రత్యామ్నాయం, సౌరశక్తి మనకు పుష్కలంగా లభించే అవకాశం ఉండగా, భరించలేని ఖర్చుతో, దశాబ్దాలపాటు సాగే నిర్మాణం తర్వాత ఉత్పత్తయ్యే అణువిద్యుత్‌ని, దేశ కీలక ప్రయోజనాలకి అవసరంగా చిత్రించడం సరికాదు. అందుకోసం తెలుగు రాష్ట్రాలని శాశ్వతంగా మరుభూములుగా మార్చడం దేశ ప్రయోజనం కానేకాదు. ప్రపంచం ప్రస్తుత ఆర్థిక విధానాలను కొనసాగిస్తే 2055 నాటికి ఉష్ణోగ్రతలు 4 డిగ్రీలు పెరిగే అవకాశముందనీ, ఆ ప్రమాదం ఊహించడానికే భయంకరమనీ, ఆ పరిస్థితులలో కేవలం పది శాతం జనాభా మాత్రమే బతికే అవకాశముందనీ అంటున్నారు కొందరు ప్రముఖ శాస్త్రవేత్తలు. దేశ ప్రజలకు కీలకమైనది అదనపు విద్యుత్తు కాదు, వాతావరణ సంక్షోభాన్ని నివారించే శక్తి విధానం.

దేశంలో ఎడారీకరణలో ముందున్న 9 రాష్ట్రాలలో తెలంగాణా ఒకటి. భారతదేశ నివేదిక 2011-13 అంచనాల ప్రకారం 31.34 శాతం నేల వివిధ దశల ఎడారీకరణలో ఉంది. ఉన్న కొద్ది అడవులను, అందునా ప్రథమ శ్రేణి అడవి నల్లమలను యురేనియం గనుల కోసం మరలించడానికి సంసిద్ధత శోచనీయం, ఆలోచనా రహితం. తెలంగాణా ప్రజల మనుగడను హరించే దేశ ప్రయోజనం ఆమోద యోగ్యం కాదు.

(అణు ‘ధార్మిక’ సత్యాలు పుస్తకం నుండి)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.