నిశీధిని చూసేందుకు కళ్ళు కావాలా?
నీ గుండెలో గూడు కట్టుకున్న గాఢాంధకారం పేరేమిటి?
వెలుగును చూపేందుకు సూర్యుడు రావాలా?
నీ చిరునవ్వుల్లో కొలువైన కాంతి పేరేమిటి?
చెలిమి నీడ కోసం లోకమంతా వెదకాలా?
అది అందించే చేయి నీదే ఐతే, ఆ నీడ నీలోనే లేదా?
జ్ఞానం జాడ కోసం విశ్వమంతా అన్వేషించాలా?
నీ ఆలోచనల దారుల్లో కాస్త వెలుగు నింపితే, తేజమై నీ కన్నుల్లో కొలువవదా?
అందాలు, ఆనందాల కోసం అనంత దూరం ప్రయాణిస్తున్నావా?
నీ మనసు దీవిలో కల్మషాన్ని తొలిగిస్తే, మిగిలేదేమిటి?
ప్రేమ కోసం జగమంతా దుర్భిణి వేసుకుని గాలిస్తున్నావా?
ఈ ప్రకృతి నీకు ప్రతి నిత్యం ఇచ్చేదేమిటి?
నువు కాస్త పంచినా, నీకు కోట్లరెట్లుగా తిరిగొచ్చే దాని పేరేమిటి?
బాధలు, బంధాల పుట్టుక గిట్టుకలు ఎక్కడని యోచిస్తున్నావా?
అవి కేవలం, నీ హృదయతంతుల స్పందనల నుండి ఉద్భవించినవి కావా?
కళ్ళతో దూరాల్నేం కొలుస్తావు?
అడుగేసే కొద్దీ కనుమరుగయ్యే వాటి గురించి ఎందుకంతలా చింతిస్తావు?
కన్నీళ్ళలో తడిసేం చేస్తావు?
మనసుకంటిన బాధల చారికలు చెరిపేస్తే, వాటి ఉనికైనా మిగిలుంటుందంటావా?
నువ్వు చెరపాలనుకున్న దూరాలు,
నువ్వు చేరాలనుకున్న తీరాలు,
నీ నుంచి ప్రవహించే కన్నీళ్ళు,
నీలో ప్రవహించే సంతోషాలు, అన్నీ నీలోనే లేవా…?
మనసుకంటితో చూస్తే, జగమంతా నీలోనే కనిపించదా,
నీవేే జగమని అనిపించదా…