రప్లికా ఆఫ్‌ ది హెవెన్‌ ఇన్‌ హిమాలయాస్‌ -వి. ప్రతిమ

 

ప్రాచీన, ఆధ్మాత్మిక, చారిత్రక స్థలాలను చూడడం ఒక రకమైన మానవ సహజ ఆకాంక్ష అయితే ప్రకృతిని, పర్యావరణాన్ని ప్రేమించి, ఆరాధించే మనుషులున్న ప్రాంతాన్ని చూడడం మరొక గొప్ప అనుభూతి. ప్రకృతిని కార్పొరేట్‌ శక్తులకమ్మి డబ్బు చేసుకునే ప్రభుత్వాలను చూస్తూ, చూస్తూ, అదే ప్రకృతిని ఆరాధిస్తూ ఆ అందాలను అలాగే దాచి ఉంచుకున్న దేశాన్ని చూడడం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది.

ఆ మధ్య ‘సీత’ సినిమా చూసినప్పట్నించీ ఎందుకోగానీ భూటాన్‌ చూడాలన్న ఆలోచన మొదలయింది. ఆ తర్వాత మిత్రుడు వేణుతో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయమొస్తే ‘తాను ఏటా ఏదో ఒక దేశానికి వెళ్తాననీ, గత సంవత్సరం భూటాన్‌ వెళ్ళానని, చాలా అద్భుతమైన దేశమనీ, తప్పక చూడమనీ’ సలహా ఇవ్వడంతో ఆ కోరిక మరింత బలపడి ఉంటుంది.

మన లోపలి సంకల్పం బలమైనదైనప్పుడు అది నెరవేరి తీరుతుందంటారు.

అలా చాలా రోజుల తర్వాత లక్ష్మి ఫోన్‌ చేసింది. గతంలో శ్రీలంక ప్రయాణంలో లక్ష్మి నాకు పరిచయం. ఆ తర్వాత ఎప్పుడూ కలవలేదు. ఇన్నాళ్ళ తర్వాత లక్ష్మి ఫోన్‌ చేసి భూటాన్‌ వెళ్దామనడంతో ఎగిరి గంతేశాను. నాతోపాటు ఎవరయినా ఒకరిని తీసుకురమ్మంది లక్ష్మి. అప్పుడే నేపాల్‌ నుండి తిరిగి వచ్చామేమో ఎవరిని పిలవాలన్నా బిడియపడ్డాను. విమలక్కని కూడా మొహమాటంగానే అడిగాను. తను వెంటనే ఒప్పుకోవడంతో సమస్య సాల్వయిపోయింది. మార్గం సుగమమయింది.

భూటాన్‌ రాజ్యం దక్షిణాసియాలోని భూపర్యవేష్టిత దేశం. సార్వభౌమ రాజ్యం. హిమాలయానికి తూర్పు వైపు చివరగా హిమపర్వతాల నడుమ ఉన్న చిన్న దేశం. భూటాన్‌కు తూర్పు, పడమర, దక్షిణ సరిహద్దులలో భారత భూభాగం, ఉత్తర సరిహద్దుగా చైనా దేశంలోని టిబెట్‌ ఉంటుంది. భారత రాష్ట్రమైన సిక్కిం భూటాన్‌ను నేపాల్‌ నుంచి వేరుచేస్తుంది. భూటాన్‌ని ‘చివరి షాంగ్రిలా’ అనీ, ‘ది ల్యాండ్‌ ఆఫ్‌ ది థండర్‌ డ్రాగన్‌’ అని కూడా పిలుస్తారు. ఈ డ్రాగన్‌ వారికి ఒక గుడ్‌ సింబల్‌, శుభసూచకం వంటిది. ఆ దేశపు చాలా వస్తువుల మీద ఈ డ్రాగన్‌ బోర్డు కనిపించడం విశేషం.

‘థింపూ’ – భూటాన్‌ యొక్క రాజధాని

సెప్టెంబర్‌ 21 రాత్రి ఎనిమిదింటికి చెన్నై విమానాశ్రయం చేరుకున్నాం. నెల్లూరు నుంచి లక్ష్మి వాళ్ళు, చెన్నై నుంచి మరికొందరు, నేను, విమలక్క చెన్నై లోని విమలక్క ఇంటినుంచి… ఇలా వేర్వేరు దారుల నుంచి ఏకంగా ఎయిర్‌పోర్ట్‌లో కలిశాం అంతా.

హేమక్క, శైలజని మొదటిగా కలిసి పరిచయం చేసుకున్నాం. మమ్మల్ని వదిలిపెట్టడానికి వచ్చిన గీత, లక్ష్మీనారాయణ, భారతిలకు వీడ్కోలు పలికి ట్రాలీల మీద మా లగేజీలు సర్దుకుంటుండగా ప్రియమ్మ, విజ్జి వచ్చి కలిశారు. అందరినీ కలుసుకోవడం ఇదే మొదటిసారయినా లక్ష్మి చేసిన చనువు పరిచయాలతో చాలా రోజులుగా పరిచయం ఉన్నవాళ్ళలా పలకరింపులు, నవ్వులతో కలిసిపోయాం అందరం. హేమక్క, ప్రభాకరన్న, శైలక్క, విజ్జి, ప్రియమ్మ, లక్ష్మి, విమలక్క, నేను… ఎనిమిది మందిమి చెకిన్‌ అయి పదిన్నరకు విమానంలో ఎక్కి కూర్చున్నాం. చెన్నై నుండి కలకత్తాకి రెండు గంటల సమయం పట్టింది. రాత్రి 1:10 కి మేము కలకత్తాలో దిగే సమయానికి విజయవాడ నుంచి వచ్చిన ఎం.లక్ష్మి, హైదరాబాద్‌ నుంచి వచ్చిన సుధాకరన్న, సత్య, పద్మక్క అంతా మమ్మల్ని కలుసుకున్నారు. నేను, విమలక్క తప్ప మిగిలిన వాళ్ళంతా ఒకరికొకరు క్లోజ్‌ రిలేటివ్‌ కజిన్స్‌. మమ్మల్ని కూడా అలాగే కలుపుకున్నారు వాళ్ళు.

కలకత్తాలో హోటల్‌ రూంకి చేరుకుని మూడు గంటల సమయంలో కాసేపు నడుం వాల్చి మళ్ళీ ఆరింటికే విమానాశ్రయానికి చేరుకుని ఎనిమిదింటికి భూటాన్‌ విమానం ఎక్కి తొమ్మిదింటికి పారో ఎయిర్‌పోర్టులో దిగాం. పారో ఎయిర్‌పోర్ట్‌ ఒక అద్భుతమైన ప్రదర్శనశాలలా ఉంది. రాజధాని థింపూ నగర నిర్మాణ నమూనా కూడా అక్కడ ఏర్పాటు చేయబడి ఉంది. అంతా తిరిగి చూస్తూ, సరదాగా ఆ ప్రదర్శనశాలని మా కెమెరాల్లో బంధిస్తూ, మా లగేజి కలెక్ట్‌ చేసుకుని మేము వెలుపలికొచ్చేసరికి ఉదయం పదయింది.

అక్కడ మా కోసం ప్లకార్డుతో గైడ్‌ ఉగెయిన్‌ ఎదురు చూస్తున్నారు. మమ్మల్ని పరిచయం చేసుకుని బస్సు వద్దకు తీసుకెళ్ళాడు. బస్సు డ్రైవర్‌ సోనమ్‌ కూడా మాకు ఎదురొచ్చి నవ్వులు చిందించాడు. మేమంతా ఆ మినీ బస్సు ఎక్కి కూర్చున్న తర్వాత మరోసారి తనను తాను పరిచయం చేసుకుంటూ ఉగెయిన్‌ తెల్లటి వెయిల్స్‌ వంటి క్లాత్‌ను మా అందరికీ భుజాల మీద కప్పి మమ్మల్ని ఆహ్వానించాడు. ఆ తెల్లటి వెయిల్స్‌ శాంతి చిహ్నమనీ, శుభసూచకమనీ… తాము అందరినీ అలాగే స్వాగతిస్తామనీ తెలిపాడు. అదొక అందమైన ఆత్మీయ స్వాగతం.

పారోలో 10 గంటలకి బయల్దేరి కొండలమీద అద్భుత ప్రకృతి దృశ్యాలనూ, హిమాలయ సౌందర్యాలనూ, జలపాతాలనూ, థింపూ లోయనూ మనసారా ఆస్వాదిస్తూ థింపూలో మాకు కేటాయించబడిన హోటల్‌ ఒస్సెల్‌ (OSSEL) కి చేరుకునేటప్పటికి 11.30 అయింది. మాకు కేటాయించబడిన గదులు అత్యంత ఆధునికమైన అన్ని సౌకర్యాలతోనూ, వారి సంస్కృతీ ప్రతీకలైన డ్రాగన్‌ చిహ్నాలతో కలగలిసి మమ్మల్ని ప్రేమగా ఆహ్వానించాయి. రిసెప్షన్‌లో పిలిచి మా ఫోన్లకి వైఫై పెట్టి ఇచ్చారు.

చకచకా గదుల్లోకి వెళ్ళి స్నానాలు ముగించి ఒంటి గంటకల్లా రెడీ అయి దగ్గర్లో ఉన్న orchid రెస్టారెంట్‌కి భోజనానికెళ్ళాం. చపాతీ, కర్రీ, చిల్లీఛీజ్‌, బ్రౌన్‌ రైస్‌, పప్పు, ఖీర్‌ మా భోజనపు అధరువులు. పెరుగు సాధారణంగా వడ్డించరు. అవసరమైతే ఆర్డర్‌ చెప్పి తెప్పించుకోవలసి ఉంటుంది. మేము రోజూ తప్పనిసరిగా ‘యోగర్ట్‌’ తెప్పించుకునేవాళ్ళం.

భోజనమయ్యాక ‘ట్రాషీచో జోంగ్‌’ అన్న చోటికి వెళ్ళాము. దాన్ని వైభవోపేతమైన మత మందిరం అని కూడా పిలుస్తారు. నిజంగానే అది అత్యంత వైభవంగా ఉంది. థింపూ నగరానికి ఉత్తరపు దిక్కున ‘వాంగ్‌ ఛూ’ నది ఒడ్డున కొండమీద నిర్మించబడి ఉంది. ఈ స్థలంలోనే భూటాన్‌ యొక్క అయిదో రాజుకి పట్టాభిషేకం చేశారనీ, అది అత్యంత వైభవంగా జరిగిందనీ, ఆ ప్రాంతంలోనే ఏటా జరిగే వారి ప్రత్యేక పండుగ ‘త్సె ఛూ’ సంబరాలు చాలా వైభవంగా జరుగుతాయనీ, ప్రజలంతా ఇక్కడ గుమిగూడతారనీ, ఆ రోజున రాజు ప్రజలనుద్దేశించి మాట్లాడతారనీ, ప్రతి ఒక్కరికీ రాజుని చూసే అవకాశం కలుగుతుందనీ, రాజు-ప్రజల సంబంధ బాంధవ్యాల గురించి ఉగెయిన్‌ వివరించారు.

అక్కడున్న మందిరంలో ఎత్తయిన బుద్ధ విగ్రహం కళాత్మకంగా ఉంది. బుద్ధుడి పక్కనే ఆ కోటని కట్టించిన ధర్మరాజు, రెండో బుద్ధుడు (2nd Buddha)గా పిలవబడుతోన్న పద్మసంభవుడి విగ్రహాలు, తారాదేవి (Female form of Buddha) విగ్రహం ఇవన్నీ అమర్చబడి ఉన్నాయి. ఆ విగ్రహాల ముందు వరుసగా కూర్చుని ఉన్న సాధువులు (Monks) అనేకమంది ఆ మత మంత్రాలనేవో వల్లె వేస్తున్నారు. కొంచెం ఎత్తులో కూర్చున్న ఒక పెద్ద సాధువు వారికి ప్రవచనాలు కాబోలు బోధిస్తున్నారు. మా పన్నెండు మంది ప్రవేశం, ఇంకా మరికొందరు యాత్రికుల కలకలమూ ఏవీ కూడా ఆ సాధువుల ఏకాగ్రతకి భంగం కలిగించినట్లుగా లేదు. నిర్మలమైన బుద్ధుడి విగ్రహాన్ని, ఆ సాధువుల బోధనలనీ చూస్తూ ఒక ప్రశాంతతను సంతరించుకుని మేము అక్కడ్నుంచి బయటపడ్డాము.

ఆ తర్వాత ఉగెయిన్‌ మమ్మల్ని వీకెండ్‌ మార్కెట్‌కి తీసుకెళ్ళారు. ఆ మార్కెట్‌ ప్రతి వారాంతంలో ‘వాంగ్‌ ఛూ’ నదీ తీరంలో ఏర్పాటు చేయబడుతుంది. థింపూ, దాని చుట్టుపక్కల ప్రాంతాల నుండి అనేకమంది వ్యాపారుల నుంచి చిన్న చిన్న అమ్మకం దార్ల వరకూ ఇక్కడికి చేరుకుని స్టాల్స్‌ ఏర్పాటు చేస్తారు. థింపూలో యాత్రికులు దర్శించడానికి ఇదొక ప్రధానమైన, వైవిధ్యభరితమైన స్థలం. అనేక రకాల సుగంధ ద్రవ్యాలు, రకరకాల డ్రైఫ్రూట్స్‌, పండ్లు, కూరగాయలే కాకుండా కూరగాయల్ని ద్రవాలు కలిపి ఎండబెట్టి సంవత్సరమంతా పాడు కాకుండా స్టోర్‌ చేసుకునేలా ప్యాక్‌ చేసి అమ్ముతున్నారు… చాలా పెద్ద మార్కెట్‌ అది.

మార్కెట్టంతా కలియదిరిగి ఎవరిక్కావల్సినవి వాళ్ళు కొనుక్కుని అంతా కబుర్లు చెప్పుకుంటూ వెలుపలికొచ్చేసరికి సాయంత్రం 5.30 అయింది. నేరుగా హోటల్‌ వద్ద దింపి రేపుదయం 9.30కి కలుస్తానంటూ గైడూ, డ్రైవరూ వెళ్ళిపోయారు. మేమంతా ఒకే గదిలో చేరి స్నాక్స్‌ తిని కాఫీలు తాగుతూ కాసేపు ముచ్చటించుకున్నాక నేను, విమలక్క హోటల్‌కి దగ్గర్లో ఉన్న షాపింగ్‌ సెంటర్‌కి వెళ్ళాం. ఆ నాలుగు వీథులూ తిరిగి షాపింగ్‌ చేసుకుని మేము తిరిగి వచ్చేసరికి 7.30 అయింది. అప్పటికే లక్ష్మి రిసెప్షన్‌ వద్ద నిల్చుని మా కోసం ఎదురుచూస్తూ కంగారు పడుతోంది. ప్రేమగా రెండు కేకలు కూడా వేసింది.

… … …

23 సెప్టెంబర్‌ ఉదయాన్నే నిద్ర లేచి కిటికీలో నుంచి థింపూ నగరాన్ని చూడడం ఒక అనుభూతి. మేము బ్రేక్‌ఫాస్ట్‌ ముగించుకుని హోటల్‌ ప్రాంగణమంతా తిరుగుతూ ఫోటోలు తీసుకుంటూ నవ్వులు, పువ్వులతో ముచ్చట్లు పెడుతూండగానే ప్రాంప్ట్‌గా వచ్చేశారు గైడ్‌, డ్రైవరూ.

ఆ ఉదయం మొదటగా ‘ఒంటో ఛాడ్జోంగ్‌’ (బుద్ధుని స్థూపం) కి వెళ్ళాం. కాంపౌండ్‌ వాల్‌కి అమర్చి ఉన్న ప్రేయర్‌ వీల్స్‌ కదుపుతూ లోపలంతా తిరిగి తిరిగి చూశాం. అక్కడి మూడంతస్థుల మందిరమూ, టాప్‌ ఫ్లోర్‌లో వెలుపలి వైపుగా ఉన్న బుద్ధుడి ఎత్తయిన విగ్రహమూ, పద్మసంభవుడి విగ్రహమూ, ప్రస్తుత భూటాన్‌ రాజు కుటుంబ ఛాయాచిత్రాలూ… ఇవి కాక అనేక రకాల రాక్షస బొమ్మల చెక్కడాలూ కన్పించాయి. ఆ అద్భుతమైన కార్వింగ్‌ మంత్రముగ్ధుల్ని చేయడమే కాకుండా ప్రతి బొమ్మ వెనుకా ఎన్నెన్నో అర్థవంతమైన అంతరార్థ కథలుండడం విశేషం. చరిత్ర చాలా లోతయినది కదా… మేము అర్థం కానప్పుడు ఎన్నిసార్లడిగినా ఏ మాత్రం విసుగు చెందకుండా చాలా ప్లజెంట్‌ వాయిస్‌తో మాకు వివరించి చెప్పేవాడు ఉగెయిన్‌. మేము బస్సు దిగి, ఎక్కిన ప్రతిచోటా

ఉగెయిన్‌ మా పన్నెండుమందినీ లెక్కపెట్టి తృప్తి చెందడం ఒక సరదా అయిన అనుభూతి.

సింటోఖా జోంగ్‌ నుండి మేము ”బుద్దడోర్‌ డెమ్‌నా” బుద్ధపాయింట్‌ ‘టాక్‌ ఆఫ్‌ ది వరల్డ్‌’ (మరొక వ్యూ పాయింటాఫ్‌ బుద్ధ)కి వెళ్ళాము. దీన్ని ‘కుంసెల్‌పోడ్నాంగ్‌’ అని కూడా పిలుస్తారు. కుంసెల్‌ అంటే ‘ఎవ్రీథింగ్‌ ఈజ్‌ క్లియర్‌’ అని అర్థం. థింపూ నగరానికి ఒక 15, 20 నిమిషాల దూరంలో ఉంటుంది ఈ ప్రాంతం. ఆ దారి, అసలా మాటకొస్తే భూటాన్‌లోని ఏ దారయినా, ఏ మార్గమయినా సరే అద్భుతమైన, వర్ణింపనలవి కాని ప్రత్యేక సౌందర్యంతో అలరారుతుండడం విశేం.

విశాలమైన ఆ పర్వతం మీద 67 అడుగుల ఎత్తులో కూర్చుని ధ్యాన స్థితిలో ఉన్న బుద్ధుడి విగ్రహం ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన విగ్రహమని ఉగెయిన్‌ చెప్పారు. అంత ఎత్తులో నిటారుగా కూర్చుని ఉన్నట్లుగా ఉన్న బుద్ధుడి విగ్రహం మొత్తంగా థింపూ నగరాన్నంతా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నట్లుగా ఉంటుంది. ఎన్నో కిలోల కంచుతోనూ, బంగారం, వజ్ర వైఢూర్యాలు కలగలిపి ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి శిల్పులకి సంవత్సర కాలం పట్టిందని చెప్పారు. ఆ ప్రాంగణంలో చుట్టూ ఉన్న డాన్సింగ్‌ డాల్స్‌ విగ్రహాలు చాలా అద్భుతంగా పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. అంతేకాకుండా ఈ మందిరం లోపల వర్ణనాతీతమైన చెక్కడాలతో కూడిన గోడలు, బొమ్మలు ఇంకా అద్దాల అలమరలలో అమర్చబడిన కొన్ని వందల బుద్ధ విగ్రహాలు అత్యంత రమణీయంగా యాత్రికులని మంత్రముగ్ధుల్ని చేస్తాయి.

ఈ కొండ పైభాగాన్నీ, ఆ దృశ్యాలనీ వర్ణిస్తూ ఒక విలేకరి ”చీకటి ఎడారిలో వెలుతురు ఒయాసిస్సులా ఉంది ఈ కొండ, ఇక్కడి బుద్ధ విగ్రహం” అంటాడు. థింపూ లోయంతా మంచు కప్పబడిన అత్యంత పొడవాటి పైన్‌ చెట్లతో నింపబడిన చీకట్లలో ఉండగా, మరో వంక థింపూ నగరం అత్యంత కాంతివంతంగా మిరుమిట్లు గొలుపుతూ ఒక వింత వైరుధ్యాన్ని మన కళ్ళముందు ఆవిష్కరిస్తోంది. బుద్ధ డోర్‌దెమ్‌నా కొండమీది నుండి థింపూ లోయనీ, వైభవోపేతమైన థింపూ నగరాన్నీ చూడడం ఒక మంచి అనుభవం.

అక్కడినుంచి మేము జంతు ప్రదర్శనశాలకి వెళ్ళాము (Takin Mini zoo). Takin అన్నది భూటాన్‌ దేశపు జాతీయ జంతువు. అది ఆవు, గొర్రె క్రాస్‌ బ్రీడ్‌లా ఉంది. ఒకానొక బుద్ధిస్ట్‌ యోగి ఆ జంతువుని సృష్టించాడని చెప్పుకుంటారు. ఒక్క భూటాన్‌ దేశంలో తప్ప ఈ జంతువు మరే ఇతర ప్రాంతంలోనూ కనిపించకపోవడం ఆశ్చర్యకరం. ఆ మధ్యాహ్నం డంకా పెయింటింగ్స్‌ చూడ్డానికి వెళ్ళాం. ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకతను సంతరించుకుని చాలా ప్రత్యేకంగా, సృజనాత్మకంగా ఉన్నాయి ఆ చిత్ర రాజాలు. తన వద్ద గ్రీన్‌ తారా ఉందనీ, వైట్‌ తారా దేవి చిత్రం కోసం వెదికింది విజ్జి. కానీ దొరకలేదు. చాలా ధర కలిగి ఉన్నాయా చిత్రాలు. ఆ సాయంత్రం కాసేపు సరదాగా సిటీలో తిరిగి షాపింగ్‌ చేసుకుని గదికి చేరుకున్నాం.

మూడో రోజు (24వ తేదీ) ఉదయం మేము థింపూ హోటల్‌ నుంచి చెకవుట్‌ అయ్యి పునాఖాకి బయల్దేరాం. పునాఖాకి వెళ్తున్నామనగానే పునాఖా వివరాలు పెడుతూ ప్యూన్‌షోలింగ్‌ (Phuensholing) గురించి ప్రస్తావించాడు మిత్రుడు వేణు. ప్యూన్‌షోలింగ్‌ రాజు, రాణిల విహార యాత్రా స్థలమనీ, భారత్‌, భూటాన్‌ బోర్డరనీ, భూటాన్‌ గేటు చూడవలసిన ప్రదేశమనీ మెసేజ్‌ పంపాడు వేణు. హిమాలయాల కొండ మొదట్లో ఉన్న ”జై గాన్‌” అన్న భారతీయ నగరం ద్వారా ప్యూన్‌ షోలింగ్‌ (భూటాన్‌) లోకి వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ భారతీయ, భూటానీ, నేపాలీ సంస్కృతులు కలగలుపుగా ఉండడం విశేషం. నేను ప్యూన్‌షాలింగ్‌ చూపించమని గైడ్‌ ఉగెయిన్‌ని కోరాను. కానీ ఈ ట్రిప్‌లో ప్యూన్‌షోలింగ్‌ లేదనీ, అది పూర్తిగా దక్షిణం వైపున ఉంటుందనీ చెప్పాడు. ఇలా మరికొన్ని ప్రధానమైన ప్రాంతాలను కూడా మేము చూడలేకపోయాము ఈ యాత్రలో.

థింపూ నుంచి బయల్దేరి కనువిందు చేస్తోన్న థింపూ లోయను చూస్తూ నన్ను నేను మరచిపోయాను. ఆ లోయ రా రమ్మని పిలుస్తున్నట్లుగా అన్పించి ఎందుకో గాని బంగోరె గుర్తుకొచ్చారు. ప్రకృతి నిజంగా ఎంత శక్తివంతమైనదో కదా అన్పించింది. మరోవంక తొలచబడిన కొండనిండా వృక్షాలతో… అవి ఒకరి కనులు మరొకరివిగా చేసుకుని చూడ్డానికి సాధ్యపడనివి.

థింపూ నుంచి సరిగ్గా 45 నిమిషాల దూరంలో డోచులా పాస్‌ వద్ద ఆగాం. సముద్ర మట్టానికి 10,334 అడుగుల ఎత్తులో

ఉంది. విశాలమైన ఆ కొండ మీద చిన్న చిన్న స్థూపాలతో కూడిన సముదాయం కనులవిందు చేస్తుంది. ఇక్కడ ప్రతిదీ అత్యంత సృజనాత్మకంగా నిర్మించబడి ఉండడం విశేషం. ఇక్కడి హిమాలయాలు రాజసంగా నిలబడి ఉండడం చూసి అచ్చెరువొందుతాం మనం. ఇక్కడ ఏడాదికోసారి డోచులా ఫెస్టివల్‌ జరుగుతుందని చెప్పారు ఉగెయిన్‌.

భూటానీయుల అధికార భాష జోంగీభా… అయినా అంతా హిందీ బాగా మాట్లాడగలుగుతున్నారు. ముఖ్యంగా థింపూలో భూటానీయుల జీవన విధానం ఒక గొప్ప సాకారమైన కలలా ఉండడం విశేషం. మనుషులంతా ఎటువంటి ఆవేశకావేషాలూ లేకుండా ఇంత ఆనందంగా, ప్రశాంతంగా ఎలా జీవించగలుగుతున్నారా అని చాలాసార్లు ఆశ్చర్యపోవడం నా వంతయింది. అయితే ఆ తర్వాత ఎక్కడో చదివిన దాన్ని బట్టి ఒక సర్వే ప్రకారం ఆసియాలోనే నిరంతర సంతోషకరమైన దేశంగా భూటాన్‌ ర్యాంకింగ్‌ పొందిందని అర్థమైంది.

థింపూ నుంచి పునాఖా వెళ్ళే దారంతా వర్ణించనలవి కాని లోయలతో, జలపాతాలతో, పైన్‌ చెట్లతో ఆక్రమించబడి ఉత్కంఠభరితమైన దృశ్యాలతో మంత్రముగ్ధుల్ని చేసింది. మేము పునాఖా చేరుకునేటప్పటికి మధ్యాహ్నం 12.30 అయింది.

పునాఖాని ప్యాలెస్‌ ఆఫ్‌ గ్రేట్‌ హ్యాపీనెస్‌ అని కూడా పిలుస్తారు. పునాఖా బోంగ్‌ రెండు నదుల మధ్య వ్యూహాత్మకంగా రూపొందించబడి ఉంది. పోచు (మగ), మోచు (ఆడ) నదులు, వీటి మధ్య గుర్తించదగిన స్పష్టమైన రంగు తేడాలు మనకి కన్పిస్తాయి. రెండు నదీపాయల మధ్య సౌందర్యవంతంగా నిలిచి ఉన్న ‘రాయల్‌ ప్యాలెస్‌’ని చూపిస్తూ ఉగెయిన్‌ ఒక మాటన్నారు. ఒకప్పుడు భూటాన్‌కి పునాఖానే రాజధానిగా ఉండేదనీ, అయితే తర్వాత విస్తృతమైన రాజభవనాలు, అఫిషియల్‌ కార్యాలయాల నిర్మాణానికి ఈ అరుదైన నదులను విధ్వంసం చేయడం ఇష్టంలేక వాటినలా ఉంచేసి విశాలమైన స్థలమున్న థింపూ నగరానికి రాజులు తమ రాజధానిని మార్చుకున్నారని చెప్పినప్పుడు భూటానీయులకు ప్రకృతి సౌందర్యం పట్ల ఉన్న ఆకాంక్ష మరొకసారి అవగతమయింది.

ప్రకృతిని ధ్వంసం చేయకుండా, కార్పొరేట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకోకుండా అలాగే దాచి ఉంచుకోవడం విశేషం. ఎంత పర్యావరణ ప్రేమికులంటే జీవఅధోకరణం కాని వస్తువులు లేకుండా ఉంచడానికి ప్రజలు ఎప్పటినుంచో ప్లాస్టిక్‌ సంచులకు బదులుగా పత్తి సంచులు వాడుతున్నారు.

ఒకవైపు హిమాలయాలకు ఆనుకుని ప్రవహిస్తోన్న పోచునది, ఆ నదికి ఇవతలి ఒడ్డున ఉన్న రిసార్ట్‌లో మా గదులు. Simg Kham Resort ఎంత అద్భుతమైన రిసార్ట్‌ అంటే ఆ ప్రాంగణమే ఒక వర్దీ సైట్‌ సీయింగ్‌. లంచ్‌ ముగించుకుని పునాఖా అంతా తిరిగి చూస్తూ, బాణాలు విసిరే చోటుకి తీసుకెళ్ళి నారి సారించడాన్ని ప్రత్యేకంగా చూపించారు ఉగెయిన్‌.

ఆ తర్వాత మేము పోచు, మోచు నదులు ప్రవహించే చోటుకి వెళ్ళాము. మగ నదిలో నీళ్ళు ఉధృతంగా ప్రవహిస్తుంటాయనీ, ఆడ నదిలో ఆ ఉధృతి కొంత తక్కువగా ఉంటుందనీ, కాబట్టి రివర్‌ రాఫ్టింగ్‌ చేయడానికి మోచు నదే సరయినదనీ అక్కడి బోట్‌ రైడర్స్‌ మాకు చెప్పారు. దాంతో మాలో ఉత్సాహమున్న ఒక ఆరుమందిమి పదివేల రూపాయలు కట్టి రాఫ్టింగ్‌కి బయల్దేరాము. ఒకవిధంగా అది సాహసోపేతమైన చర్య. మోచు నది కూడా చాలా ఉధృతంగానే ఉంది. సుధాకరన్న ‘సేఫ్‌గార్డ్స్‌’లో ఉన్న మమ్మల్ని, మా రాఫ్టింగ్‌నీ వీడియో, ఫోటోలు తీసి గ్రూప్‌లో పెట్టారు. విమలక్క, హేమక్క, ప్రభాకరన్న, సుధాకరన్న ఒడ్డునే ఉండిపోయారు. విమలక్క ఒక విధంగా నన్ను వద్దని కూడా వారించింది.

నిజంగా రాఫ్టింగ్‌ ఒక అద్భుతమైన అనుభవం.

పడవ ఎక్కిన వెంటనే తెడ్లు ఎలా వేయాలో, ఎప్పుడు ఆపాలో, ఏ సమయంలో పాదాల వేళ్ళు బోటుకి నిలదొక్కి ఆపాలో వంటి అనేక సూచనలు రెండు మూడుసార్లు బోధించి, మమ్మల్ని పరీక్షించి ఆ తర్వాత ముందుకు తీసుకెళ్ళారు మా రైడర్‌ లక్కీ. మమ్మల్ని పాటలు పాడమని అడిగారు లక్కీ. మేమెవరమూ గొంతెత్తకపోవడంతో అరుదైన పాత హిందీ సినిమా పాటలు తనే మధురంగా పాడడం మొదలుపెట్టాడు. మా వాళ్ళు తనతో గొంతు కలిపారు. ఒకటి రెండు భూటానీస్‌ సినిమా పాటలు కూడా పాడాడు. పడవ నడపడమే కాకుండా పడవలోని మనుషులను అనందార్ణవంలోకి తీసుకెళ్ళగలిగే రసవిద్య తెలిసినవాడు లక్కీ అన్పించింది. ‘మీ అందరికీ ఈత వచ్చా?’ అని లక్కీ అడుగుతుండగానే కొంత దూరమెళ్ళాక ఒక ఉధృతమైన అల కొండవాలు నుంచి వచ్చి మా పడవను తీవ్రంగా అటూ, ఇటూ కుదిపేసింది. కేకలు, అరుపులు, ఆపై నవ్వూలూ, లక్కీ పాడుతోన్న ప్రేమ పాటలూ పువ్వులు పువ్వులుగా నదిలోకి వెదజల్లబడ్డాయి. ఎడమవైపు కూర్పున్న శైలక్క, పద్మక్క, నేనూ పూర్తిగా తడిచిపోయాం.

బస్సులో ఒడ్డునే ప్రయాణిస్తూ గమ్యం వద్దకు చేరుకున్న మా బృందం ఉద్వేగంగా మా కోసం ఎదురు చూస్తున్నారు. మళ్ళీ కొంతసేపటికి అదే ఉధృతితో పడవ కదలాడింది. ఈసారి చాలా నీళ్ళు పడవలోకి చేరుకుని మెల్లగా జారిపోవడం మొదలెట్టాయి. కుడివైపున కూర్చున్న ప్రియమ్మ, సత్య, ఎం.లక్ష్మి అంతా బాగా తడిచిపోయారు. మధ్యలో కుదురుగా కూర్చున్న లక్ష్మి మాత్రం చాలా ఆస్వాదిస్తూ అందరినీ చూస్తోంది.

మొత్తంగా ఒక ముప్పావు గంట తర్వాత మేము తీరం చేరుకున్నాము. ఎదురు చూస్తున్న మా బృందం ముఖాల్లో గొప్ప రిలీఫ్‌. లైఫ్‌ జాకెట్లన్నీ తీసి లక్కీకి అందచేసి త్వరగానే మేము మా రిసార్ట్స్‌కి చేరుకున్నాం. అందరం ఒక గదిలో చేరి బుర్లూ, కాఫీలూ అయ్యాక ఎవరి గదుల్లోకి వాళ్ళం దూరి స్నానాలు ముగించాం. వాళ్ళంతా పేకాటలో రిలాక్స్‌ అవుతుండగా లక్ష్మి మా గదిలోకి వచ్చింది. మేం ముగ్గురం మధ్యాహ్నం మేము చూసిన టంకా పెయింటింగ్స్‌ గురించీ, వాటి ధరల గురించీ, మాల్‌లో మేం చేసిన షాపింగ్‌ గురించీ చాలాసేపు చర్చించుకున్నాం.

అప్పటికి రాత్రి 7.30 అవడంతో మేం ముగ్గురం ఆ ప్రాంగణాన్ని పరికిస్తూ, అందులోని అరుదైన మొక్కల సముదాయం, ఆ చంద్రోదయ వేళ ఆ రిసార్ట్‌లో మొక్కల మధ్యన వెలుగుతున్న విద్యుత్‌ బల్బులు, మలయ మారుతాన్ని ఆస్వాదిస్తూ డైనింగ్‌ హాల్‌ వెతుక్కుంటూ బయల్దేరాం. మాకివ్వబడిన కాటేజెస్‌ నుండి ఆ మొక్కల్లో రెండు మూడు కొండలు దిగి వెళ్తే కానీ మేం భోజనశాలని చేరుకోలేదు. ఆ పక్కనే ఆ రిసార్ట్‌ రిసెప్షన్‌ కూడా కన్పించింది. అంత అందమైన లొకేషన్‌ అది. అంతేకాకుండా అనేక రకాల రుచికరమైన అధరువులతో భోజనం కూడా చెప్పుకోదగ్గదిగానే ఉంది. స్త్రీ పక్షపాతిగా అన్నింటికంటే నన్ను ఆకర్షించిన విషయమేంటంటే భూటాన్‌లో రిసార్ట్స్‌లోనూ, హోటల్స్‌లోనూ అంతా అమ్మాయిలు పనిచేయడం. దీన్నిబట్టి భూటాన్‌లో క్రైం రేట్‌ని మనం తేలిగ్గా అంచనా వేయవచ్చు. ఆ అమ్మాయిలు ఎయిర్‌ హోస్టెస్‌ల్లా సౌందర్యవంతులే కాకుండా, దేవలోకం నుండి దిగి వచ్చినట్లుగా అత్యంత దయగా ఉండడం, ఏ అర్థరాత్రి ఏ అవసరమొచ్చినా మాయా బాలికల్లా ప్రత్యక్షమవడం… ఈ విషయాన్నే ఆలోచిస్తూ ఆ రాత్రి నాకు చాలా ప్రశాంతంగా నిద్ర పట్టేసింది.

మర్నాడు 25న ఉదయం ఆరింటికే నిద్రలేచి బాల్కనీలోకి వచ్చాను. హిమాలయ హిమ పవనాల మంచు రాత్రుల నుంచి అప్పుడప్పుడే మేలుకుంటూ పరవశంగా, మంద్రంగా పారుతోన్న పోచునది ఆ

ఉదయ సంధ్యలో తొలిరాత్రి తరువాత భార్యని పరవశించి చూస్తోన్న పడుచు కుర్రాడిలా ఉంది. ఆ నదినీ, నదిని ఆనుకుని ఠీవిగా నిలబడి ఉన్న మంచు కొండలనీ చూస్తూ మేము స్వయంగా కలుపుకున్న వేడి వేడి కాఫీ రుచి చూస్తూ కబుర్లు చెప్పుకోవడం విమలక్కకీ, నాకూ ఒక మంచి దాచుకోదగిన అనుభవం. ఎంతకీ ఆ బాల్కనీని, ఆ దృశ్యాన్నీ వదిలిపెట్టి లోపలికి రాబుద్ది కాలేదు మాకు ఎం.లక్ష్మి వచ్చి గెట్‌ రెడీ అని అప్రమత్తం చేసేదాకా.

ఈ రిసార్ట్‌లో బ్రేక్‌ఫాస్ట్‌ కూడా అత్యంత రుచికరంగా ఉందని చెప్పక తప్పదు. ఎవరు పునాఖా వెళ్ళినా ఈ రిసార్ట్‌లో దిగమని నేను సలహా ఇస్తాను. ఈ రిసార్ట్‌ రిసెప్షన్‌ బిల్డింగ్‌లో షాపింగ్‌ కూడా చాలా రీజనబుల్‌గా ఉంది. ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే భూటాన్‌లో షాపింగ్‌ చాలా ఎక్స్‌పెన్సివ్‌గానే

ఉంది. ఎక్కడా దొరకని ప్రత్యేకమైన వస్తువులంటూ పెద్దగా కన్పించలేదు. హ్యాండీ క్రాఫ్ట్స్‌ ఎక్కువ కావడంతో ధరలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఎక్కువగా బుద్దుడి విగ్రహాలూ, తారాదేవి బొమ్మలూ, డ్రాగన్‌ ప్రతీకలూ కన్పిస్తాయి. తారాదేవి ఫిమేల్‌ ఫామాఫ్‌ బుద్ధగా వీరు భావిస్తారు. తారాదేవిని ఇంట్లో ఉంచుకుంటే అంతా శుభమే కలుగుతుందని వీరి నమ్మకం.

ఆ ఉదయం మేము చుట్టూ కందకం ఏర్పాటు చేయబడి ఉన్న రాజకోట లోపలికి వెళ్ళాము. పునాఖా కోటని చూడడం ఒక మంచి అనుభవం. అనేక రకాల చెక్కడాలతోనూ, పొడవాటి ఇనుప తలుపులతోనూ, విశాలమైన కోర్ట్‌యార్డులతోనూ, మూడంతస్థుల భవనాలతోనూ నిండి ఉన్న ఆ కోట ముందు భాగంలోని నిటారైన మెట్లు ఎక్కడం కష్టమే అయినా ఎక్కడమయ్యాక వరండాలోని ప్రేయర్‌ వీల్స్‌, లోపలి దృశ్యాలు మనని సేదతీరుస్తాయి. కోటంతా తిరిగి చూసి ఆ కొండమీద, చెట్ల దారుల్లో 15, 20 నిమిషాలు నడిచి, నడిచి పోచు నది వద్దకు చేరుకున్నాము మేము. ఆ నదిమీద పురాతన కాలంలో నిర్మించబడిన సస్పెన్షన్‌ బ్రిడ్జిమీద నడవడం నచ్చిన అనుభవం. పోచునది ఎప్పట్లాగే ఉధృతంగా ప్రవహిస్తోంది. దానిమీద అటూ, ఇటూ ఊగిసలాడుతోన్న ఇనుప తీగెల వంతెన మీద ఆ దరికి నడుచుకుంటూ వెళ్ళి అక్కడున్న షాపులో లస్సీలు, ఫ్రూటీలు తాగి సేదదీరి మళ్ళీ అటునుంచి ఈ దరికి నడుస్తూ ఆ వాతావరణాన్ని అనుభూతించాం.

మేము కోట నుండి బయటపడేసరికి పన్నెండున్నరయింది. లంచ్‌ అయ్యాక మేము ఫెర్టిలిటీ టెంపుల్‌కి వెళ్ళాము. 15, 20 నిమిషాల కొండదారి అది. మేము సస్పెన్షన్‌ బ్రిడ్జి వరకూ నడిచి, కోటంతా తిరిగి చూసి కాళ్ళు పట్టేశాయేమో మాలో కొంతమంది ఫెర్టిలిటీ టెంపుల్‌కి రామనీ, అంత అవసరం లేదనీ అన్నారు నవ్వుల మధ్య. కానీ ఆ దారి, కొండమీది ఆ గుడీ రెండూ కూడా ప్రత్యేకమైనవే.

భూటాన్‌లోని మోనాస్టరీలన్నీ కూడా అద్భుతమైన చెక్కడాలతో, దేశీయ ప్రతీకలతో, అంతరార్ధ కథలతో నిండి ఉంటాయి. ప్రతిచోటా ఉగెయిన్‌ మాకో కథ చెప్పేవాడు. మా ఇతర యాత్రికుల గైడ్లు కూడా ప్రతి చిన్న విషయాన్ని పొల్లుపోనీకుండా కథలు కథలుగా అర్థం చేయించడం సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. సంతానంలేని వారు ఈ గుడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటారట. పిల్లలు పుట్టిన వెంటనే వచ్చి తమ మొక్కు తీర్చుకుంటారట. ఇక్కడ కూడా ప్రేయర్‌ వీల్స్‌ ఉన్నాయి. మనం గుడిలో గంటలు మోగించినట్లుగా వీళ్ళు ఈ ప్రార్థనా చక్రాలను తిప్పడం ఒక సాంప్రదాయంలా ఉంది. భూటాన్‌ అంతా బౌద్ధం తప్ప వేరే మతం ఉన్నట్లుగా కన్పించదు. ఎక్కడ చూసినా బుద్ధుడి మందిరాలు, మోనాస్ట్రీలు తప్ప వేరే ఇతర గుడులేవీ మనకి కన్పించవు. బుద్ధుడిని దేవుడిని చేసి పూజించడం అన్నది కొంత ఇబ్బందికరమే అయినా వాళ్ళయొక్క అంకితభావం కొనియాడదగినది. అక్కడో బుద్ధ విగ్రహాన్ని కొనుక్కుని అందరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కొండదిగి బస్సు వద్దకు చేరుకున్నాం.

ఆ సాయంత్రం పునాఖా అంతా తిరుగుతూ నగరాన్ని చూస్తూ, షాపింగ్‌ మాల్స్‌ చూస్తూ, అక్కడి ప్రజలని పరిశీలిస్తూ గడిపాం.

… … …

26వ తేదీ ఉదయాన్నే మా అందమైన జింగ్‌కాంగ్‌ రిసార్ట్‌ వదిలి పారో వైపుగా మా ప్రయాణం మొదలయింది. భూటాన్‌ దేశపు సహజ సౌందర్యం పారో దారిలో కూడా మమ్మల్నెంతగానో ఆట్టుకుంది. హిమాలయ రాజ్యమైన భూటాన్‌ చిన్న దేశమే అయినా అత్యంత సౌందర్యవంతమైనది. సంస్కృతీపరంగా ఉన్నతమైనది. చక్కటి ఆర్థిక ప్రమాణాలు కలిగినది. ఆ క్రమంలో పారో కూడా చాలా అందమైన నగరం.

పారోలో మొదటిగా అడవిలోని అత్యంత పెద్దదైన జంతు ప్రదర్శనశాలని చూశాం. యాక్‌, సాంబార్‌, రంగు రంగుల గుర్రాలు వంటి అనేక రకాల చిన్నవీ, పెద్దవీ జంతువులు, ముచ్చటైన జింకలూ, దుప్పిలూ, చిత్ర విచిత్రమయిన పక్షులూ, వాటి కిలకిలా రావాలు… అంతేకాకుండా అనేక రకాల మొక్కలు, చెట్లు, పోనిఫెరస్‌, రోడోడెండ్రాన్‌, ఎవరో పద్ధతిగా అందంగా వరసగా నిలిపి ఉంచినట్లుగా ఉన్న అడవి ఫెరన్స్‌, ఆ శీతాకాలపు శుభోదయాన ఆ కొండల మధ్య అడవంతా కలియ తిరుగుతూ కొంగొత్త అనుభూతిని మా హృదయాల్లో నింపుకుని సంతృప్తిగా లంచ్‌కి వెళ్ళాం మేము. లంచ్‌ తర్వాత దగ్గర్లో ఉన్న షాపుల్లో టంకా పెయింటింగ్స్‌, అనేక రకాల చేతిపనితనాన్ని చూసుకుంటూ మా రిసార్ట్స్‌కి చేరుకున్నాం. ఇది చాలా ఎత్తయిన కొండమీద ఉంది. ఇక్కడ కూడా హిమాలయాలు, ఉధృతంగా పారుతోన్న నదీ మాకు తోడయ్యాయి.

మధ్యాహ్నం రిసార్టంతా తిరిగి చూస్తూ, ఫోటోలు తీసుకుంటూ రిసెప్షన్‌లో ఉన్న షాపుల్ని సెర్చ్‌ చేస్తూ గడిపాక ఉగెయిన్‌ స్టోన్‌ బాత్‌ సంగతి ప్రస్తావించాడు. హేమక్క, విమలక్క, సుధాకరన్న, ప్రభాకరన్న, లక్ష్మి అంతా గదిలో ఉండిపోయారు. నేను, ఎం.లక్ష్మి, ప్రియమ్మ, పద్మక్క, సత్య, శైలక్క వెళ్ళాం.

అది మా రిసార్ట్స్‌కి దాదాపు ముప్పావు గంట దూరంలో ఉంది. గదులు, గదులుగా ఉన్న నిర్మాణంలో లోపల చెక్క తొట్టిలో నీళ్ళుంటాయి. నీళ్ళు మరీ వేడిగా అన్పిస్తే చన్నీళ్ళ పైప్‌ తిప్పుకోవచ్చు. ఆవిరి గదంతా నిండిపోతుంది. అరగంట స్నానానికి ఒక్కొక్కళ్ళం రూ.1300 చెల్లించాం. కానీ ఎవరూ కూడా ఆ గదుల్లో అరగంట స్నానం చేయలేకపోయారు. ఏదో ఊపిరాడని ఆ పదిహేను నిమిషాల తర్వాత ఒక్కొక్కరం చాలించి గదిలోంచి వెలుపలికొచ్చారు. ఇదో కొత్త అనుభవం. ఆ గదుల బయట ఉన్న యాపిల్‌ చెట్టు మీద నుంచి మేము స్వయంగా యాపిల్‌ కాయలు కోసుకోవాలని అభ్యర్థించి, లక్ష్మి యాపిల్‌ చెట్టెక్కి కాయలు కోయడం మరో విశిష్టమైన అనుభవం.

ఆ రాత్రి త్వరగా భోజనాలు ముగించి పడుకున్నాం.

27వ తేదీ ఉదయం 9 గంటలకు పారో టక్ట్స్‌ంగ్‌ వద్దకు బయల్దేరాం. పారో టక్ట్స్‌ంగ్‌ లేదా టైగర్‌ మొనాస్టరీ వెయ్యి అడుగుల ఎత్తయిన కొండ మీద వేలాడుతున్నట్లుగా ఉంటుంది. దట్టమైన నీలిరంగు పైన్‌ చెట్లతో మంత్రముగ్ధమయినటువంటి రోడో డెండ్రాన్‌ మొక్కలతోనూ నిండి ఉన్న అందమైన అడవిలో ఈ మఠం నిర్మించబడి ఉన్నదనీ, భూటానీయులు వారు పురుషులయినా, స్త్రీలయినా జీవితంలో ఒక్కసారయినా సరే టైగర్‌ నెస్ట్‌ చూసి తీరాలనుకుంటారనీ, అది అత్యంత ఖ్యాతి కలిగిన స్థలమనీ చెప్పాడు ఉగెయిన్‌.

టైగర్‌ నెస్ట్‌ చూడాలనుకుంటే వాహనమయినా లేదా గుర్రమైనా సగం దూరం వరకూ అంటే ఫలహారశాల వరకూ మాత్రమే వెళ్తాయనీ, అక్కడినుంచి నిటారయిన మెట్లు, నిటారయిన నడవా, ఆశ్రమం వద్ద మరింత ఇరుకయిన మెట్లు ఉంటాయనీ, వెన్న దీపాల ప్రార్థనా మందిరం దాటి మఠం వెళ్ళేదారిలో జలపాతం దాటుతూ పారో లోయ చూడడం ఉత్కంఠభరితమైనదనీ కూడా చెప్పాడు. ఆశ్చర్యంగా అతని మాటలు వింటుండిపోయాన్నేను. మొత్తమ్మీద అదంత తేలికైనదేమీ కాదని అందరికీ అర్థమయింది. ఎవ్వరూ కూడా ఆ నిటారు నడక పట్ల ఉత్సాహం చూపించలేదు. నేను కొంత ఊగిసలాడినప్పటికీ ఒంటరిగా సాధ్యం కాదని నిబాళించుకున్నాను. హఠాత్తుగా మేమంతా సీనియర్‌ సిటిజన్లమన్న విషయం మా కళ్ళముందు ఆవిష్కృతమయింది.

బౌద్ధ మతాన్ని భూటాన్‌లోకి తీసుకొచ్చిన గురు రింపోచె మందిరం ఆట అది. ఆయన మొదటగా పులి వెనుక ఎక్కి వచ్చాడంటారు. అందుకే దానికి టైగర్‌ నెస్ట్‌ అని పేరు వచ్చిందంటారు. వ్యూ పాయింట్‌ వద్ద ఆగి లయన్‌కేవ్‌ సింహం ముఖంలా ఉన్న ఆ గుహ ముందరి భాగాన కన్పించీ కన్పించని ఆ మొనాస్టరీని చూసి చాలాసేపు గడిపి అసంతృప్తిగానే తిరుగు ముఖం పట్టాం.

అయితే మేము మ్యూజియంకు వెళ్ళినప్పుడు లక్కీగా అక్కడ లయన్‌ మొనాస్టరీ నమూనాని చూసి చాలా ఆనందించాం. భూటాన్‌ని గురించిన సవివరమైన చిత్రాలు, నమూనాలు, విశేషాలూ, అక్కడ టి.విలో నిరంతరాయంగా వస్తోన్న భూటాన్‌ దేశీయ నృత్యాలు మమ్మల్నెంతగానో ఆట్టుకున్నాయి. ఆ మధ్యాహ్నం లంచ్‌ తర్వాత ఆ దేశవాళీ నృత్యాలను మేము స్వయంగా చూడడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ కాసేపు షాపుల్లో తిరిగాం. భూటాన్‌లో ఇది మా చివరి రోజు. పారోలోని అద్భుతమైన ఫారెస్ట్‌ వ్యూ గదులు, వ్యాలీ వ్యూ రూములు చుట్టుపక్కల ఉన్న పైన్‌ అడవులనీ, పారో వ్యాలీ యొక్క విస్తృత దృశ్యాలనూ యాత్రికులకు అందిస్తుంటాయి.

ప్రపంచంలోని అత్యంత సంతోషకరమైన దేశాలలో భూటాన్‌ ఒకటి అని మేం అక్కడ గడిపిన కాలం ఆనందార్ణవంలో మమ్మల్ని ముంచి తేలుస్తూ క్షణక్షణం నిరూపించుకుంది.

నన్ను బాగా ఆశ్చర్యానికి గురిచేసిన విషయమేమిటంటే రాజు నుండి సామాన్య ప్రజల వరకూ కూడా ఒకే రకమైన సాంప్రదాయ దుస్తులు ధరించారు. వాటి టెక్స్చర్‌లో కూడా ఏ స్థాయీ భేదం లేకపోవడం, రాజ కుటుంబీకులు ప్రయాణమైనప్పుడు ముందూ వెనకా ఎటువంటి సైరన్ల హోరూ లేకపోవడం చెప్పుకోదగ్గవి. అయితే రాజ వాహనం వస్తోందని అర్థమయిన వెంటనే ప్రజలు తమ వాహనాలను క్షణం పాటు ఆపి వారికి దారిచ్చి ఆ తర్వాత కదిలేవారు. అది మర్యాదపూర్వకంగా, గౌరవ సూచకంగా అన్పించింది. అడవుల్ని రక్షించుకోవడం, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, ఒకరినొకరు గౌరవించుకోవడం, మందు తాగకపోవడం (విపరీతంగా), ఎక్కడా స్మోకింగ్‌ లేకపోవడం ఈ పద్ధతులన్నీ వాళ్ళకి ప్రత్యేకించి ఎవరూ నేర్పించరు, తరతరాలుగా వారి నరనరాన జీర్ణించుకుపోయాయేమో అన్పిస్తుంది. ఆ విధంగా భూటాన్‌ ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంది.

ప్రపంచవ్యాప్తంగా మరెక్కడా లేని విధంగా భూటాన్‌ వెస్టర్న్‌ కల్చర్‌కి లోను కాకుండా తమ సంస్కృతిని కాపాడుకుంటూ

ఉండడం ఆశ్చర్యకరమైన విషయం. అలా అని భూటాన్‌ ఆధునికతకు దూరంగా ఉందని కూడా చెప్పలేం. తన సహజమైన స్వచ్ఛస్థితిని ఆధునికతతో మిళితం చేస్తూ సమతుల్యతతో సంతోషంగా, ప్రశాంతంగా జీవితాలను గడుపుతోన్న భూటానీయులు శతధా ప్రశంసనీయులు.

… … …

28వ తేదీ ఉదయం ఎనిమిదింటికి మమ్మల్ని పారో ఎయిర్‌పోర్ట్‌లో దిగబెట్టి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు గైడ్‌ ఉగెయిన్‌, డ్రైవర్‌ సోనమ్‌. కలకత్తా వరకూ ప్రయాణించి అక్కడ హైదరాబాదీయులకు వీడ్కోలు తెలిపి మిగిలిన వాళ్ళం చెన్నైదాకా ప్రయాణించి వీడ్కోలు తీసుకున్నాం. వారం రోజుల క్రితం అపరిచితులయిన మేమంతా చిరకాల పరియచస్థుల్లా, స్నేహతుల్లా వీడ్కోలు కొంత బరువుగానే ఉంది.

Share
This entry was posted in యాత్రానుభవం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.