మిట్టమధ్యాహ్నపు నీడ – ఉమా నూతక్కి 

 

మిట్టమధ్యాహ్నపు నీడ… చల్లని స్పర్శల నలుపు కాదు చిత్తడి రొచ్చుల తెలుపు…

పట్టపగటి ఎండ కాదు… గుడ్లగూబల రాత్రి కార్చే రసి…

గుడ్డు చిదిపిన పాము పాకి వెగటు జిగటల గిజురు

ఊసరవెల్లి శ్లేష్మంలో ఊపిరి గిజగిజ…

బొద్దింక నెత్తుటి మరక… బొచ్చు పురుగు పారాడిన దద్దురు…

అసహ్యం తాకింది… చీదర అంటింది… రోత ఒరిసింది…

గుండెను చీల్చిన కేక గొంతు దాటడంలేదు…

గట్లు తెగిన ఘోష కంట్లో ఆగడంలేదు…

ప్రాణం లుంగలు చుట్టుకుపోతోంది… దుఃఖం ముంచెత్తుతోంది…

ఎక్కిళ్ళు… ఎగశ్వాస…

అమ్మా… అమ్మా…

…..

మిథునా… మిథునా…

ఎవరో భుజాలు కుదుపుతున్న స్పర్శకి లేచింది మిథున, ఆ చేతుల్ని విదిలించి కొడుతూ.

ఆందోళన, అయోమయం అర్జున్‌ ముఖంలో. అంత నిద్రలో కూడా తనను విదిల్చి కొట్టిందని చిన్నబుచ్చుకున్నట్టు కూడా తెలుస్తోంది.

మెల్లగా తేరుకొని చెప్పింది మిథున ‘సారీ, అర్జున్‌’.

‘ఏమయ్యింది…’

అడగడం అతనికి మొదలు కాదు, ఆమెకి కొత్తా కాదు.

దూరంగా జరగబోతున్న అతని మెడ చుట్టూ చేతులు వేసి గుండెల్లో తల పెట్టుకుంది మిథున. ఆమె కళ్ళ తడి స్పర్శ తెలుస్తోంది అతనికి. అతని మనసు నీరయిపోతోంది. సంకోచంగా ఆగిపోతున్న అతన్ని అల్లుకుపోయింది.

పసిపాపలా గుండెల మీద నిద్రపోతోంది మిథున. కానీ అప్పుడప్పుడూ మడతపడుతున్న భృకుటి చూస్తుంటే ఆమె కలల్లో సంచరిస్తున్నట్లు చీకట్లు కనిపిస్తున్నాయతనికి. పసిపాపలా పడుకున్న మిథునని చూస్తే ఒక్కసారి అతని మనసు ప్రేమతో నిండిపోయింది. ఆమెని అంత కలవరపెడుతున్న విషయం ఏమిటి??

లేచి బయటికి వచ్చి బాల్కనీలో నించున్నాడు అర్జున్‌. అతనికి ఏమీ అర్థం కావట్లేదు. కానీ, ఏదో ఒకటి చేయాలి. ఎప్పుడూ నవ్వుతూ తుళ్ళుతూ ఉండే మిథున హఠాత్తుగా నిద్రలో పడుతున్న వేదన అతన్ని విస్మయానికి గురి చేస్తుంటుంది. ఒకవేళ ఆమెకి తనతో పెళ్ళి ఇష్టంలేదా అంటే, ఆ అవకాశం కూడా లేదు. మిథున అతని మేనత్త కూతురు. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఇద్దరికీ నాలుగేళ్ళు తేడా. హాస్పిటల్‌లో మిథున పుట్టినప్పుడు నాయనమ్మ పొత్తిళ్ళలో గులాబి మొగ్గలా ఉన్న ఆ పసిపాపను అమ్మ చాటు నుంచి చూస్తున్నప్పుడు, ‘నీ పెళ్ళాం రా’ అని నాయనమ్మ చెప్పడం, అదేమిటో అర్థం కాకపోయినా సిగ్గుపడుతూ దగ్గరికి వెళ్ళి బుగ్గలు మెల్లగా తాకడం ఇప్పటికీ గుర్తే అర్జున్‌కి.

మిథున చిన్నప్పుడు అత్తయ్య వాళ్ళు ఒరిస్సాలో ఉండేవారు. ప్రతి సెలవలకి తను వెళ్ళేవాడు. నాయనమ్మ ప్రాణం తీసి తీసుకెళ్ళేదాకా గొడవ చేసేవాడు. లేకపోతే అత్తయ్యే పిల్లల్ని తీసుకువచ్చేది. మిథున ఉన్నన్ని రోజులూ అతనికి వేరే ప్రపంచం ఉండేది కాదు. ఇద్దరూ కలిసి ఆడుకున్న బొమ్మలాటల దగ్గర్నుంచి ఏమీ మర్చిపోలేదతను. అర్జున్‌ దృష్టిలో ఆమె ఒక అద్భుతం అప్పుడూ, ఇప్పుడూనూ. ఆ తర్వాత అతను పదో తరగతి చదువుతుండగా, తండ్రికి అమెరికాలో ఉద్యోగం రావడంతో అతను కూడా వెళ్ళిపోయాడు. రెండేళ్ళకి ఒకసారి తను వచ్చినప్పుడల్లా అత్తయ్య ఇంట్లోనే ఉండేవాడు. చిన్నప్పుడు గలగలా గోదారిలో ఉండే మిథున రానురానూ గంభీరంగా మారిపోయింది. అయినా తన పట్ల ఆమె చూపించే ప్రేమ మాత్రం అలానే ఉండేది. చివరికి తమ పెళ్ళి గురించిన ప్రపోజల్‌ను పెద్దవాళ్ళు తెచ్చినపుడు మిథునే ముందు ఒప్పుకుని, తనను కూడా ఒప్పించింది.

… … …

ఎప్పుడు వచ్చిందో వెనక నుంచి వచ్చి గట్టిగా అతన్ని హత్తుకుంది మిథున.

ఆలోచనల్లోంచి తేరుకుని, ‘ఏమయ్యిందిరా… ఎప్పటి కలేనా?’ అని అడిగాడు. ఏమీ సమాధానం చెప్పలేదామె. బలహీనంగా నవ్వి, ‘పడుకుందామా, నీకు రేపు కాన్ఫరెన్స్‌ ఉందన్నావ్‌’ లోపలికి వెళ్తూ అంది.

లాభంలేదు, నాయనమ్మతో మాట్లాడాలి అనుకుంటూ లోపలికి వెళ్ళి పడుకున్నాడు.

పొద్దున్నే అర్జున్‌ లేచేటప్పటికి మిథున దాదాపుగా వంట పూర్తి చేసేసింది. రాత్రి తాలూకా నలత ఆమె మొహంలో కొంత కనిపిస్తోంది కానీ, సహజంగా తనలో ఉండే హుషారు నీరసాన్ని డామినేట్‌ చేస్తోంది. ‘కాన్ఫరెన్స్‌ అటెండ్‌ అవ్వాలిగా, ముందు నువ్వెళ్ళిపో. మన ఆఫీసుకి నేను తర్వాత వెళ్తా’ అర్జున్‌కి రెండోసారి కాఫీ ఇస్తూ చెప్పింది. పెళ్ళికి ముందు హైదరాబాద్‌లో వర్క్‌ చేసేది. ఆరు నెలల క్రితం పెళ్ళి అయ్యాక, పాత కంపెనీకి రిజైన్‌ చేసి అర్జున్‌ కంపెనీలోనే చేరింది.

బ్యాగ్‌, కార్‌ కీస్‌ తీసుకుని బయటికి వెళ్తున్న అతన్ని చేయి పట్టుకుని చిన్నపిల్లలా గుంజుతూ, ‘నా మామూలేదీ’ చిలిపిగా అడిగింది. తనొక్కడే బయటికి వెళ్తుంటే ఆ మామూలిచ్చి వెళ్ళాలి. తేరిపారా చూశాడు మిథునని. పీడకలల తొక్కిడిలో కళ్ళంతా కుంకుమ జీరలు పూశాయి. అయినా, ఎలాంటి కల్మషం లేకుండా పసిపాపలా నవ్వుతున్న ఆమెని దగ్గరికి తీసుకుని రెండు కళ్ళమీద మెత్తగా ముద్దు పెట్టుకున్నాడు.

‘కాసేపు పడుకో. రాత్రి నిద్ర లేదు నీకు’ చెంప మీద తట్టి వెళ్ళిపోయాడు బయటికి.

తలుపేసుకుంటుండగా ఎదురింటి తలుపు తెరుచుకుంది. ఎదురింటతను, అర్జున్‌ వయసే ఉంటుంది, ఆఫీస్‌కి బయలుదేరాడనుకుంటా.

ఓ పాపను ఎత్తుకున్నాడు. ఎత్తుకునేంత చిన్నదేం కాదు. పాప బుగ్గలు పుణుకుతున్నాడు. చెవులు మెలేస్తున్నాడు.

వెనకే మురిసిపోతూ అతని భార్య.

‘అబ్బా వదులు మామా’ కిలకిలా నవ్వుతోంది పాప. కానీ గింజుకుంటోందని తెలుస్తోంది.

అటే చూస్తున్న మిథునతో ‘మా అన్నయ్య కూతురు. వచ్చిందంటే ఇంక ఈయన వదిలిపెట్టరు’ నవ్వుతూ చెప్పింది ఎదురింటామె.

‘సాయంత్రం చెప్తా నీ పని’ అతని చేతుల్లోంచి విడిపించుకొని దూకిన పాపని చూస్తూ అన్నాడతను.

భళ్ళున తలుపేసుకుని పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళింది మిథున.

సాయంత్రం చెప్తా నీ పని..?

‘ఇప్పుడు తప్పించుకున్నావ్‌… దొంగపిల్లా.. సాయంత్రం చెప్తా…’

సా…యం…త్రం…చె…ప్తా…నీ…ప…ని…

పొగులుతున్న దుఃఖం. తన్నుకొస్తున్న కోపం.

తప్పించుకుందే కానీ, తూనీగ రెక్కలకి వదలని సాలీడు జిగురు.

ఏంటిది… తెమడ… చీమిడి… కాదు ఇంకేదో… నీలం ఫ్రాకు మీద తెల్లగా… చిక్కగా… తడిగా…

అంటుకోలేదు. అంటించాడు. ఎలుగుబంటి చేతులతో వెనకనుంచి చుట్టేసి… నోరు నొక్కేసి..

నడుం కింద గౌనుకేదో తాకుతోంది. అదేంటో సరిగా తెలియకపోయినా గుండెలోకి మాత్రం బాకులు దిగుతున్నాయి.

భయం… కంగారు… అసయ్యం… సిగ్గు… ఏడుపు…

గాబు… కాగు… బొక్కెన… అన్నీ ఖాళీ!

పగుళ్ళిచ్చిన తొట్టిలో నిలవని నీళ్ళు కంటిలోంచి కారిపోతున్నాయ్‌ ధారాపాతంగా.

ఓ చేత్తో పంపు కొట్టుకుంటూ మరో చేత్తో మరక తడుముకుంటూ… కడుక్కుంటూ… ముక్కు చీదుకుంటూ…

కళ్ళు తుడుచుకుంటూ…

ఎంత కడిగినా పోదేం… ఇన్నేళ్ళయినా వదలదేం…

కడుక్కుంటుంది తను ఒక్కత్తేనా…

ఎదురింటి పాప…

‘అబ్బా వదులు మామా…’

‘సాయంత్రం చెప్తా నీ పని…’

ఏదో పూనకం పట్టినట్లు ఎదురింటి తలుపు కొట్టింది.

మండుతున్న కళ్ళు… వణుకుతున్న పెదాలు… చెదిరిపోయిన జుత్తు… చెంపల మీద చారికలు…

మిథునని చూసి ఎదురింటామె కంగారుగా అడిగింది, ‘మిథునా, ఏమయ్యిందండి.’

‘బుజ్జి కుందేళ్ళ వెనక తోడేళ్ళు పొంచాయి… డేగ తన్నుకు పోతుంది, కోడిపిల్లని దాచుకోవాలి.’

మిథున మాటలకి అయోమయంగా చూసింది. ఇదేం పట్టించుకోకుండా కార్టూన్‌ ఛానల్‌లో ఏదో చూస్తున్న పాప వంక వేలు చూపిస్తూ, ‘పాప జాగ్రత్త…’ అని గిర్రున వెనక్కి తిరిగింది మిథున.

… … …

‘ప్రియమైన బావా…

సారీ…

కాదు… తడవ తడవకీ చెప్పే ఈ సారీలు ఇంక వద్దు బావా…

మనం విడిపోదాం…’

ఇంతకాలం అర్జున్‌కి చెప్పలేకపోయినదంతా ఉత్తరంలోకి దించుకొందామనుకున్న మిథున ‘విడిపోదాం’ అని రాశాక పెన్ను పడేసి చేతుల్తో ముఖం కప్పుకొని బావురుమంది.

కాటేయాలని, కబళించాలని చూసిన కట్లపాము దర్జాగా తిరుగుతుంటే, అభం శుభం తెలియని పసి పావురం బతుకంతా తల్లడిల్లాలా? ఎందుకు నాకింత శోకం… ఈ కన్నీటి ఖైదు నుంచి నాకు విడుదలే లేదా? ఎవడి నేరానికో నాకు శిక్షేంటి?!

నా తోడు… నా ప్రాణం… నా బావతో విడిపోవడమా?

కానీ, నాతో తనకి సుఖం, శాంతి ఏమున్నాయ్‌? ఎంత కాలం భరించాలి?

తడిచి చివికిన కాగితం నలిపి పడేసి, మళ్ళీ మొదలుపెట్టింది.

‘బావా… గుర్తున్నాయి కదూ! ఒరిస్సాలో ఒక పల్లెటూర్లో ఉండేవాళ్ళం కదా మేము. నువ్వెలా మర్చిపోతావులే. సెలవలు వచ్చాయంటే చాలు, అత్తమ్మోళ్ళ ఊరికి అంటూ అమ్మమ్మని సతాయించి లాక్కొచ్చేవాడివిగా. నాకప్పుడు పదేళ్ళు అంతేగా. పచ్చటి అడవి, విశాలమైన కాలనీ, బోలెడు మంది స్నేహితులు, ఆడుకున్నన్ని ఆటలు, అప్పుడప్పుడూ వచ్చే నువ్వు. బాల్యం ఇంత అందంగా ఉంటుందా అనిపించే రోజులు కదా అవి. ఒకటే లోటు. ప్రాజెక్టు ఏరియా కాబట్టి ఇంటర్‌ స్టేట్‌ అగ్రిమెంట్‌లో భాగంగా ఇంజనీర్లు, ఉద్యోగులలో తెలుగువాళ్ళం కొద్దిమందే. అందుకే, స్కూల్‌లో మాత్రం ఒరియా మీడియం! చెట్టుదీ, పుట్టదీ భాషతో, యాసతో సంబంధం లేని ఘోష. మనకే కదా ఈ తేడాలు. ఇంట్లో అమ్మే చెప్పేది పుస్తకాలు తెప్పించి. అయితే, చదువింక సాగట్లేదని, విజయవాడలో కమలత్త (నాన్న రెండో చెల్లెలు. నువ్వు పోరంకి పిన్ని అనేవాడివి గుర్తుందా) ఇంట్లో ఉంచారు నన్నూ, అక్కనీ. ఇంటిని ఆనుకునే స్కూల్‌ కాంపౌండ్‌.

చిన్నప్పటి నుంచి వేరే రాష్ట్రంలో పెరగడం, ప్రాజెక్ట్‌ ఏరియాలో ఉండే కాస్మో కల్చర్‌, వేరు వేరు భాషల స్నేహితులతో ఇంగ్లీష్‌ మాధ్యమం కాబట్టి అలవోకగా వచ్చే మా ఇంగ్లీష్‌ పదాలు, వచ్చీ రాని మా తెలుగు… అవన్నీ అప్పటి ఆ స్కూల్‌కి హాట్‌ టాపిక్స్‌. కమలత్త, భుజంగరావ్‌ మామయ్య వాళ్ళ ఇద్దరు పిల్లలూ మా ఈడు వాళ్ళే. కానీ, కమలత్త మాతో బండెడు చాకిరీ చేయించేది. అక్క నాకంటే పెద్దదే కానీ, ఎంత ఒక్క ఏడాదేగా. తనూ చిన్నపిల్లే. బారెడు జుట్టుండేది దానికి. తను నూనె రాసుకుని జడేసుకుని, నాకూ వేసేది. కొట్టుడు పంపుతో పెద్ద గాబు నిండా నీళ్ళు కొట్టి పోయాలి. నేను రెండు బక్కెట్లు కొట్టాక చెయ్యి నొప్పెట్టి చూసుకుంటుంటే, నన్ను పక్కన కూర్చోబెట్టి అక్కే మొత్తం కొట్టి పోసేది. ఆరిందాలా అన్ని విధాలా కాపు కాసేది నన్ను. చదువూ, ఆటపాటలు, పనీ ఇవన్నీ ఒక ఎత్తు కానీ… భుజంగం మామయ్య రూపంలో ఆ రాక్షసుడు ఒక ఎత్తు. ముద్దు చేస్తున్నట్లు దగ్గరకు తీస్తుండేవాడు. ఆ తాకుడులోనే తేడా తెలిసిపోయేది. సాయంత్రం అయితే ఏదో అసౌకర్యం నన్ను చంపేసేది. తప్పించుకు తిరగడంతోనే సరిపోయేది నా టైమంతా. అతని దగ్గరకు తీసుకొని వేళ్ళతో తడుముతున్నప్పుడల్లా నల్ల పొడలబల్లి పాకినట్లు అనిపించేది.

ఓ రోజు మధ్యాహ్నం డ్రిల్‌ పీరియడ్‌. స్కిప్పింగ్‌ రోప్‌ మర్చిపోయి ఇంటికి వచ్చాను. అల్మరాలో వెతుక్కుంటుంటే, వెనకగా ఏదో కదిలినట్లు నీడ. మెడమీద నుంచి కిందకు చేతులు సాచి చుట్టేసింది నీడ కంటే చిక్కనైన ఆ చీకటి. దడుచుకుని కేకవేయబోయిన నా నోరు మూసేశాడతను. గింజుకుంటూనే

ఉన్నా వదలట్లేదు. వెనకనుంచి ఇంకా బలంగా ఒత్తుకుంటూ, కాళ్ళతో నేలని తంతూ విరగబడుతున్నా, రక్కుతున్నా… ఏడుస్తున్నా…

వెనక స్కర్ట్‌కి ఏదో గట్టిగా తగులుతోంది… తడిగా, జిగటగా తాకుతోంది.

బైట అలికిడి అయినట్లనిపిస్తే వదిలేశాడు.

కమలత్త వచ్చింది. ములగచెట్టు నిండా గొంగళి పురుగులే. కొమ్మల మీద మంట పెట్టి వస్తున్నానని తనకి తాను చెప్పుకున్నట్లు చెబుతోంది నన్ను కానీ, ఆ నీచుడ్ని కానీ పట్టించుకోకుండా.

‘సాయంత్రం చెప్తా నీ పని’, మండ్రగబ్బ కొండె తర్జనలా ఊపుతూ బెదిరించింది.

స్కర్ట్‌ వెనకంతా ఇంత వెడల్పున తెల్లటి జిగురు డాగు. చీదరేస్తోంది, రోత పుడుతోంది…

అప్పుడు స్కూల్‌కి ఎలా వెళ్ళడం. నాకున్నవి రెండే యూనిఫామ్స్‌. రెండోది పొద్దున్న అక్కే

ఉతికింది. చిట్టి చిట్టి చేతుల్తో తను ఉతికి పిండకుండా ఆరేసే ఆ స్కర్ట్స్‌ తర్వాత రోజు పొద్దున్నకీ ఇంకా మెత్తగా, చెమ్మగా ఉండేవి. అలానే వేసుకునేవాళ్ళం. ఇప్పుడు మార్చుకునే అవకాశం లేదు. అలానే ఏడ్చుకుంటూనే ఎలాగో కడుక్కుని, గుంజుకుని అప్పటికైతే వెళ్ళాను కానీ బావా…! ఆ చీదర ఇంకా వదలడం లేదు.

స్కర్టు వెనక అంటుకున్న మైల… మాలిన్య… స్కలన… వీర్యపాతాలన్నీ పొంగి… పోటెత్తి జుగప్సా ప్రవాహాల వైతరణై నా లక్క పిడతల్ని… నా గుజ్జన గూళ్ళని… నా ఆశల్ని… ఆ ఆకాశాల్నీ మొత్తంగా ముంచెత్తింది.

‘…తప్పించుకున్నావ్‌ దొంగపిల్లా, సాయంత్రం…’

సాయంత్రమయ్యింది. నీడ ఇంకా పొడవయ్యింది. నీడ చేతులు బారెడయ్యాయి. ఆ చేతుల బారి నుంచి తప్పించుకోవడానికే మొత్తం శక్తులు, యుక్తులన్నీ ఖర్చయిపోయాయి.

రెండ్రోజుల్లో దేవుడు పంపించినట్లు వచ్చింది అమ్మమ్మ. పిల్లలకి తిండి అమురుతుందో లేదో అని సున్నుండలు, చిమ్మిరుండలు తెచ్చింది.

‘నేను రాత్రికి పిల్లల దగ్గర పడుకుంటాలే, పిన్ని వచ్చిందిగా…’ అనౌన్స్‌ చేశాడతను.

అమ్మమ్మని కరుచుకుపోయా ‘వెళ్ళిపోదాం అమ్మమ్మా, ఇక్కడ ఉండను…’ అంటూ. పెనంలా కాలిపోతున్న ఒంటిని చూసి అమ్మమ్మ గాభరాపడింది. రాత్రికి మొలిచిన కోరలతో, మళ్ళీ అదే నీడ. బెడ్‌ల్యాంప్‌ గుడ్డి వెలుతురులో ఒంటి మీదంతా పరుచుకునే నీడ. అమ్మమ్మ పసిగట్టినట్టుంది. మర్నాడు అక్కడ పెరట్లో అమ్మమ్మ అతనితో మాట్లాడడం చూశా నేను. మేం స్కూల్‌ నుంచి వచ్చాక అమ్మమ్మ వెళ్ళిపోతుంటే ఎప్పుడూ లేనంత గుక్కపెట్టి ఏడ్చా. దగ్గరకి తీసుకోబోతుంటే ‘నొప్పి’ అని అరిచి వెనక్కి పడిపోయా. ‘గుండెలమీద నొప్పి. ఎర్రటి మచ్చలు. వెనక నీడ పడితే భయం. వెనక నుంచి ఎవరైనా భుజం మీద చెయ్యి వేస్తే భయం. వెనకనుంచి లారీ వస్తుంటే భయం…’

ఇంకా రాయలేకపోయింది మిథున. అణచిపెట్టుకున్న వేదన అక్షరాల్లోకి రావడానికి తన్నుకులాడుతుంటే, తను రాసింది తనకే పేలవంగా అనిపించి పెద్దగా అరుస్తూ రాసిన పేజీలను ముక్కలు ముక్కలుగా చించేసింది.

… … …

కాన్ఫరెన్స్‌ మొదలవడానికి కొంత టైం ఉందిగా. తోచక మిథునకి మెసేజ్‌ పెట్టాడు అర్జున్‌. రిప్లై రాకపోతే పడుకుందేమో అని వదిలేశాడు. కానీ అతనికి రాత్రి సంఘటన ఇంకా కళ్ళముందు నుంచి పోవట్లేదు. అది మొదటిసారి కాకపోయినా, అలవాటు కాలేకపోతున్నాడు. గురక పెట్టడం కాదు, కాళ్ళు కదల్చడం, పళ్ళు నూరడం వంటి నిద్రా సమస్యలు కాదు కదా అలవాటైపోవడానికి. ఏ కరుకు కలల ఒరిపిడిలో నలిగి, ఏ చేదు గుర్తుల రాపిడితోనో కుమిలి, చెప్పుకోలేని ఏ అనుభవాల పెనుగాలులలో అల్లాడి అతలాకుతలమవుతున్న సహచరి, చిన్ననాటి ప్రియనేస్తం పెనుగులాట అలవాటెలా అవుతుంది, ఏమీ చేయలేకపోతున్న నిస్సహాయతలో.

తన టెన్త్‌ తర్వాత అమెరికా వెళ్ళిపోయాక, చదువూ ఉద్యోగం అంతా అక్కడే. చిన్నప్పుడు ఎంతో చలాకీగా ఉన్న మిథున, ఎందుకో సడన్‌గా ముభావంగా మారిపోయింది. తను అమెరికా వెళ్ళకముందు మూడేళ్ళూ ఆ మార్పు తనకి అర్థమయింది. మూడేళ్ళ క్రితం తమ పెళ్ళి అనుకున్నాక అందరికీ దగ్గరగా ఉందామని వైజాగ్‌ వచ్చేశాడతను. ఒక స్టార్టప్‌ పెట్టుకుని డెవలప్‌ చేశాడు. అంతకుముందు, మధ్య మధ్యలో వచ్చినా గంభీరంగా ఉండే మిథున దగ్గర తన మనసు విప్పలేదతను. నాయనమ్మ తమ పెళ్ళికి తొందర పెడుతుంటే, మేనరికాల గురించి విని ఉన్నాడు, చదువుకున్నాడు కాబట్టి సంకోచించాడు. కానీ, మిథునే తనతో మాట్లాడింది. ‘నేను నిన్ను తప్ప ఎవరినీ చేసుకోను బావా’, అని స్పష్టంగా చెప్పింది. తనంటే ప్రాణం ఇస్తుంది. అమ్మా నాన్నను ప్రేమగా చూసుకుంటుంది. అంతా బాగుంటుంది. తనంటే ఆమెకి ఇష్టం లేదన్న భయమే లేదు. మరి అప్పుడప్పుడూ మిథున పడుతున్న సంఘర్షణ, తనకు తాను చొరవగా తన దగ్గరికి వచ్చి అల్లుకుపోయే మిథునకి, తను దగ్గరికి వెళ్ళినప్పుడు వైల్డ్‌గా రియాక్ట్‌ అయ్యే మిథునకి మధ్య అతను నలిగిపోతున్నాడు. ఏదో జరిగింది, అతనికి అర్థం కావట్లేదు.

కోటు జేబులోంచి ఫోన్‌ తీసి డయల్‌ చేశాడు. అటువైపు లిఫ్ట్‌ చేయగానే, ‘నాయనమ్మా…’ అంటూ మాట్లాడడం మొదలుపెట్టాడు. కాన్ఫరెన్స్‌ మొదలవుతుండగా ఫోన్‌ పెట్టేసి, ‘నాయనమ్మ వస్తోందోయ్‌…’ వాట్సప్‌ చేశాడు భార్యకి.

… … …

కరక్ట్‌ టైంకి వచ్చేసింది గోదావరి. ట్రెయిన్‌లోంచి బ్యాగ్‌ దించుతూ ”ఏంటి ఇంత తేలిగ్గా ఉంది. తినడానికేం తేలేదా?’ గునాయిస్తున్న మనవడి నెత్తిమీద ప్రేమగా మొట్టి ‘అంత టైం ఎక్కడ ఇచ్చావ్‌రా. అయినా ఇక్కడ దొరకని సామాన్లేం ఉన్నాయి నాన్నా. చేసి పెడతాలే’ అంది సరోజనమ్మ, అర్జున్‌ నాయనమ్మ, మిథున అమ్మమ్మ.

పచ్చటి ఛాయలో మెరిసిపోయే నిలువెత్తు మనిషామె. అర్జున్‌కి అన్నీ నాయనమ్మ పోలికలే. ఎనభై సంవత్సరాల వయసులో కూడా ఆరోగ్యంగా ఉంటుందామె. తొమ్మిది మంది పిల్లలకి, పాతికమంది మనవ సంతానానికి స్ట్రెస్‌ రిలీవర్‌, ప్రాబ్లమ్‌ సాల్వర్‌, ఆల్‌ ఇన్‌ వన్‌ గైడ్‌ ఆమె. కారెక్కి కూర్చోగానే మనవడి మొహంలోకి చూస్తూ ఏంటి సంగతని అడిగింది.

‘మిథున’ చెప్పాడు అర్జున్‌. నాయనమ్మ అతనికి గొప్ప స్నేహితురాలు. ఆమె దగ్గర దాచేవేం లేవు.

‘దుడుకుగా ఉంటున్నావా?’ నవ్వుతూ అడిగిందామె.

‘తమరి వదనం. అంత సీన్‌ లేదు. వణికిస్తోంది తల్లీ’ తలకొట్టుకుంటూ అన్నాడు, ‘ఎక్కడైనా కాఫీ తాగిపోదామా?’

నాయనమ్మ అలసిపోయి ఉంటుందని తెలుసతనికి. కానీ అతని ఆరాటం నిలువనివ్వట్లేదు.

‘ఊహు ముందు మిథునని చూడాలి’

ఆమెకి అంతా అర్థమవుతోంది. ముందు మనవరాలిని చూడాలి. ఆమె మనసు కొట్టుకుపోతోంది. మిథునని చూడగానే ఆమె మనసు నీరయిపోయింది. కళ్ళకింద నలుపు చక్రాలు తిరుగుతోంది. కారు దిగగానే తనకన్నా ముందు అర్జున్‌ చెయ్యి పట్టుకుని చిన్నపిల్లలా గారాం చేస్తూ ఏదో అడుగుతోంది. అతని చేయి పట్టుకున్న పద్ధతిలోనే పట్టేసింది సరోజనమ్మ, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ కనిపిస్తోంది. తృప్తిగా నిట్టూర్చి లోపలికి వెళ్ళింది. టిఫిన్లు అయ్యాక మిథునతో అన్నాడు అర్జున్‌, ‘ఈ రోజు నువ్వెళ్ళిపో. నాయనమ్మని ఎవరో బంధువుల ఇంటికి తీసుకెళ్ళాలంట.’

మిథునకి కొంచెం తెలుస్తోంది, కానీ ఆరాలు తీసి అడిగే మనస్తత్వం కాదామెది. ఆమె కూడా పోరాటం చేస్తూనే ఉంది. అమ్మమ్మే ఏదో ఒకటి చేయాలి, బయటికి వస్తూ, ‘బావా!’ నెమ్మదిగా పిలిచింది అర్జున్‌ని.

‘నాకు కొంచెం అర్థమౌతోంది అమ్మమ్మ ఎందుకు వచ్చిందో. నువ్వు సంతోషంగా ఉండాలి బావా. నాకే ఎలా బయటికి రావాలో తెలియట్లేదు. నిస్సహాయంగా ఉంది. మనం విడిపోదాం’.

దుఃఖంతో గొంతు పూడుకుపోతోంది ఆమెకి. ”మిథునా…” నాయనమ్మ ఉందని కూడా ఆలోచించలేదతను. దగ్గరికి తీసుకుని రెండు తడి కళ్ళనీ ముద్దాడాడు, ‘అవఙవతీ వఙవతీ…’ అని నవ్వేసి పంపించాడామెని ఆఫీసుకి.

వెనక్కి తిరిగేటప్పటికి సోఫాలో కూర్చుని ఇద్దర్నీ చూస్తున్న నాయనమ్మ కనిపించింది. వెళ్ళి ఒళ్ళో తల పెట్టుకున్నాడు. మనవడి తలని ఆప్యాయంగా దువ్వుతూ మొదలుపెట్టిందామె. జరిగిందంతా చెప్పింది మనవడికి.

”అక్కా చెల్లెళ్ళని వెంటనే అక్కడి నుంచి తీసుకొచ్చేశాం. తర్వాత మీ అత్తయ్య వాళ్ళు ఆంధ్రా వచ్చేశారు. ఇంకా అంతా బాగానే

ఉందనుకున్నాం. కానీ అనుకున్నంత సాఫీగా అవ్వలేదు. కొత్తలో అంతా మర్చిపోయినట్లే ఉంది మిథున కానీ, లోలోపల ఉన్న గాయం వయసు పెరిగేకొద్దీ ఆఖరికి, స్కూల్‌లో బయలాజికల్‌ సైన్సెస్‌ పాఠాల దగ్గర్నుంచి ఏ సంఘటన జరిగినా ఆమెలో లోపల ఉన్న జ్ఞాపకాలు బయటకు వచ్చేవి. పెద్దవుతున్నకొద్దీ తన మీద జరిగిన దాడి తీవ్రతని తను మరింతగా తీసుకుంది. అలా డిస్టర్బ్‌ అయినప్పుడల్లా వదలకుండా జ్వరం వేధించేది. ఏమీ జరగనట్లు అమ్మా, నాన్నలు మేనత్త కుటుంబంతో ఉండడం తట్టుకోలేకపోయింది.

”పెళ్ళిళ్ళకి, ఫంక్షన్లకి మిథునని తీసుకెళ్ళడం ఒక ప్రహసనం అయ్యేది. చదువులో, మిగిలిన అన్ని విషయాల్లో చురుగ్గా ఉండేది. గుంపులో కలవడానికి విపరీతంగా భయపడేది. ఒక్కతే ఉన్నప్పుడు గోడని ఆనుకుని నించునేది. ఎందుకూ, పడిపోతావా అని ఏడిపించేవాళ్ళు స్నేహితులు. కానీ, వెనకనుంచి ఎవరన్నా పట్టుకుంటారని భయం. లారీలంటే భయపడేది. వెనకనుంచి లారీ వస్తుంటే వణికిపోయేది. ఎవరన్నా ఏడిపిస్తుంటే తట్టుకోలేక, తనని తానే హింసించుకొని, కుమిలిపోయే మనస్తత్వాన్ని పెంచుకుంది. మనసు తల్లడిల్లినప్పుడు, ఎవరైనా ఏడిపించినప్పుడూ తనని తాను గాయపరుచుకునేది. చాలామంది డాక్టర్లకు చూపించాం. కానీ వాడు దగ్గర బంధువు కదా, మిథున మామూలు మనిషయ్యేలోపు వాడెక్కడో ఒక చోట తారసపడేవాడు. బయటకి ఎవరికీ వాడి గురించి చెప్పకపోవడం, తన కళ్ళముందే వాడు గౌరవంగా తిరగడం, తన శరీరం మలినం అయిపోయిందన్న భ్రమ మిథునని చాలా కృంగదీసింది. చివరికి పోయిన సంవత్సరం అతను చనిపోయాక కొంత తేరుకుంది. పెళ్ళికి సరేనంది. అయితే, నిన్ను తప్ప ఎవరినీ చేసుకోనంది. మేనరికమని, అవనీ, ఇవనీ అంటుంటే నువ్వు ఒప్పుకోవని భయపడ్డాం. నువ్వు ఒప్పుకుని మా నెత్తి మీద పాలు పోశావ్‌. అంతా బాగుంది అనుకున్నాం కానీ, ఇంకా మామూలు మనిషవ్వలేదు” ముగించింది నాయనమ్మ.

ఆందోళన పడుతున్న ఆమెని సర్దుతూ ‘ఇది చాలా చిన్న విషయం నాయనమ్మా’ అని తేలిక చేయడానికి ప్రయత్నించాడు అర్జున్‌ నిట్టూర్చుతూ. ‘చిన్న విషయం కాదురా నాన్నా, చాలా చాలా పెద్ద విషయం. మనసుకి సోకే రోగాలకి మందులిస్తారే, వాళ్ళకి చూపించాలేమో. కానీ, నలుగురికీ తెలిస్తే, పిచ్చి డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్తున్నారని, దాన్ని పిచ్చిదానిలా జమకడతారేమోనని దిగులుగా ఉందిరా’ అంటూ కళ్ళొత్తుకుంది.

‘అట్లాంటిదేమీ అక్కర్లేదు, ఎలానో చెబుతా కానీ, ముందు అలా వంటగది సామ్రాజ్యాన్ని నీ చేతికిందకు తెచ్చుకొని, అరటికాయ బజ్జీలు వేద్దువు పదా’ అని హాస్యమాడుతూ ఆమెను కిచెన్‌ వైపు తీసుకెళ్ళాడు. ఆమె శనగపిండి కలుపుతుంటే, తనకి అందని ఎత్తులో ఉన్న వరిపిండి డబ్బా అందిస్తూ చెప్పాడు.

‘నువ్వన్నట్లు ఇది పెద్ద విషయమే నాయనమ్మా! మన మిథునకి ఎదురైన చేదు అనుభవాల వంటి బారిన పడుతున్నారు మన దేశంలో ప్రతి గంటకీ నలుగురు చిన్నారి తల్లులు. మూర్ఛ, హిస్టీరియా వంటి జబ్బుల పాలవుతున్నారు, నువ్వన్నట్టు పిచ్చాసుపత్రుల్లో మగ్గుతున్నారు. నేరం లేకుండానే శిక్షలు అనుభవిస్తూ, ఆయాచిత పాపాలు మోస్తూ, మొండిగా, బండగా, మనుషుల్ని ద్వేషించే వాళ్ళుగా అయిపోతున్నారు మరికొందరు. కానీ, మన మిథునని చూడు. నిలువెత్తు ప్రేమ కదూ. నిండైన మార్దవం కదూ, పూల మనసు, తేనె పలుకు కదూ… ఆ అమృతభాండంలో చిన్న నలక పడింది. ప్రేమతో తీసేయాలి. ఇప్పుడు నాకు తెలిసింది కదా, నేను చూసుకుంటా. నువ్వింక నిశ్చింతగా బజ్జీలేసెయ్‌. నీకు మతిమరుపు వచ్చేసిందని ఒప్పుకో. సోడా ఉప్పు వేసావ్‌ కానీ ఉప్పు వెయ్యలేదు…’

… … …

‘నాయనమ్మా! మిథునకి ఉప్పుగల్లు దిగదుడువు. ఎన్ని కళ్ళు పడ్డాయో… ఈ రోజు మరీ వడిలిపోయింది. మళ్ళీ రేప్పొద్దున్నే ప్రయాణం కదా. ఉన్న ఈ ఒక్క రోజూ మనవరాలికి దిష్టి తీసుకో.. అది సరే, నెమలీ… (ప్రేమ ఎక్కువైతే అలానే పిలుస్తాడు) నీ ఫ్రెండ్‌ ఆ మధ్య చెప్పింది. తులిప్‌ గార్డెన్స్‌కి వెళ్ళడం తన డ్రీమ్‌ అని. అప్పుడు నిన్ను చూపిస్తూ అన్నాను గుర్తుందా! ‘మా ఇంట్లోనే ఉంది తులిప్‌ తోట అని’. ఈ తుళ్ళింతల తులిప్‌ వనంతో కలిసి, ఆ నెదర్లాండ్‌ తులిప్‌ తోపులకి వెళ్దాం. మీ మిత్రురాలు కుట్టుకునేలా…’ చెబుతున్నాడు అర్జున్‌ మిథునతో.

ఇద్దర్నీ చూస్తూ సరోజనమ్మ తడికళ్ళు మెరిశాయి.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.