అమ్మగా, ఆలిగా, ఆదిలక్ష్మిగా
అన్ని రూపాలలో కొలుస్తూ,
అడుగడుగునా హింసిస్తూ
అందలమెక్కిస్తున్నామంటున్న
అయోమయపు అడుగుజాడలను
నిరసించలేక నీరు కారిపోతున్న
గర్భకుహరాన విత్తనమై
మొలకెత్తి ఊపిరి తీసుకుంటూ ఉంటే
ముప్పని పెను కుప్పని
స్కానింగులతో భ్రూణహత్యలు
చేస్తూ ఆడపిల్లలు అవనికి
ఆధారమంటూ ఉబుసు పోక
కబుర్లు విని, విని విషాదపు
నిశీధిలో మునిగి తేలుతూనే ఉన్నా
ముప్పుతిప్పళ్ళను ఎదుర్కొని
అంకురమై అవనికి ఏతెంచితినా! కర్కశత్వపు
కబంధ హస్తాలలో
కనుమరుగవుతున్నా
పెళ్ళై ఒక ఇల్లై ఆనందడోలికలో
ఊయలలూగుదామంటే
వరకట్నపు వాయనాలతో
అనంతానికి పయనమవుతున్న
లోకం పోకడ తెలియక
బంధాలు, అనుబంధాలంటూ
పడిచచ్చే నాకు
బతుకునివ్వమని
బతిమలాడుకోవాలా?
అన్నీ నేనై అవనిలా భరిస్తున్నా
అడుగడుగునా వంచనయే,
నాకు బతకాలని ఉంది…
బతుకు పుస్తక చివరి పేజీ
చదివే వరకు బతకనిచ్చి, బతుకునీయండిరా నన్ను