చైతన్యవంతమైన పరిసరాలు… రాగ యుక్తంగా తెలుగు పద్యాలు చదువుతున్న పిల్లలు… పైథాగరస్ సిద్ధాంతాన్ని వివరిస్తున్న లెక్కల మాస్టారి కంచు కంఠం… పిల్లలకి మధ్యాహ్న భోజనం వండిపెట్టే గ్రూప్ లీడర్ ఈరవ్వ పురమా యింపులు… స్కూల్ వాతావరణం చైతన్య వంతంగా ఉంది. కారిడార్‌లో రౌండ్స్‌లో ఉన్న హెడ్మాస్టారు శాంతిని చూడగానే ‘రండి మేడం, పిల్లలు మీ కోసం ఎదురు చూస్తున్నారు’ అంటూ ఆహ్వానించారు. అప్పటికే అక్కడున్న కావ్య, అరుణ పాడుతున్న ‘బాలికా చేతనా…’ పాటని ముగించి ‘అక్క వచ్చేసింది… మాట్లాడుకోవడం అయిపోయాక ఇంకో పాట పాడుకుందాం’ అనగానే ‘ఓకే’ అంటూ పిల్లలంతా ఒక్కసారే ‘హాయ్ అక్కా’ అని పలకరించారు.
14 ఏళ్ళ అమ్మాయిలు 15 మంది ఉత్సాహంగా ఉన్నారు. ఐదారుగురు కొంచెం బిడియంగా ఉన్నా అక్క ఏం చెప్తుందా ఇవ్వాళ అని ఆసక్తిగా చూస్తున్నారు. పలకరింపు లయ్యాక ‘మీ లక్ష్యం ఏమిటి?’ అన్న ప్రశ్నకి టీచర్ అవ్వాలని, డాక్టర్, ఇంజనీర్, కలెక్టర్ అవ్వాలని… ఎంత విశ్వాసంగా ఉన్నారు! తమ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఏం చేయాలో మాట్లాడుతూనే ‘మీ ఆదర్శ వ్యక్తులెవరు?’ అని అడిగింది. ఒకరిద్దరు ‘అమ్మ… నాన్న… టీచర్…’ అంటూ సణిగినా పెద్దగా స్పందించ లేదు. ‘నాకైతే చిన్నప్పుడు మా లక్ష్మి టీచర్ రోల్ మోడల్. కొంచెం పెద్దయ్యాక పి.టి.
ఉష, ఆ తర్వాత మదర్ థెరిస్సా…’ ‘అట్లా మారిపోతరా…!’ మధ్యలోనే అందుకుని ఆశ్చర్యపోయింది మౌనిక. ఆలోచన పెరుగుతున్న కొద్దీ, వాస్తవాలు అర్థమవు తున్నకొద్దీ మన భావాలు మారతాయని వివరించింది శాంతి. చిన్నప్పుడు ఆదర్శమైన లక్ష్మి టీచర్ బళ్ళో సార్‌లనించి ఒకమ్మాయి లైంగిక వేధింపులను ఎదుర్కొంటూన్నానని చెప్తే ‘ఎవరితో అనకు, ఇంట్లో వాళ్ళు బైటికి కూడా పంపరు. ఆ సార్‌కి దూరంగా ఉండు అని చెప్పడం నచ్చలేదని, అందుకే తనకి ఆదర్శం కాదని చెప్పింది శాంతి.
‘అలాంటి సార్లని ఉద్యోగం లోంచి తీసె య్యాలి’, ‘ఊర్లో పెద్దలకి చెప్పి దండించాలి’, ‘స్కూల్లో అసెంబ్లీ జరిగేటప్పుడు ఆ సార్ గురించి అందరి ముందు చెప్పెయ్యాలి…’ ఇలా ఎవరికి తోచింది వాళ్ళు చెప్పుకు పోతున్నారు. ముగ్గురు, నలుగురు ముఖ ముఖాలు చూసుకోవడం శాంతి దృష్టి దాటిపోలేదు. లక్ష్మి టీచర్ చెప్పిన దానిమీద చర్చ కూడా జరిగింది. ఆవిడ కరక్టే చెప్పారని కొందరు, కాదు అలా చెప్పడం తప్పు అని కొందరు, ఆ సారుని అడిగే బాధ్యత ఉందికదా అని కొందరు… చర్చ కొనసాగింది. వారి విశ్లేషణని వింటూ నిశ్శబ్దంగా చూస్తూ ఉంది శాంతి. ‘హెడ్మాస్టర్‌కి చెప్పొద్దా?’ అడిగింది అరుణ. ‘అవును చెప్పాలి, ఆయనే యాక్షన్ తీసుకుంటారు’ అన్నారు ఒకరిద్దరు. అమ్మా, నాన్నలకి చెప్పాలని మాత్రం ఎవరూ అనట్లేదు!!
కాసేపు విన్నాక ‘ఇంకా కొన్ని మార్గాలు న్నాయి. పిల్లలకి, ముఖ్యంగా అమ్మాయిలకి ఏ ఇబ్బంది వచ్చినా ఛైల్డ్‌లైన్‌కి కానీ, మహిళా హెల్ప్‌లైన్‌కి కానీ చెప్పొచ్చు. అవసరమైన సహాయం చేస్తారు’ అంది శాంతి. ‘అవును, మా అక్క దోస్త్‌కి పదో తరగతిలో పెళ్ళి పెట్టుకుంటే తనకి పెళ్ళి ఇష్టంలేక 1098కి ఫోన్ చేసిందంట. వాళ్ళొచ్చి పెళ్ళి ఆపేసి, హాస్టల్లో చేర్పించారంట’ అంది భాను.
‘నిజంగానేనా! ఈ నంబర్లన్నీఉంటాయి కానీ ఎవరూ ఎత్తరు, ఎప్పుడూ పని చెయ్యవు. ఒకవేళ పనిచేస్తున్నా ఎక్కడో ఊర్లో ఉన్నవాళ్ళ దగ్గరికి ఎక్కడొస్తారు అన్నారు సోషల్ సారు. నువ్వేమో వచ్చారంటున్నావు?’ ప్రశ్నార్థకంగా ఆగింది శైలు. ‘ఈ నంబర్లు మన సోషల్ టెక్స్ట్‌బుక్‌లో ఉన్నాయి. నేను చూశాను’ అంది లయ. ‘ఎప్పుడన్నా ఫోన్‌చేసి చూద్దాం అని అనిపించలేదా? ఎప్పుడైనా ట్రై చేశారా?’ అంది కావ్య. ‘ఆఁ.. హమ్మో.. బాబోయ్..’ రకరకాల ఎక్స్‌ప్రెషన్స్ సన్నగా వినబడ్డాయి.
‘చేసి చూద్దామా’ అన్న శాంతి ప్రశ్నకి నవ్వే సమాధానంగా చుట్టూ చేరిపోయారు. ముందు ఏ నెంబర్‌కి చేద్దాం అని ఫోన్ తియ్యగానే 100 అని, 181 అని, 1098 అని తర్జనభర్జన పడి ఛైల్డ్‌లైన్‌కి చేద్దాం అని తీర్మానించారు. మీరే చెయ్యండి అని ఫోన్ ఇవ్వబోతే తేలో, పామో అన్నట్టు బెదిరిపోయారు. 1098 డయల్ చేసి స్పీకర్ ఆన్ చేసి పెట్టింది శాంతి. కాల్ లిఫ్ట్ చేయగానే మాట్లాడమని సైగ చేసినా, మాట్లాడండి అని చెప్పినా అందరూ దూరం జరిగి నిశ్శబ్దంగా చూస్తున్నారు. అటునుండి ‘ఇది ఛైల్డ్‌లైన్ అండి. మీకు మేము ఏ విధంగా సహాయ పడగలం’ అంటున్న కౌన్సిలర్‌తో ‘మేం ఒక స్కూల్ నుండి మాట్లాడుతున్నాం. మీరు అందించే సేవల గురించి చెప్పగలరా’ అడిగింది శాంతి. రెండు నిమిషాల పాటు వివరాలు చెప్పారు. ‘ఇంకేమన్నా తెలుసుకోవాలని అనుకుంటు న్నారా?’ అన్న ప్రశ్నకి పిల్లల్ని చూసింది శాంతి. తల అడ్డంగా ఊపిన పిల్లల్తో, ‘సరే అయితే, మరి థాంక్స్ చెప్పరా?’ అనగానే అందరూ కోరస్‌గా ‘థాంక్స్ అండి వివరాలు చెప్పినందుకు’ అన్నారు. అవతలనుండి ధన్యవాదాలు తెలిపి ఫోన్ పెట్టేశాక సంభ్ర మంగా వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకోసాగారు.
‘ఈసారి ఇంకో నెంబర్‌కి మీరే చెయ్యండి’ అని ఫోన్ ఇవ్వగానే ‘భూమికకి చేద్దాం’ అంటూ సరిత తీసుకుంది. ఉత్సాహంగా అందరూ గుమిగూడారు. హెల్ప్‌లైన్ కార్డు చూసి ఒకరు, సోషల్ టెక్స్ట్‌బుక్ చూసి ఒకరు నెంబర్ చెప్తుంటే డయల్ చేసింది సరిత. మూడు రింగుల తర్వాత ‘హలో! భూమిక హెల్ప్‌లైన్’ అని వినబడగానే నిశ్శబ్దమై పోయారు అందరూ. శాంతి కూడా ఏం మాట్లాడ కుండా పిల్లల్నే చూస్తోంది. ‘భూమిక హెల్ప్‌లైన్. మీకు ఏం సహాయం కావాలన్నా సంకోచించకుండా మాట్లాడొచ్చు’ అని వినిపించగానే మానస ముందుకొచ్చి ‘మేము స్టూడెంట్స్. మీరు ఏమేం చేస్తారో చెప్పండి, మేము తెలుసుకోవాలను కుంటున్నాం’ అంది. పిల్లల ముఖాల్లో సంతోషం. కౌన్సిలర్ వివరాలు చెప్తుంటే కొంతమంది నోట్ చేసుకున్నారు. ‘మీరు కానీ, మీ ఇంట్లో వాళ్ళకి గానీ, మీ చుట్టుపక్కల ఆడవాళ్ళకి గానీ, మీకు తెలిసిన వాళ్ళకెవరికైనా గానీ, అమ్మాయిలకైనా, మహిళలకైనా ఏదైనా సహాయం కావాల్సొస్తే భూమిక హెల్ప్‌లైన్‌కి కాల్ చేసి సహాయం పొందవచ్చు’ అని కౌన్సిలర్ చెప్పగానే థాంక్స్ చెప్పి ఫోన్ కట్ చేసి గొప్ప విజయాన్ని సాధించి నట్లుగా చూశారు పిల్లలంతా. శాంతి క్లాప్స్ కొడ్తుంటే కావ్య, అరుణ జతకలిశారు. పిల్లలు కూడా చప్పట్లు కొట్టి తమను తాము అభినందించుకున్నారు.
మోకాళ్ళపైన పైకిలేచి భవ్య అందర్నీ ఆపమన్నట్లు సైగ చేసి ‘ఇలా దిశతో కూడా చేయించి ఉంటే ఆమెకి టైంకి సహాయం అందేదేమో’ అంది. ‘అవును ఎవరైనా తీస్తారా అని మనలాగే ఆమెకీ డౌట్ ఉండిందేమో’ ఒకరిద్దరు మెల్లిగా అన్నారు. ‘మాకూ సమస్య ఉందక్కా. ఇప్పుడెళ్ళి స్టాఫ్‌రూంలో సార్లతో చెప్తాం హెల్ప్‌లైన్లకి ఫోన్ చేసి మాట్లాడామని. దెబ్బకి దారికొస్తారు. ఈ సారి మాజోలికొస్తే…’ ఆవేశంగా అంటున్న రాణిని ఆపింది రమ్య. లేకపోతే ‘ఈసారి మాకోసమే హెల్ప్‌లైన్‌కి ఫోన్ చేస్తాం. ఇవాళ్టి అనుభవాన్ని మేం ఎవ్వరం మర్చిపోం. మా సమస్యని మేమే తీర్చు కుంటాం. తీర్చుకోలేనప్పుడు మీ సహాయం అడుగుతాం’ అంటూ ధైర్యంగా, ఆత్మ విశ్వాసంతో చెప్తున్న ఆ పిల్లల్ని ఆప్యాయంగా చూసింది శాంతి. అందర్నీ దగ్గరగా పొదుపుకుని ప్రతి స్కూల్లో, ప్రతి అమ్మాయికి ఈ అనుభవాన్ని ఇవ్వగలిగితే… ప్రాక్టికల్‌గా వారే తెలుసుకునేలా చేస్తే… ధైర్యం, ఆత్మవిశ్వాసం మాటలతో నేర్పేది కాదుగదా!! ప్రతి అమ్మాయికి ఈ ధైర్యాన్నిచ్చే బాధ్యత మనందరిదీ కాదా!!