కరిగేసింది… ఇప్పటివరకూ నింగిని తాకిన ఆ ధైర్యమూ, నిజాయితీ,
ఆ మేఘం ఇప్పుడు చల్లనైన కన్నీటి వర్షం కురిపిస్తోంది.
ఎన్నాళ్ళకెన్నాళ్ళకు ఈ కన్నీటి రుచి తెలిసింది మళ్ళీ!!
గెలిచి నిలబడిన ఆనందమూ, కూలబడి పొందిన అవహేళనా, అవమానమూ,
వీటికి తోడైన వ్యక్తిత్వపు పొరబాట్లూ, ఎత్తుకి ఎగురుతూ నియంత్రణ కోల్పోయి
దిగజారిన అభిమానపు విలువ తెలుసుకున్న అపరాధ భావనా…
వీటన్నిటితో వచ్చిన దుఃఖాశ్రువులే ఇవి!!
మగ అహంకారాలని ఎదిరించి మరీ నిరూపించుకున్న స్వాభిమాన వ్యక్తిత్వానికి,
ఆ మనోసుగంధపు స్వీయ స్వీకారానికి వచ్చిన ఆనందభాష్పాలే ఇవి!!
దుఃఖపు, సంతోషపు ఈ ద్వైతపు వరదని ఆపడానికి ఆప్యాయంగా చేస్తున్న ప్రయత్నంలో
తిరిగి పునీతమ్ అయి మరింత స్వచ్ఛం అవుతున్నా!!
నన్ను నేను ఇంకా ఇంకా తెలుసుకుంటున్నా!!
అందుకే… ఈ కన్నీళ్ళ వర్షం చాలా విలువైనది, ఆత్మీయమైనది
మనుషుల స్వార్ధపు, అవకాశవాదపు, కృత్రిమత్వపు, కపటత్వపు మరకలని
అంటించుకు రావద్దని నా వివేకం ఈ వెక్కిళ్ళకు చేస్తున్న దాక్షిణ్యపు హెచ్చరిక ఇది.
అలసిన కళ్ళు ఈ కొత్త జ్ఞానాన్ని మళ్ళీ పసిపాపలా స్వచ్ఛంగా, మరింత నిబ్బరంగా
చూడడానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాయి.
మనుషుల నీడ పడినా, వారి మనసుల కుటిలత్వపు నీడ పడనివ్వకూడదనే దృఢ సంకల్పాన్ని
నా ప్రియరోదన నాకు ప్రేమగా నేర్పుతోంది!!!