బుద్ధుడు తనకు తాను ‘తథాగతుడు’ అని సంబోధిస్తాడు. తథాగతుడు అంటే ఆది, అంతం లేనివాడని అర్థం. అభయముద్రతో ధ్యానముద్రలో చెట్టు కింద కూర్చున్న బుద్ధుడి బొమ్మ ఎవరికైనా గుర్తుకొస్తుంది. చరిత్ర పాఠాలలో క్రీ.పూ.563లో గౌతమబుద్ధుడు జన్మించాడని, యజ్ఞయాగాదులు, యుద్ధాల వల్ల జరుగుతున్న హింసను నివారించడానికి బౌద్ధ మతాన్ని, సంఘ ఆరామాలను స్థాపించి అహింస సిద్ధాంతాన్ని ప్రచారం చేశాడని చదివి ఉంటారు. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలోనే ఎన్నో బౌద్ధ క్షేత్రాలు ఉన్నప్పటికీ, నా దృష్టి ఎందుకో వాటి వైపు వెళ్ళలేదు. ఇప్పుడు బుద్ధుడి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఈ పుస్తకం ద్వారా తెలుసుకున్నాను. ‘విశాఖ ప్రాంతంలోని ప్రాచీన బౌద్ధ క్షేత్రాలతో మొదలుపెట్టి, బుద్ధుని జీవితగాథనూ, బౌద్ధం విస్తరించిన క్రమాన్నీ, ఆరామ జీవనాన్ని’ పరిచయం చేస్తుంది ఇది.
ఎత్తుగడలోనే బౌద్ధం ఇతివృత్తంగా ఉన్న గురజాడ కథ ‘మీ పేరేమిటి?’ లోని గురువు పరివర్తనను ఉదహరించడం అద్భుతంగా కుదిరింది. ఉత్తరాంధ్రను మొట్టమొదట చేరుకున్నది బౌద్ధమే అంటూ బుద్ధుడు అడుగుపెట్టిన ప్రాంతాల చరిత్రను, బౌద్ధ క్షేత్రాల వివరాలను రచయితలు ఇచ్చారు. బౌద్ధ సంప్రదాయాలు – పుణ్యక్షేత్రాల్లో తలనీలాలు సమర్పించడం, కాషాయ వస్త్రాలను ధరించడం… వైదిక ఆచారాలుగా అవతరించాయని అన్నారు. ‘చీర’ పదానికి మూలం బౌద్ధ భిక్షువులు ధరించిన ‘చీవారాలు’. బౌద్ధాన్ని ఆచరించినదీ, ఆదరించినదీ ప్రధానంగా వ్యాపారులే. మగధ రాజు బింబిసారుడు మినహా బౌద్ధం పుచ్చుకున్న వారు వారణాసి, శ్రావస్తి నగరాలకు చెందిన సంపన్న వ్యాపారులే. బుద్ధుడు తన జ్ఞానాన్ని పంచి పెట్టడం వీరితోనే మొదలైంది. ఉపాకుడు అనే ఒక సన్యాసి గౌతముడిని ‘ఎవరిని అనుసరిస్తూ నీవు ఈ ప్రపంచాన్ని త్యజించావు? నీకు గురువు ఎవరు? నువ్వు బోధించే ధర్మ సూత్రాలు ఏమిటి’ అన్న ప్రశ్నా, బుద్ధుని జవాబూ, క్రీ.పూ. 6వ శతాబ్దం నాటి భారత సమాజాన్ని గురించి తెలుపుతుంది. ఆ కాలంలో విభిన్న ఆలోచనలు, భావ స్వేచ్ఛ, జ్ఞానాన్వేషణకు శాస్త్రాలు, మార్గాలు ఉండేవని తెలుస్తోంది. తొలి ప్రవచనాన్ని చేసి ధర్మచక్ర గమనానికి బుద్ధుడు నాంది పలికిన సన్నివేశం, సాధారణ పౌరుడు యశుడు సంఘంలో చేరడం లాంటి ఉదంతాలు ఈ పుస్తకంలో ఉన్నాయి. బౌద్ధం జనాదరణ పొందడానికి, ప్రజల భాషలో శ్రోతల మానసిక స్థితి, గ్రహణ స్థితి, సంసిద్ధతలకు అనుగుణంగా బుద్ధుడు బోధనలను చేయడం, పాలకులు రాజపోషకులవడం కారణం అని రచయితలు అంటారు. గౌతముడిని పెంచిన తల్లి సంఘంలో చేరడానికి పట్టుబట్టడంతో స్త్రీల రాక మొదలయింది. వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది బౌద్ధమే. అన్ని కులాలకీ, వర్గాలకీ సంఘ ప్రవేశం కల్పించినదీ బౌద్ధమే. బౌద్ధ సంఘంలో చేరిన ప్రతి ఒక్కరి లక్ష్యం – ఆధ్మాత్మిక చింతన కాదు, సంఘ జీవనం సుఖమయ జీవనం కోసం కాదు, సభ్యులకు దొరికే నాలుగు వనరులు… భిక్షగా దొరికిన మెతుకులు, చెత్తకుప్పల్లో దొరికిన బట్టలు, చెట్లకింద నిద్ర, మూత్రాన్ని మందుగా వాడటం మాత్రమే. ప్రతి ఆరామమూ గణతంత్రం మాదిరి నిర్వహించబడేది. ఇక్కడి న్యాయవ్యవస్థ ప్రజాహితమైనది, హేతుబద్ధమైనది, సంక్షేమ రాజ్య లక్ష్యాలకు చేరువలో ఉండేది.
‘బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి’ అని స్మరణం చేస్తూ బౌద్ధువులు ఆ మూడింటినీ స్వీకరిస్తారు. బుద్ధుడు సుజాత ఇచ్చిన పాయసం తింటాడు, వేశ్య అయిన ఆమ్రపాలి ఆతిథ్యం స్వీకరిస్తాడు. తన పెంపుడు తల్లి సంఘంలో చేరడానికి పట్టుబట్టడంతో స్త్రీలకు అనుమతి ఇస్తాడు. యశుడు సాంసారిక జీవనం నుండి వచ్చి సన్యసించిన తొలి సాధారణ పౌరుడు. మంగలి ఉపాలి లాంటి వారినుంచి బింబిసార రాజుల వరకూ అందరినీ సమానం చేశాడు. స్త్రీలకూ, వర్గ విభజనకు అతీతంగా సామాన్య పౌరులకూ, సంఘంలో స్థానం కల్పించాడు. స్త్రీ పురుషులు కలిసి నివసించడం, నైతిక పతనానికి దారితీయకుండా ఉండడానికి సంఘ నియమావళిని తయారుచేశాడు. కామపూరిత వ్యామోహంతో స్త్రీల దేహస్పర్శను కోరడం, లైంగిక వేధింపులకు గురిచేయడాన్ని తీవ్ర తప్పిదాలుగా పరిగణించాడు. క్రమశిక్షణ అనేది నేరభావాన్ని తొలగించే ఉత్తమ సాధనం అని, అది అంతిమంగా బంధనాల నుండి విముక్తి కలుగజేస్తుందని బుద్ధుడు అనేవాడు. తన తదనంతరం సంఘం స్వయంచాలకంగా నడుస్తుందని నమ్మి వారసుడిని నియమించలేదు. బుద్ధుని అంతిమ క్షణాలు మనల్ని కదిలిస్తాయి. బుద్ధుడికి ఎనభై ఏళ్ళప్పుడు ఒక కార్మికుడు అతన్నీ, అతని పరివారాన్నీ భోజనానికి పిలుస్తాడు. ఎండబెట్టిన మాంసం పెడతాడు. దాంతో బుద్ధుని ఆరోగ్యం దెబ్బ తింటుంది. నొప్పిని భరిస్తూనే తన అనుచరుడు ఆనందునితో ఆ కార్మికుడిని ఎవరూ నిందించరాదని ఆజ్ఞాపిస్తాడు. త్రాగేందుకు నీళ్ళు అడుగుతాడు. దగ్గరలోని వాగుని ఎడ్ల బళ్ళు దాటడం వలన బురద నీరు మిగులుతుంది, దాన్నే తాగుతాడు. ‘ఒక పాతబడిన రథం మాదిరిగా నా శరీరం క్షీణించింది. ఇకమీదట మీపై మీరే ఆధారపడాలి. ధర్మం తప్ప మోక్షానికి మరో మార్గం లేదని గుర్తెరిగి నడుచుకోండి’ అని సందేశం ఇస్తాడు. తర్వాత హిరణ్యవతి నది ఒడ్డున సాల వృక్షాల నీడలో విశ్రమిస్తూ తనువు చాలిస్తాడు. ‘చావు పుట్టుకల నిరంతర పరిభ్రమణం నుండి శాశ్వతంగా విముక్తుడై నిర్యాణం పొందాడు.
కళింగ ఆంధ్రలోని బౌద్ధ క్షేత్రాల (శాలిహుండం, కళింగపట్నం, రామతీర్థం, సరిపల్లి గుట్ట, గుడివాడ దిబ్బ, పావురాల కొండ, తొట్లకొండ, బావికొండ, మాధవధార, బొజ్జన్నకొండ, లింగాల మెట్ట, కొత్తూరు, లింగరాజు పాలెం) విశేషాలను ఈ పుస్తకంలో పేర్కొన్నారు. తొట్లకొండకు ఆ పేరెలా వచ్చింది? రాతిలో నిర్మించబడిన ఆవాసాలను ఆరామాలు అంటారు. ఆ ఆరామ నిర్మాణ వివరాలు తెలుసుకోవచ్చు. శివలింగాలుగా స్థానికులు వాటిని పూజించడానికి కారణం వాటి ఆకారాలే! యలమంచిలి దగ్గర బయటపడిన కొత్తూరు బౌద్ధ క్షేత్రం వివరాలు ఉన్నాయి. సంస్కృతంలో ‘ఏరండ’ అంటే ఆముదపు చెట్టు. ఆముదాలవలస అనే ఊరి పేరు దాంతోనే వచ్చింది. మొదటిసారి ఆరామ నిర్మాణం చేసింది బింబిసారుడు. 12వ శతాబ్దం వరకు దేశవిదేశాలలోని బౌద్ధులకూ, పర్యాటకులకూ అది పవిత్ర క్షేత్రం. ఇప్పుడు స్థూపాల అవశేషాలు ఒక భాగంలో, మరో భాగంలో ముస్లింల శ్మశాన వాటిక మిగిలాయి. మనకున్న ఆరామాలు మాధవధార, బావికొండ, తొట్లకొండ, పావురాల కొండ. ఆరామాల చుట్టూరా ఒక ఎడ్ల బండి చుట్టిరాగలిగినంత వెడల్పు గల స్థలం వదిలిపెట్టాలన్న నియమం
ఉంది. చుట్టూ గోడో, కంచో ఉండేది. మొదట్లో చెక్కతో కట్టడాలు కట్టేవారు. విహారాలను భక్తులు సంఘానికి దానం చేసేవారు. అనాథ పిండికుడు జేతవనాన్ని దానం ఇవ్వడం గురించి ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. బౌద్ధాన్ని స్వీకరించాక అతడు బుద్ధుడికి బస ఏర్పాటు చేయాలనుకున్నాడు. రాజకుమారుడు జేతకుడి తోట నచ్చింది. కొనాలని అనుకున్నాడు. కాని రాకుమారుడికి ఇష్టం లేదు. వెంటబడ్డ వాడిని ఒదిలించుకునేందుకు తోట అంతా బంగారు నాణాలతో పరిపించి వాటిని తనకు ఇమ్మన్నాడు. అనాథ పిండికుడు కోటి ఎనభై లక్షల బంగారు నాణాలను తెప్పించి తోట అంతటా పరిపించి వాటిని చెల్లించాడు. బుద్ధుడిపై వాడికి ఉన్న భక్తికి మెచ్చి రాకుమారుడు ఆ వనాన్ని ఉచితంగా ఇచ్చేశాడు. అంతేకాదు, వనం చుట్టూ ప్రహరీగోడ, పెద్ద ద్వారం కూడా కట్టించాడు. విహార గదులు, సమావేశ స్థలి, తదితర సదుపాయాలను అనాథ పిండికుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం… భారత ఉపఖండం పైనా, ఆసియా, దక్షిణ ఆగ్నేయ ఆసియాలపైన మన వ్యాపారులకు ఉన్న గుత్తాధిపత్యం, అప్పటికింకా అంతర్జాతీయ వాణిజ్యం అంటూ ఏదీ లేకపోవడం.
బౌద్ధం విశిష్టతను ఎలా సంతరించుకున్నదీ వివరించబడింది. బుద్ధుడు ఇంద్రియ నిగ్రహమూ, నియమ వర్తనమూ, సాధన మార్గమూ లాంటి వాటిని నిర్వాణ మార్గాలుగా ఉపదేశించాడు. ఈనాడు వినిపించే శాంతీ, ధర్మమూ, సర్వ సమానత్వమూ, పరస్పర సహకారమూ, విశ్వమానవ ప్రేమ లాంటి నినాదాలన్నీ బౌద్ధంలో ఉన్నాయి. బుద్ధుని బోధకు గుర్తు ధర్మ చక్రం, శాంతి అహింసలకు సంకేతం. ధర్మ చక్ర పరివర్తనం బౌద్ధ ధర్మ బోధకే వాడబడినా, లోకంలో శాంతిని కూడా అది నెలగొల్పగలిగింది. ఈ పుస్తకం బుద్ధుని జీవిత గాథని, బౌద్ధం విస్తరించడాన్నీ, బౌద్ధ సంఘ కార్యకలాపాలనూ, ఆరామ జీవనాన్ని పరిచయం చేస్తుంది. కళింగ ఆంధ్రా అంతా నడిపిస్తుంది. ఆ ప్రాంత విశేషాలను కళ్ళముందు ఉంచుతుంది. చారిత్రక, పురాతత్వ వివరాల సేకరణ, దాన్ని మనకు పంచిపెట్టడం ఈ గ్రంథ రచయితల ధ్యేయం. బౌద్ధం పట్ల వారికి ఉన్న అనురక్తి అభినందనీయం. ఆరామవాసుల ఆచార వ్యవహారాలను కళ్ళముందు ఉంచారు, ఆసక్తికరమైన విషయాలను వెలికిదీశారు.
మధురవాడ… (విజయవాడ, గుడివాడ) పేర్లెలా వచ్చాయి? ‘వాడ’ను ‘బస్తీ’ అనే అర్థంలో వాడుతున్నాం. ఇక్కడ ‘వాడ బలిజీలు’ అనే కులస్తులు ఉన్నారు. ‘వాడ’ అనే మాట ‘ఓడ’ అనే తెలుగు పదం నుండి, ‘బలిజ’ అనేది సంస్కృత పదం ‘వణిజ’ నుంచి వచ్చిందని అనుకోవచ్చు. సముద్రపు ఇసుకలో బంక మట్టి దిబ్బలు ఉన్నాయి. బావికొండ ఆరామం దగ్గరున్నదే మధురవాడ. అప్పటి శాసనాల్లోని ‘విహారవాడ’. ఆరామాలని ఏర్పాటు చేసే ముందు అక్కడ ప్రకృతి వైపరీత్యాలను పరిగణనలోకి తీసుకునేవారు. దొంగతనాలు జరగకుండా గదులకు తాళాలు వేసుకునేవారు. ఆస్తులు ఉండరాని సన్యాసులకి ఈ అవసరం ఎలా వచ్చింది అంటే.. బుద్ధుని తర్వాత కొందరు భిక్షువులు విదేశాలతో వ్యాపారం చేయడం వలన. తొట్లకొండలో రోమన్ నాణాలు లభించడం దానికి గుర్తు. కొండల మీద, నదీ తీరాలలో నిర్మింపబడిన ఆరామాల నుండి అగుపడే రమణీయమైన ప్రకృతి దృశ్యాలు వారి అభిరుచికి అద్దం పడుతున్నాయి. నిర్మాణానికి సంబంధించిన ప్రతి అంశం… స్థలం, విస్తీర్ణం, నమూనా చిత్రం… సంఘం పరిశీలించి ఆమోదించేది. విహార గదుల్లో సౌకర్యాలు ఉండేవి. మంచాలు, పరుపులు, వాలు కుర్చీలూ, బల్లలూ… గదుల పరిరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్త జాబితా ఉండేది. తొట్లకొండలో స్థూపాల పూజ జరిగినట్లు తెలుస్తోంది. స్థూపానికి ప్రాకృత రూపం ‘ధూపం’. రెండింటికీ అర్థం ‘కుప్ప’ లేక ‘గుట్ట’. చైత్యం ‘చితా’ అన్న దానిలోంచి వచ్చింది. తమ ఆరాధన కోసం బౌద్ధులు బుద్ధుని అవశేషాలపైన (శిరోజం, దంతం) వాటిని నిర్మించుకున్నారు. శిల్పంలో శైవ సంప్రదాయ ప్రతీకలు కూడా కనిపించేవి. వీటిలో కొన్ని ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి. కృష్ణానది లోయలో స్థూపాలను శిల్పకళతో తీర్చిదిద్దారు. అమరావతి, జగ్గయ్యపేట క్షేత్రాలు. ‘ప్రపంచంలో ఈ అద్భుత కళను సృష్టించినందుకు ఆంధ్రులు గర్వించకుండా ఎందుకుంటారు?’ అన్న రాహుల్జీ ప్రశంసను అందుకున్నాయి. సమావేశ స్థలి మరో ముఖ్య బౌద్ధ కట్టడం. వంటశాల, కొట్టు గదులూ ఉండేవి. అందుకే ‘ఇది సరికాదు, ఆనందా! మన నివాసాలలో వంటలు చేసుకోవడం, మనకు నచ్చినదల్లా వండుకుని తినడం శ్రమణుల జీవన విధానం కానే కాదు’ అని బుద్ధుడు అనాల్సి వచ్చింది. ఆరామాలకు దాన ధర్మాలు చేయడానికి ఉపాసకులు (భక్తులు) చూపించే ఉత్సాహానికి ఉదాహరణగా కుశినార వాసుడు రోగ ఉదంతాన్ని పొందుపరిచారు. ‘ప్రజలు పెట్టే భిక్షతో సహా అన్ని వనరులనూ మన సోదరులు నిష్పాక్షికంగా పంచుకున్నంత కాలం సంఘం వృద్ధి చెందుతుంది, లేదంటే క్షీణిస్తుంది’ అని బుద్ధుడు ఆర్థిక సమానతా సూత్రాన్ని అమలు పరచడానికి కృషి చేశాడు. బిక్షువులకి సేవా ధర్మాన్ని నిర్దేశించాడు. ఆరామ పాలనా వ్యవహారాలూ వీలైనంత వరకు బిక్షువులే చూసుకునేవారు. (బౌద్ధం పతనం చెందాక తెలుగు దేశంలోని విహారాలే ‘లంజేదిబ్బలు’గా వ్యవహరించబడ్డాయి.)
బౌద్ధానికి సంబంధించిన సాహిత్యం ఎంతో ఉంది. తిరుపతి వెంకట కవులు బుద్ధ చరిత్రం రాసినప్పటినుంచి, పింగళి-కాటూరి, నండూరి కృష్ణమాచార్యులు, అద్దేపల్లి రామమోహనరావు లాంటి ఎందరో కవులు రాశారు. ఈ కాల్పనిక సాహిత్యాన్ని పక్కన పెడితే, బౌద్ధం గురించి రాసిన కాల్పనికేతర సాహిత్యం చాలా ఉంది. చారిత్రక పరిశోధనలు ఉన్నాయి. ఇటీవల వచ్చిన ‘తథాగతుని అడుగుజాడలు’ బౌద్ధం గురించి, కళింగ ఆంధ్రలోని బౌద్ధ క్షేత్రాల గురించి ఎన్నో విశేషాలను తెలిపింది. ఈ గ్రంథ రచయితలు వైవిధ్యం కోసం మధ్యలో సన్నివేశాల్నీ, సంభాషణల్నీ, ప్రముఖుల సుభాషితాలనీ చేర్చారు. రచయిత్రి ఆ ప్రాంతంలో తిరుగుతూ ఉన్నప్పుడు ఒక గొర్రెల కాపరి కనిపిస్తాడు. పేరు బుద్ధాల అప్పన్న. ఇంటిపేరు బుద్ధుడి పేరుకి మరో రూపం. అప్పన్న సింహాచలం కొండమీది దేవుడు. రచయిత తవ్వకాలు పాత కట్టడాల కోసం అంటే అప్పన్న ‘ఎండి బంగారం’ కోసం అంటాడు. సముద్రం గోలకి మకాం మార్చుకున్నాడని అంటాడు.(దయచేసి గొర్రెల కాపరి మాటలకు నవ్వకండి. ఇవాళే యాదాద్రి దేవాలయ అధికారులు అనలేదా? కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? మనం మారలేదా? యాదాద్రి దేవుడు ఎందుకు మారడు?) పండుగ రోజుల్లో కొండమీద దీపాలు పెడతామని చెబుతాడు. ‘నేరాల చదును’ చూపిస్తాడు. అవే సమాధులు. సందర్భోచితంగా శ్రీ శ్రీ ‘సుప్తా అస్థికలు’లోని ‘అవి ధారా గర్భమున మానవాస్థికా పరంపరలు… ఆ మనుష్యాస్థికలు నిద్రలో మునింగి/సంచరించును భైరవ స్వప్న వీడి…’ ఉదహరిస్తారు. అప్పన్న హఠాత్తుగా మాయమవుతాడు. అందులో సమాధులలోని పూర్వీకుల అదృశ్య హస్తం ఉందా? అంటూ మన కుతూహలాన్ని రేకెత్తిస్తారు.
దీనికి వెనువెంటనే సమతూకంగా, విరుద్ధంగా… నేటి అప్పన్నతో పాటు నాటి సిహుని కథని ఇచ్చారు. సేనాని సిహుడు జైన మతస్థుడు. జైన, బౌద్ధ మతాల మధ్య వైరం ఉన్నప్పటికీ, సిహుడు బుద్ధుని బోధనలు విని సంఘంలో చేర్చుకోమని కోరుతాడు. అనుమతి ఇస్తూ జైనులు ‘బిక్షాటనకు వచ్చినప్పుడల్లా లేదనకుండా బిక్ష వేస్తున్నావు. ఈ సత్సంప్రదాయాన్ని నీవు భవిష్యత్తులో కూడా కొనసాగించాలి సుమా’ అంటాడు బుద్ధుడు. సిహుడు బుద్ధుడికిచ్చిన విందులో ఎద్దు మాంసాన్ని వడ్డిస్తాడు. సిహుడు బౌద్ధాన్ని స్వీకరించినందుకు కోపగించిన జైనులు మాంసాన్ని తిన్న బుద్ధుడిని తప్పు పడతారు. ఆసక్తిదాయకమైన ఈ వివాదం ఆనాటి మతాల మధ్యనున్న పోటీకి అద్దం పడతాయి. (మతాలు భౌతిక సామాజిక వ్యవస్థ నుంచే పుట్టాయని అనడం సరైనదే. మతాలన్నీ సుఖాన్నే ఎరగా వేశాయి. బౌద్ధం ఈ లోకంలో సుఖాలు చూపించలేని సాంఘిక పరిస్థితిలో, స్వర్గాన్ని సృష్టించి జనాన్ని వంచించినట్లయింది. నేడు బాబాలకు గిరాకీ హెచ్చవడం సాంఘిక పరిణామ ఫలితమే కదా!)
‘తథాగతుడి అడుగు జాడలు’ ఒక మహోన్నత మానవుని పాద ముద్రలు, పథముద్రల గురించే కాదు, అనేక ప్రాంతాల ప్రజల ఆహార వ్యవహారాలను కూడా తెలియజేస్తుంది. బౌద్ధ ఆరామాలను కళ్ళముందు ఉంచుతుంది. మనం కోల్పోయిన వాటిని చెబుతూ, శిథిలమయిపోయిన వాటిని చూపిస్తూ రచయితలతో పాటు మనకూ ఆవేదన కలిగిస్తుంది.
బౌద్ధ సంఘాలు అనతి కాలంలోనే అనేక కారణాల వలన సంఖ్యాపరంగా తదితర ఆధ్మాత్మిక సంస్థలను మించి పోయాయి. బౌద్ధం భగవంతుడిని అంగీకరించలేదు. బౌద్ధులకు వర్ణ భేదం లేదు, స్త్రీ పురుష భేదం లేదు, సర్వ సమానత సిద్ధాంతం వారిది. బుద్ధుడు మధ్యే మార్గాన్ని బోధించాడు. ఒకవైపు విలాసమయ జీవనాన్నీ, మరోవైపు అంతులేని వస్తు వినియోగాన్నీ ఖండించాడు. ‘కాయ దండన’ కాదు, కావాల్సింది ‘మానసిక సంయమన’ నియమం పాటించడం అని బోధించాడు. బౌద్ధాన్ని రాజులే పోషించడం వల్ల, ధనికులు అన్ని సదుపాయాలూ ఏర్పాటు చేయడం వల్ల, కొందరు ఆరామంలో జీవనాన్ని హాయిగా వెళ్ళబుచ్చడం కోసం చేరారు. బుద్దుని కాలంలోనే అనేక నియమాలు సడలించబడ్డాయి. మలి దశలోని బౌద్ధులు సంయాసులైనా ఎంతో సంపాదనాపరులు.
తన ఆస్తినంతా ధారపోసిన అనాథ పిండికుడి వృత్తాంతం ఉంది. అతను మరణశయ్యపైన ఉన్నాడని విన్న బుద్ధుడు తన శిష్యుడు ఆనందుడిని పంపుతాడు. తాను అప్పుడు విన్న అద్భుత ప్రపంచం భిక్షుకులకు మాత్రమే బోధించేదని తెలిసి, అనాథ పిండికుడు ఆనందుడిని అటువంటి ధర్మ బోధనలను అందరికీ చేయమని కోరతాడు. అలా బౌద్ధం సరళీకృతం అయింది. పుణ్యం సంపాదించుకోవడానికి ఉన్న అనేక మార్గాలలో కొన్ని… బౌద్ధ సంఘం పట్ల చూపించాల్సిన భక్తి శ్రద్ధలు, దానధర్మాలు, ధ్యానం, నిర్మలమైన పరివర్తన, కోరికలను త్యజించడం, ఇతరుల కోసం త్యాగం చేయడం, కష్టాలలో ఉన్న వారికి సాయపడడం లాంటివి. నలందా ఆరామానికి వందల గ్రామాలను దానం ఇచ్చిన ఉదంతం ఉంది. ఒక ధనికుని మామిడి తోటను కొంతమంది వ్యాపారులు పది కోట్ల బంగారు నాణాలనిచ్చి కొని బుద్ధునికి కానుకగా ఇచ్చారు. దాని నిర్వహణ ఖర్చు రాజు భరించేవాడు. ఆ గ్రామాల్లోని జనం ప్రతి రోజూ అక్కడి వారికి అవసరమయ్యే తిండి, సామానులను ఉచితంగా పంపేవారు.
బౌద్ధ మత ప్రభావంవల్లే జన జీవనంలో మౌలికమైన మార్పులు వచ్చాయి. స్థానికులు ఐశ్యర్యవంతులయ్యారు. పట్టణాల స్థాపన జరిగింది. బుద్ధుని అనంతరం కూడా చాలా కాలం బౌద్ధం ఆదరణకు నోచుకోవడానికి కారణం డి.డి.కోశాంబి చెప్పినట్లు ‘త్వరితగతిన మారుతోన్న ఆనాటి సమాజపు సాంఘిక, ఆర్థిక, రాజకీయ అవసరాలకు సరిపడ్డ సమగ్రమైన భావజాలంగా, ప్రజల అభిలాషలకు నేరుగా స్పందించిన సంపూర్ణమైన పరిష్కారంగా అది ఎంతోకాలం నిలిచి ఉండడమే!
రచయిత్రి తన మిత్రుడు, పరిశోధకుడు అయిన రాబర్ట్ ష్నిక్‌తో కలిసి భీమునిపట్నం ప్రాంతంలోని పావురాల కొండ పర్యటిస్తారు. ధర్మ చక్ర చిహ్నాలతో ఉన్న పాద ముద్రలను చూస్తారు. బోధి వృక్షం, సింహాసనం, త్రిరత్నాలు, బుద్ధ పాదాలు బుద్ధునికి ప్రతీకలు. ఆ పాద చిహ్నాలు, సమాధులు అక్కడ నివసించిన భిక్షువులవి అయ్యుండవచ్చు. పావురాల కొండపైన ‘పులి-మేక’ ఆట పటాన్ని చూస్తారు. ఆరామ జీవనంలో ఆటపాటలకు కూడా తావు ఉండేదనడానికి అది గుర్తు. బావికొండపై ధాతు పేటికలను చూడొచ్చు. అవి బుద్ధుడివని అనడానికి ఆధారం మాత్రం లేదు. ఆరువందల ఏళ్ళకు పైగా ఇక్కడి ఆరామాలలో బౌద్ధం వర్ధిల్లింది.
పర్యావరణ పరిరక్షణకు కంకణం కట్టుకున్న రచయిత్రి రాణీ శర్మ చివర్లో తన కొక్కిరాపల్లి పర్యటనల వివరాలను పొందుపరిచారు. కొక్కిరాపల్లికి చెందిన ప్రొఫెసర్ కొల్లూరు సూర్యనారాయణ సాయం తీసుకుంటారు బౌద్ధ అవశేషాలు దొరికిన స్థలాలను గుర్తుపట్టడానికి. అయితే ఆ గ్రామస్థులకి వీళ్ళ పరిశోధనలు నచ్చవు. క్షణాలమీద కామందుకు కబురు అందిస్తారు. ‘అక్కడ స్థూపం ఉండాలి’ అన్న ప్రొఫెసర్ మాటలను అతడు కొట్టిపారేస్తాడు. మర్యాదగా వాళ్ళని అక్కడనుండి తరిమేస్తాడు. ‘చిన్నప్పుడు చూసిన పురాతన కట్టడాలన్నీ నామ రూపాలు లేకుండా మాయమయ్యాయి’ అని ప్రొఫెసర్ వాపోతాడు. రచయిత్రి ఆ దుస్థితికి ‘వ్యవసాయం, పరిశ్రమల స్థాపన, గృహ నిర్మాణాలు’ లాంటివి కారణాలుగా పేర్కొంటారు. ‘అభివృద్ధి’కి వారసత్వ సంపదను కాపాడుకోవడానికి మధ్య జరిగే సంఘర్షణలో విజయం అభివృద్ధినే వరిస్తోందని అంటారు.
‘బుద్ధాం’ పేరులోనే దానికున్న బౌద్ధ ప్రాశస్త్యం తెలుస్తోంది. ఇక్కడ బుద్ధుని రాగి ప్రతిమలు దొరికాయి. పురాతనమైన బావులు బయటపడ్డాయి. పెద్ద పెద్ద ఇటుకలు లభించాయి. పురాతత్వ సంపద గురించి అధికారులకు కూడా తెలుసు, కానీ వారు నిస్సహాయులు. ‘నిజానికి కాలం, పురోభివృద్ధి తీసుకొచ్చిన ఒత్తిళ్ళను తట్టుకొని కొన్ని ప్రదేశాలైనా నిలవడం మన అదృష్టం’గా భావిస్తారు రచయిత్రి. సింహాచలంలోని ధారపాలెం, మాధవ ధార, భోగాపురంలోని గుడివాడ దిబ్బ బౌద్ధ క్షేత్రాల గురించి ఆసక్తికరమైన విషయాలు చెబుతారు. అక్కడి విష్ణు దేవాలయ పూజారి ఆ ‘గుడికి, బౌద్ధానికీ ఏ సంబంధమూ లేదు’ అని నిష్కర్షగా జవాబిస్తాడు. రచయిత్రికి మాత్రం స్థూపం పైన వినియోగించిన ఇటుక ముక్క దొరుకుతుంది. ‘మన పూర్వీకులు సృష్టించి మనకు అందజేసిన కట్టడాలనూ, శిల్ప సంపదనూ, కళాఖండాలనూ ఒకసారి పోగొట్టుకుంటే వాటిని తిరిగి చేజిక్కించుకోవడం అసాధ్యం. సమిష్టి ఆస్తిని కాపాడుకోవాలి’ అని ముగిస్తారు. రచయిత్రితో ఏకీభవించని వారు ఎవరూ ఉండరు. అయితే సమస్యల్లా పిల్లి మెడలో గంట కట్టేదెవరు?
ఈ పుస్తకం బుద్ధుని జీవిత గాథని బౌద్ధం విస్తరించడాన్నీ, బౌద్ధ సంఘ కార్యకలాపాలనూ, ఆరామ జీవనాన్ని పరిచయం చేస్తుంది. కళింగ ఆంధ్ర అంతా నడిపిస్తుంది. ఆ ప్రాంత విశేషాలను కళ్ళముందు ఉంచుతుంది. చారిత్రక, పురాతత్వ వివరాల సేకరణ, దాన్ని మనకు పంచిపెట్టడం ఈ గ్రంథ రచయితల ధ్యేయం. బౌద్ధం పట్ల వారికి ఉన్న అనురక్తి అభినందనీయం. ఆరామ వాసుల ఆచార వ్యవహారాలను కళ్ళముందు ఉంచారు, ఆసక్తికరమైన విషయాలను వెలికితీశారు. ఈ రకమైన సాహిత్యం గురించి స్మరించుకోవడం ఎంతైనా అవసరం. ఇందుకుగాను అదివరకే పరిశోధకులు ఎన్నో పుస్తకాలు రాసినప్పటికీ, అవి చాలావరకూ పాఠ్యపుస్తకాలలాంటివి. ప్రత్యేకంగా కళింగా ఆంధ్ర బౌద్ధ క్షేత్రాల గురించి ఆసక్తి కలిగించేలా ఎంతో పఠనీయంగా రాసిన పుస్తకం ఇదే. ఈ పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్‌వారు ప్రచురించి మహోపకారం చేశారు. రచయితలకీ, ప్రచురణ సంస్థకీ తెలుగు పాఠక లోకం రుణపడి ఉంటుంది.