దోర్నాదుల సుబ్బమ్మ రచనలు – మహిళాభ్యుదయం – కొండయ్య కోసూరు

పరిచయం : సింహపురి పరిధిలో ఆత్మకూరు మండల వాసి దోర్నాదుల సుబ్బమ్మ ”మోడుపడిన మూడు గుండెలు” (1958) నవలతో రచనకు శ్రీకారం చుట్టి సాహిత్యంలో తనకంటూ ఒక స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సుబ్బమ్మ ఇంతవరకూ కథలు, కథానికలు, కవితలు, వ్యాసాలు, పాటలు, లేఖలు, నవలలు, శతకం, జీవిత చరిత్ర రాశారు. ఈమె రచనలన్నీ మహిళా నేపథ్యాన్ని కలిగి ఉండడం విశేషం. ముప్ఫై ఎనిమిది సంవత్సరాలుగా విసుగు, విరామం లేకుండా ఉద్యమకారిణిగా, మహిళా మండలి అధ్యక్షురాలిగా, కవయిత్రిగా, రచయితగా మహిళాభ్యుదయం కోసం నిరంతరం పోరాటం సాగించారు దోర్నాదుల సుబ్బమ్మ.

సమకాలీన సమాజంలోని సగటు స్త్రీ జీవితాన్ని కేంద్రంగా చేసుకొని, మహిళాభ్యుదయానికి మానవత్వాన్ని జోడించి రచించిన కథలు దోర్నాదుల సుబ్బమ్మ రచనల్లో ప్రధానంగా కనిపిస్తాయి. కథలు, మినీ కథలతో పాటుగా సుబ్బమ్మగారు కవిత్వం, లేఖా సాహిత్యం, యాత్రా రచనలు వంటివి కూడా రచించారు. ఆధునిక సమాజంలో మానవుడు నాగరికంగా ఎంతో పురోభివృద్ధిని సాధించినప్పటికీ సాటి మహిళల పట్ల మాత్రం సమానత్వం, స్వేచ్చ, ఆత్మవిశ్వాసం మొదలైన విషయాలలో ఇప్పటికీ వివక్షత చూపుతున్న నైజాన్ని ప్రశ్నిస్తూ, స్త్రీ సమాజానికి చిరకాల వాంఛితాలైన సమానత్వం, స్వేచ్ఛ అనేది అందివచ్చే కాలాన్ని కాంక్షిస్తూ సుబ్బమ్మగారు వెలువరించిన రచనలు స్త్రీ జాతి విముక్తి పట్ల ఆమెకు గల చిత్తశుద్ధికి నిదర్శనాలు.

స్త్రీ స్వేచ్ఛకు, ఆత్మగౌరవానికి, వారి కనీస హక్కులకూ భంగం కలిగిస్తూ ఎదురయ్యే అనేకానేక అవాంతరాలను, అంటే సమస్యలను, అణచివేతను, పీడనను, దోపిడీలను, దౌర్జన్యాలను మొదలైన అంశాలను ఎన్నింటినో గురించి దోర్నాదుల సుబ్బమ్మ గారి రచనలు మన కళ్ళముందు ఉంచుతాయి. సుబ్బమ్మగారి రచనల్లో కనిపించేటటువంటి వివిధ రకాల విషయాలు, సందేహాలు, సమస్యలు, పరిష్కారాలు, సూచనలు, సలహాలు, మహిళాభ్యుదయాన్ని కాంక్షిస్తూ మహిళా లోకానికి బాసటగా నిలుస్తున్నాయి. సుబ్బమ్మగారు ఆమె రచనల్లో స్త్రీ జీవితంలోని అన్ని పార్వ్వాలనూ స్పృశించారు. సుబ్బమ్మగారి రచనల్లో వ్యక్తమైన మహిళాభ్యుదయ కాంక్షను గురించి ఇందులో వివరించబడుతుంది.

స్త్రీ జీవితానికి సంబంధించి సుబ్బమ్మగారు తమ రచనల్లో ప్రస్తావించిన మహిళాభ్యుదయ భావాలు ప్రధానంగా కుటుంబ సంబంధమైనవి, సామాజిక జీవితానికి సంబంధించినవి గానూ గుర్తించవచ్చు.

కుటుంబం : భారతీయ జీవన విధానంలో కుటుంబం ఎంత ప్రధానమైనదో, అందులో స్త్రీకి కూడా అంతే ప్రాధాన్యత ఉంది. భారతీయ కుటుంబ వ్యవస్థ స్త్రీ మూలకేంద్రంగా నిర్మితమైంది. ప్రత్యక్షంగానో, పరోక్షంగానో భారతీయ సమాజంలోని కుటుంబాలన్నీ స్త్రీల భాగస్వామ్యం మీదనే ఆధారపడి వర్థిల్లుతున్నాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్నప్పటికీ కుటుంబ వ్యవస్థలో నేటికీ మహిళలకు సంపూర్ణమైన సాధికారత మాత్రం లభించకపోవడం గుర్తించదగిన అంశం. కుటుంబంలో స్త్రీల భాగస్వామ్యం ఎంత ప్రధానంగా

ఉందో, దానికంటే ఎక్కువగా వారి అస్వతంత్రత, ఆంక్షలతో కూడిన వివక్షాపూరితమైన యాజమాన్య బాధ్యతలు కూడా కల్పించబడుతున్నాయనేది యదార్థ సత్యం.

స్త్రీని పూజించే దేశంలోనే ఆమెకి ఆంక్షల సంకెళ్ళు వేసి బందీని చేసింది మన సమాజం. కుటుంబంలోని స్థాయిల్లోనూ బాధ్యతల బరువును మోసేది సాధారణంగా తల్లులే అనే నగ్నసత్యం అందరికీ తెలుసు. కానీ నిర్ణయాధికారం మాత్రం అంతిమంగా కుటుంబ పెద్ద లేక యజమాని అయిన పురుషుడిదే అవుతుంది. అయితే బాధ్యతలు, బంధుత్వాల నడుమ శారీరకంగా అలసిపోయి, మానసికంగా నలిగిపోయేది స్త్రీలే అని గుర్తించలేని, గౌరవించలేని మానసిక దౌర్భల్యం గల సమాజంలో మనం జీవిస్తున్నామని గుర్తు చేసుకోవడం విచారించదగిన విషయం.

దోర్నాదుల సుబ్బమ్మగారి రచనల్లో కుటుంబంలోని బరువు బాధ్యతలను మోస్తూ మానసికంగానూ, శారీరకంగానూ నలిగిపోతున్నటువంటి అనేక రకాల స్త్రీ మూర్తులు మనకు కథల్లోను, కవితల్లోనూ దర్శనమిస్తున్నారు.

‘మరో వసంతం కోసం’ అనే లేఖా సంపుటిలో ‘జీవితంలో స్త్రీ భాగస్వామా? భోగ వస్తువా?’ అనే లేఖ కుటుంబంలో స్త్రీకి జరుగుతున్న అన్యాయాన్ని వివరిస్తుంది. న్యాయవాదిగా పనిచేస్తున్న పద్మ దగ్గరికి వచ్చిన ఒక యాభై సంవత్సరాల ముస్లిం స్త్రీ తన బాధను పద్మతో చెప్పుకుంటుంది. ఆ విషయాన్ని పద్మ తన స్నేహతురాలైన సుస్మితకు రాసిన లేఖలో ఈ విధంగా ప్రస్తావించింది.

ఆమె పదహారేళ్ళ వయసులో ‘నిఖా’ కట్టిన భర్త గురించి తప్ప ఇంకేమీ తెలియకుండానే పదేళ్ళు కాపురం చేసి ఇద్దరు పిల్లలకు తల్లయింది. ఐదేళ్ళ తర్వాత భర్త ఇంకో పెళ్ళి చేసుకుని ఆమెకు, పిల్లలకు తిండి పెట్టడం కూడా దండగని సూటిపోటి మాటలతో బాధిస్తున్న సమయంలో, భర్తలేని సమయంలో వచ్చిన ఒక వ్యక్తితో పరిచయం ఆమె జీవితానికి కొత్త ఆసరాని, భరోసాని ఇస్తుందని నమ్మి అతనితో వెళ్ళిపోతుంది. పాతిక సంవత్సరాల తర్వాత, పిల్లలకి పెళ్ళిళ్ళయి సొంత కాపురాలు చేసుకుంటున్న సమయంలో ఆమె కూతురు, కోడలు వచ్చి తల్లిని చెడిపోయిన మనిషని తిట్టిపోతారు. రెండో భర్త ఆస్తి మొత్తాన్ని మొదటి భార్య కొడుకులని ఇచ్చేశాడు.

”ఇన్నాళ్ళూ నేను కలిసి కాపురం చేసినందుకు ఇదేనా ఫలితం?” అని అనుకోగానే నా గుండె బద్దలైంది. నేనూ భార్యనేనన్నాను. అది చెల్లదని, ముస్లింకి, హిందూకి ఇంకేదో చట్ట ప్రకారం పెళ్ళి జరిగితేనే అది పెళ్ళవుతుంది అని వెటకారం చేశారు నన్ను. ”కోర్టు ఏం చెప్తుందో, దానికి ఖర్చులెవరు ఇస్తారు? నేను బతికి తప్పు చేశానా? పిల్లలకింత విషం పెట్టి నేను తిని చనిపోయి ఉంటే బాగుండేదా? అదొక్కటే నా చేతిలో ఉండేది. దాన్ని చెయ్యలేదు…” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన యాభై సంవత్సరాల అభాగ్యురాలైన ఆ మహిళ దుస్థితి ఎవరికైనా ఆవేదనను కలిగిస్తుంది.

సమాజం : మానవుడు సంఘజీవి. మనుషులు సమూహంగా ఇతరులతో పాటు కలిసిమెలిసి జీవనాన్ని సాగిస్తారు. కుల, మత, వర్ణ, లింగ, జాతి, ప్రాంతీయ విచక్షణలు ఉన్నప్పటికీ వీటన్నింటినీ అంతర్లీనంగా కలిపే ఒకానొక సూత్రం సంఘ జీవనంలో

ఉంటుంది. అందువలన వివిధ రకాల వ్యక్తులు ఒకచోట చేరి కలిసి మెలిసి జీవించే వ్యవస్థను మానవ సమాజంగా మనం చెప్పుకోవచ్చు. కలిసి జీవించే క్రమంలో ఆయా వ్యక్తుల మధ్య రాగద్వేషాలు, కోపతాపాలు, ఆప్యాయతానురాగాలు, ఈర్ష్యాద్వేషాలు మొదలైన మానసిక ప్రవృత్తులు తలెత్తుతూ, తరిగిపోతూ కూడా ఉంటాయి. మానవ జీవన క్రమంలోని ఈ సంకీర్ణమైన, సంక్లిష్టమైన వ్యవస్థనే మనం మన చుట్టూ ఉండే సమాజంగా గుర్తిస్తున్నాం. మానవ సమాజం భిన్న వ్యక్తులతో పాటు, భిన్నమైన మనస్తత్వాలను కూడా నిరంతరం ప్రదర్శిస్తూనే ఉంటుంది. అటువంటి మానవ సమాజంలో సగభాగమైన, బరువు బాధ్యతలను మోయడంలో సగం కంటే ఎక్కువైన స్త్రీ జీవితం చాలా క్లిష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నదని చెప్పవచ్చు. స్త్రీకి పురుషుడు శత్రువు అనడం సాధారణమే అయినప్పటికీ, అసాధారణంగా ‘స్త్రీకి స్త్రీయే శత్రువు’ అనే ప్రచారం అనాదిగా మన సమాజంలో వినిపిస్తూనే ఉంది.

సమాజంలో స్త్రీకి గల ప్రాధాన్యతను మరిచి, సమాజ నిర్మాణంలో ఎంతో క్రియాశీలకమైన ఆమె పాత్రను నిర్లక్ష్యం చేస్తూ, నేటికీ స్త్రీని సమాజం ఎన్ని విధాలుగా పీడనకు, అవమానాలకు, మానసిక క్షోభకు గురి చేస్తున్నదో తెలిపే సందర్భాలు, సన్నివేశాలు దోర్నాదుల సుబ్బమ్మగారి రచనలలో ఈ విధంగా కనిపిస్తున్నాయి.

‘వికసించని విరిబోణులు’ అనే కథలో పెద్ద కుటుంబాలలోని ధనవంతులైన మహిళలు ఒకచోట చేరి ఉబుసు పోవడానికి చెప్పుకునే కబుర్లలో సాటి స్త్రీ, నలుగురికీ మంచి చేసేదీ అయిన మీనాక్షి గురించి, ఆమె కట్టుకునే సాధారణమైన చీరను గురించి చులకనగా మాట్లాడుకోవడం, ఆమె బాహ్య వేషధారణను, నిరాడంబరతను అవహేళన చేయడం గురించి అక్కడే ఉన్న కథా రచయిత్రి అయిన వైచిత్రి మౌనంగా వింటుంది. అప్పుడు అక్కడ చేరి ఉన్న మహిళా సేవాదళ సమితి సభ్యులైన ఆ మహిళలందరూ ఎదురుగా లేని సాటి స్త్రీలను గురించి తమ మనస్సులోని అక్కసును ఈ విధంగా వెళ్ళగక్కుతారు.

”అసలు ఆడవాళ్ళకి అందం, చందం, అభినయం అనేవి ఉండి తీరాలి. ఏమోనండీ, నాకు మాత్రం బయట అడుగుపెట్టాలనుకున్నప్పుడు కొత్త చీరలో కనపడాలనిపిస్తుంది. సాధ్యమైనంత వరకూ అలాగే వస్తుంటాను.” ”ఆమెనంటి పెట్టుకొని ఇంకొకామె ఉంది చూడూ… సరస్వతి. మ్యాచింగ్‌ జాకెట్‌ ఎప్పుడైనా తీసినట్టు చూశారా! ఫ్యాషన్‌ తెలిసిన ముఖాలు కాదు!” ”ఇటువంటి వాళ్ళ వల్లనే స్త్రీ జాతి అంటే చిన్నచూపు ఏర్పడింది” అంటూ అక్కడికి మహిళా సేవాదళ సమితి వారి సన్మాన కార్యక్రమానికి వచ్చిన రచయిత్రి వైచిత్రిని మహిళామండలి సభ్యులు ఆమె అభిప్రాయం చెప్పమని అడిగారు. వైచిత్రి మాత్రం ప్రశాంతంగా వాళ్ళతో, ‘ఆమె చీరవల్ల ఎదుటివారికి వచ్చిన నష్టమేమిటని’ ప్రశ్నిస్తుంది. ఆమె మాటలు విని, ”ఏమోనండీ మాకలాంటి వారంటే నచ్చదు, గిట్టదు. అటువంటి వారితో మాట్లాడాలన్నా మనస్సంగీకరించదు. అంత గతీ గత్యంతరం లేనప్పుడు నలుగురిలో తిరగాలనుకోవడం చాలా పొరపాటు. ఏదైనా పని సాధించాలన్నా, చెయ్యాలన్నా కొంత తాహతుండాలి. మంచం ఉన్న వరకే కాళ్ళు ముడుచుకోవడం బాగుంటుంది” అంటూ స్త్రీ పట్ల అసూయను ప్రదర్శిస్తున్న, సంఘంలో గొప్పవారిగా, సేవాదళ సమితి సభ్యులుగా ఆడంబరాలు ఒలకబోస్తున్న మహిళల తీరును గ్రహించిన వైచిత్రి సన్మాన సభను విడిచి వెళ్ళిపోతుంది.

మహిళల మనసుల్లో సాటి మహిళల పట్ల గల దురభిప్రాయాలు, చులకన భావం, అసూయా ద్వేషాలు తొలగిపోయి, పరస్పరం సేవాభావం కలిగే రోజు త్వరలోనే రావాలని వైచిత్రి ఆశిస్తుంది. వికసించని మానసిక స్థితి కలిగిన మహిళల అంతరంగాలను చిత్రించిన వైచిత్రి కథానికకు మొదటి బహుమతి వచ్చిన ఆనందం కన్నా కూడా, సాటి స్త్రీ పట్ల స్త్రీలకు గల దురభిప్రాయం మారాలనే ఆకాంక్ష వైచిత్రికి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుందని ఆమె మాటల వలన తెలుస్తుంది.

ముగింపు : ఈ విధంగా దోర్నాదుల సుబ్బమ్మగారి రచనలలో స్త్రీ జీవితంలో ఒక ముఖ్య సందర్భమైన పిల్లలు కలగడం, సంతానవతి లేదా మాతృమూర్తి కావడం అనే విషయాన్ని గుర్తించిన చిత్రణ పిల్లలు లేనంత మాత్రాన కుమిలిపోవలసిన అవసరం లేదని, ధైర్యాన్ని తెలియచెప్పే విధానం, ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు అని వివరించిన తీరును గురించి చెప్పుకోవచ్చును.

దోర్నాదుల సుబ్బమ్మగారు ఏ ప్రక్రియ చేపట్టి రచన చేసినప్పటికీ అందులోని ప్రధాన వస్తువు స్త్రీని గురించే ఉంటుంది. ఆమె రచనలన్నీ ప్రధానంగా స్త్రీని కేంద్రంగా చేసుకునే రచించబడినవి అనే విషయం సుబ్బమ్మగారి రచనలను పరిశీలిస్తే స్పష్టంగా బోధపడుతుంది. దోర్నాదుల సుబ్బమ్మగారు అభ్యుదయవాది, ప్రగతిశీల భావాలు మెండుగా కలిగిన రచయిత్రి, కవయిత్రి. అంతకన్నా ముందు ఆమె మహిళాభ్యుదయం గురించి నిరంతరం పరితపించే స్త్రీ వాది అని చెప్పుకోవడం సమంజసం. ఆమె కథను రాసినా, కథానికను కల్పించినా, కవిత్వాన్ని వెలువరించినా, లేఖను రచించినా, రుబాయిల వంటి వచన పద్యాలను అలవోకగా అల్లించినా, విహార యాత్రను విరచించినా, జీవిత చరిత్రను చిత్రించినా అందులో స్త్రీ స్వేచ్ఛ, సమానత్వం, స్త్రీ సంక్షేమ సంబంధమైన ఆదర్శాలు, ఆశయాలు వర్ణరంజితంగా పరిమళించే తీరు ఆకట్టుకుంటుంది.

అతి సాధారణమైన ఇతివృత్తాలు, అంతే సామాన్యమైన పాత్రలు, అత్యంత సహజమైన సంభాషణలు, సజీవమైన సంఘటనలు, సన్నివేశ కల్పన, భావోద్వేగాల చిత్రణ దోర్నాదుల సుబ్బమ్మగారి రచనలలో మహిళాభ్యుదయం పరమావధిగా రచించబడినవని చెప్పడానికి కావలసినన్ని నిదర్శనాలను ఈ అధ్యాయంలో పేర్కొన్న ఉదాహరణల ఆధారంగా మనం గ్రహించవచ్చు. ఈ విధంగా దోర్నాదుల సుబ్బమ్మగారి రచనలలో చిత్రించబడిన మహిళాభ్యుదయం గురించి, దాన్ని వ్యక్తీకరించడానికి సుబ్బమ్మగారు కల్పించిన పాత్రలు, కథా సన్నివేశాలు, సంఘటనలు, వర్ణనలు, సంభాషణలు మొదలైన అంశాలు దోహదపడిన తీరుతెన్నులను గురించి చెప్పుకోవచ్చును.

Share
This entry was posted in వ్యాసాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.