పవహిస్తున్న దుఃఖంకాళ్ళు ప్రవహించిన దుఃఖం అలసట తీరగానే ఆగిపోతుంది
కళ్ళు ప్రవహించే దుఃఖం చెక్కిళ్ళ మీదే ఆవిరవుతుంది
కానీ మనసు ప్రవహించే దుఃఖం ఉందే
అది మాత్రం ఆత్మదహనమయ్యే వరకూ కొనసాగుతూనే ఉంటుంది
ఎందుకంటే, యుగాలుగా అలా తయారు చేయబడ్డాం.
రేపటి రోజున పగిలిన పాదాల నెర్రెలన్నీ పూడుకుపోవచ్చు
అంతులేని నడకకు మొరాయించిన కాళ్ళ నొప్పులు తగ్గిపోవచ్చు
కానీ వలస వెళ్ళాల్సి వచ్చిన పరిస్థితులూ
వలస నుండి వెనక్కి రావాల్సి వచ్చిన మనః స్థితులూ
వేసిన ముద్రలు ఎప్పటికైనా చెరిగిపోతాయా?
తమ తాతల, తండ్రుల స్వేదంతో వేయబడ్డ రోడ్లమీద పది కోట్ల జతల పాదాలు చేస్తున్న పాదయాత్ర… ఓట్ల కోసమో, నోట్ల కోసమో కాదు. కాగితాల్లో అయినా తమ ఉనికి భద్రంగా ఉన్నచోటుకి, తమ బ్రతుకుకే కాదు… చావుకీ ఒక గుర్తింపు దక్కగలదు అని తాము భావించే పుట్టినూరుకి, తమదనుకున్న మట్టి మీద మనిషికి ఉండే మమకారమది. దాన్ని ఎలా ప్రశ్నించగలం?
చాలా మంది ఏమని అనుకుంటున్నా రంటే కాళ్ళు పుండ్లు చేసుకుని ఎందుకు వెనక్కి వెళ్ళడం అని.
బతుకు బాగోకే కదా వలసకి వచ్చారు. మళ్లీ వెనక్కి వెళ్లి ఏమి బావుకుంటారు అనే హక్కు మనకెక్కడిది? ఆ జీవితం వాళ్ళది. అనుభవించేవాడికే అందులోని లోతులు తెలుస్తాయి. మనమెవరం మాట్లాడటానికి?
అసలు వాళ్లు నడిచే పరిస్థితులు ఎలాంటివి?
వంట్లో ఉన్న కాస్త తేమని లాగేస్తున్న నిప్పులు చెరిగే ఎండలు… నడచి నడచి చెప్పు తెగిపోయి ఇప్పుడు కాళ్లకి చెప్పులూ లేని దయనీయ స్థితి. నిండు గర్భిణీ స్త్రీలు… పచ్చి బాలింతలు… ముది వయసు మీద పడిన ముసలవ్వలూ… ఎందుకు నడవాల్సి వస్తుందో తెలియని పసితనాలు… ప్రతి వారి మీద తమని మించిన బరువులు…
గంట ప్రయాణానికే రెండు గంటలపాటు సన్నద్ధమవుతాం మనం… మరి ఎన్నాళ్ళు సాగుతుందో తెలియని ప్రయాణానికి ఎంత సన్నద్ధం అవ్వాలి? నిమిషాల మీద నడక మొదలయ్యింది… ఒక మూల నుండి కాదు… ఒకచోట నుండి కాదు… దేశమంతా వాళ్ళ కదలికలే… అలసట సంగతి సరే, నడిచే దారి తప్ప ఆకలి… దాహం తీర్చుకునే దారి వాళ్ళకి తెలియదు. బస ఎక్కడ చెయ్యాలో తెలియదు. ఇక మహిళల పరిస్థితి మరీ ఘోరం. రోజుల తరబడి నడుస్తున్న నడకలో చాటు అన్నదే దొరకనప్పుడు వారి వారి దైనందిన కార్యక్రమాలకి ఎంత కష్టం. ఋతుచక్రాల్లాంటి బాధల సంగతి సరే సరి. ఎప్పటికప్పుడు పిల్లల ఆకలి అవసరాలు తీర్చడానికి ఇంట్లో ఎంత కష్టపడుతుందో… రోడ్ల మీద అంతకు వందింతల కష్టం ఆమె స్వంతమవుతుంది.
ఎక్కడేం దొరుకుతుందో అసలు దొరుకుతుందో లేదో తెలియని స్థితిలోనే వాళ్ళు నడకని మొదలు పెట్టారు. అలా చెయ్యాలంటే గుండెల్లో ఎంత ధైర్యముండాలి. ఇంతటి దారుణమైన పరిస్థితులలోనూ ఎన్నో ఆంక్షలు. ఎక్కడ ఆపేస్తారో తెలియదు. ఏ సరిహద్దులో ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలియదు. ఇంత కష్టపడి స్వస్థలం చేరామన్న ఆనందం కూడా లేకుండా చాలా చోట్ల వాళ్లని స్వంత గ్రామాల్లోకి రానివ్వడంలేదు. వెలి వేయబడ్డ బ్రతుకుల్లా మారిపోయాయి వాళ్ల జీవితాలు.
అయినా సరే
దేశమంతా నడుస్తూ ఉంది… నడుస్తూనే ఉంది…
దేశమింకా ఆకలితో ఉంది… ఆకలితోనే ఉంది…
నడక ఆగేలా లేదు ఆకలి తీరేలా లేదు…
ఈ దేశపు మనిషి ఇంకా స్థిరపడలేదు… తనలో స్థిరత్వం లేక కాదు. స్థిరమైన దష్టి
ఉన్న నాయకత్వం లేక. వెన్నెముకలేని బ్యూరాక్రసీ వల్ల. ఈ దేశంలో ప్రతి ప్రాణమూ చదరంగపు గడిలో పావులాంటిదే.
ఈ నడకని ఆపి సేద తీర్చుకునేలా దేశమింకా తయారుచేయబడలేదు. 73 ఏళ్ల స్వతంత్ర పాలనలో మీరెక్కడ ఉన్నా ఆహార భద్రత ఉంటుందనీ చెప్పి చూపించిన ఒక్క నాయకుడిని కూడా దేశం తయారు చేసుకోలేక పోయింది.
ప్రపంచ స్థాయి మేనేజ్మెంట్ యూనివర్సిటీలు… ప్రపంచ స్థాయి వ్యాపార సంస్థల్ని లీడ్‌చేసే వ్యక్తులని తయారు చేశామని గర్వపడుతూ, క్రైసిస్ మేనేజ్మెంట్ అంటే ఏమిటో తెలియని నాయకుల చేతుల్లో దేశాన్ని ఉంచి మనం మాత్రం గుండెల మీద చెయ్యేసుకుని పడుకుంటున్నాం. గ్రాస్ రూట్ లెవెల్‌కి వెళ్లి సమస్యని అవగాహన చేసుకోవాలి అన్న సంగతే పట్టనట్లుగా మనం తయారు చేయబడ్డాం.
సమస్య మనదాకా వస్తే చూసు కోవచ్చులే అన్న ఉదాసీనతలోకి జారిపోయాం. పేరుకే అవిచ్ఛిన్న భారత దేశం. కానీ ఎక్కడికక్కడ ప్రాంతాలుగా విచ్ఛిన్నం. ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే ఒక స్వార్థం.
అవును వాళ్ళు వలస వచ్చారు… వచ్చి ఏం చేశారు… మనమున్న చోట మనం చేయలేనివన్నీ చేశారు. కానీ వాళ్లు తిరిగి ఏం పొందారు, తిరస్కతి తప్ప. ఎందుకు వెళుతున్నారు… భరోసా లేక. అవును, నిజమే… వచ్చి ఎన్నేళ్లైనా బ్రతుకుకొక భద్రత ఏర్పడలేదు కాబట్టి. ఎప్పటికప్పుడు ఇక్కడ పరాయితనం కనిపించబట్టి… ఎప్పటికీ తామిక్కడ పరాయి వారమే అని గుర్తు చేసేవారు ఎక్కడికక్కడ ఉన్నారు కాబట్టి.
పత్రికల్లో వస్తున్న కథనాలూ, చేతనైన సహాయం చేస్తున్న ఆప్తులు చెబుతున్న యదార్థగాథలు వింటుంటే సాటిమనిషిగా రోజుకెన్నిసార్లు సిగ్గు పడుతున్నానో. ఇంత కష్టంలో కూడా వాళ్ళు అధికారపు వేధింపులకు గురవుతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ వేధింపులు భరించలేకే కొందరు రైలు పట్టాల వెంట నడుస్తూ ఉన్నారట. అలాంటి వారిలో కొందరు తమపై నుంచి రైలు వెళ్ళగా చనిపోయారు. రైలు అంత దగ్గరగా వస్తున్నా మెలకువ రానంత గాఢ నిద్రలోకి వాళ్లు జారుకున్నారంటే ఎంతగా అలసిపోయి ఉంటారో పాపం!
వార్తలు చదువుతుంటేనే అసలా కాళ్ళెలా కదులుతున్నాయో అన్న దుఃఖం మనల్ని వదిలిపెట్టడం లేదే… మరి ఆ నడకలో ఉన్న వాళ్ళకి ఇంకెంత దుఃఖం ఉండి ఉండాలి. అక్కడంటూ మనం పుట్టిన ఊరు ఒకటుందనే మమకారం… బతుకైనా చావైనా తన వాళ్ళ మధ్యలో ఉంటే తప్తి అని తప్ప, వెళ్ళగానే అక్కడేదో బతుకు బాగుపడి పోతుందని ఎవ్వరికీ లేదు.
కళ్ళూ… కాళ్ళూ మాత్రమే కాదు, కాలం కూడా చెమ్మగిల్లుతున్న పరిస్థితి వాళ్ళది.
అవును మరి…
మనమంతా కరోనాకి ముందు, కరోనాకి తరువాత మన జీవితాల్లో వచ్చే మార్పుల గురించి మాట్లాడుకుంటున్నాం. అందుకు తగ్గట్లుగా మనల్ని మనం సిద్ధం చేసుకుంటున్నాం. కాకపోతే ఇప్పటికీ మనం గుర్తించనిది ఏమిటంటే… మన జీవితాల మీద వారు వేసి ఉంచిన భరోసాని మనం కోల్పోయాం. నిజమే ఇప్పటి వరకూ మనం వారికి ఆసరాగా లేం. వారే మనకు ఆసరాగా ఉన్నారు. ఇక ముందు అలా ఉంటారన్న భరోసా అయితే లేదు.
మనకి భరోసాగా ఉన్న కొన్ని జీవితాలకీ మనమెప్పుడూ భరోసాగా లేమని కాలం కూడా చెమ్మగిల్లి పోతున్నట్లుంది. అందుకేనేమో తనతోపాటు కరోనాని సహ ప్రయాణికుణ్ణి చేసుకుంది. వాళ్ళని మనం వదిలేసినట్లుగానే మనల్ని అది మన ఖర్మకే వదిలేసింది.