దుర్గాబాయి దేశ్‌ముఖ్‌

(గత సంచిక తరువాయి…)

ఉప్పు సత్యాగ్రహం

ఉప్పు సత్యాగ్రహం వంటి ఉద్యమం ప్రపంచ చరిత్రలో ఏ దేశంలోనూ కనీవినీ ఎరుగం. 24 రోజులు పాదచారియై గాంధీ మహాత్ముడు తన అనుచరులతో 200 మైళ్ళు నడిచి పశ్చిమ సముద్ర తీర ప్రాంతమైన దండి గ్రామం చేరారు. దారి పొడవునా వేలాది మంది జనులు ఆయనకు స్వాగతం చెప్పారు. జయ జయ ధ్వానాలు చేశారు. దండిలో ఆయనకు కొందరు గుజరాత్‌ విద్యాపీఠం విద్యార్థులు కూడా కలిశారు.

లూయీఫిషర్‌ తన మహాత్మాగాంధీ జీవిత చరిత్రలో ఈ సన్నివేశాన్ని ఇలా వర్ణించారు. ”ఆయుధ రహితులై లక్షలాది ప్రజలు ఒక మహావిప్లవానికి సంసిద్ధులైనారు. తిరుగుబాటు చేశారు. అత్యంత శక్తిమంతమైన బ్రిటిష్‌ ప్రభుత్వానికి దడ పుట్టించారు. సముద్ర తీరాన నివసించే పల్లె పల్లె, ఊరూరు ప్రజలంతా తీర ప్రాంతం చేరారు. ప్రతి ఒక్కరు ఒక్క బాణలి తమతో తెచ్చుకున్నారు. సముద్ర జలాల్లోకి అడుగులు వేశారు. ఉప్పు తమకు తామే తయారు చేసుకోవాలన్నదే వాళ్ళ సంకల్పం. మహదాశయం. పోలీసులు సామూహిక నిర్బంధాలకు పాల్పడ్డారు. గాంధీజీ కుమారుడు రామదాసు గాంధీని, ఆశ్రమవాసులు కొందరితో పాటు అరెస్టు చేశారు.

”Gandhi had communicated with it by lifting up some grains of salt. The next act was insurrection without arms. Every village on India’s long sea coast went to the beach or waded to the see with a pan to make salt, the police began mass arrests. Ramdas, third son of Gandhi, with a large group of ashramites was arrested”. – The Life of Mahatma Gandhi, PP-268-69 (1990)

దేశమంతా ఉప్పెనలాగా అల్లకల్లోలమైంది. ఎక్కడ చూసినా ఉప్పు తయారీకి ప్రజలు

ఉపక్రమించారు. బొంబాయిలో 60 వేల మంది ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు. పోలీసులు బొంబాయిలో కాంగ్రెస్‌ కార్యాలయంపై దాడి జరిపారు. సంకెళ్ళు కావలసినన్ని లేక సత్యాగ్రహుల చేతులకు తాళ్ళు బిగించి వాళ్ళను లాక్కొని వెళ్ళారు పోలీసులు. ఆయన ఉప్పు తయారు చేయగానే గాంధీజీ పిలుపు మేరకు దేశమంతటా ముఖ్య నగరాలలో, ప్రాంతాలలో సాప్తాహిక దీక్షలు, సముద్ర జలాల నుంచి ఉప్పు తయారుచేసే కార్యక్రమాలు జరిగాయి.

జవహర్‌లాల్‌ నెహ్రును అలహాబాద్‌లో అరెస్టు చేసి ఉప్పు చట్టం నిబంధనల కింద ఆరు నెలలు జైలు శిక్ష విధించింది ప్రభుత్వం. గాంధీజీ తయారుచేసిన పిడికెడు ఉప్పును డా.కనుగా పదహారు వందల రూపాయలు (వేలం పాటలో) ఇచ్చి అలహాబాద్‌లో కొనుక్కున్నాడు. మహారాష్ట్రలో, బెంగాల్‌లో ఈ ఉద్యమం మరింత విజృంభించింది. కలకత్తా పురపాలక సంఘ అధ్యక్షుడు సేన్‌ గుప్తాను ప్రభుత్వం ఆరు నెలల పాటు కారాగారంలో నిర్బంధించింది.

మహాత్మాగాంధీ గొప్పతనం ఏమిటంటే భారత స్వాతంత్య్రోద్యమంలో అశేష ప్రజావాహినిని పాల్గొనేట్లు చేయడం. కూడు, గుడ్డలు, సమస్త ప్రజలకు కావలసినవి. అవి దైనందిన జీవితావసరాలు. వాటినాయన ప్రబలాయుధాలుగా చేసుకున్నారు. వాటి సాయంతో బ్రిటిష్‌ ప్రభుత్వంపై చారిత్రాత్మక పోరాటం సాగించారు. అదీ ఆయన అఖండ ప్రజ్ఞ. విదేశీ వస్త్ర బహిష్కారం, స్వదేశీ లవణ ఉత్పత్తి అటువంటివి. అతి పేద ప్రజలకైనా నిద్ర లేస్తే ఉప్పు లేనిది ఆ రోజు గడవదు. ఆయన గవర్నర్‌ జనరల్‌ ఇర్విన్‌కు ఇలా హెచ్చరిక ప్రకటన పంపించారు.

‘On March 2, 1930 Gandhi warned the Viceroy, Lord Irwin, of his intentions, saying”, If my letter makes no appeal to your heart, on the eleventh day of this month, I shall proceed with such co-workers of the Ashrams as I can take, to disregard the provisions of the salt laws, I regard this tax to be the most iniquitous of all from the poor mans stand point. As the independence movement is essentially for the poorest in the land the beginning will be made with this evil.”

(మార్చి 2, 1930 ఆయన వైస్రాయి ఇర్విన్‌ను హెచ్చరిస్తూ, పది రోజులలో ఈ దురన్యాయపు చట్టాన్ని ఎత్తివేయకపోతే, ఆశ్రమ వాసులైన తన కొందరు అనుచరులతో తాను ఉప్పు చట్టాన్ని ధిక్కరిస్తానని ఆయన స్పష్టం చేశారు. పేదవాడి కడుపుకొట్టే ఇంత దుష్టమైన చట్టం ఇంకొకటి ఉండబోదని ఆయన తెలిపారు. నిజానికి స్వాతంత్య్రోద్యమం భారతీయ పేద ప్రజల కోసమే ముఖ్యంగా ఉద్దేశించినది. ఈ దుర్మార్గపు చట్టాన్ని నిర్మూలించడమే నా పరమ ధ్యేయం.)

సకల ప్రపంచ మానవాళి చరిత్రలోనే ఇటువంటి మహోద్యమం ఇంతవరకు సంభవించలేదని బొంబాయి క్రానికల్‌ పత్రిక ఈ సన్నివేశాన్ని అభివర్ణించింది. సకల మానవాళి చరిత్రలోనే ఇటువంటి దేశభక్తి ఉద్యమం ఇంకొకటి కనబడదని కూడా ఆ పత్రిక వర్ణించింది. విదేశాల నుంచి, ఆఖరుకు బ్రిటిష్‌ పత్రికా ప్రతినిధులు, ఛాయాచిత్ర గ్రాహకుల నుంచి ఈ మహోద్యమం పట్ల గొప్ప ప్రతిస్పందన లభించిందని కూడా ఆ పత్రికే పేర్కొంది.

పురాచారిత్రాత్మకమైన మోషే నాయకత్వంలో యూదుల పవిత్ర జనావాస యాత్రాన్వేషణను తలపింపచేస్తున్నది ఈ దండి యాత్ర అని సర్‌ ప్రఫుల్ల చంద్ర రే అభిప్రాయపడ్డారు. ఈ ఉద్యమాన్ని గురించి చెప్పిన ప్రఫుల్ల చంద్ర రే గొప్ప దేశభక్తుడు, విజ్ఞాన శాస్త్రవేత్త, బ్రిటిష్‌ ప్రభుత్వం చేతనే ‘సర్‌’ బిరుదాంకితుడు.

ఈ ఉప్పు సత్యాగ్రహం ఒక మహాయజ్ఞమని గాంధీ మహాత్ముడు అభివర్ణించారు. ఏప్రిల్‌ 6వ తేదీన జలియన్‌ వాలాబాగ్‌ దురంత హత్యల పరితాప స్మృతి దినంగా పాటిస్తూ గాంధీజీ తన దేశ ప్రజలను ఒక నిర్ణాయకమైన గొప్ప తిరుగుబాటుకు ప్రేరేపించాడు. ఒకవేళ తనను బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్బంధించగానే శ్రీ అబ్బాస్‌ తయాబ్జీ, ఆయనను కూడా అరెస్ట్‌ చేయగానే శ్రీమతి సరోజినీ నాయుడు దండి యాత్ర అనంతర అనుగత ఉద్యమానికి నాయకత్వం వహిస్తారనీ, వారి నాయకత్వాన్ని ప్రజలు శిరసావహించాలని గాంధీజీ ఉద్బోధించారు.

ఆయన సముద్ర తీరంలో ఉప్పు సేకరిస్తున్న సందర్భంలో ఆయన వెంట శ్రీమతి సరోజినీ నాయుడు కూడా ఉంది. దర్శన అనే ప్రాంతంలో ఉప్పు కొటార్లపై సత్యాగ్రహులు దాడి జరిగినప్పుడు సరోజినీ నాయుడు నాయకత్వం వహించారు. ఆమెను బ్రిటిష్‌ ప్రభుత్వం నిర్బంధించింది. అప్పుడామె వెంట రెండువేల ఐదువందల మంది సత్యాగ్రహులున్నట్లు యునైటెడ్‌ ప్రెస్‌ విలేఖరి, ప్రముఖ పాత్రికేయుడు వెబ్‌ మిల్లర్‌ రాశారు.

ఉప్పు సత్యాగ్రహంలో దేశభక్తులందరూ పాల్గొనాలనీ, ముఖ్యంగా మహిళలకు ఇందులో గురుతరమైన బాధ్యత ఉందని మహాత్ముడు ఉద్బోధించాడు. ఇది 13 ఏప్రిల్‌ దాకా కొనసాగుతుందనీ, ఉధృతరూపం ధరిస్తుందనీ కూడా ఆయన ఆశించారు. ఒకవేళ ఆ ఉద్యమంలో పాల్గొనలేని వారు విదేశీ వస్త్ర బహిష్కారం, ఖద్దరు ప్రచారం, మద్యపాన నిషేధం వంటి కార్యక్రమాలలో శాయశక్తులా సహకరించాలని కూడా ఆయన ప్రబోధించారు. ఇక మహిళలను ఉద్బోధిస్తూ మహాత్ముడిలా వారికి సందేశం వినిపించారు.

I am preparing a message for the women of India who I am becoming more and more convinced, can make a larger contribution than men towards the attainment of Independenc, I feel that they will be worthier interpreters of non-violence than men, not because they are weak as men in their arrogance, believe them to be, but because they have greater courage of the right type, and immeasurably greater spirit of self-sacrifice.” – (The Man and His Mission – P.106-H.S.Polak, Published by Natesan, Madras – 1931 (8th edition)

(నేను మహిళలనుద్దేశించి ఒక సందేశం ఇస్తున్నాను. స్వాతంత్య్ర సముపార్జనంలో పురుషుల కన్నా మహిళలకు పటుతరమైన, గురుతరమైన శక్తి ఉన్నదని నేను మరీ మరీ విశ్వసిస్తున్నాను. అహింసాతత్వాన్ని బాగా అర్థం చేసుకొని అనుపాలించగలిగిన సామర్థ్యం పురుషులకన్నా మహిళలకే ఎక్కువగా ఉంటుంది. స్వీయాహంకారంతో పురుషులు, స్త్రీలు అబలలనీ, శక్తిహీనులనీ అనుకుంటారేమో కానీ, ధైర్యసాహసాలలో, అపరిమేయమైన త్యాగనిరతిలో వాళ్ళు అధికులు సుమా అని చెప్పవలసి ఉంటుంది.)

మహాత్ముడి ఈ నమ్మకాన్ని దుర్గాబాయి వమ్ము చేయగలదా? దక్షిణ భారతానికంతా ఆమె త్యాగోజ్వల ధైర్య సాహస నిరతి ఆమెను నాయక మణిలాగా ప్రకాశించేటట్లు చేసింది. ఆమె సత్తా ఎటువంటిదో ఎరుక పరిచింది.

ఈ విషయాలన్నీ అప్పుడు చెన్నపట్నంలో ఉన్న దుర్గాబాయి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంది. ఆవేశోద్వేగ సంయమ భరిత హృదయంతో గమనిస్తూనే ఉన్నది. ఆమె ఉవ్వెత్తున ఉద్యమంలోకి ప్రవేశించింది. ఆమె వయస్సు అప్పటికి 21 సంవత్సరాలే.

ఉప్పు సత్యాగ్రహం గురించి అత్యంతాసక్తికరమైన కొన్ని విషయాలున్నాయి. కాంగ్రెస్‌ కార్యనిర్వాహక సమావేశాలలో సత్యాగ్రహోద్యమ స్వరూప స్వభావాలను గాంధీజీ చర్చిస్తుండేవారు. అనుచరులతో సంప్రదిస్తూ, ఫలితాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవారు. ఉప్పు సత్యాగ్రహం ఎన్నుకోవడంలో భోజరాజు పట్టాభి సీతారామయ్యగారి పాత్ర చాలా ఉంది. ఆయనతో గాంధీజీ ప్రధానంగా సంద్రించేవారని భావించడానికి చాలా అవకాశం ఉంది. భోగరాజు పట్టాభి సీతారామయ్యగారు ఆ రోజుల్లోనే గాంధీజీ సూత్రకారుడైతే పట్టాభి భాష్యకారుడనే గౌరవం పొందాడు. అదీకాక ఆనాటి స్వాతంత్య్ర సమరంలో ఆధునిక కాలంలో దేశ దేశాల స్వాతంత్య్రోద్యమం ఏ తీరున ఏ విధంగా సాగిందో కూడా నాయకులు బాగా తెలిసినవారై ఉంటారనుకోవచ్చు. అమెరికాలో ఆ తర్వాత కాలంలో నల్లజాతుల విముక్తి పోరాటంలో గాంధీజీ ప్రభావం అమేయంగా ఉన్నట్లే. బ్రిటష్‌ రాజరికం నుంచి అమెరికా స్వాతంత్య్రం పొందడం అనే ఉద్యమ స్వరూప స్వభావాలు భారత స్వాతంత్య్రోద్యమంపై అంతో ఇంతో ప్రసరించినట్లు భావించాలి. అమెరికా స్వాతంత్య్రోద్యమంలో కూడా విదేశీ వస్త్ర బహిష్కారం ఉంది. బ్రిటన్‌ నుంచి దిగుమతి అయ్యే ‘టీ (తేయాకు)’ నిరాకరణం ఉంది. బోస్టన్‌ నగరంలో విదేశీ వస్తు బహిష్కరణ పర్యవసానంగా జరిపిన కాల్పులే స్వాతంత్య్రోద్యమాన్ని చైతన్యవంతం చేశాయి. ‘పరిపాలనలో ప్రాతినిధ్యంలేని పన్నులు నిరాకరిస్తాము’ (నో టాక్సేషన్‌ వితవుట్‌ రిప్రజెంటేషన్‌) అనేది స్వాతంత్య్రోద్యమ నినాదంగా అమెరికా ప్రజలను ఉత్తేజపరిచింది.

ఉప్పు సత్యాగ్రహం పుట్టు పూర్వోత్తరాలను గురించి డా||భోగరాజు పట్టాభి సీతారామయ్య తన ప్రశ్నోత్తర సమకాలీన చరిత్ర (కరెంట్‌ హిస్టరీ ఇన్‌ క్వశ్చన్స్‌ అండ్‌ ఆన్సర్స్‌) అనే గ్రంథంలో విస్మయావహమైన ఎన్నో విషయాలు తెలియచేశారు. 1946వ సంవత్సరం చివర్లో, భారతదేశానికి ఇంకొక ఏడెనిమిది నెలల్లో స్వాతంత్య్రోద్యమం సిద్ధించబోతున్నదనగా ఈ గ్రంథం కలకత్తా నుంచి వెలువడింది. ఈ గ్రంథంలో వెయ్యి ప్రశ్నలూ, దానికి పట్టాభి సమాధానాలూ ఉన్నాయి. పత్రికా విలేకరుల సమావేశంలోనో, విద్యా నిలయ వార్షికోత్సవాలలోనో, బహిరంగ సభలలోనో దేనిలోనో ఆయనను ఉప్పు సత్యాగ్రహం నేపథ్యం ఏమిటని ఎవరో అడిగారు. ఆ మేధావి ఆ ప్రశ్నకు సమాధానం చెపుతూ ఎన్నో విస్మయకర విషాదాలు తెలియచేశారు. అవి ఇవే :

1929 డిసెంబరు 23న ఇర్విన్‌-గాంధీ సమావేశం విఫలమయింది. గాంధీజీ చాలా అసంతృప్తి చెందారు. ఆ సమావేశం సుహృద్భావంగా ముగియలేదు. అదే రోజు ఢిల్లీ పురానా ఖిల్లా ప్రాంతంలో వైస్రాయి ప్రయాణిస్తున్న రైలు కింద ఒక బాంబు పేలింది. గత్యంతరం లేని పరిస్థితులలో సంపూర్ణ స్వరాజ్య సాధనే తమ ఆశయమని కాంగ్రెస్‌ ప్రకటించవలసి వచ్చింది. బ్రహ్మాండమైన ప్రజా ఉద్యమాన్ని సంఘటింప చేయవలసిన ఆలోచన చేయవలసి వచ్చింది. దేశం యావత్తూ దీనివల్ల చైతన్యం కావలసిన అవసరం కూడా స్పష్టపడింది. మానవ జీవితానికి అత్యంతావసరాలు ఆహారం, వస్త్రం. ఆహారం విషయానికొస్తే కనీసావసరం ఉప్పు. 4800 మైళ్ళ సముద్ర తీరంతో పరివేష్టితమై ఉంది భారతదేశం. రాజస్థాన్‌లో జయపురం, జోథ్‌పురం సంస్థానాల ఉమ్మడి సొత్తు అయిన సంభారు సరస్సు అతి విశాలంగా పరచుకొని ఉంది. కానీ బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ సరస్సుపై గుత్తాధిపత్యం చెలాయిస్తున్నది. సింధు ఎడారిలో (మరు భూములలో) ఒక బ్రహ్మాండమైన ఉప్పు గనుల ప్రాంతం ఉంది. ఈ ఉప్పు ప్రాంతం భారతదేశపు అవసరాలను 250 సం|| పాటు తీర్చగలదు. పంజాబులో విస్తారమైన ఉప్పు శిలలున్నాయి (రాతి ఉప్పు). ఈ ఉప్పు శిలలు ప్రపంచపు ఉప్పు అవసరాలనే (వినియోగాన్నే) 250 సం||పాటు తీర్చగలవు. ఇక భారతదేశానికే అయితే 1200 సం||లు సరిపోతాయి. వీటితోపాటు పంజాబులో అసంఖ్యాకంగా ఉప్పు నూతులున్నాయి. ఈ నీరు తోడి పారించి ఉప్పు తయారుచేస్తారు అక్కడివారు. ఈ విధంగా ఉప్పు తయారు పొలాలు చవిటి నేలల గుణాన్ని పోగొట్టుకుని తర్వాత పంట పొలాలవుతాయి. 1836వ సం||దాకా దక్షిణ భారతం నుంచి కలకత్తాకు ఉప్పు పడవలు నిరంతరంగా చేరుతుండేవి. మళ్ళీ అవి బియ్యం నింపుకుని, తిరిగి వెళుతుండేవి. ఎప్పుడైతే లీచెస్టర్‌ నుంచి చెషైరు నుంచి (ఇంగ్లాండ్‌) భారతదేశానికి

ఉప్పు రవాణా ప్రారంభమైందో అప్పుడిక పంజాబ్‌ క్షేత్రాలు చవిటి (ఊషర) పర్రలయ్యాయి. దక్షిణ భారతదేశానికి బియ్యం చేరడం నిలిచిపోయింది. ఇక్కడొక ప్రశ్న తలెత్తుతుంది. లివర్‌పూల్‌ నుంచి ఇండియాకు ఉప్పు దిగుమతి ఎందుకు అని? ఎందుకంటే అప్పుడు ఇంగ్లాండ్‌, భారతదేశం నుంచి ముడిసరుకులు విరివిగా ఎగుమతి చేసుకునేది కదా! ఆ పడవలు ఇంగ్లండు నుంచి ఖాళీగా ఎలా వస్తాయి? సముద్ర జలాల్లో ఖాళీ పడవలు ప్రయాణం చేయలేవు. అవి ప్రయాణం చేయడానికి, వెన్ను దూలం అటూ, ఇటూ ఊగిపోకుండా ఉండడానికి అవసరమైన బరువుతో ఆ పడవలు నడవాలి. అందుకని ఆ పడవలు మొదట్లో మట్టి నింపుకుని వచ్చేవి. కలకత్తా రేవు చేరిన తరువాత ఆ మట్టిని ఏం చేయాలి? ఇప్పడు అప్పర్‌ సర్కులర్‌ రోడ్‌, చౌరంగి ప్రాంతాలు అప్పట్లో మెరక నేలలు కావు. గొప్ప కాలువ ఉండేది అక్కడ. హుగ్లీ నుంచి కాళీఘాట్‌ దేవాలయానికి పడవ మార్గమది. ఇంగ్లండు నుంచి పడవలతో వచ్చిన మట్టితో ఇంగ్లీషు వారు ఆ గొప్ప కాలువను పూడ్చివేశారు. అయితే ఇట్లా కాలువలు పూడ్చి వేసే అవకాశం వాళ్ళకు ముందు ముందు ఎట్లా ఉంటుంది? అందుకని 1836లో ఇంగ్లండ్‌ పార్లమెంట్‌ ఒక కమిటీని నియమించింది. ఇండియాకు వెళ్ళే ఓడలలో ఏ సరుకు నింపి తీసుకుని వెళితే బాగుంటుందో బాగా పరిశీలించి నిర్థారణ చేయవలసిందిగా. అప్పుడా కమిటీ ఉప్పు తీసుకొని వెళ్ళాలని నిర్ణయించింది. (అప్పట్లో భారతదేశానికి ఎగుమతి చేయడానికి వాళ్ళ దగ్గర సరుకు ఏముంది కనుక!)

అలా ఇండియాకు ఉప్పు దిగుమతి (రవాణా) ప్రారంభమైంది. కానీ ఇండియాలో ఉప్పుకు కొరత ఏముంది? కొల్లలు కొల్లలుగా ఉత్పత్తి అవుతుంది కదా! అందువల్ల ఉప్పు తయారీదారులపైన మణుగుకు 3-8-0 పన్ను విధించింది సర్కారు. దాంతో బెస్త ప్రజల జీవనాధారం, ముఖ్యంగా బెస్త ఆడవాళ్ళ వృత్తి నాశనమైపోయింది. బెస్త కుటుంబాలలో ఉప్పు తయారు చేసేవారూ, ఉప్పు చేపల పరిశ్రమలకు ఆధారమైన వారూ స్త్రీలే కదా! వాళ్ళు మణుగు ఉప్పుకు మూడున్నర ఎలా తెస్తారు? సముద్రంలో నుంచి పడవల నిండా చేపలు తెస్తారు కానీ, వాటిని ఉప్పు చేపలుగా ఎండించడానికి వాళ్ళు ఉప్పు ఎక్కడ నుంచి తెచ్చుకుంటారు? మణుగుకు మూడున్నర రూపాయల పన్ను ఎక్కడ నుంచి తీసుకొని వస్తారు? వాళ్ళు కలిలోకీ, గంజిలోకీ, సంకటిలోకీ కూడా ఉప్పు తయారు చేసుకోకూడదని ఆంక్ష పెట్టింది బ్రిటిష్‌ ప్రభుత్వం. అప్పుడిక వాళ్ళు సముద్రపు నాచును, తీగలను ఎండించి, మండించి ఆ బూడిదను ఉపయోగించుకోసాగారు. ఇందుకు కూడా కన్నెర్ర చేసింది ఆంగ్లేయుల ధర్మరాజ్యం. ఇట్లా చేసిన బెస్త వారికి 500 రూపాయల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ వచ్చింది. మత్స్యకారుల జీవితాలు కటిక దరిద్రంపాలై, ఛిన్నాభిన్నమైపోయాయి. మత్స్య పరిశ్రమకు భారతదేశంలో అత్యంత నష్టం, విపద్దశ సంప్రాప్తించాయి. భారతదేశ ఔషధ తయారీలలో, రసాయనశాలలలో ఉప్పు వాడకం కూడా ఉండేది. అందువల్ల అవీ క్షీణించిపోయాయి. ఈ విధంగా దేశీయ పరిశ్రమలను నాశనం చేశారు బ్రిటిషువారు. ఇక ఉప్పు తయారీని గుత్తదారులకు అప్పగించారు. పెట్టుబడిదారీ వ్యవస్థను పెంచారు. ఉప్పు ఇక గుత్త వ్యాపార పరిశ్రమ అయిపోయింది.

ప్రజల ఆరోగ్యానికి కూడా ఈ పరిస్థితి ఎంతో ఆపద తెచ్చింది. ఇంతవరకు సూర్యకాంతి, నీరు, గాలిలా స్వతస్సిద్ధంగా లభించే ఉప్పు అమ్మకం దినుసు అయిపోయింది. కొనుక్కునే సరుకు అయిపోయింది. ప్రజలకు డబ్బు ఎక్కడినుంచి లభిస్తుంది? అందువల్ల వారి ఆహారంలో ఉప్పు వాడుక తక్కువైపోయింది. ఇదెట్లా తెలిసిందంటే 1903-04లో ఉప్పు వాడకం బాగా పెరిగినప్పుడు తెలిసింది. గోఖలే మహాశయుడి సమ్మెట పోట్ల వల్ల కేంద్ర బడ్జెట్‌లో ప్రభుత్వం ఉప్పు పన్ను తగ్గించక తప్పింది కాదు. అప్పుడు మణుగుకు పన్ను 2-8-0 కు తగ్గించింది ప్రభుత్వం. దాంతో ఉప్పు వినియోగం కొంత పెరిగిందని పట్టాభి చెబుతూ 50 సం||ల క్రితం తన బాల్యంలో జరిగిన ఒక ఉదంతం ప్రస్తావించారు. సర్‌ జొనాథన్‌ హచ్చిన్‌ అనే వైద్య రంగ ప్రముఖుడు ఇండియా వచ్చినపుడు ఇక్కడ కుష్టువ్యాధి ఎక్కువ కావడానికి ఉప్పు వాడకం తగినంత లేకపోవడమే కారణమని చెప్పారు.

భారతదేశంలో ఉప్పు వాడకం బాగా తగ్గిపోవడంతో పశుసంపద కూడా క్షీణించింది. కుడితిలో, దానాలో, ఉప్పు పాళ్ళు బాగా తగ్గిపోవడంతో అవి చిక్కి శల్యమై అసువులు బాస్తూ వచ్చాయి.

ఇక పంజాబ్‌లో పంట పొలాలు కూడా బీడువారి పోయాయి, ఊషర క్షేత్రాలయ్యాయి. ఇదెక్కడైనా ఉందా-తెల్లవాడి ఉప్పు పన్ను… చెషైర్‌ నుంచి ఉప్పు రవాణా పంజాబ్‌ను బీడు భూములను చేయడం?!

ఉప్పు వ్యాపారమంతా ప్రభుత్వం కట్టడిలోకి, పరిపూర్ణ అధికారంలోకి, గుత్తాధిపత్యంలోకి వచ్చింది. వ్యాపార లాభాలు సంపాదించి పెట్టింది. గుత్తేదారులను సృష్టించింది. జట్టీ వ్యాపారం చేసి కొందరు కాంట్రాక్లర్లు అమిత ధనవంతులయ్యారు. ఉన్న వ్యాపారం ‘లైసెన్స్‌’ రాజ్యంగా పరిణమించింది. ఈ విధంగా భారతదేశపు ఆర్థిక వ్యవస్థను ఉప్పు పన్ను కుంగదీసింది. దళారీల రాజ్యమై పోయింది బ్రిటిషు వారిది. లక్షల సంఖ్యలో ప్రజలు తమ జీవనోపాధిని కోల్పోయారు… అని పట్టాభి సీతారామయ్య ఉప్పు సత్యాగ్రహం వెనుక ఉన్న దీనగాధను, ప్రజల విషాద దుర్భర జీవితాన్ని వివరించారు. 1946.)

అందువల్లనే ఉప్పు సత్యాగ్రహం సముద్రంలో కాక భూమిమీద ఒక గొప్ప తుఫానును,
ఉప్పెనను సృష్టించింది. ఉప్పు సత్యాగ్రహం దేశాన్నంతా అల్లకల్లోల భరితం చేస్తుండగా, పెనుతుఫానులాగా చుట్టుముట్టగా చెన్న పట్నంలో కాంగ్రెస్‌ నాయకులు ఆ మాటే తలపెట్టక పోవడం, ఉలకక, పలకక నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండడం ఇరవై ఏళ్ళ దుర్గాబాయిని విషాద సంభ్రమాశ్చర్యాలకు గురిచేసి

ఉంటుంది. అప్పుడామె మద్రాసులోనే ఉంది. అదిన్నీ కాశీనాథుని నాగేశ్వరరావుగారి విశాల గృహావరణంలో వెనుకవైపు ఉన్న అతిథి నిమిత్తం ఉన్న వాటాలలో, భర్త ఆరోగ్యోపచార విధులలో నిమగ్నమై నివసిస్తున్నది. మద్రాసులో ఉప్పు సత్యాగ్రహం లేకపోవడం ఆమె మనస్సును ఎంతగానో కలచివేసి ఉంటుంది. ఆమె ఇది దారుణంగా భావించి బాధపడి ఉంటుంది. లజ్జాకరంగా తలచి వెత చెంది ఉంటుంది. భారతదేశంలో ప్రముఖ నగరం మద్రాసు. ఇంగ్లీషు ప్రభుత్వానికి మొదటి నుంచీ కంచుకోట. ఈ నగరం చేష్టలుడిగి హాయిగా నిద్రపోతోందా? నిర్జీవం గాబోతోందా? అని ఆమెకు చాలా బాధ, విచారం, ఆందోళన కలిగి ఉంటాయి.

(ఇంకా ఉంది…)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.