సృష్టికి మూలం తానై
అవనికి ఆదర్శమై
జననిగా జగతిలో
తన ఒడే తొలి బడిగా
తన మాటే తొలి బాటగా
ధైర్యసాహసాలకు నిలయంగా
నీతి నిజాయితీలకు మారుపేరుగా
ఓర్పు, ఓదార్పులకు చిహ్నంగా
అన్యాయ అక్రమాలకు పాల్పడితే
అరికట్టే అడ్డుగోడలా, ఆదిశక్తిలా
అర్ధించిన చేతులనే, ఆయుధాలుగా మార్చి
వేధించిన విధితోనే జగడమాడి
కీచకుల పతనానికి కంకణం కట్టి
మూర్ఖులను, మానవ మృగాలను
స్మశానానికి తరిమి, మట్టిలో కలిపేంతవరకు పోరాడి
అబలగా చూసినా ఈ సమాజంలో
సబలగా సర్వసాధ్యురాలిగా
ఆత్మస్థైర్యంతో నిలిచి
సమాజ మార్పే ధ్యేయంగా
పట్టుదలతో ప్రయత్నంతో, ప్రతిభతో
వంటింటి నుండి విశ్వంవైపు
అత్తింటి నుండి అభ్యుదయం వైపు
గృహహింస నుండి గమ్యతీరాలకు
సతీసహగమనం నుండి సమానత్వం వరకు
ఝాన్సీ రుద్రమల రౌద్రం
నుండి నేటి మలావత్ పూర్ణ
పర్వత ప్రయాణం వరకు
ఆకాశమే హద్దుగా ప్రయత్నమే శ్వాసగా
వెనుతిరగక పట్టువిడవక
ప్రపంచానికి వెలుగై, ప్రగతిపథ మార్గంలో
నాటి నుండి నేటివరకు
తరతరాలకు, యుగయుగాలకు
వెలిగే శాశ్వత జ్యోతిలా విరాజిల్లుతూ
ముందుకు సాగిపోతున్న
మహిళలందరికీ
పాదాభివందనాలు…
అందుకే మీరు ఆదర్శజ్యోతులు