సంబంధాలు – కన్నడ: వసుంధర కె.ఎం., మైసూరు – అనుసృజన: వేలూరి కృష్ణమూర్తి

‘హాయ్‌, హౌ ఆర్‌ యూ?’ అతడి నుండి వచ్చిన మెసేజ్‌ ఈమె మొబైల్‌లో అర్ధగంట నుండి చల్లగా కూర్చొని ఉంది.

హర్షిణి ఏదో ఒక నంబర్‌ సెర్చ్‌ చేయడానికి మొబైల్‌ తీసినప్పుడు స్క్రీన్‌పై ఉన్న అతడి మెసేజ్‌ చూసి, అతడి వాట్సాప్‌కు ‘ఓ! హాయ్‌! ఐ యాం ఫైన్‌… థాంక్స్‌’ అని మరుసందేశాన్ని పంపింది.

‘వై, సో లేట్‌ రిప్లై?’ ఒక సెకండ్‌ కూడా ఆలస్యం చేయక అతడి నుండి మెసేజ్‌ వచ్చింది. ఈమె వెంటనే అతడినుండి మరు సందేశాన్ని ఊహించలేదు. అందుకని కొంత అసహనం చెందింది హర్షిణి.

‘సారీ ఐ వజ్‌ బిజీ విత్‌ సం అదర్‌ వర్క్‌. అది సరే, ఏమిటి సమాచారం? ఇలా ఉన్నకున్నట్టే?’ మరొక మెసేజ్‌లో అడిగింది.

‘ఒక సర్‌ప్రైజ్‌ న్యూస్‌ ఉంది’ అని అతడన్నాడు.

‘ఏమిటి?’ ఈమె ప్రశ్న.

‘షి హ్యాస్‌ కన్సీవ్డ్‌. అండ్‌ ఐ యాం గోయింగ్‌ టు బి ఎ ఫాదర్‌’

అతడి మెసేజ్‌ చూడగానే ఈమె ఇటువైపు నుండి సంభ్రమంతో ‘ఓ, రియల్లీ? హౌ ఈజ్‌ సుమనా నౌ? ఇద్దరూ ఎక్కడున్నారు? సుమనాకు ఫోన్‌ ఇవ్వు’ అని సంతోషంతో అడిగింది.

ఈమె ప్రశ్నకు జవాబివ్వక ‘హే… ఏం చేస్తున్నావిప్పుడు?’ అని మరొక ప్రశ్న టైప్‌ చేశాడు.

ఈ సమయంలో మెసేజ్‌కంటే ఫోన్‌ చేసి మాట్లాడడమే మంచిదని అనుకొన్ని హర్షిణి ఫోన్‌ చేసి, ‘కాలేజీలో ఉన్నా. ఆరామంగా ఉన్నా. అది సరే, సుమనా ఎలా ఉంది?’ అని అడిగింది.

‘నువ్వేమమ్మా, ఇప్పుడు చాలా బిజీ అయిపోయావు. మాట్లాడడానికి కూడా సరిగ్గా దొరకవు. భార్యను దింపడానికి వచ్చే వారం అక్కడికి వస్తున్నా. షల్‌ వియ్‌ మీట్‌ దేర్‌? ఐ నీడ్‌ టు టాక్‌ విత్‌ యు’ ఆమె ప్రశ్నకు జవాబివ్వకుండా అన్నాడు.

‘ఏయ్‌, అలాంటిదేమీ లేదు. అన్ని పనులూ మామూలుగానే జరిగిపోతున్నాయి. అది సరే, ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావు? ఆర్‌ యూ ఇన్‌ హాస్పిటల్‌ నౌ? ఈస్‌ సుమనా దేర్‌ విత్‌ యూ? తోడుగా ఎవరున్నారని చెప్పనే లేదు కదా? ఆల్‌ ఓకే?’ అని మళ్ళీ అదే ప్రశ్న వేసింది.

ఇక ఆమె వదలదని కన్‌ఫర్మ్‌ చేసుకుని ‘ఆల్‌ డూయింగ్‌ గుడ్‌. షి ఈజ్‌ ఎట్‌ హోం. నేను బయటికి వచ్చాను. నీతో మాట్లాడాలనిపించింది. ఐ నో యు విల్‌ బి బిజీ. అందుకే మెసేజ్‌ పంపించాను. ఇంకేంటి విశేషాలు?’ అన్నాడు.

‘ఇంకేమీ లేవు. నువ్వే చెప్పాలి. ట్రీట్‌ ఎప్పుడిస్తావు?’ అని అడిగింది.

‘ఓ, కమాన్‌ యార్‌. ఒట్టి ట్రీట్‌ మాత్రమే ఏమిటి. ఇంకొక వారంలో సెలబ్రేట్‌ చేసుకుందాం. గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుందాం. నేనే అక్కడికి వస్తున్నా. షి ఈజ్‌ మూవింగ్‌ టు హర్‌ మదర్స్‌ హౌస్‌. మూడు, నాలుగు నెలలు బెడ్‌ రెస్ట్‌ అని చెప్పారు. అందుకే నేను తనను దింపడానికి వస్తున్నా’ అన్నాడు.

‘ఓకే! దట్‌ సౌండ్స్‌ గుడ్‌. మా ఇంటికి తీసుకుని రా. అమ్మ కూడా చూడాలని అంటోంది. మళ్ళీ కాల్‌ చేస్తా. ఇప్పుడు కొద్దిగా బిజీ. సుమనాని అడిగానని చెప్పు. ఇక్కడికి వచ్చాక కలుద్దాం. బై’ అని చెప్పి కాల్‌ కట్‌ చేసి నిట్టూర్పు విడిచింది.

… … …

హర్షిణితో అప్పటివరకు అటువైపు నుండి మాట్లాడింది పన్నగ. అతను ఆమె మేనత్త కొడుకు. అన్నీ సక్రమంగా జరిగి

ఉన్నట్లయితే ఇప్పటికి వారిద్దరికీ వివాహం జరిగి ఉండేది. కానీ, తానొకటి తలిస్తే దైవమొకటి తలుస్తుందని అన్నట్లు, జాతక దోషం ముందుకొచ్చి వారిద్దరి ఇళ్ళల్లోనూ పెద్దల మధ్య భేదాభిప్రాయాలు పెరిగిపోయి వాళ్ళ వివాహానికి పెద్ద అడ్డుగోడగా నిలిచింది.

ఇలా అనుకున్న వివాహం ఆగిపోయి అసహనంలో ఉన్న పన్నగకు హర్షిణిని మరచిపోవడం సాధ్యం కాలేదు. గుండె నొప్పితో బాధపడుతున్న తండ్రి వెంటనే వివాహం చేసుకోమన్న కోరికను అతను మొదట్లో అంగీకరించలేదు. దగ్గరి బంధువే అయిన హర్షిణితో గడిపిన సమయాన్ని అంత సులభంగా మరువలేక తండ్రి కోరికను అంగీకరించలేకపోయాడు. కానీ, ఎప్పుడైతే తన తల్లిదండ్రులు, బంధువులు వెదికి తీసుకువచ్చిన దంతపు బొమ్మలాగా ఉన్న సుమనాను చూసిన వెంటనే, పెళ్ళికి అంగీకరించిన అతను తన తండ్రి ఆరోగ్యం కారణంగానే ఈ పెళ్ళికి అంగీకరించానని అందరితో చెబుతూ వచ్చాడు. హర్షిణికి తన ముఖం చూపించలేకపోయిన అతను, తను ఇంత వెంటనే వివాహం చేసుకోవడానికి అంగీకరించింది తన తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడం, తన తల్లి తీవ్రమైన ఒత్తిడే కారణమని పరి పరి విధాలుగా చెబుతూ తన నిస్సహాయతను నివేదించుకున్నాడు. కానీ, మాటల మధ్యలో సుమనా గురించి కనీసం ఒక్కసారి కూడా చెప్పలేదు.

పన్నగ ఇంత వెంటనే వేరొకరితో వివాహానికి అంగీకరించాడని తెలిసి హర్షిణి ఆశ్చర్యపోయింది. అయినా అతని తండ్రి అనారోగ్యం గురించి మొదటినుండి తెలిసి ఉండడం, దానికి తోడు తాను వివాహానికి అంగీకరించడానికి గల కారణాన్ని పన్నగ బాధతో వివరించడంతో వివేకవంతురాలైన హర్షిణి మనసు కరిగింది. తాను ప్రేమించిన అతడి జీవితం పచ్చగా ఉండాలని మంచి మనసుతో అతనికి వివాహ శుభాకాంక్షలు తెలిపింది.

పన్నగ ఇప్పుడే పెళ్ళి చేసుకుంటే చేసుకోనీ, కానీ తనకు మాత్రం ఇప్పుడే పెళ్ళి వద్దని, కొంత సమయమివ్వాలని తల్లిదండ్రులను కోరింది. పన్నగ వివాహం దగ్గర పడుతుండగా తామిద్దరూ కలిసి గడిపిన రోజులను గుర్తుచేసుకుని హర్షిణి బాధపడసాగింది. అయినా, తన కుటుంబం ముందు మాత్రం తాను ధైర్యంగా ఉన్నానని చూపించుకోసాగింది.

ఉన్నత చదువులు చదివి వివేకవంతురాలైన హర్షిణి తామిద్దరూ బంధువులైనందున తమకు యుక్తవయసు వచ్చినప్పటినుండి ఉన్న ప్రేమ బాల్యంలోని స్నేహంలాగా కొనసాగాలని, రక్త సంబంధపు బంధువులైన తమ మధ్య కోపం మంచిది కాదని చెప్పి పన్నగ పెళ్ళికి రావడానికి అంగీకరించని తన తల్లిదండ్రులను బలవంతం చేసి ఒప్పించి తీసుకువెళ్ళింది. అలా ఆ పెళ్ళికి వెళ్ళడమే ఆమె జీవితంలో తర్వాతి మలుపునకు మూలమైంది.

వివాహ మండపంలో పన్నగ పక్కన తెల్లగా మెరుస్తూ నిలబడిన సుమనాని చూసిన వెంటనే అతను తనను మర్చిపోయి, అంత వెంటనే వివాహానికి అంగీకరించడానికి గల కారణం హర్షిణికి అర్థమైంది. తమ ఇద్దరిలో ప్రేమ ఎవరిలో ఎంత గట్టిగా ఉందనేది కూడా ఆమెకు తెలిసింది. తాను, సుమనా అంత అందగత్తె కాకున్నా తీసివేసే అందం మాత్రం కాదు. దానికి తోడు ఆమెకంటే తాను విద్యావంతురాలు, బుద్ధిమంతురాలు. కానీ, జాతకానికి సంబంధించిన ఒక చిన్న లోపం కారణాన్ని ముందుంచుకుని, తండ్రి అనారోగ్యాన్ని నెపంగా చేసుకొని పన్నగ, అతని కుటుంబ సభ్యులు ఇంత వెంటనే పెళ్ళికి ఒప్పుకోవడానికి గల కారణం ఆమెకు స్పష్టమైంది. పన్నగ కోసం అత్తగారి ఇంటినుండి వచ్చిన మైసూరులో ఒక సైటు, కారు, లెక్కలేనంత బంగారు ఆభరణాలు, వెండి వస్తువుల బహుమానాల పట్టీని గురించి ఆమె ఇంకొక మేనత్త వీరికి మాటల్లో వివరించింది.

వివాహ మండపంలో పన్నగ తల్లిదండ్రులకు తాము ఆ పెళ్ళికి వెళ్ళడం అసహనాన్ని కలిగించిందని వారి ప్రవర్తనను బట్టి అర్థమయ్యింది. వీరిది హస్తం చూపి అవలక్షణమనిపించుకొన్నవారి పరిస్థితి అయింది. అక్కడ తాము అనగత్యులూ, అపరిచితులుగా అనిపించడంతో అక్కడ ఎక్కువసేపు ఉండడం వారికి సాధ్యం కాలేదు. భార్యగా పక్కన నిలబడ్డ అమ్మాయికి, తనను మేనత్త కూతురిగా పరిచయం చేయడానికి సంకోచపడుతున్న పన్నగ విచిత్ర ప్రవర్తనతో హర్షిణికి చాలా అవమానం, దుఃఖం కలిగింది. ఆమె మనస్సులో అప్పటివరకు పన్నగ కోసం మిగిలి ఉన్న స్నేహం-ప్రేమ పూర్తిగా మారిపోయాయి.

… … …

హర్షిణి దుఃఖిస్తూ కూర్చొనే అధైర్యపు ఆడపిల్ల కాదు. అలాగని పన్నగను ద్వేషించనూ లేదు. ఒకటి, రెండు వారాలపాటు ఆత్మ నివేదన, ఆత్మ విమర్శ చేసుకుంది. తన ముందు బ్రతుకు ప్రశ్నపత్రాన్ని తానే తయారుచేసుకుని జవాబు కోసం పరీక్ష ఎదిరించే గట్టి నిర్ణయానికి వచ్చింది. పన్నగతో ప్రేమ, వివాహం అన్న కలల లోకంలో మునిగిపోయి, వృధా చేసుకున్న తన జీవితపు నూతన అధ్యాయాన్ని మరలా కొనసాగించడానికి సన్నద్ధమయ్యింది.

ఎం.ఎ. ఎకనామిక్స్‌ చేసిన హర్షిణికి పన్నగతో భవిష్యత్తును నిర్మించుకునే నమ్మకం ఉన్నందున తన తర్వాతి జీవితం గురించి ఎక్కువగా ఆలోచించలేదు. ఇంకా చదవాలా వద్ద్దా? ఉద్యోగంలో చేరాలా వద్దా? అన్న విషయంపై పన్నగకూ అంతగా ఆసక్తి లేకపోయినందువల్ల అతడికి లేని ఆసక్తి తనకు మాత్రం ఎందుకని ఆమె కూడా నిర్లక్ష్యం చేసింది. కానీ, ఇప్పుడు ఎవరివల్ల తన జీవితం ఆనందంగా

ఉంటుందని భావించిందో ఆ వ్యక్తి అతని బ్రతుకును మాత్రమే సరిచేసుకోవడాన్ని చూసి దిగ్భ్రాంతురాలైంది. అతడు లేకున్నా తన భవిష్యత్తును తానే నిర్మించుకోవడానికి నిర్ణయించుకొంది. సాధ్యాసాధ్యాల గురించి ఆలోచించి చివరకు ఎం.ఎ.కు తోడు సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే ఎన్‌.ఇ.టి. పరీక్షకోసం తీవ్రంగా కష్టపడింది. హర్షిణి అచంచలమైన నిష్టకు, ఆమె తీవ్రమైన కష్టానికి ప్రతిఫలాన్ని తన మొదటి ప్రయత్నంలోనే సాధించింది. ఆమెకు రీసెర్చ్‌ స్కాలర్‌షిప్‌ కూడా లభించింది. ‘భారతదేశం ఆర్థికతలో మహిళా సహాయ సంఘాల పాత్ర’ అన్న విషయంపై పి.హెచ్‌.డి.ని ప్రతిష్టాత్మకమైన విశ్వవిద్యాలయం నుంచి ప్రారంభించి పరిశోధనవైపు తన దృష్టినంతా కేంద్రీకరించింది. ఇలా, ఏదో ఆవేశపు జోరులో ఎక్కడా ఆపక, విశ్రాంతి తీసుకోకుండా పనిచేసి విజయాన్ని సాధించి అలసటను, బాధను నివారించుకోసాగింది.

… … …

కానీ, దీనితో ముగించక పన్నగ ఆమె జీవితంలో మరోసారి ఎదురయ్యాడు. బొమ్మలాంటి అమ్మాయిని వివాహం చేసుకొని ఉన్నా మళ్ళీ ఇలా వచ్చాడేమిటని ఆమె ఆశ్చర్యపోయింది. అతను చెప్పినట్లు అతని తండ్రి అనారోగ్య పరిస్థితి మరింత విషమించింది. రంభలాంటి భార్య బొమ్మలాగా అలంకరించుకోవడం తప్ప ఇంటి విషయాల్లో ఆసక్తి చూపేది కాదు. తన అత్త మామలకు, చివరికి భర్తకు కూడా ఎదురు సమాధానం చెప్పడం, మాటిమాటికీ పుట్టింటికి వెళ్ళిపోయి ఇక్కడి పరిస్థితిని మర్చిపోవడం చేసేదట. సంసారాన్ని ఇంతగా నిర్లక్ష్యం చేసే స్త్రీకి వివాహం ఎందుకు కావాల్సి వచ్చిందోనని అతను బాధపడ్డాడు.

హర్షిణి పన్నగను దీర్ఘంగా చూసింది. అతను అలసిపోయి ఉన్నాడు. గడ్డం పెంచుకున్నాడు. మనసులో ఏదో చింత అతడిని వేధిస్తోందని తెలుస్తోంది.

‘మనసుకు శాంతి కోసం వెతుకుతున్నా హర్షిణీ. నీతో ప్రేమలో ఉన్నప్పుడు నేను చాలా సంతోషంగా ఉండేవాడిని. ఇప్పుడు నా వివాహమే నాకు గుదిబండయింది. నిన్ను మోసం చేశాననే అపరాధ భావం నన్ను పీడిస్తోంది. ఇంటిలో కూడా అమ్మా, నాన్నలు నిన్ను గుర్తుచేసుకుని ‘పాపం ఆ అమ్మాయిని మోసం చేశాము. అందుకే మనకు ఇలాంటి శిక్ష’ అంటూ బాధపడుతున్నారు. ఒకసారి మా ఇంటికి రా హర్షిణీ. వారికి కొంచెం ఊరటగా ఉంటుంది’ అని చాలా ఆదరంగా పిలిచాడు.

కొత్త జీవితాన్ని నిర్మించుకునే ఊపులో, తన జీవితంలోని చేదు జ్ఞాపకాలను మర్చిపోయింది హర్షిణి. ఒకసారి పన్నగ ఇంటికి కూడా వెళ్ళి మేనత్త, మామగారి బాధను గమనించి వచ్చింది. తాను ప్రేమించిన వ్యక్తి జీవితంలో ఇలా కాకుండా ఉండాల్సిందని బాధపడింది.

ఒకసారి పన్నగతో ‘సుమనాతో నేనొకసారి మాట్లాడనా’ అని అడిగి, ఒత్తిడి చేసి అతడ్ని అంగీకరింపచేసింది. ‘ఇలా మనస్తాపంతో జీవితం గడపడం మంచిది కాదు. ఆమె మనసులో ఏముందో అర్థం చేసుకొందాము. వివాహం చేసుకున్నప్పుడు ఎంతో సంతోషంగా

ఉండడం నేను గమనించాను. ఎటువంటి కారణం లేకుండా ఆమె ఇలా అవడానికి అవకాశం లేదు’ అని వివరంగా చెప్పింది.

సుమనాతో మాట్లాడుతుండగా ఆమెకు ఉన్న సమస్య హర్షిణికి అర్థమైంది. సుమనా మానసికంగా అలసిపోయింది. పడగ్గదిలో పన్నగ కోరికలను తీర్చలేని సమస్య ఆమెను తీవ్రంగా బాధిస్తుండేది. పన్నగ కూడా ఆమెను ప్రేమించక కేవలం ఆమె శరీరపు అందాలకు ఆరాధకుడయ్యాడు. ఆమె ప్రేమతో వికసించడానికి ముందుగానే మొరటుగా ప్రవర్తించి ఆమెను బాధపెట్టేవాడు. ఆమెను సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో సుమనా మనసును మరింతగా ముడుచుకుపోయేలా చేసింది. దానికి తోడు అత్తా, మామలు వీలైనంత త్వరగా మనవడిని ఇవ్వాలంటూ కోడలిని వేధిస్తుండేవారు. అది సుమనాకు జుగుప్స పుట్టించేది. ఈ సమస్యలన్నింటికీ సమాధానం కోసం ఆమె మాటిమాటికీ పుట్టింటికి వెళ్ళేలా చేసేది.

ఈ విషయాలన్నీ తెలిసిన తర్వాత హర్షిణి ఊరికే ఉండలేకపోయింది. పన్నగతో ఉన్న చనువుతో, భార్యాభర్తల మధ్య ఉన్న సమస్య గురించి మాట్లాడడానికి సిద్ధమై అతనికి సుమనా మానసిక వ్యధను గురించి చెప్పింది.

‘ప్రేమలేని సంసారంలో సారముండదు పన్నగ. ఆమె అందాన్ని ఆరాధించే నువ్వు ఆమె ఆంతర్యాన్ని కూడా అర్థం చేసుకో. అనునయంతో అంగీకరించే ప్రేమ ఇద్దరి నమ్మకాన్ని ఎక్కువ చేస్తుంది. దుడుకుగా ప్రవర్తించకు. ఆమె కూడా నిన్ను ప్రేమిస్తుంది. స్త్రీ ఒక పూవు లాంటిది. ఆ లేత మొగ్గ పువ్వుగా పూర్తిగా వికసించేవరకూ వేచి ఉండాలి’ అని తనకు తెలిసినట్లు వివరించింది. అలాగే సుమనాకు కూడా మరొక విధంగా కౌన్సిలింగ్‌ చేసింది. ఇలా కొన్నిసార్లు వారి సమస్యల గురించి వారితోనే చర్చిస్తూ చివరికి వారిద్దరి జీవితాన్ని ఒక కొలిక్కి తీసుకువచ్చింది.

ఈ మధ్యలో పన్నగకు హైదరాబాద్‌లోని ఒక కంపెనీకి బదిలీ కావడంతో సుమనాను కూడా తీసుకువెళ్ళాడు. ఒక సంవత్సరం గడిచిపోయింది. ప్రస్తుతం సుమనా గర్భం ధరించిందని పన్నగ చెప్పడంతో బెంగుళూరులో ఉన్న హర్షిణి సంతోషించింది.

కానీ, పన్నగ హైదరాబాద్‌ నుండి సుమనాను ఆమె పుట్టింట్లో వదలడానికి వచ్చినప్పుడు హర్షిణికి అతని ప్రవర్తనలో ఏదో అసహజత్వం ఉందనిపించింది. భార్యాభర్తలిద్దరి మధ్య మనస్ఫర్థలు తొలగిపోయాయని భావిస్తున్న సమయంలో హర్షిణికి అతని ప్రవర్తనలో విచిత్రమైన అనుభవం ఎదురవసాగింది. తన విషయంలో అతని ప్రవర్తన మారడం ఖచ్చితంగా గోచరించింది. అతను నిర్లక్ష్యం వహించినా బాధపడేది కాదు, కానీ అతని ప్రవర్తన, తెచ్చిపెట్టుకున్న ప్రేమ ఆమెకు వేరే ఏదో సూచనను తెలిపింది.

వారిద్దరి దాంపత్య జీవితం సరిదిద్దడానికి హర్షిణి తీసుకున్న జాగరూకతను పన్నగ తప్పుగా గ్రహించాడు. గతంలో ఆమెను ప్రేమించాడు. ముప్ఫై ఐదేళ్ళు దాటినా ఇంతవరకూ వివాహం చేసుకోకుండా ఉన్న హర్షిణి తనతో సంభోగించడానికి సమ్మతిస్తుందని తనకు తానే నిర్ణయించుకున్నాడు. అతడి నిర్ణయం రెస్టారెంట్‌లో ఒక మూలలో టేబుల్‌ వద్ద కూర్చున్నప్పుడు పన్నగ చేసిన అనవసరమైన స్పర్శల వల్లే హర్షిణికి సూక్ష్మంగా తెలిసిపోయింది. వారిద్దరికీ రెస్టారెంటు నుండి వీడ్కోలు పలికి ఇంటికి వచ్చిన హర్షిణి బాంబును డీయాక్టివేట్‌ చేసే తర్ఫీదు ఉన్న శ్వాసం లాగా తక్షణం సుమనా మొబైల్‌కు ఒక మెసేజి పంపింది.

ప్రియ సుమనా, బహుశా దాంపత్య జీవితమనేది దంపతులిద్దరి అనురాగపు సౌధం. అది చీలడానికి ముందే ప్రేమ బాంధవ్యం అన్న కాంక్రీట్‌ వేసి సిద్ధం చేసుకోవాలి. బెంగుళూరులోని మీ అమ్మగారి ఇంటిలో పొందే విశ్రాంతిని నువ్వు హైదరాబాద్‌లోనూ పొందవచ్చు. నువ్వు తెలివైనదానివి. నా మాటలు నీకు అర్థమవుతాయని నేను నమ్ముతున్నా. అర్థం కాకుంటే పన్నగకు ఈ సందేశాన్ని ఫార్వర్డ్‌ చెయ్యి. అతను అర్థం చేసుకుంటాడు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో.

బై. ప్రేమతో నీ హర్షిణి.

హర్షిణి పంపిన సందేశం సుమనా మొబైల్‌ నంబర్‌ నుండి పన్నగకు ఫార్వర్డ్‌ అయ్యింది.

సుమనా భర్తతో ‘ఈ మెసేజ్‌ నాకు అర్థం కావడంలేదండి. అదేమిటో చదివి చెప్పండి’ అంది.

ఇప్పుడు పన్నగకు తానూ హుషారుగా ఉండాలన్న సూచన లభించడంతో అతని దారి మారింది.

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.