ఎవరూ ఆమెనా…?
మొగుడు చచ్చిపోయిండుగా…?
ఈ మాటల తూటాలు కొన్ని కోట్లాదిమంది
గుండెలను సుతిమెత్తగా గాయపరుస్తూ
చనిపోయిన మనుషుల్ని
రాబందులు పొడిచి పొడిచినట్లుగా
ఆమె మనోభావాల్ని మంటల్లో కాలుస్తుంటే
ఆ ఆవేదన అంతు చిక్కనిది…!
కట్టుకున్నోడు కాటికి పోయినా
పిల్లల కోసమైనా బతకాలనే ఆశ చావక
మొండి ధైర్యంతో కూలీనాలీ చేస్తూ…!
బతుకును వెళ్ళమారుస్తున్న తరుణంలో
ఆదరించి అక్కున చేరదీయాల్సిన సమాజంలో
ఆమెను ఛీత్కరిస్తే ఎలా…?
పుట్టుకతో పెనవేసుకున్న
పసుపు కుంకుమలే దూరాన నెట్టివేసి
శుభకార్యాలు అశుభమని నెట్టివేసి
ఎదురుపడితే అరిష్టమని
నలుగురిలో కలిసి నడవడాన్ని కూడా
అమానవీయంగా చిత్రించి
ప్రతి కదలికను అపహాస్యంగా అల్లి
పదే పదే ఆమె గాయాల్ని కెలుకుతూ
నీటిలోనుంచి ఒడ్డునపడ్డ చేపపిల్లలా…!
ఆమెను
బాధించడం ఏడ్పించడం చంపడమేలా…?
ఒక్కోచోట ఒకలా
ఆమె వంటగత్తెగా మారి వండిన ఆహారాన్ని
ఎవరూ ముట్టకూడదని కంపు కట్టి ఆజ్ఞలు చేయడం
అవసరమైతే తాను వండిన ప్రదేశాన్నే శాశ్వతంగా
నిషేధించే ప్రబుద్ధులు ఉండడం పరిపాటే
మరొకచోట మరోలా
అశువులు బాసిన భర్త కానరాని లోకాలకు వెళితే
పెళ్ళి ఖర్చులు రాబట్టుకోవడానికి అత్తింటివారే
వేలంపాటలో గెలుపొందిన వాడికి
అంగట్లో సరుకులాగా కట్టబెట్టే ఆచారం
మూర్ఖత్వం కాక మరేమిటి…?
ఒక్కటేమిటి ఎన్నెన్ని చెప్పగలం
ఆమె శోక సంద్రం గురించి…?
ఆమె
కనబడినప్పుడు అదృష్ట దేవత అన్నవారే
ఎదురు పడితే మొహాలు తిప్పేసుకుని
ముదనష్టపు ముండని తిట్టడం
ఆటవిక దురాచారం కాక మరేమిటి…?
అపనమ్మకాల ఊబిలో పడేసి
సంప్రదాయాలు కట్టుబాట్లు అంటూ
మానసిక హింసకు గురిచేయడమనేది
ముమ్మాటికీ కుట్రే… ఆమె మనిషే…!