రోహిణీ కార్తి… రోళ్ళు పగులుతాయంట! కాస్త పొద్దెక్కగానే మొదలౌతున్న వడగాలులకి పిట్టా, పురుగూ కూడా ఎక్కడివక్కడ సద్దుమణిగిపోతున్నాయి. ఇక లాక్డౌన్ పుణ్యమా అని పెద్దా చిన్నా తేడా లేకురడా అన్ని పనులకి తాళాలేయడంతో జనమంతా ఇళ్ళకి పరిమితమయ్యారు.
మరి ఈ నిశ్శబ్ద కల్లోలం ఏంటి? ఎక్కడ్నించి? ఎందుకని?
దేశమంతా లాక్డౌన్తో పనుల్లేవ్… పనిలేక పైసల్లేవ్… ఎప్పటికప్పుడు కూలి పైసల్తో నాల్రోజులకో, వారానికో సరిపడా సరుకులు కొనుక్కునే శ్రమజీవులకి దుకాణాల్లేక సరుకులూ లేవ్. ఉన్నవన్నీ నిండుకున్న ఇళ్ళల్లో, ఇళ్లనబడే గూళ్ళల్లో తిండీ, తిప్పలూ లేక… అడుక్కోడానికి కూడా రోడ్లమ్మట మనిషిలేక… బొక్కెడు నీళ్ళు తాగినా ఆరని కడుపుమంటలకి సొమ్మసిల్లిన కాయాలు…
రేపో మాపో తాళాలు తెరుచుకుంటా యని ఎదురుచూసీచూసీ ఇక చూసే శక్తీ, ఓపికాలేక…. చస్తామో, బతుకుతామో తెలీక… కనీసం పుట్టినూర్లో అయినవాళ్ళ మధ్య చస్తే… నాలుగు కన్నీళ్ళు కార్చే ఆప్తులతో పాటు, కనీసం కట్టెని కాల్చడానికి అడ్రస్ అన్నా ఉంటుంది. కానికాడ చస్తే అనాథ శవంలా మార్చురీలో పడుండటమో, కరోనా భయంతో కాటికాడ కూడా అనుమతి లేక రహస్యంగా కొండల్లోనో గుట్టల్లోనో సర్కారే తగలబెట్టేస్తే… ఒద్దు. ఈ గతిలేని బతుకొద్దు. దౌర్భాగ్యపు చావు ఒద్దు. నా వాళ్ళ దగ్గరికి పోవాలి… నా ఊరి మట్టిని ముట్టాలి. ఒకటే ధ్యాస. ఉన్న నాలుగు బొచ్చలూ, చిరకిపాతలు మూటలుగట్టి నెత్తిన బెట్టుకుని ఉన్న నాలుగు పైసలూ అద్దెకి కట్టి గూడు వదిలించుకుని ఊరి బాట పట్టిన శ్రామిక జీవుల కోలాహలం! మాటలు కూడా లేని కలవరంతో కూడిన నిశ్శబ్ద కల్లోలం!!
బస్సు లేదు, బండిలేదు, రైలు లేదు. అయినా సరే ఊరు చేరాలి. కాళ్ళే చక్రాలుగా మైళ్ళ దూరం తరిగించడానికి… కరిగిపోయిన కండలు, అరిగిపోయిన చెప్పులు, చిరిగిపో యిన బట్టలు, కాలే కడుపులు… పెద్దా, చిన్నా, పిల్లా, పాపా, ముసలీ, ముతకా తేడా లేదు…. ఒకటే నడక. బారులు బారులుగా దారులన్నీ దాటిపోడానికి ఒకటే నడక.
రోళ్ళు పగిలే ఎండల్లో, కాళ్ళు పగిలి రక్తమోడుతున్నా ఆగని నడక. లేతపాదాలు కమిలిపోయి, బొబ్బలెక్కి చితికినా కుంటుతూనే సాగిన నడక. పురిటి స్నాన మన్నా పూర్తికాని పసిగుడ్డుల్నేసుకుని పచ్చి బాలింతలూ…. ఇప్పుడో అప్పుడో ప్రసవించ బోయే నిండు గర్భిణిలూ… నడకన్నా పూర్తిగా నేర్వని చిన్నపిల్లలూ… ఇక్కడ మాత్రం తేడా లేదు. అరదరూ సంకల్పించింది ఒకటే నడక…. నడక… నడక…
తాళాలేయమన్న హుకుంని ధిక్కరించి సాగుతున్న నడక!
కాలే కడుపుల్ని, పిడచగట్టుకుపోతున్న గొంతుల్ని, మసకబారుతున్న చూపుల్ని, వసివాడుతున్న కాయాల్ని… దేన్నీ లెక్క చెయ్యని సంకల్పం…. నడక! ఎందాకా ఈ నిశ్శబ్ధపు నడక!!
ఈ శ్రమజీవుల చెమటతో, పాదాలు చెమర్చిన రక్తంతో తడుస్తున్న రహదారులు…. క్షణంలో ఆవిరి చేసేస్తున్న ఎండవల్ల మరింత నల్లగా మెరుస్తూ వాహనాల రద్దీ లేకపోవ డంతో విశ్రాంతి తీసుకుంటూ నీ సంకల్పా నికి తలొగ్గానన్నట్టు విశాలంగా, సుదూరంగా విస్తరించి నిర్మానుష్యపు ఆహ్వానాన్ని పలకడం తప్ప ఏం చేయగలవు.
ఇంతటి సంకల్పాన్ని భరించలేని సర్కారు గదమాయించి, అడ్డగించినా ఆగని శ్రామిక ప్రవాహంలో తాళాలు కొట్టుకు పోయాయి. మనసు ద్రవించి, గుండె పట్టేసి,
కళ్ళు చెమర్చి, గొంతులో పేరుకుపోతున్న దుఃఖాన్ని బద్దలు చేయాలని, తాళాలు బద్దలుకొట్టి రోడ్లపైకొచ్చేసింది మానవత్వం. అతిథి శ్రామికులు కష్టకాలంలో పడుతున్న దుర్భర దుఃఖానికి కొంతన్నా ఓదార్పు నివ్వాలని బువ్వ పెట్టడంతో మొదలై, గౌరవం గా వంట చేసుకుని తింటామన్నందుకు సరుకులు పంచి, మేమున్నామన్న భరోసా నిచ్చి సందూ, గొందూ, ఇల్లూ, వాకిలీ తిరిగి ఓదార్పు మాటలతో అక్కున చేర్చుకున్నంత ఉపశమనాన్నిచ్చిన సహృదయాలు… నిరంతర నడక ప్రారంభించిన అతిథి శ్రామి కుల బాటలో చలువ పందిళ్ళు వేయకపోయి నా ఇంత నీడనిచ్చే చిన్న టెంట్లేసి, చల్లని నీళ్ళు, కమ్మని మజ్జిగ, పండు ఫలంతో మొదలై కడుపునిండా తినెళ్ళమంటూ ఆప్యాయంగా భోజన సదుపాయం కల్పించ డర ఒక మానవత్వపు పరిమళం.
ఇంకాస్త మురదుకెళ్ళి మైళ్ళకొద్దీ సాగాల్సిన నీ నడకని పంచుకోలేముకాని నీ నడకని తగ్గిరచేలా ఉడతా సాయం చేయాలని ట్రక్కుల్లో, లారీల్లో పోవాలనుకున్నా పైసలు లేక పగిలిన పాదాలే చక్రాలుగా సాగుతున్న వారిని ఆపి వాహనాలెక్కించి, డబ్బిచ్చి పంపిన వైనం… ఇలా ప్రమాదకరంగా పంపడం వద్దని, ఏకంగా బస్సులే ఏర్పాటు చేసి ప్రేమగా, గౌరవంగా, ఆత్మీయంగా వీడ్కోలు పలికి ఊరు చేరేదాక కాచుకునున్న వైనం… ఇంతటి మానవత్వర, ఇంతటి సహనం, ఇంతటి సహానుభూతి ఈ గడ్డుకాలంలో ఒక చారిత్రాత్మక సంఘటన. సహోదరభావం, సమానత్వం, సంఘటితత్వం వెల్లివిరిసిన అపూర్వ సందర్భం.
దేశానికి తాళాలేసి వైరస్ అరటదని భ్రమింప చేసి కోట్లాది శ్రామికుల, చిరు వ్యాపారుల కడుపుకొట్టి మా ఆచారాలు మమ్మల్ని రక్షిస్తాయి, హిందూ సారప్రదా యాలే ప్రపంచానికి దిక్కు అరటూ బీరాలు పలికిన నోళ్ళకి కాలే కడుపుల మంట కనిపించలా! దూరాభారపు దుఃఖాలు వినిపిం చలా! కాని నిశ్శబ్దపు నడకల, పగిలిన పాదాల, అలసిన శ్వాసల సవ్వడులు మాత్రం ఘూర్జించాయట!! తాళాలు బద్దలు కొట్టిన శ్రమైక ధీరుల వైనం కల్లోల పరిచిందట!! ఇదేమి నీతి?? ఇదేమి నైజం??