మారుతున్న లైంగికత – కొత్త హక్కుల చర్చ -ఎ. సునీత

 

ఈ సమావేశానికి నన్ను ఆహ్వానించిన వసంత లక్ష్మి, కృష్ణ గార్లకి నా కృతజ్ఞతలు. పౌర హక్కులు, మానవ హక్కుల ఉద్యమంలో రాజకీయాల గురించి నేర్చుకున్న నాకు ఇక్కడ మాట్లాడటం ఒకరకంగా స్వంత ఇంటికి రావటం వంటిది. ఈ రోజు బాలగోపాల్‌ ఇక్కడ ఉండి ఉంటే బాగుండు అని ఇక్కడున్న చాలా మందితో సహా నేను కూడా కోరుకుంటున్నాను. 1990ల చివర్లో నాకు బహిరంగ సభల్లో మాట్లాడటం కొత్తయినప్పుడు నేను కష్టపడడం విన్న ఆయన ఈ రోజు నేను మాట్లాడింది విని ‘పర్లేదు, ఈ అమ్మాయికి కూడా విషయాలు మాట్లాడడం వచ్చింది’ అని బహుశా భావించేవారేమో!

ఈ రోజు చర్చకి మన ముందున్న విషయం – లైంగికత, లైంగిక హక్కులు, లైంగిక హింస. రోజు రోజుకీ స్త్రీలు (జన్మతః లేదా తరువాత స్త్రీలుగా పరిణమించిన), బాలురు, బాలికలపై జరిగే వేధింపులు, హింస గురించి ఎక్కువవుతున్న వార్తలు అందరినీ కలవరపెడుతున్నాయి. వాటికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు, ప్రజా స్పందన మరో పక్క ఈ వేధింపులని, హింసని రాజకీయం చేసి చట్టపరమయిన, విధాన పరమయిన స్పందన కోసం అడుగుతున్నాయి. గత నెల రోజులుగా ఊపందుకున్న ‘మీ టూ ఉద్యమం’ దీన్ని ముందుకు తీసుకుపోయి ముఖ్యంగా కులీన స్త్రీలు చదువుకునే, పనిచేసే బహిరంగ/విద్యా/పని స్థలాల్లో లైంగిక వేధింపుల సంస్కృతిని ఇంతకు ముందు ఎన్నడూ లేనంత బలంగా ప్రశ్నిస్తోంది. ఇంత స్పృహ, స్పందన పెరిగినప్పటికీ ఎందుకు వేధింపులు, హింస ఆగట్లేదు అన్న బాధ, కోపం, కసి కూడా చాలామందిలో మరో పక్క పెరుగుతున్నాయి.

ఈ పరిణామాలన్నింటినీ ”స్త్రీల పెరుగుదలని ఆపుతున్న పితృస్వామ్య హింస : దానికి ఎదురవుతున్న వ్యతిరేకత” అన్న చట్రంలో… అంటే, స్త్రీలు ముందుకు వెళ్తుంటే సహించలేని పురుషులు ఈ హింసకి పాల్పడుతున్నారని విశ్లేషించవచ్చు. హక్కుల కార్యకర్తలుగా ఆయా సంఘటనలలో బాధితులకి సహకారం అందించడానికి ఇటువంటి విశ్లేషణ కొంత మేరకు పనికొస్తుంది. కానీ వివిధ సంఘటనల ప్రత్యేక నేపథ్యం మరియు చారిత్రక సందర్భాలని పక్కకి పెట్టి అందరినీ ”స్త్రీలు-పురుషులు” అనే సంకుచిత చట్రంలో చూస్తే ఈ విశ్లేషణ పరిమితంగానే ఉపయోగపడుతుంది. అంతేకాక, స్త్రీలు, పురుషులు అందర్నీ తనకనుకూల రీతిలో మారుస్తూ నెడుతున్న రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక శక్తుల గురించి కూడా మనకర్ధం చేయించదు. హింస ఎక్కువయ్యేది మార్పు జరిగే సమయంలోనేనన్నది మనకందరికీ తెలిసిన విషయమే. కాబట్టి లైంగిక హింస, వేధింపుల ఘటనల్లో వ్యక్తమవుతున్న సాంఘిక, ఆర్థిక, రాజకీయ మార్పుల విస్తృతిని అర్థం చేసుకోవటం, కనీసం దాని కోసం ప్రయత్నించటం చాలా అవసరం. ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్న హింస, వేధింపులని లైంగిక హక్కుల ఉల్లంఘనలుగా పరిగణించే అవగాహన గురించి కూడా ఆలోచించాలి. ఇది ఎప్పటినుండో వస్తున్న అవగాహనా లేక కొత్తగా వచ్చిన అవగాహనా, ఏ రకంగా వ్యతిరేకించాలి,

ఉద్యమం ఎలా నిర్మించుకోవాలి అనే స్పృహతో ఆలోచించటం ఎంత అవసరమో, ఇటువంటి విశ్లేషణ కూడా అంతే అవసరం. అప్పుడే లైంగిక హింస, వేధింపులని లైంగిక హక్కులకి ముడి పెట్టి ఆలోచించే స్పృహ, అవగాహన కల్పించడంలో ప్రజా ఉద్యమాల పాత్ర గురించి మాత్రమే కాక రాజ్యం, విపణి, పెట్టుబడి, పాపులర్‌ కల్చర్‌ తెచ్చే వ్యవస్థీకృత మార్పులు పోషిస్తున్న బలమయిన, లోతయిన పాత్ర గురించి ఆలోచించగలం. వీటి పాత్రని అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే లైంగిక హింస, వేధింపులు లైంగిక హక్కుల స్పృహకి ఎలా జతచేయబడుతున్నాయి, ఇటువంటి లైంగిక హక్కుల స్పృహ కల్పిస్తున్న చారిత్రక అవకాశాలని, అలాగే దాని పరిమితులని విశ్లేషించడం కూడా సాధ్యపడుతుంది.

లైంగికత అనంగానే స్త్రీ పురుషుల మధ్య కలిగే ఆకర్షణకి లేక శృంగారానికి సంబంధించిన అంశంగా, దాన్ని, దానిపై సంఘం విధించే సాంఘిక, సాంస్కృతిక కట్టుబాట్లు, నియమాల గురించి విశ్లేషించటమే లైంగికతకు సంబంధించిన ప్రధాన చర్చగా అర్థం చేసుకోవడం కద్దు. అయితే ఇది సమాజ నియమాలకు (నార్మెటివ్‌ ఇంజంక్షన్‌) లోబడి సైద్దాంతిక చర్చకి ముందే పరిమితులు విధించు కోవటమవుతుంది. లైంగికత మానవ జీవితంలో అనేక పార్శ్వాలని స్పృశించే కీలకమైన, విస్తృతమైన అంశం, విషయం, దానిలో అంతర్భాగం. దాని వ్యక్తీకరణలో భాగంగా ఈ మధ్య మన ముందుకొచ్చిన విషయాలని చూస్తే దాని విస్తృతి అర్థం చేసుకోవచ్చు. నచ్చిన బట్టలు వేసుకోవడం, తమకు సంతోషమిచ్చే పనులు చెయ్యటం, తమకు నచ్చిన లైంగిక భాగస్వాములతో- ఒకటే జెండర్‌ కావచ్చు, వేరే జెండర్‌ కావచ్చు- కలిసి జీవించటం, కష్టంగా ఉంటే జెండర్‌ని మార్చుకోవడం, రోడ్లపై, బహిరంగ ప్రదేశాల్లో హాయిగా తిరగగలగడం, కులం, మతంతో నిమిత్తం లేకుండా జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వతంత్రం, ఒంటరిగా జీవించే అవకాశం, పెళ్ళితో అవసరం లేకుండా లైంగిక సంబంధాలు, కలిసి జీవించే అవకాశం కావాలనటం, అమ్మాయిల కదలికలపై హాస్టళ్ళలో, ఇళ్ళలో ఉండే కట్టుబాట్లు ఎత్తివేయాలనటం, పార్కులు, టీ షాపులు, రోడ్లు పరలైంగిక పురుషులకు ఎంత చెందుతాయో తమకి కూడా చెందాలని స్త్రీలు, ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులు అడగటం, వీటన్నింటిలో తమ శరీరాలపై, ఇష్టాఇష్టాలపై, కోరికలపై ఇతరులు (కుటుంబం, కమ్యూనిటీ, రాజ్యం కూడా) పెట్టే అసంబద్ధ నియంత్రణ ఉండకూడదనే అంశంతో పాటు బహిరంగ ప్రదేశాలు, నివాస స్థలాలు, సమాజ వనరులు, అవకాశాలు వీటికనుగుణంగా మారి తమక్కూడా ఉపయోగపడాలి, చెందాలనే బలమైన ఆకాంక్షలు తోడయి ఉన్నాయి.

గత కొన్నేళ్ళుగా దేశ ఉన్నత న్యాయస్థానం జెండర్‌, లైంగికతల గురించి వరసబెట్టి ఇస్తున్న తీర్పులు వ్యక్తిగతం, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించి జరుగుతున్న మార్పులకి అద్దం పడుతూ, వాటిని బలపరిచే విధంగా వెలువడుతున్నాయి. 2009తో సమలైంగికత, జెండర్‌ గురించి ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు వ్యక్తిగత లైంగిక జీవితంలో ఎవరు జోక్యం చేసుకోకూడదని చెపితే, నల్సా తీర్పుతో ట్రాన్స్‌జెండర్‌ వ్యక్తులకు గుర్తింపు లభించింది. 2018 సంవత్సరం ప్రారంభంలో ప్రైవసీని రాజ్యం, మార్కెట్‌ గౌరవించాలని, అంతకంటే ముఖ్యంగా వ్యక్తిగతాన్ని ప్రాథమిక హక్కుల్లో భాగంగా పరిగణించాలని ఇచ్చిన తీర్పు సెప్టెంబర్‌ 2019లో 377 పరిధి నుండి సమలైంగికులని తీసేసి, వారికి రాజ్యాంగపరమైన హక్కులు కల్పించాలనే కోర్టు తీర్పుకి దారితీసింది. 377 సెక్షన్‌, అదే నెలలో ఐపిసి 497 కింద ఇకనుండి అక్రమ సంబంధాన్ని నేరం కింద పరిగణించమని వచ్చిన రెండు తీర్పుల్లో కూడా ఇద్దరు వయోజనులైన వ్యక్తుల మధ్య అంగీకారంతో ఏర్పడే వ్యక్తిగత సంబంధాలని రాజ్యం నేరపూరితం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని కోర్టు గట్టిగా నొక్కి చెప్పింది. స్త్రీల పట్ల, హాజ్‌ ఆలీ దర్గాహ్‌ కావచ్చు, శబరిమలై ట్రస్ట్‌ కావచ్చు, తమ వివక్షా పూరిత ధోరణులని మార్చుకోవాలని ఇచ్చిన తీర్పులు, అలాగే స్త్రీలని ఆస్తిలా పరిగణించకూడదని చెప్పిన 497 తీర్పు కూడా ఈ కోవకి చెందినవే. ఈ తీర్పులన్నింటినీ ముడివేసే దారాలు వ్యక్తిగత స్వేచ్ఛ, అంగీకారం, లైంగిక సమానత్వ భావనలు.

ప్రజా ఉద్యమాలు ఒక్కటే ఆయా వ్యక్తీకరణలకు, వాటి వ్యవస్థీకరణకి అవకాశం, భూమిక ఏర్పరుస్తున్నాయా అనే ప్రశ్న వేసుకుంటే బహుశా కాదని సమాధానం వస్తుంది. గత ఇరవై ఏళ్ళుగా వేళ్ళూనుకున్న ఉదారవాద రాజ్యం, పెట్టుబడి, దానికనుగుణంగా రూపుదిద్దుకుంటున్న జన సమ్మత సంస్కృతి (పాపులర్‌) పాత్ర వీటి ఏర్పాటులో చాలా కీలకం. ఆయా ధోరణులకు ప్రధాన భూమిక అయిన ‘వ్యక్తి వాదం’ (ఇండివిడ్యువలిజం), ఇదే పెట్టుబడి, రాజ్యం జరుపుతున్న హింస, విధ్వంసం మధ్యలో రూపుదిద్దుకుంటున్న పరిణామం. ఒక పక్క ప్రజల నివాస, భూమి, ఆవాస హక్కుల్ని కాలరాస్తున్న నయా ఉదారవాద పెట్టుబడి, రాజ్యం, సంస్కృతి అదే సమయంలో వ్యక్తిగత లైంగిక హక్కుల్ని-ముఖ్యంగా వ్యక్తిగతాన్ని, పరస్పర అంగీకారయుతమైన సంబంధాల్ని ఎలా, ఎందుకు వ్యవస్థీకృతం చేస్తోందనే ప్రశ్న రావడం సహజం. ఇక్కడ మనం గుర్తించాల్సింది, 1990 తర్వాత జరిగిన, జరుగుతున్న రాజకీయ, ఆర్థిక, సామాజిక పరిణామాల వల్ల ఒక పక్క హింస, నియంత్రణ పెరుగుతుంటే, మరో పక్క ప్రగతిశీలమైన పరిణామాలు కూడా జరుగుతున్నాయి. ఈ వైరుధ్య భరిత వాస్తవాన్ని అర్థం చేసుకోవటమే ఈ ఉపన్యాసం యొక్క ముఖ్య ఉద్దేశం.

మన కళ్ళముందే ఈ వైరుధ్యభరిత వాస్తవం ప్రతి రోజూ ప్రత్యక్షమవుతోంది. అంతర్జాలం ద్వారా వచ్చిన లైంగిక సమాచార విప్లవం, దానితో వెల్లువలా వచ్చిన పోర్నోగ్రఫీ, ఒక పక్క లైంగిక వికృతాలకు దారితీస్తూనే, మరో పక్క లైంగికత పట్ల ఉండే పాత భయాల్ని బద్దలు కొట్టి, లైంగికానందం ఒక అవసరం… ఇంకా చెప్పాలంటే మా హక్కు అనే అవకాశం పురుషులతో పాటు సమ లైంగికులకు, స్త్రీలకు కూడా కల్పిస్తోంది. లైంగిక చర్య/శృంగారానికి అవతలి వ్యక్తి అంగీకారం అవసరమనే భావ ప్రచారానికి కూడా ఎంతో కొంత తోడ్పడుతుంది. రెండవది, ఫేస్‌బుక్‌ వంటి సామాజిక మాధ్యమాలు స్వయం ఆరాధనకు ఒక పక్క తెర తీస్తూనే, మరో పక్క భిన్నరకాల లైంగిక అస్తిత్వ భావాలకి పునాదులు కూడా ఏర్పరుస్తున్నాయి. ఫోటోలు షేర్‌ చేసుకోవటం కావచ్చు, తమలాంటి వాళ్ళు ఎంతో మంది

ఉన్నారనే ఎరుక పెరగటం కావచ్చు, తమ జీవితం విధిస్తున్న నిర్బంధంలోనే కాకుండా వేరే రకంగా జీవించొచ్చని అర్థమయ్యి కలిగే ఆశ కావచ్చు… ఇలా అంతర్జాలం ఇస్తున్న వెసులుబాటు వల్ల కుటుంబం, కుల సమాజం బలంగా నిర్దేశించి, అమలుపరిచే కట్టుబాట్లు, ముఖ్యంగా ఎవరితో ఎవరు కలవచ్చు అన్న విషయం గురించిన నియమాలు సడలుతున్నాయి. బహుశా పెరుగుతున్న కుల హత్యలు, ఖాప్‌ హత్యలు, సామూహిక అత్యాచారాలు ఈ కదలికని తట్టుకోలేని చర్యలే కావచ్చు. ఒక రకంగా చెప్పాలంటే కన్పిస్తున్న ఈ వైరుధ్యాలు భారతీయ సమాజంలో వేళ్ళూనుకున్న పెత్తందారీ భావజాల ఊగిసలాటని, దాని నేపథ్యంలో రూపుదిద్దుకుంటున్న లైంగిక హక్కుల స్పృహని మన కళ్ళ ముందుకు తెస్తున్నాయి. మనమనుకున్న రీతుల్లో కాకుండా లైంగిక హక్కుల స్పృహకి దారులు ఏర్పడుతున్నాయని గుర్తించాల్సిన సమయం వచ్చింది. అయితే, హక్కుల కార్యకర్తలుగా కానీ, హక్కుల వ్యవస్థీకరణ గురించి ఆలోచించేవారు గానీ ఈ వైరుధ్యభరిత వాస్తవాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?

మొదట మనం చర్చించుకోవాల్సింది లైంగికతకు సంబంధించిన ‘హక్కులు’ ఎవరు, ఎక్కడ, ఏ సందర్భంలో ఎలా వ్యక్తీకరిస్తున్నారు అన్న ప్రశ్నలు. సాధారణంగా మనం ఎవరు అన్న ప్రశ్నలో పరిగణించే జెండర్‌, కులం, వర్గం, లైంగిక ధోరణులే కాక, అసలు లైంగికత క్రియాశీలకంగా ఆయా సంఘటనల్లో ఎలా వ్యక్తీకరింపబడుతోంది అన్న విషయం కూడా ప్రత్యేకంగా గమనించాలి. ఎక్కడ అన్న ప్రశ్నని కూడా ఒక ఫిజికల్‌ స్పేస్‌కి సంబంధించినదిగా మాత్రమేకాక అంతర్జాలం, మీడియా వంటి వర్య్తువల్‌ స్పేస్‌తో కూడా కలిపి అర్థం చేసుకోవాలి. నాకిచ్చిన చర్చనీయాంశంలో వేధింపులు, హింస భాగం కాబట్టి ప్రధానంగా అటువంటి సందర్భాలనే తీసుకుని ఈ ప్రశ్నల్ని చర్చించుకుందాం. మనం దీన్ని గత ఇరవయ్యేళ్ళలో జరిగిన వివిధ రకాల సంఘటనల్లో ఎక్కడినుంచయినా మొదలుపెట్టొచ్చు కానీ, ప్రధాన స్రవంతి చర్చల్లోకి వచ్చి, ఎంతో కొంత నన్ను ప్రభావితం చేసిన సంఘటనలని తీసుకుని చేస్తే బాగుంటుందని నాకనిపించింది. ఆ రకంగానే మొదలు పెడతాను.

వాటిలో మొదటిది, 2012 నుండి హర్యానా రాష్ట్రంలో వెల్లువలా బయటికొస్తున్న దళిత అమ్మాయిలపై జరుగుతున్న సామూహిక అత్యాచారాలు (ఇప్పటికివి అందరు స్త్రీలకు పాకాయనుకోండి). ప్రధానంగా జాట్‌ కులానికి చెందిన యువకులు చేస్తున్న ఈ లైంగిక అత్యాచారాలని అక్కడి దళిత సంఘాలు, కుటుంబాలు పెద్ద ఎత్తున బహిరంగ పరిచాయి. ఈ అమ్మాయిలందరూ దాదాపు చదువుకుంటున్న వాళ్ళే. స్కూలుకెళ్ళే దారిలో జరిగిన ఈ అత్యాచారాల్లో కొన్ని ఇరుగు పొరుగు వాళ్ళు చేసినవి ఉన్నాయి, కొన్నిట్లో మగ స్నేహితులు, తమ సహచరులతో కలిపి జరిపినవి ఉన్నాయి. కొంతమంది అమ్మాయిలని ‘జీన్స్‌’ వేసుకున్నందుకు టార్గెట్‌ చేసిన సంఘటనలు కూడా

ఉన్నాయి. వీటిని కుల అత్యాచారాలని నిర్వచించి దళిత కమ్యూనిటీ యాక్టివిస్టులు ఫిర్యాదుల నమోదుకు తీవ్రంగా ప్రయత్నించారు కొన్నిట్లో, అతి కొన్నిట్లో నమోదు చేయించగలిగారు. ఇక్కడ విషయం ఏమిటంటే, దళిత అమ్మాయిలు కుల వ్యవస్థ విధించిన కట్టుబాట్లు దాటి చదువుకోవటమే కాక ఇతర కులాలకు చెందిన అబ్బాయిలతో సమానంగా మాట్లాడి, స్నేహం చేయడం, దళిత కుటుంబాలలో పెరుగుతున్న విద్య, ఉద్యోగాలు, అక్కడి ఆధిపత్యకుల సమూహాలకు కంటగింపుగా పరిణమించాయని అక్కడి అన్ని ప్రజాస్వామ్య సంఘాలు చెప్తున్నాయి. మా అమ్మాయిలకి రక్షణ కల్పించాలని, అత్యాచారం చేసిన వారిని తగినంతగా శిక్షించాలని దళిత సంఘాలు, ఆయా కుటుంబాలు నిరసన చేస్తుంటే, జాట్లు, వాళ్ళ కుల పంచాయతీలు మాత్రం కేవలం అమ్మాయిలు హద్దు దాటి ప్రవర్తించడం వల్లే ఇవి జరుగుతున్నాయని ఇప్పటికీ వాదిస్తున్నారు. అమ్మాయిలు ‘హద్దులు’ దాటటం వాస్తవమే. ప్రకటిత రాజ్యాంగం అందరూ, ముఖ్యంగా స్త్రీలు, అదీ అణగారిన వర్గాల స్త్రీలు చదువుకోవాలని చెప్తుంటే, ఆధిపత్య కుల సమూహాలు తాము ఇన్నాళ్ళు విధించిన అప్రకటిత రాజ్యాంగం ద్వారా తమపై ఆర్థికంగా ఆధారపడిన దళిత, ఇతర అణగారిన సమూహాల పైన కుల, పితృస్వామ్య ఆంక్షలు, ఏ బట్టలు వేసుకోవాలి, ఎట్లా నడవాలి, ఏ తిండి తినాలి, ఎక్కడ చదవాలి, ఎట్లా నడుచుకోవాలి వంటి అన్నింటిపై విధించిన హద్దులు (దక్షిణ భారతదేశంలో కొంత ముందే జరిగిందీ ప్రక్రియ) సడలుతున్నాయి. దీనివల్ల కుల ఆధిపత్యానికి, దానిపై ఆధారపడిన కుల పురుషాహంకారానికి దెబ్బ తగులుతోందనడానికి ఈ అత్యాచారాలు, హత్యలు, నిరసన కారులపై దాడులు సూచన. రాజ్యాంగం, చట్టం గుర్తించిన స్త్రీలపై జరిగే శారీరక, లైంగిక హింసకి సంబంధించి ప్రజారంగంలో చర్చ ప్రధానంగా ఇప్పటికీ బాలికలు, యువతులు, స్త్రీలు పాటించాల్సిన ‘హద్దుల’ చుట్టూ తిరగటం బాధాకరమే అయినా, ఇక్కడ గమనించాల్సిన విషయం దళిత సమూహాలపై, స్త్రీలపై కుల నియంత్రణ సడలడం.

ఈ సంఘటనలు దేశంలో మిగిలిన వారిని పెద్దగా కదిలించలేదు కానీ, 2012 డిసెంబర్‌లో ఢిల్లీలో ఫిజియోథెరపీ విద్యార్థిని జ్యోతి సింగ్‌పై జరిగిన క్రూరమైన, సామూహిక అత్యాచారం. బహుశా ఢిల్లీలో జరగడం వల్ల కాబోలు, అందర్నీ కదిలించింది. తన స్నేహితుడితో కలిసి సినిమా చూసి ఇంటికి తిరిగొస్తున్న విద్యార్థినిపై జరిగిన ఈ ఘటన దేశంలోని యువతరాన్ని కుదిపేసింది. ఎందుకు? బహుశా, చాలామంది వాళ్ళిద్దరిలో తమని తాము చూసుకుని, అటువంటి పరిస్థితుల్లో తాము కూడా ఉండి ఉండొచ్చని అనుకున్నారు. అత్యాచారం చేసిన వాళ్ళు క్రింది వర్గానికి చెందిన వారు కావటం కూడా ఈ కోపానికి ఒక ప్రధాన కారణం కావచ్చని విశ్లేషకులన్న మాట కూడా నిజమే. మధ్య తరగతి అమ్మాయిలు రాత్రి పూట స్వతంత్రంగా తిరిగితే ఏం జరుగుతుందన్న తల్లిదండ్రులు భయపడి, వారిని భయపెడతారో అటువంటి సంఘటన జరగటం, అత్యాచారం అనగానే రోడ్డు మీద పనీ పాటా లేని అపరిచిత పోరంబోకులు పెళ్ళి కాని యువతులపై లైంగిక ఉద్రేకంతో చేసేదనే బలమైన నమ్మకం నిజమవటం రెండూ కూడా ఈ కలవరానికి తోడ్పడ్డాయి. అత్యాచారానికి పాల్పడిన ఈ మగవాళ్ళు ఎవరు? ఢిల్లీ చుట్టుపక్కల రాష్ట్రాల నుండి మహా నగరంలో పని చేయడానికి వేలమంది యువకులు, కుటుంబాలు అక్కడికి వలస వస్తుంటారు. ఈ ముగ్గురూ అటువంటి కుటుంబాలకి చెందిన వాళ్ళు. తమ రోజువారీ జీవితంలో ఎటువంటి హక్కులు, వెసులుబాటు లేని చాకిరీతో కూడిన పనిచేసే ఈ అసంఘటిత వలస శ్రామికులు, వాళ్ళల్లో కొందరికి అటువంటి అణచివేత నుండి బయటినుండి థ్రిల్‌ పొందటానికి ఖాళీ రవాణా వాహనాలు ఉపయోగపడుతున్నాయని; వలస కారణంగా పట్టణంలో తాము కోల్పోయిన పురుషాధికారాన్ని ‘స్వేచ్ఛగా’ తిరుగుతున్న స్త్రీల మీద అత్యాచారాలు చేసి తిరిగి పొందుదామని చూస్తున్నారని కూడా విశ్లేషకులు చెప్పారు. ఢిల్లీకి చదువు కోసం వచ్చిన జ్యోతి సింగ్‌ వంటి దిగువ మధ్య తరగతి అమ్మాయిలు తమ స్థాయిలో, నగరం ఇచ్చిన స్వేచ్ఛని

ఉపయోగించుకోవటం బహుశా వారికి కంటగింపు అయుండొచ్చు. అయితే ఈ సందర్భంలో అనేకమంది రాజకీయ నాయకులు తమ వ్యాఖ్యలతో తాము కూడా ఇదే పద్థతిలో ఆలోచిస్తున్నామని నిరూపించుకున్నారు. ‘ఆ అమ్మాయి ఆ సమయంలో ఎందుకు బయటుంది’, ‘ఆ అబ్బాయితో ఎందుకుంది’ అంటూ వయసొచ్చిన అమ్మాయిలని స్వతంత్రులుగా అంగీకరించలేమని చెప్పకుండా చెప్పారు.

వీరి ఆలోచనలు ఈ సందర్భంలో దేశవ్యాప్తంగా జరిగిన నిరసనల్లో పాల్గొన్న యువతుల ఆలోచనలకి పూర్తి భిన్నంగా ఉన్నాయి. అనేకమంది చదువుకుంటున్న యువతులు, ప్రజా రవాణా సౌకర్యాలు, వసతుల్ని మెరగుపరచాలని, అవి 24 గంటలూ అందుబాటులో ఉంటే స్త్రీలు సురక్షితంగా ప్రయాణించొచ్చనీ, వీథుల్లో, బస్సు స్టాపుల్లో లైట్లు ఉండాలని, అలాగే రక్షణ పేరుతో స్త్రీల కదలికల మీద నిబంధనలు పెట్టటం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని, దాని బదులు వారికి అవసరమయిన సెక్యూరిటీ పెంచాలనీ, పోలీసులు యువతులపై నిఘా కాకుండా వారి రక్షణ కోసం అవసరమయ్యే పోలీసింగ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. లైంగిక హింసని నియంత్రించాలంటే ‘రక్షణ’ పేరుతో యువతులని మళ్ళీ కుటుంబం, కమ్యూనిటీ, సమాజ నిర్బంధానికి లోను చెయ్యటం సరయిన పరిష్కారం కాదని బలంగా చెప్పారు.

కానీ వారడిగింది ఒకటయితే, జరిగింది మాత్రం మరొకటి. జాతీయ స్థాయిలో ఈ రెండు సంఘటనల్లో ప్రధానంగా, స్పష్టంగా వ్యక్తమయింది యువతీ యువకుల లైంగికత, ముఖ్యంగా యువతుల లైంగికత గురించిన ఆందోళన. కొంతమంది తల్లిదండ్రులు వారి భద్రత గురించి భయపడితే, చాలామంది ఎవరి నియంత్రణ లేని స్వతంత్రులయిన అమ్మాయిలు తిరక్కూడని వారితో తిరుగుతారని, దానివల్ల ‘సమాజానికే’ తీవ్ర నష్టం జరుగుతుందని అత్యంత ఆందోళన చెందారు. వారిపై, వారి కదలికలపై నియంత్రణ అవసరమని భావించారు. కొన్ని కళాశాలల్లో యూనిఫామ్‌ ప్రవేశపెట్టారు. కొన్నిట్లో బస్సులు ప్రవేశపెట్టారు. హాస్టళ్ళలో సిసి టీవీ కెమెరాలు పెట్టారు, కాలేజీల్లో యువతులపై కర్ఫ్యూలు విధించారు. ఇదే వరసలో రాజకీయ నాయకులేమో వసతులు కల్పించే, మెరుగుపరిచే విషయం పక్కనపెట్ట లైంగిక నేరాల చట్టం కఠినతరం చేయడానికి పూనుకున్నారు. ఇంకా చేస్తూనే ఉన్నారు. పోలీసింగ్‌లో భాగంగా ఉత్తరప్రదేశ్‌ వంటి చోట్ల ‘రోమియో స్క్వాడ్‌’ పేరుతో బహిరంగ ప్రదేశాల్లో యువతీ యువకుల కదలికలపై నియంత్రణ పెంచారు.

ఈ రెండు రకాల ఘటనల్లో స్వయంగా బాధితులయిన వారి గొంతులు, బ్రతికి బయటపడిన హర్యానా దళిత బాలికలపైన తీవ్ర ఒత్తిడి, అణచివేత వల్ల కావచ్చు, జ్యోతి సింగ్‌ మరణించడం వల్ల కావచ్చు, పెద్దగా వినిపించలేదు. కానీ, తొందర్లోనే అటువంటి రెండు ఘటనలు ఈ తరం స్త్రీల గొంతుల్ని ముందుకు తెచ్చాయి. ఎంత దగ్గరివారయినా సరే, లైంగిక సంబంధాల్లో ‘అంగీకారం’ ఉండాలని పెద్ద ఎత్తున చర్చని లేవనెత్తాయి. ఇవి రెండూ మన ప్రగతిశీల సర్కిల్స్‌ గురించే అవటం కాకతాళీయం కాదు కూడా. మన దగ్గరి స్త్రీ వాద ఉద్యమం 1970ల నుండి ప్రగతిశీల సముదాయాల్లో, అంటే అప్పట్లో కమ్యూనిస్టు నేపథ్యం నుండి, ఇంకా పార్టీల్లో కూడా కొనసాగే పితృస్వామ్య ధోరణులు, స్త్రీల లైంగికత పైన అమలయ్యే నిఘా, కొన్ని సందర్భాల్లో పురుషుల అభ్యంతరకర ప్రవర్తన, అత్యాచారాల గురించి బాగానే చర్చని లేవదీస్తూ వచ్చింది. అయితే 2000 సంవత్సరం నుండి ఇప్పటికి రెండు కీలక పరిణామాలు జరిగాయి. మొదటిది, స్త్రీ పురుష సంబంధాలలో స్త్రీల స్పష్టమైన అంగీకారం లేకుంటే ఆయా సంబంధాలని వేధింపులుగానో లేక దాడి లేక హింసగానో పరిగణించాలని, ఆయా పురుషులు ఎంత దగ్గరి వాళ్ళు, స్నేహితులు, గురువులు, చివరికి భర్తలు అయినా సరే అన్న భావన క్రమంగా ప్రజారంగంలో చర్చలోకి వచ్చింది. 2013 నుండి ఈ భావన లైంగిక హింస, వేధింపులకు సంబంధించిన చట్టాల్లో కొంతమేరకు భాగం కూడా అయింది. రెండవ మార్పు, అప్పట్లో ప్రగతిశీల సర్కిల్స్‌కి మాత్రమే పరిమతమైన ఈ చర్చ ఇప్పుడు ఎంతో కొంత ప్రధాన స్రవంతిలో భాగంగా జరుగుతోంది. పురుషుల కోరికలు తీర్చుకోవడానికి స్త్రీలు ఒక సాధనం కాదనీ, స్త్రీల ఇచ్చ, స్వతంత్రత ప్రధానమని స్త్రీవాద ఉద్యమం కలిగించిన స్పృహ ఈ దశాబ్దంలో జరిగిన లైంగిక హింస, వేధింపులకి సంబంధించిన చర్చల్లో భాగంగా ప్రధాన స్రవంతిలోకి రావటం ఆసక్తికరమైన పరిణామం. ఆయా స్త్రీలు పురుషులతో లైంగిక సంబంధాలకి అంగీకరించినా ఆ ”అంగీకారం” ఇచ్చేలా చేసే పరిస్థితులు, దాని సాధ్యాసాధ్యాలు, రాజకీయాలు, అలాగే స్త్రీల అంగీకారం స్వచ్ఛందంగా ఉండాలంటే ఎటువంటి పరిస్థితులు పని స్థలాల్లో, స్నేహ సంబంధాల్లో, కుటుంబంలో కల్పించాలన్న విషయానికి సంబంధించిన చర్చ అంత తేలిగ్గా అర్థ¸మయ్యేది కాదని మనకి క్రింద చర్చించుకునే సంఘటనలు తెలుపుతాయి.

మొదటి సంఘటన ఢిల్లీలో ప్రగతిశీల సర్కిల్‌లో అందరికీ తెలిసిన చరిత్రకారుడు, కళాకారుడు అయిన మహమూద్‌ ఫారూఖీ తనని వేలితో అత్యాచారం చేశాడని ఆయన స్నేహితురాలు పోలీసులకి ఫిర్యాదు చేయడం, దిగ్భ్రాంతికి గురయిన బాధితురాలు తన స్వంత దేశమైన అమెరికాకి వెళ్ళి మూడు నెలల తర్వాత తిరిగొచ్చి ఫిర్యాదు చేసినప్పుడే విషయం బయటికొచ్చింది. 2013లో మార్చిన చట్టంలో అనుమతి లేని ఈ లైంగిక చర్యను అత్యాచారంగా నిర్వచించారు. అహంకార పూరిత నమ్మకంతో ఆ స్త్రీ ఇష్టం, అనుమతి లేకుండా చేస్తే దాని పర్యవసానాలు ఆ స్త్రీపై ఎలా ఉంటాయో బాధితురాలు ఇలా వర్ణించింది. ‘నా శరీరంపై నాకు మాత్రమే పూర్తి అధికారం ఉండాలి. నేను వద్దంటే లైంగిక చర్యకు పాల్పడిన తర్వాత, నా శరీరంపై నాకే నియంత్రణ లేకుండా పోయినట్లే కదా. ఇది నేను భరించలేను. నా అనుమతి లేకుండా చేశాడు కాబట్టే, నా కిష్టమైన, గౌరవించే వ్యక్తి అయినప్పటికీ నేను ఫిర్యాదు చేస్తున్నాను’ అని ఒక స్నేహితురాలి ద్వారా ప్రపంచానికి తెలియచేసింది. ఇటువంటి అత్యాచారాన్ని ఇతర అత్యాచారాలతో పోల్చి చూడడం కష్టమని కొంతమంది సీనియర్‌ స్త్రీ వాదులు అభిప్రాయపడ్డారు. అతనికి సెషన్స్‌ కోర్టులో శిక్ష పడినప్పుడు బాధితురాలి వాంగ్మూలం తప్ప ఇతర సాక్ష్యాలు చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయనకి శిక్ష వేయడం తప్పని మనీషా సేథీ వంటి మానవహక్కుల కార్యకర్త వ్యాసం రాశారు. నాతో సహా చాలామంది దీన్ని నమ్మటం కష్టమని, సరయిన సాక్ష్యాలు లేకుండా అతనికి శిక్ష వేయడం, అతడు ఒక ముస్లిం కాబట్టే జరిగిందని భావించాం. ఇటువంటి శిక్షలు 2013లో వచ్చిన లైంగిక దాడుల చట్టం వల్ల రాజ్యాధిపత్యం తీవ్రతరం అయిందన్న అభిప్రాయాన్ని బలపరుస్తోందని అభిప్రాయపడ్డాం. వీటిలో కొన్నింటికి నేనిప్పటికీ కట్టుబడే ఉన్నాను కానీ, నా అభిప్రాయాన్ని సరిదిద్దుకోవలసిన అవసరం నా యువ స్నేహితులు కల్పించారు. వారిలో హైద్రాబాద్‌ ఫర్‌ ఫెమినిజం ఫేస్‌బుక్‌ నడిపే తేజస్విని మాడభూషి ఒకరు. ఆమెతో సహా ఆ సందర్భంలో నాకున్న యువ స్నేహితులు అందరూ ఫారూఖీని శిక్షించిన ఆ తీర్పుని హర్షించటమే కాక, ఈ రకంగా వద్దంటున్నా వాళ్ళనుకుంటున్న లైంగిక చర్యకి పాల్పడే మగవాళ్ళు చాలామంది తమకి తెలుసనీ, వారి ప్రవర్తన వల్ల తీవ్రంగా క్షోభపడ్డ యువతులు అనేక మంది ఉన్నారని, అటువంటి మగవాళ్ళందరికీ ఇటువంటి తీర్పు ఒక గుణపాఠమని ఫేస్‌బుక్‌లో రాశారు. అంతేకాదు, నాలా ఆలోచించే పాత తరం స్త్రీ వాదులని విమర్శించారు, కోపగించుకున్నారు కూడా. అత్యాచారాలు ఎక్కడో దూరంగా కాక, దగ్గరి వాళ్ళు, ప్రగతిశీల పురుషులు కూడా చేస్తున్నారని ఎత్తి చూపారు.

2017లో తమ దగ్గర పనిచేసిన విద్యార్థినులని లైంగికంగా వేధించిన ప్రగతిశీల ప్రొఫెసర్ల లిస్టు వెలువడడం అకడమిక్‌ సర్కిల్స్‌లో ఉండే నావంటి వారిని ఇంకొకసారి కుదిపేసింది. అమెరికాలో, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ‘మీ టూ’ ఉద్యమం సందర్భంలో వెలువడింది లిస్టు. ”నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను” అని సామాజిక మాధ్యమాల్లో లక్షలాది మంది స్త్రీలు రాసిన సందర్భం అది. మన దేశంలో వచ్చిన లిస్టు బాధితుల పేర్లు లేకుండా వేధించిన అధ్యాపకుల పేర్లు బయటపెట్టింది. దానిలో ఎవరి సిద్ధాంతాలనయితే అందరూ సైట్‌ చేస్తామో వారి పేర్లు చాలా ఉన్నాయి. చాలామంది వామపక్ష భావజాలంలో పనిచేసేవాళ్ళే. వారి పుస్తకాలు, ఆలోచనలు అందరికీ స్ఫూర్తినిచ్చేవే. ఈ లిస్టులో ఎక్కనివాళ్ళు చాలామందే ఉన్నారు కానీ, ఇలా బహిరంగంగా పేర్లు చెప్పడం అందరిలో కొంచెం భయమయితే కలిగించింది. కొంతమంది హాస్పిటల్లో చేరారని కూడా విన్నాం. వీరిలో కొంతమందిపై ఆ తరువాత వారు పనిచేసే సంస్థల్లో ఫిర్యాదులు కూడా నమోదయ్యాయి. ఆ తర్వాత మన హైద్రాబాద్‌లోనే, నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌లో ఒక దళిత పరిశోధక విద్యార్థిని ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసింది. కేరళలో దళిత మహిళా కార్యకర్తలు తమ తోటి ప్రగతిశీల, దళిత యాక్టివిస్టుల నుండి తాము ఎదుర్కొన్న వేధింపుల గురించి బహిరంగంగా రాశారు. ఇప్పుడు మీడియాలో లైంగిక వేధింపులపై చర్చ నడుస్తోంది.

అయితే చట్టం దగ్గరకు, లైంగిక వేధింపుల వ్యతిరేక కమిటీల దగ్గరకు వెళ్ళకుండా ఈ రకంగా పేర్లు బయట పెట్టడం ఏ రకంగా సరైందని స్త్రీ వాదుల్లోనే కొంతమంది అభ్యంతరం లేవదీశారు. కష్టపడి సాధించుకున్న చట్టాలు, కమిటీలు వదిలేసి, ఈ రకమైన లిస్టులు తయారుచేయటం మనల్ని మనమే ఓడించుకున్నట్లని అభిప్రాయపడ్డారు. కానీ ఇంతకన్నా, ఈ చర్చలో బయటపడిన ముఖ్యమైన విషయమేమిటంటే, అకాడమిక్‌ వాతావరణంలో అధ్యాపక స్థానంలో ఉండి, కొత్త ఆలోచనా ప్రపంచాలని విద్యార్థులకి చూపించే పురుషులకుండే ఆకర్షణ శక్తి. దీనికి వారు విద్యార్థుల భవిష్యత్తుని నిర్దేశించే అధికారం తోడయితే ఈ మూడింటి కలయిక విద్యాలయాల్లోనే కాదు, ఎక్కడయినా సమస్యా పూరితమే. విద్యార్థులు మొదటి తరం వాళ్ళయితే, మరెంత కష్టం! విద్యార్థినులు తమకి అధ్యాపకులతో శారీరక సంబంధానికి అంగీకారం ఉందని చెప్పినా, ఇష్టమేనని చెప్పినా సరే, అది ఎటువంటి అంగీకారం, ఇష్టం అనే ప్రశ్న వేసుకోవాలి. మన దగ్గర అతి కొద్ది యూనివర్శిటీల్లోనే లైంగిక వేధింపుల కమిటీలు ఉన్నాయి. వాటిల్లో కూడా కొన్నే పనిచేస్తున్నాయి. వాటిల్లో మంచిగా పనిచేస్తాయని పేరు తెచ్చుకున్న అతి కొద్ది లైంగిక వేధింపుల కమిటీలు కూడా సీనియర్‌ ప్రొఫెసర్ల దగ్గరికొచ్చేటప్పటికి చతికిలపడిపోతాయని ఈ చర్చలో బయటికొచ్చింది. లిస్టుపై చర్చ విద్యార్థులు, అధ్యాపకులు ఎంత దగ్గరగా తిరిగినా, కలిసి పనిచేసినా, వారిద్దరి మధ్య శారీరక సంబంధాలు అధికార సంబంధాలేననీ, ఈ విషయాన్నీ దృష్టిలో పెట్టుకుని అధ్యాపకుల బాధ్యతని పునర్నిర్వచించాల్సిన అవసరం ఉందని చెప్పింది.

వీటిలో కొత్తేముంది. లైంగిక వేధింపులు, అత్యాచారాలు, ఎప్పటినుండో ఉన్నవీ, మనకు తెలిసినవే కదా అని కొంతమంది అనొచ్చు. కానీ ఇప్పటివరకు మనమేం చేయగలిగాం? ఆడవాళ్ళమందరం మనలో మనం ‘వాడు వెధవ, వీడు చెడ్డోడు జాగ్రత్త’ అని ఒకళ్ళకొకళ్ళు వెనక వెనక చెప్పుకున్నాం. మగవాళ్ళమయితే ‘రేయ్‌, మనోడు చాలా రసికుడు’ అనీ, కొంచెం సిద్ధాంతం తెలిసినవాళ్ళు ‘అది ప్రైవేటు విషయం, మనం రాజకీయాల్లో మోరలిస్టిక్‌గా ఉండకూడదు’ అంటూ సూక్తులు చెప్పుకుంటూ వచ్చాము. ఇప్పటికీ మన ప్రగతిశీల సర్కిల్స్‌లో గానీ, మన సంస్థల్లో గానీ, లైంగిక వేధింపులకు పాల్పడే వాళ్ళని బహిరంగంగా, నిర్ద్వంద్వంగా ఖండించే సంస్కృతి మనం పెంపొందించుకోలేదు. కొంత సమస్యాపూరితమయినా సరే, ఆపకుండా అన్ని వేదికల్లో అరిచి, గగ్గోలు పెట్టి, అది పెంపొందించాల్సిన అవసరం తీసుకొచ్చింది ఇప్పటి యువతరానికి చెందిన స్త్రీలే.

నా ఉద్దేశంలో లైంగికతపై ఇప్పటి చర్చలు 1990లలో జరిగిన చర్చలకంటే భిన్నమైనవి. అప్పటి చర్చలు ముఖ్యంగా స్త్రీల లైంగికతపై కుటుంబ నియంత్రణ, కొంతమేరకు పార్టీ నియంత్రణ గురించి అగ్ర కులాలకు చెందిన, మధ్య తరగతి వివాహిత స్త్రీలు లేవదీసినవి. 1990ల చివర్లో స్త్రీల శరీరాల్ని వస్తువులుగా మారుస్తున్నారనే చర్చ ఆర్థిక సంస్కరణల నేపథ్యంలో అందాల పోటీలకు వ్యతిరేకంగా వచ్చింది. ఇవి కాకుండా, చాలావరకు లైంగిక హక్కుల గురించిన చర్చలు రాజ్యం, అగ్ర కులాలు, సైన్యం చేస్తున్న అత్యాచారాల నేపథ్యంలోనే జరుగుతూ వస్తున్నాయి. ఆయా ఉల్లంఘనల్లో స్త్రీల పట్ల సానుభూతి కూడగట్టడం కొంతమేరకు సాధ్యమే కానీ, ఇప్పటి సంఘటనల్లో అటువంటి సానుభూతి అంత తేలిగ్గా కూడగట్టలేము. ఇప్పటి చర్చలు వివాహ వ్యవస్థ బయట స్త్రీలు, పురుషులతో కలిసి తిరిగే, పనిచేసే సందర్భాల్లో – ముఖ్యంగా పని స్థలాల్లో, విశ్వవిద్యాలయాల్లో, లేదా స్నేహ సంబంధాలు, ప్రేమ సంబంధాల నేపథ్యంలో వస్తున్నాయి. స్త్రీలు కూడా తమ స్వేచ్ఛను, స్వాతంత్య్రాన్ని ఎంతో కొంత ఉపయోగించుకుంటున్న సందర్భాల్లో వస్తున్న వేధింపులు, అత్యాచారాలు, హింస, అంతే కాదు మారుతున్న సమాజంలో స్త్రీ పురుష సంబంధాలు ఏ ప్రాతిపదికన ఉండాలి అన్న చర్చ జరుగుతున్న సందర్భంలో వస్తున్న హింస ఇది.

కానీ తెలుగులో ప్రధాన స్రవంతిలో ఈ విషయాలపై చర్చ ప్రధానంగా పాత నైతికత ప్రాతిపదికనే కొనసాగుతోందని రెండు సంఘటనల్లో స్పష్టమయింది. 2017 జనవరిలో మన దగ్గర అర్థరాత్రి ఒక టెలివిజన్‌ ఛానల్‌ విలేఖరి పెద్ద స్థాయిలో ఉన్న మహిళా పోలీసు అధికారి ఇంట్లోకి, ఆమె భర్త, తల్లితోపాటు బలవంతంగా ప్రవేశించి ఆమె పడక గదిలోకే కాక, బాత్రూంలోకి కూడా ప్రవేశించాలని ప్రయత్నించాడు. ఎందుకాయన అంత ఉత్సాహ పడిపోయాడు? ఆమెనుండి విడిపోయిన భర్త, ఆమె వేరే వ్యక్తితో సంబంధం పెట్టుకుందని అనుమానపడి టెలివిజన్‌ ఛానల్‌కి చెప్తే వాళ్ళు వెంటనే కెమెరామెన్‌ను పంపించేశారు. ‘బ్రేకింగ్‌ న్యూస్‌’ అంటూ వేసేశారు. ఆ ఛానెల్‌ని చూసి మరొక పది ఛానళ్ళు మాకెక్కడ టీఆర్పీ పడిపోతుందోనని అవాకులు, చవాకులు, అబద్ధాలను శాయశక్తులా ప్రసారం చేసేశారు. ‘రెడ్‌హాండెడ్‌గా పట్టుబడింది’ అని హెడ్డింగ్స్‌ పెట్టడంతో ఆమెని, ఆమె స్నేహితుడైన మరొక పోలీస్‌ ఆఫీసర్‌ని సస్పెండ్‌ చేశారు. ఎవరూ కూడా వ్యక్తిగత విషయంలో మీడియాకి అక్కడ పనేంటి అన్న ప్రశ్న వేసుకోలేదు. ఒంటరిగా ఉన్న స్త్రీ ఇంటిలోకి బలవంతంగా ప్రవేశించటం వేధింపుల కిందకి రాదా అని మహిళా సంఘాలు అడిగితే కోపం కూడా తెచ్చుకున్నారు. ఎందుకంటే, ఆ నైతిక పోలీసింగ్‌ తెలుగు మీడియా ఛానళ్ళకి పదేళ్ళుగా అలవాటైపోయింది మరి. దశాబ్దంగా ఒంటరి స్త్రీలను వేటాడి, వేధించి, వాళ్ళని వ్యభిచారులని, తాగుబోతులని బహిరంగంగా అవమానించటం, మహిళల ఫిర్యాదులతో రెండవ భార్యలని, భర్తలని వేటాడి ప్రయివేటు జీవితాలను సరుకుగా మార్చుకోవటం – వాటిద్వారా తమ సామాజిక పెత్తందారీ అధికారాన్ని ఛానళ్ళు స్థాపించుకున్నాయి.

వాటికి మహిళా సంఘాల వ్యతిరేకత అస్సలు రుచించలేదు. ఆమె తోటి పోలీసు ఆఫీసర్‌ భార్యని గన్‌ పెట్టి బెదిరించిందని, ఆమెకి ఆ స్నేహితుడితో అక్రమ సంబంధం ఉందని, మహిళా సంఘాలు అతని భార్యకి మద్దతునివ్వాలి తప్ప, ఈమెకి ఇవ్వకూడదని ఇలా అనేక రూమర్లు ప్రసారం చేశారు. మహిళా సంఘాలకు బెదిరింపు వాట్సాప్‌ మెసేజ్‌లు పంపించారు. ఆంగ్లంలో వ్యాసం రాసిన ఒక స్త్రీ వాదిపై పరువు నష్టం దావా కూడా వేసిందో ఛానల్‌. పైగా, తామే మహిళా ఉద్యమాన్ని నడుపుతున్నామని, ఎవరూ పట్టించుకోని మహిళా సంఘాలను నిలబెట్టింది తామేనని కూడా ఉద్ఘాటించింది. ఆయా మహిళా సంఘాల కార్యకర్తల చీకటి జీవిత కోణాలు బయటపెడతామని బెదిరించింది. ఈ విషయంపై పరిశోధనా పత్రం సమర్పించిన ఒక మహిళా ప్రొఫెసర్‌కి పేరు లేని బెదిరింపులందాయి. ఇంతకీ విచిత్రమేమిటంటే, తెలుగులో ఏ మీడియా సంస్థల్లో కూడా ఏ రకమైన లైంగిక వేధింపుల కమిటీలు లేవు. ఆయా ఛానెళ్ళ ప్రగతిశీలత, నాన్సీ ఫ్రేజర్‌ చెప్పినట్లు, నయా ఉదారవాద పెట్టుబడి తన మనుగడ కోసం అరువు తెచ్చుకునే ప్రగతిశీలత మాత్రమేనని ఈ సందర్భంలో వారి విశ్వరూపంతో బయటపడింది.

ఇలాగే స్వతంత్రులుగా వ్యవహరించే స్త్రీలపై వేధింపులు, పెత్తనం ద్వారా సామాజిక పెత్తందారీ తనం సంపాదించుకున్న మరో రంగం సినిమా రంగమని అక్కడి స్త్రీల నిరసన ఎత్తి చూపింది. డబ్బు, స్వతంత్రం, గ్లామర్‌, పేరు ఉన్న స్త్రీలు తమకి వేధింపులు

ఉన్నాయని, న్యాయం జరగట్లేదని గొంతు విప్పితే, మూకుమ్మడిగా బెదిరించి ఆ గొంతులే ప్రజారంగంలో విన్పించకుండా చేసిన ఘనత మన తెలుగు సినీ పరిశ్రమది. ఆ నిరసన సందర్భంలో సినీ పరిశ్రమ స్పష్టం చేసిందేమిటంటే అక్కడ స్త్రీలు లైంగిక సరుకే కానీ ఆ సరుకు తాము గీసిన గీత దాటి మాట్లాడితే ఏ మాత్రం సహించమని. మహిళలు హీరోల దగ్గరో, డైరెక్టర్ల దగ్గరో, ప్రొడ్యూసర్ల దగ్గరో లైంగిక దాస్యం చెయ్యకపోతే పాత్రలు రావని అర్థనగ్నంగా నిరసన వ్యక్తం చేసిన శ్రీరెడ్డి పెద్ద దుమారమే లేపింది. ఆమె వెనక వచ్చిన అనేకమంది డైలాగ్‌ ఆర్టిస్టులు కూడా దారుణమైన పని పరిస్థితులు ఉన్నాయని, పై నుండి క్రింద దాకా అందరు పురుషులు తమని లైంగికంగా దోచుకుంటున్నారని వివరాలు, కొన్ని పేర్లతో సహా బయట పెట్టారు. శ్రీ రెడ్డితో సహా ఎవరూ కూడా తాము ఒకరితో మాత్రమే సంబంధం కలుగున్నవారమని అనలేదు. తమ శరీరాలు లైంగిక వస్తువులుగా తెరపై చూపటానికి వారికి పెద్ద అభ్యంతరం లేదు. తమ శరీరాలు ప్రేక్షకులని ఎలా కదిలిస్తాయో తెలుసని శ్రీరెడ్డి స్పష్టంగానే మాట్లాడింది. వాళ్ళన్నది ఒక్కటే, లైంగిక లొంగుబాటు పని దొరకడానికి షరతు కాకూడదని. అంతే, పరిశ్రమ మొత్తం ఒకే తాటిపై నిలబడి టెలివిజన్‌ ఛానెళ్ళని, వార్తా పత్రికలను బెదిరించి వాళ్ళ గొంతులు వినపడకుండా చేసింది. సామాజిక పితృస్వామ్యాన్ని బలంగా నిలబెట్టింది.

మీరనొచ్చు ఇవి ఎప్పటినుండో ఉన్నాయి, దీంతో కొత్తగా చర్చించుకునేదేముంది అని. కాస్టింగ్‌ కౌచ్‌ ఎప్పటినుండో ఉంది అనేది ఒప్పుకోవాల్సిందే. సినిమా రంగం నుండి మాట్లాడిన స్త్రీలకు ఎంతో కొంత ప్రజా మద్దతు దొరకడం కొత్త విషయాలే. అంతేకాదు, సినిమా రంగం స్త్రీలలో ఎవరూ కూడా నగరాల నుండి వచ్చినవాళ్ళు కాదు. రాజకీయాల్లో వాళ్ళకి పెద్దగా ఆసక్తి కూడా లేదు. వాళ్ళెవరూ స్త్రీ వాదులమని చెప్పుకోలేదు. కుల నిచ్చెనలో అన్ని మెట్ల నండి వచ్చి, పెద్దగా చదువు లేనివాళ్ళు, చిన్నప్పుడే వివిధ కారణాల వల్ల చదువుకి దూరమై, పెళ్ళిళ్ళు అయిపోయి, కుటుంబాల నుండి విడిపోయిన వాళ్ళు. పనిచేసేచోట హింసకి గురవ్వదలచుకోలేదని, అవమానకర పరిస్థితుల్లో, అన్యాయానికి గురవుతూ బ్రతకదలచుకోలేదని చెప్పారు. సినిమా పరిశ్రమలో వ్యక్తులుగా గౌరవంతో బ్రతకటం ఎందుకు సాధ్యం కాదని అడిగారు.

వ్యక్తిగత స్వేచ్ఛని వ్యక్తీకరిస్తున్న క్రమంలో హింసాత్మకమవుతున్న మరొక సాంఘిక పరిణామం, కులాంతర, మతాంతర వివాహాలు. వీటిని ఇదివరకు ప్రగతిశీల సంఘాలు, సంస్థలు ప్రోత్సహించి ఒక కార్యక్రమంగా చేసేవి గానీ, గత దశాబ్ద కాలంగా జరిగినవన్నీ దాదాపు వ్యక్తుల మధ్య ప్రేమతో జరిగినవే. వీరిలో ఎవరికీ కులాన్ని నిర్మూలించాలనే విశాల లక్ష్యాలు పెద్దగా లేవు. నిచ్చెన మెట్లలో పైనున్న

వాళ్ళు విరుచుకుపడి ఆయా దళిత (ఇతర వెనుకబడిన కులాల) అల్లుళ్ళని, ఇతర సొంత కూతుళ్ళని పొట్టన పెట్టుకున్నప్పుడు కూడా ఆయా యువతీ, యువకులు అడిగేది – తమకి ఈ పెద్ద పెద్ద సామాజిక శక్తులతో సంబంధం లేదనీ, తమ వ్యక్తిగత ఆకాంక్షల్ని గౌరవించమని. కుల హత్యలో భర్తని కోల్పోయిన ప్రణయ్‌ భార్య అమృత వర్షిణి కూడా అదే చెప్పింది. తెలంగాణ ఏర్పడిన నాలుగేళ్ళలో దాదాపు 35కు పైగా ఇటువంటి దాడులు, హత్యలు జరిగాయంటే, ప్రబలుతున్న కులాంతర వివాహాలని, వాటినాపాలని విశ్వ ప్రయత్నం చేస్తున్న ఈ హింస తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.

ప్రధాన స్రవంతి చర్చలో గానీ, పాపులర్‌ కల్చర్‌లో గానీ, ఇంకా చెప్పాలంటే ఉద్యమ సంస్కృతిలో కూడా సాధారణంగా వీటిని అడిగేవాళ్ళు, అడగగలిగే వాళ్ళు మగవాళ్ళే. మన సినిమాల హీరోలందరూ వ్యవస్థపై కోపగ్రస్తులైన మగవాళ్ళే.జనసమ్మత సంస్కృతి (పాపులర్‌ కల్చర్‌) లేదా ప్రజా సంస్కృతిలో క్రియాశీలురైన ఆడవాళ్ళను కొన్ని నమూనాల్లో అర్థం చేసుకుంటూ వచ్చాము. కుటుంబంలో స్థానం కోసం పోరాడే వాళ్ళు లేదా కుటుంబం, గ్రామం, కులంపై వ్యవస్థీకృత అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడేవాళ్ళు, ఇంకా చెప్పాలంటే, వ్యవస్థపైనే పోరాడే వాళ్ళు. కానీ ఇప్పటివరకు మనం చూసిన సంఘటనలలోని వివిధ రకాల స్త్రీలు, వారికి మద్దతు తెలుపుతున్న పురుషులు మాత్రం మా వ్యక్తిగత స్వేచ్ఛకి, కులం, పితృస్వామ్యంతో సహా ఎవరూ అడ్డు రాకూడదని ఆశిస్తున్నారు. వ్యక్తిగత స్వేచ్ఛ కోసం జెండర్‌, కులంతో సహా సమాజం పెట్టిన అడ్డంకుల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నారు.

అసలీ వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగతం ఎక్కడివి? ఇక్కడే మనం ఆయా స్త్రీలు, పురుషులు ఏ వ్యవస్థీకృత మార్పుల నుండి వస్తున్నారనే ప్రశ్న వేసుకోవాలి. భారతదేశం నిరంతరాయంగా అన్ని రంగాల్లో అమలు చేసిన నయా ఉదారవాద విధానాలు, అవి తెచ్చిన మార్పుల నుండే వ్యక్తిగత స్వేచ్ఛని ఈ రకంగా వ్యక్తీకరించే యువతీ, యువకులు వస్తున్నారని నా ప్రతిపాదన. ఆయా విధానాల వల్ల జరిగిన విధ్వంసం గురించి, అవి తెస్తున్న కొత్త వైరుధ్యాల గురించి అందరికీ తెలిసిందే. అయితే ఈ విధ్వంసం నేపథ్యంలోనే జెండర్‌, లైంగిక సంబంధాలు కూడా పునర్వ్యస్థీకరింపబడుతున్నాయని, శరీరం, లైంగికతల గురించి పాత పెత్తందారీ భావజాలాలు మారుతున్నాయని గుర్తించాలి. ఇప్పుడు ఆయా మార్పులని కొంచెం వివరంగా చర్చించుకుందాం.

మారుతున్న లైంగికత – కొత్త హక్కుల చర్చ పుస్తకం నుండి (ఇంకా ఉంది)

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.