అనుమతి లేని బతుకులు!? -అనిశెట్టి రజిత

 

నేను బడి నుండి ఇంటికి చేరుకొని చాయ్‌ తాగి మా ఊరి చివరన ఉన్న మా అడ్డాకు పోదామని బయలుదేరిన. చెప్పులు తొడుక్కుంటుంటే మా అమ్మ ‘ఎక్కడికిరా శంకరీ… గా ఉరేనియం అడ్డాకాడికేనా… ఏ రాత్రికొస్తవో… వాన కుమ్మరిచ్చేటట్టుంది జర జల్దిరా బిడ్డా’ అని ఇంటెనుక నుండి కేకేసింది. మొన్నటిరోజున ఉరేనియం తవ్వి మందిని సంపుతరంట గద, లొల్లిజేయనీకి మా ఆడోల్లను రమ్మంటరా శంకరీ అన్నది యాదికొచ్చి… ఇప్పుడు ‘ఉరేనియం’ అన్న మాటకు నాకు నవ్వొచ్చింది. ఆశ్చర్యానందమూ కలిగింది. డెబ్భై ఏండ్లకొచ్చిన మా అమ్మ జగ్గమ్మ కూడా ఈ సమస్యను ఇంతగ పట్టించుకొని ఆరాటపడుతున్నందుకు.

మా అడ్డాకు దూరంగ బండి దిగి అటు దిక్కు నాలుగడుగులు వేసేవరకు అక్కడ మా సంగన్న ఏదో తమాశా చేస్తున్నడు. గొంతులో ఏ సరుకు ఒంపుకున్నడో మనిషి ఊగుకుంట చేతిలో ఏదో కాగితం ముక్క పట్టుకుని ఏదేదో అంటున్నడు. నాకెంతో ఆత్మీయుడు సోదర సమానుడైన సంగన్న ఎప్పుడో తప్ప ఇట్ల ప్రవర్తించడు. ఏమయ్యిందో అన్న ఆత్రుతతో సంగన్నను చేరుకొని చేతిల కాగితం లాక్కున్న. ‘అరే పంతులూ చదువురా కాయితం… మహా బాగా రాసిన్రు మన బతుకు ఏం కానున్నదో చదువుర’ అని ఆవేశపడుతున్నడు. చదువుతగని నువ్వు కూర్చో అని కూర్చోబెట్టి నేనా కాగితం ముక్కను చదివిన. మనసుకెక్కలేదు… ”సంగన్నా ఏదన్న ఉంటే అందరం కలిసి మాట్లాడుకోవాలె… నువ్విట్ల ఊగుకుంట తమాశా చేసుడు బాగాలేదే..” అని మళ్ళీ ఒకసారి ఆ కాగితాన్ని చదివిన అర్థం చేసుకునేందుకు.

అది నిజమో, అబద్ధమో కానీ ఒక్కసారిగా నాలో నిర్వేదం, ఆవేదన కమ్ముకున్నది. ఏం తోచనట్టు ఆ చాయ్‌ అడ్డా షెడ్డు కింద గాలి ఆడనట్టయి ఆ పేపరు ముక్కతోనే గాలి ఊపుకుంటూ అక్కడ అదివరకే కూర్చున్న మా మిత్రులిద్దరిని అప్పుడుగానీ గమనించలేదు. పి.జి. చదువుకున్న సూర్యకిరణ్‌, దగ్గర్లోని గ్రామానికి సర్పంచ్‌ మల్లికార్జున్లు నా స్పందన కోసం చూస్తున్నరు.

… … …

సంగన్న గొంతు బిగ్గర మోగింది. ”చూసినావురా పంతులూ గీల్లు నమ్ముతలేరు గని ఎంత దుర్మార్గమో నాలుగు లైన్లున్న గా కాగితంల మన ప్రాంతపు నాశనమంతా నింపింన్లు, మన కాళ్ళకు నోళ్ళకు బేడీలేసింన్లు… ఇదేమన్న నూరేండ్ల నాటి బ్రిటిషోని రాజ్యమా… మనమేమన్న పరాయి దేశపోల్లమా… మనమెందుకు లొల్లిజేస్తున్నం, సంబురానికా… మన నల్లమల చుట్టూరా అక్రమ తవ్వకాలు జరుపుతున్నరని.. యురేనియం కోసం వేట మొదలుబెట్టిండ్రని కద… గిదేమన్న తప్పారా శంకరం. దీనికే అనుమతి తీసుకోవాల్నటరా. మన బతుకులు నాశనం చేయుమని వాళ్ళకు అనుమతి ఎవరిచ్చింరో”

సంగన్న ఇంకేదో మాట్లాడబోతుంటే ”నువ్వుండే సంగన్న నేను అదే ఆలోచిస్తున్న. ఇగో మన సూరి, మల్లికార్జున్‌ కూడా అదే ఆలోచిస్తున్నరు. మన ఊర్లమీద మన అడివిమీద ఎవరి అనుమతితోటి పెద్ద బోర్లతోటి తవ్వకాలు చేస్తున్నరని. ఇంతలో మరో ఇద్దరు

ఉద్యమ కార్యకర్తలు వచ్చింరు. అందరం చెక్క టేబుల్‌ చుట్టూర కుర్చీలు సర్దుకొని కూర్చున్నం.

”ఈ ప్రకటన నిజందో ఫేక్‌ దో గని చూసింరా శంకర్‌ సార్‌ ఎట్లాంటివి జరుగుతున్నయో. ఇదంతా ప్రజలను అంటే మనలను గజిబిజి చేయడానికే కదా…” మల్లికార్జున్‌. ”మన నోట్లో మట్టి గొట్టుకుంటనే.. మీదికెల్లి మనల్నే దొంగలను చేస్తున్నరు. ప్రజల మంచి పట్టది చెడు మాత్రం బాగా పడ్తది. ఏమన్నంటే శాంతిభద్రతలని కాలడ్డం బెడ్తరు. బాగున్నది అవ్వా…” రవి అందుకున్నడు.

”ఇంతకూ ఆ ప్రకటనల ఏమున్నదంటే యురేనియం తవ్వకాల గురించిన అధికారిక సమాచారం వాళ్ళకు లేదంట. మనం సభ పెట్టుకున్నా, రాస్తారోకోలు చేసినా, నినాదాలిచ్చినా గానీ ఆ శబ్దాలకు అడవిలోని జంతువుల మనుగడకు, సంరక్షణకూ భంగమంట విన్నరా” అన్నడు విద్యార్థి నాయకుడు గణేష్‌. ”ఇందుమూలంగా సెక్షన్‌ 30 పోలీస్‌ యాక్ట్‌ను విధిస్తున్నరంట. ఉల్లంఘిస్తే చట్టపరంగా శిక్షిస్తరంట” అని చాలా సేపటి నుండి మా మాటలు వినుకుంట మౌనంగా ఉన్న సంగన్న అందుకొని పూర్తిచేసిండు.

”ఇంతకన్న వాళ్ళేం చేస్తరు. వాళ్ళకున్న అధికారం బలం తోటి ప్రజల గుండెబలాన్నీ, న్యాయబలాన్నీ దెబ్బతీయాలని చూస్తరు. ప్రజలను అడ్డుకుంటరు. మద్దతుగ వచ్చేటోల్లనూ అడ్డుకుంటరు. ఇంకా ముదిరితే కొట్టి తిట్టి అరెస్టు చేసి ఈడ్చుకుపోతరు. మంటలను చల్లార్చే ప్రయోగాలు చేస్తరు” సూర్యం అందుకున్నడు. ఇంతల చాయ్‌లు వచ్చినయి. గుమికూడిన పదీ పదిహేను మందిమి వాడిపోయి ఎర్రబడిన ముఖాలతోటి చాయ్‌ తాగుకుంట ఆలోచిస్తున్నం. మా దిక్కు గబగబా నడిచొస్తున్నడు అంబన్న. ‘ప్రకటన ఉత్తదే. అది ఫేక్‌ ది. పోలీసోల్లు ఇచ్చింది కాదు. పరేశాన్‌ కావద్దు మనం’ అన్నడు. ఒక్కసారిగా అందరు ఓ ఓ ఓ అని అరిచిన్లు. అది గేలిచేసుడో, సంతోషమో తెలియకుండనే. లొల్లి లొల్లిగ అందరు ఏదో ఒకటి మాట్లాడుకుంటున్నం. ‘అరే ఆగుండి లొల్లి ఏంది ఇప్పుడిది నిజందే మననెత్తిన బండరాయి ఏస్తరేమో. పరిస్థితుల్ని తక్కువ అంచన గడుతున్నరా. సంబురం ఎందుకురా. రేపు డీలపడరు చూడుండి’ సంగన్న జరంత కోపంగనే అన్నడు. సంగన్న ఇప్పుడు తాగినోడి లెక్కలేడు. మామూలుగనే ఉన్నడు. ఎప్పటి తీరున మామూలుగనే మాట్లాడుతున్నడు.

గీసోంట నక్కజిత్తులు, దొంగ ఏషాలు, హెచ్చరికలు ఇంకెన్ని చూడాలె మనం. మనకు చావో బతుకో తేల్చుకునేది తప్ప గత్యంతరం తప్పదా?

… … …

నా లోపల కల్లోలం. కడుపుల తిప్పేస్తున్నది. ఆలోచనలు అల్లుకుంటున్నయి. దేశం మనదే, ప్రభుత్వం మనదే, ప్రజలదే పాలన. ప్రజాస్వామ్యమే ప్రభుత్వ విధానం. అయినా ప్రజలెందుకు తల్లడిల్లుతున్నరు. ఊపిరాడక కొట్టుకు ఛస్తున్నరు, నిరసన ఎందుకు చేస్తున్నరు. వాళ్ళ బాధలేంది, వాళ్ళ అభ్యంతరాలేంది, వాళ్ళ బతుకులేంది, భయాలేంది.. అన్నీ తెలుసుకొని తాము చేసేది మంచి పనైతే అది వివరంగ వాళ్ళకు తెలియచెప్పుతూ ఎంత మంచిదో, ఎవరికి మంచిదో నప్పేట్టు చెప్పి సామరస్యం చూపించవచ్చు కద. మళ్ళ మాట్లాడితే ప్రజల అభివృద్ధికే అన్నీ జేస్తున్నమంటరు. ఆ అభివృద్ధేందో, దానివల్ల ప్రజలకు ఏం లాభమో, ఇప్పుడున్న బతుకులకన్నా ఎంత మెరుగు కానున్నమో కండ్లకు కట్టినట్టు చెప్పాలె కద…

ఎవరో పరాయి దేశమోల్లొచ్చి ఇక్కడి ప్రజలను శత్రువులుగ భావిస్తూ దోచుకునే పన్నాగాలు పన్నుతున్నట్లు, అణిచివేయ చూస్తున్నట్లు ఇదేం దౌర్జన్యం? అని పరిపరి విధాల నాలోపల కెలుకుతుంటే ‘శంకరన్నా శంకరన్నా’ అన్న పిలుపుతో బయటికొచ్చి అందిరి దిక్కు చూసిన.

అందరూ రవిని పాట పాడమంటున్నరు. ఆ పాటలు ఇప్పటికే సభలల్ల, సమావేశాలల్ల ఊపేస్తున్నయి జనాలను. రవి పాట ఎత్తుకోకముందే ఎందుకో నాకు మా అమ్మ ‘ఉరేనియం’ అన్న మాటను అందరికీ చెప్పి నవ్వించాలనిపించింది. మా అమ్మ గిట్ల ‘ఉరేనియం’ అడ్డాకు పోతున్నవా బిడ్డా అన్నదంటే అందరిలో పేలవమైన నవ్వు కనిపించింది.

కానీ వెంటనే ‘అదే నిజం గదన్న. గీ యురేనియం తవ్వకాల కన్నా మనకు ‘ఉరే’నయం కదన్నా. ఆ చావుకన్నా గీ చావే నయం గద’ అన్నడు వెంకట్‌. వాళ్ళ ఊరి శివార్లో పెద్ద బోరు తవ్వి భయం పెట్టి పోయింది కంపెనీ. నిజమే చెప్పిందిరా అమ్మ, ఉన్నమాటే గద అని సంగన్న అన్నడు. ఇంతల రవి పాట అందుకున్నడు. ఆ పాట ‘నల్లమల’ చుట్టూ లోపలా అల్లుకున్న జీవవైవిధ్య సంబంధాలను సున్నితంగా, మధురంగా తాకుతూ చల్లగ ఊరికే వాగులా సాగుతున్నది. అందరు కోరస్‌ ఇస్తున్నరు.

వాతావరణం మారిపోతున్నది. అమ్మ చెప్పినట్లు వాన ఎత్తిపోసేందుకు కారుమబ్బులు నల్లగ గుంపులు కడ్తున్నయి. దూరాన మేఘాల గర్జనలు వినిపిస్తున్నయి. మసక కమ్ముకుంటున్న వాతావరణం లో ఓల్టేజి బల్బు వెలుగుతున్న షెడ్డు కింద కూర్చున్న ‘నల్లమల’ పరిరక్షణ ఉద్యమ జీవులు పాటలో పడి కొట్టుకుపోతున్నరు. చిన్న చిన్నగ చినుకులు మొదలయినయి.

… … …

ఐదేండ్ల తరవాత ఈ ప్రాంతంల నాలుగు రోజుల నుండి ముసురుబెట్టి ఎవరిదో ఉసురు సుడిగాలై కొడుతున్నట్లుగా గాలీవానా, చలీ కోతపెడ్తున్నయి. దూరాన సూర్యాస్తమయం చివరి ఎరుపులు మబ్బుల సందునుండి కనిపిస్తున్నయి. గాలి జుయ్‌ జుయ్‌ మంటున్నది. కుండపోతగ వానపడే సూచనలు కనిపిస్తున్నయి. పాట పూర్తయింది. రవిని ఇంకో పాట పాడమంటున్నరు. రవి మరోపాట ఎత్తుకున్నడు. రవి పాటకు, రాబోయే వానకు ఎవరి అనుమతి కావాలె. పొంగే నదులకు, ఎత్తిపోసే అలుగులకూ, బీభత్సంగా ప్రవహించే వరదనీళ్ళకూ ఎవరి అనుమతి కావాలె. జరిగిన నష్టాలను ఏ నష్టపరిహారాలతో పూడ్చగలరు. జరగబోయే నష్టాలను నిలువరించి ఏ నష్టపరిహారాలతో తీర్చగలరు. నా ఆలోచనలు ఈదురుగాలులు ఈడ్చి కొడ్తున్నట్టు స్థిరంగా ఉండనిస్తలేవు.

… … …

ఇంతకు అడవిలోని సమస్త జంతుజాలానికీ, విలువైన వృక్షసంపదకూ, అడవిలోని ఆదివాసీ సమూహాలకూ అనునిత్యం ఎవరివల్ల నష్టం, కష్టం కలుగుతున్నది. వాళ్ళు కలిసి చేస్తున్న సహజీవనం వల్లనా లేక పిడుగుపడినట్టు ఖనిజ నిక్షేపాల కోసం ప్రభుత్వాలు తవ్వకాలకని కంపెనీలకు ఇస్తున్న అనుమతుల వల్లనా…?

”సార్‌ శంకర్‌ సార్‌” జంగన్న పిలుస్తున్నడు.

”ఎక్కడున్నరు సారు. పాట ఇంటలేరు”

”వింటున్న రవీ.. వాన కుమ్మరించేటట్టుంది. మన ఉద్యమగీతం పాడు. తరువాత బయలుదేరుదాం. వాన జోరు అందుకుంటే ఈ రాత్రి ఇక్కడ్నే ఉండాలె. కానీయ్‌” అన్న. రవి గీతం మోగుతున్నది. అది నాకు వేల లక్షల డప్పుల మోతలా వినిపిస్తున్నది.

రానున్న నిర్బంధం నాలో కలవరం రేపుతున్నది. పునరావాసం అనే ఆలోచనే గుండెల్లో కత్తిలా దిగబడుతున్నది. బాధితుల ఆర్తనాదాలు!! అధికారుల ఉక్కుపాదాలు!! విస్ఫోటనం!! మానవ హననం!! అంతా వికృతం!! కాలుష్యం!! చావుకేకలు!! మరణమృదంగాల దుర్భరమైన వాయిద్యాల చప్పుడు! చప్పుడు!! చప్పట్లు! చప్పట్లు!! మోగుతున్నయి రవి పాటకు.

ఇగ పోదాం పండి. ఉరుములు మెరపులు, వాన దంచేటట్టుంది అని వెంకట్‌ లేచిండు. అందరం లేచి నిలబడ్డం. నిలబడాలె ముందు ముందు.

”సార్‌ ఎవరి ‘అనుమతి’కీ భయపడేది లేదు. ఎదుర్కొందాం… తేల్చుకుందాం. ఇంకేం భయం, నిండా ముంచుతాంటె. వస్త సార్‌” అనుకుంట అంబన్న తన సైకిల్‌ ఎక్కిండు. అందరం రేపు కలుద్దాం అనుకుంట విడిపోతున్నరు. రేపటి రోజున ఉధృతం కానున్న ఉద్యమ వ్యూహాలు కూర్చునేందుకు ఒక్కటిగా సమాయత్తమయ్యేందుకు… నా ఆలోచనలు మెలికలు తిరుగుతున్నయ్‌.

‘అనుమతి’ అన్న పదం నాలో చిత్ర విచిత్రంగా గిరికీలు కొడ్తున్నది. దోచుకునే అనుమతి, తవ్వుకునే అనుమతి, చెదరగొట్టే అనుమతి, చావగొట్టే అనుమతి… అధికారం వీటన్నింటికీ అనుమతిస్తది కంపెనీలకు. ప్రజలకు బతికే అనుమతి మాత్రం లేదు… కదానె సంగన్న.

మా బతుకులకు మేం బతికేందుకు ‘అనుమతి’ కావాల్నా అయ్యలూ అని ప్రజలు దీనంగా విలపించాలె. మరి నోరులేని నల్లమల అడివి చెట్లూ, జంతువులూ, ఆటవిక పెంటలూ (పేటలూ) ఎట్లా ఎవరిని వేడుకుంటయి? స్వతంత్ర దేశంలో సామాన్యులైన దళితులు, గిరిజన ఆదివాసులూ అంతా కలిపి పేదలైన, దిక్కూమొక్కూ లేని జనం ఉన్నచోట ఉండి ఉన్నదేదో చేసుకొని తినుకుంట బతకడానికి ‘అనుమతి’ కావాల్నా… తలుచుకుంటె కండ్లు, తల గిర్రున తిరుగుతున్నయి.

నా లోపలా బయటా చీకటి ముసుగుపడింది. చినుకులు పెద్దగయి రేకుల షెడ్డు శబ్దం చేస్తున్నది. బయటంతా చితుకూ, రొచ్చూ… చీదరగున్నది.

అయినా ఈ రాత్రి ఎవరిండ్లకు వాళ్ళు పోవాలె కద. ఎవరి ఊర్లనూ, వాడలనూ, కుటుంబాలనూ వాళ్ళు హత్తుకోవాలి కద. పదండి పోదాం పదండి పోదాం మన బతుకుల్లోకి, రేపటి ఉదయపు సూరీడు మన ప్రాణ మిత్రుడై వెచ్చగా మబ్బుల దండ్లను చీల్చుకుంట రావాల్నని ఎదురుచూస్తూ అందరం సైకిల్లు, స్కూటర్ల మీద బయలుదేరినం.

మా తాతలు కట్టిన పాత ఇల్లు. వెనకట పొందిచ్చుకున్న మా వాడలు. తల్లిదండ్రులూ.. భార్యాపిల్లలూ.. ఇరుగు పొరుగు… బంధువులూ… ఎన్నో ఏండ్లుగా ఆ ఊరూ వాడల్లో కలిసిమెలిసి

ఉంటున్న వాళ్ళందర్నీ ఆర్తిగా ఆలింగనం చేసుకునేందుకు నేను సంగన్నను ఎక్కించుకుని ఊరి దిక్కుకు నా బండిని పోనిచ్చిన. మా ఊరిలోకి, మా వాడలోకి, మా ఇంటిలోకి, నా కుటుంబం అనుబంధంలోకి పోవడానికి ఇప్పుడైతే ఎవరి ‘అనుమతి’ పత్రం తీసుకునే అవసరం లేదు కదా…

ఇంతలో ఒక్కసారిగా ఏదో మిరుమిట్లు గొల్పినట్లు భ్రమ. వెళ్ళిపోయిన సూరీడు వెనకకొచ్చి వేయి సూర్యకాంతులు ఎగజిమ్ముతూ ఆ కారుచీకటినీ, దండిగ కురుస్తున్న వాననూ, ఈదురుగాలినీ పటాపంచలు చేస్తూ కాంతిపుంజాలు ప్రసరిస్తున్నట్లూ, నా తోటి ఉద్యమ తమ్ముళ్ళూ… మిత్రులూ

సూర్యుళ్ళు గుంపుకట్టినట్లుగా దిగ్భ్రమ గొల్పుతూ వెలిగిపోతున్నరు.

ఆ విచిత్ర దృశ్యానికి అప్రయత్నంగా నా చేతులు రెండూ పైకి లేచి పిడికిళ్ళు బిగించి వందనం చేస్తున్నట్లూ… పిడికిళ్ళు విచ్చుకొని తలపైన చేతులు రెండూ కలిపి నమస్కార భంగిమలు నిలబడినట్టూ…

ఆ దృశ్యం అదృశ్యమవుతుండగా సంగన్న ”ఆపురా పంతులూ మా సందొచ్చింది” అంటున్నడు. నేను పూర తేరుకోకుండనే సంగన్నను దించి ముందుకుపోయిన. ఈ రాత్రికి ‘అనుమతు’ల గురించిన అసమ్మతి వ్యాసం రాసి పత్రికకు పంపాలె అన్న ధ్యాసతో…

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.