(గత సంచిక తరువాయి…)
ఆమె కాశీనాథుని నాగేశ్వరరావుగారి సన్నిధికి వెళ్ళి ఇదేమి అన్యాయం అని ఆయన్ను నిలదీసి ఉంటుంది. ”అమ్మాయీ! ఈ విషయాలు నీకు తెలియవు. పెద్దలున్నారు నిర్ణయించడానికి. రాజకీయాలతో నీకేమి పని?” అని అనునయంగానో, అతిశయంగానో ఆయన సర్దిచెప్పారు. అథవా ఆ ప్రయత్నం చేశారు. కానీ అది దుర్గాబాయికి నచ్చలేదు. మసస్సుకు సమాధానం కలగలేదు. అప్పటికే మహానాయకుడిగా, సైమన్ కమీషన్‌పై గర్జించి బెదరగొట్టిన, ప్రజల ఆదరాభిమాన, ఆరాధనపాత్రుడైన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంగారి దద్గరకు వెళ్ళింది. ఆయన గుహలో నిద్రపోతున్నారేమిటీ? అని విస్తుపోయింది దుర్గాబాయి. ఆయనతో అప్పటికి సన్నిహితంగా ముఖాముఖి ఆమె సంభాషించి ఉండదు. అప్పుడెప్పుడో ఏడేళ్ళ క్రిందట కాకినాడ కాంగ్రెస్ మహాసభలో ఆమెను పదమూడు, పధ్నాలుగేళ్ళ బాలికగా ఆయన చూసి ఉండవచ్చు. కానీ ‘బాలా! విక్రమ నందితా’ అని అప్పుడామెను ఆయన పోల్చుకొని ఉండకపోవచ్చును. పరిచయోపచారాలైన తరువాత ‘అయితే ఏమంటావమ్మా?’ అని ప్రకాశం పంతులు ఆమెను సలహా కోరి ఉంటారు. చెన్నపట్నంలో ఉప్పు సత్యాగ్రహం లేకపోవడం, చేయకపోవడం మద్రాసుకే కాక, రాష్ట్రానికే లజ్జాకారకం, అవమానభరితం అని ఆమె ఆయన అర్థం చేసుకోగలిగేటట్లు వివరించి ఉంటుంది. దేశంలోనే పేరుపొందిన గొప్ప ‘బీచి’ (సముద్రతీర విహార నిర్దేశ ప్రాంతం)ని వదిలిపెట్టి, బ్రిటిషువారి గట్టి పునాదులున్న ధీమాను క్రక్కదల్చకుండా (బీటలు వారేట్లు చేయకుండా) చీరాల బోయి ఉప్పు వండుతారా! హవ్వ! అని ఆయన్ను నిలదీసి ఉంటుంది దుర్గాబాయి. ‘అయినా మీరు ఇక్కడి ప్రజలను చైతన్యవంతులను చేయండి. నిద్రావస్థ నుండి మేల్కొలపండి. ఫలితం మీరే చూద్దురుగాని!’ అని పందెం చరచినట్లు మాట్లాడి ఉంటుంది. ప్రకాశం గారి తలకెక్కింది దుర్గాబాయి హితబోధ, ధీరగంభీర వచనం. అప్పటికప్పుడే తన కార్యదర్శిని (ఖాసా సుబ్బారావు అని నేతి సీతాదేవి చెపుతున్నారు) ఫోనులో పిలిచి మద్రాసులో ఆ సాయంకాలం బహిరంగ సభ ఏర్పాట్లు చూడవలసిందిగా పురమాయించారు ప్రకాశం పంతులు గారు. అప్పుడెప్పుడో గాంధీజీ లాగానే ‘దుర్గా కారెక్కవమ్మా’ అని ఆమెను కారెక్కించుకుని కాశీనాథుని వారింటికి వెళ్ళారు ప్రకాశం పంతులుగారు.
కాశీనాథుని వారు తెల్లబోయి ఉంటారు. పక్కనే బాలకాళిగా దుర్గాబాయిని చూడగానే ఆయనకు అంతా అర్థమై ఉంటుంది. కాశీనాథుని గారూ, ప్రకాశం గారూ చీరాల వెళ్ళి తాము చేయబోయే ఉప్పు పోరు విరమించుకున్నారు.
ఏప్రిల్ 9న దండిలో జరిగిన ఉప్పు సత్యాగ్రహ యాత్ర సందర్భంగా గాంధీజీని కలుసుకోవడానికి కాశీనాథుని వారు వెళ్ళారు అంతకు పూర్వమే. అప్పుడే దుర్గాబాయి గాంధీజీకి ఒకలేఖ రాసి, దాన్ని మహాత్ముడికి చేర్చి వారు దానికి రాసే సమాధాన లేఖేమిటో తనకు తెచ్చి ఇవ్వవలసిందిగా నాగేశ్వరరావు పంతులు గారిని అభ్యర్థించింది. వారింటి ఆవరణలోనే కదా ఆ రోజుల్లో దుర్గాబాయి ఉండడం, అందువల్ల ఆయనను ఆ విధంగా కోరగలిగిందామె. దండి నుంచి వచ్చిన తర్వాతనే ప్రకాశం గారితో సంప్రదించి చీరాలలో అయితే తమకు అండదండలు, సహాయ సహకారాలు దండిగా ఉంటాయని చీరాలలో ఉప్పు సత్యాగ్రహం చేయడానికి నాగేశ్వరరావు గారూ, ప్రకాశం గారూ సన్నాహాలు చేసుకొని ఉన్నారు. గాంధీజీకి దుర్గాబాయి రాసిన లేఖలో ‘బాపూ! చెన్నపట్నంలో ఉప్పు సత్యాగ్రహం చేయడానికి మీ అనుమతిని వేడుకొంటున్నాను. మహిళల సత్యాగ్రహమని మీరనుకోవద్దు. మహిళలు జాతిని జాగృతం చేయగల శక్తి మీకు తెలియనిది కాదు. వారి తోడ్పాటు లేకుండా ఉద్యమాలు ఫలకారులు కావని కదా మీరు కూడా అన్నారు, ఒకవేళ ఇక్కడి పెద్దలు మిమ్మల్ని అభ్యర్థించలేదని మీరు సంకోచిస్తే, నా కోరికను అంగీకరించకపోతే, అంగీకరించకపోయినా నేను ఈ సత్యాగ్రహం చెయ్యడానికి సంసిద్ధంగా ఉన్నాను. మీరు దయతో అనుమతిని ఇవ్వండి. దాంతో నా ఉత్సాహోద్వేగాలు మరింత పుంజుకుంటాయి’ అని అర్థమయ్యేలా మహాత్ముడికామె రాసిన లేఖకు అంతటి మహా సంరంభంలో కూడా మహాత్ముడామెను గుర్తుపెట్టుకొని, ‘అమ్మా! నేను కాదంటానా?!’ అనే స్ఫూర్తి ఆమెలో కలిగేలా సమాధానం రాశారు. అంతకు పూర్వమే దుర్గ ఆత్మబలం ఆయనకు పరిచితమే. ఆంధ్రదేశ పర్యటనకు మహాత్ముడు వచ్చిన ఎన్నో సందర్భాలలో దుర్గాబాయి మహాత్ముణ్ణి దర్శించుకోవడమే కాక, ఆయన ‘దుబాసీ’గా కూడా వ్యవహరించేది కదా! ఆయనకు తెలుసు దుర్గాబాయి జయించి తీరుతుందని! ఉప్పు సత్యాగ్రహం ప్రారంభం కావడానికి ముందు మద్రాసులో బ్రహ్మాండమైన బహిరంగ సభ జరిగింది. ప్రజలలో ఉత్సాహోద్రేకాలు మిన్నుముట్టాయి. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొనడానికి ఎప్పటికప్పుడు ఎందరో ఉత్సాహులు ముందుకు వచ్చారు. వాళ్ళకు కావలసిన అన్నపానాది సౌకర్యాలు సమకూర్చడానికి ఉదారులెందరో సంసిద్ధమయ్యారు. నగర పరిపాలనాధికారికి (శాంతి భద్రతల సంరక్షణ ప్రధానాధికారికి) లిఖిత పూర్వకమైన ప్రకటనలు చేరాయి. రాయపేటలో సత్యాగ్రహ శిబిరాలు అప్పటికప్పుడు ప్రత్యక్షమైనాయి.
నగరమంతా జన సందోహంతో తరంగలించింది.
ఆ రాత్రికి రాత్రే ప్రకాశం గారిని ప్రభుత్వం నిర్బంధించింది. తన తరువాత ఉప్పు సత్యాగ్రహోద్యమానికి నాయకత్వం వహించ వలసింది దుర్గాబాయే అని ప్రకాశం పంతులుగారు ప్రకటించారు. మరి ఎవరున్నారు ఆయన తర్వాత ఆ మహానగరంలో ఆ మహత్తర బాధ్యతను స్వీకరించడానికి? చక్రవర్తి రాజగోపాలాచారిగారు వేదారణ్యానికి వెళ్ళి అక్కడ సత్యాగ్రహోద్యమంలో నిమగ్నమైనారు. కాశీనాథుని వారూ, ప్రకాశం గారూ భావించినట్లే మద్రాసు నగరం ఉవ్వెత్తున ప్రతిస్పందించదేమోనని రాజాజీ అనుకొని ఉండవచ్చు. అదీకాక రాష్ట్రంలో దూర ప్రాంతాలలో కూడా ఈ చైతన్యం పొంగులు రావాలి కదా!
అందువల్ల ప్రకాశం గారు అరెస్టు కాగానే దుర్గాబాయి ఉప్పు సత్యాగ్రహోద్యమ నాయకురాలైంది. చెన్నై నగరంలో అప్పటి ఒక ప్రత్యక్షసాక్షి కథనాన్ని శ్రీమతి నేతి సీతాదేవి తమ గ్రంథంలో ఇట్లా అభివర్ణించారు. (ఆ ప్రత్యక్ష సాక్షి శ్రీ నేతి సోమయాజులు-గుంటూరులో తర్వాత న్యాయవాది)
”అప్పుడు నేను మద్రాసులో ‘లా’ చదువుతున్నాను. కచేరీ రోడ్డులో మేడమీద ఒక చిన్న రూం తీసుకొని ఉండేవాడిని. ఆ రోజు… అంతకుముందు నాలుగురోజుల నుంచీ ఊరు అట్టుడికి పోతున్నది సత్యాగ్రహపుటావేశంతో. ప్రకాశం గారిని అరెస్టు చేసినందుకు నిరసనగా మద్రాసులో హర్తాళ్ ప్రకటించారు. షాపులన్నీ మూసేశారు. ఊరంతా ఆవేశంతో ఊగిపోతున్నది. బయట ఉన్నట్లుండి సముద్రఘోషలా పెద్ద ఘోష! ఏమిటని ఆలకించే సరికి జేజేలు కొట్టుకుంటూ జనం కదలి వస్తున్నారు. ‘వందేమాతరం’ గాంధీజీకి జై, స్వాతంత్య్రం రావాలి’ ఉప్పు పన్ను పోవాలి, దుర్గాబాయికి జై, హిందుస్తాన్ హమారా… అని ఒక నినాదమా? బయటికి వచ్చి వసారాలో నిలబడి చూశాను. నేల ఈనినట్లు ఆ చివర నుంచి ఈ చివర వరకు విశాలమైన కచేరీ రోడ్డంతా నిండిపోయింది.
సముద్రంలో స్నానం చేసి అందరి ముందు, పెద్ద కుంకుమ బొట్టుతో జుట్టు విరబోసుకుని ఆ దుర్గే త్రిశూలం ధరించిందేమోనన్నట్లు చేతిలో పతాకం ధరించి దుర్గాబాయి వస్తోంది. ఆవిడ ఆ రూపం, ఉత్తేజం కలిగించే ఆమె కంఠం, ప్రజలలో మహోద్వేగం కలిగించి ప్రజలు వెంట నడుస్తున్నారు” (పుట, 75)
అక్కడి దృశ్యం అంతలో మారిపోయింది. పోలీసు బలగంతో పాటు పోలీసు కమీషనర్ ఆనందాచారి వచ్చి హూంకరించాడు, ఆగండి అని.
ఊరేగింపును నిశ్శబ్దం ఆవరించుకుంది. ‘రెండు నిమిషాలలో ఈ జనమంతా నిష్క్రమించాలి. లేకపోతే కాల్పులు జరుపుతాము’ అని భీకరించాడు. ఆ పోలీసు కమీషనర్ నినదభీషణాలకు ఎవరూ బెదిరిపోలేదు. ఆనందాచారి తన సహాయాధికారికి ఏదో చెప్పాడు. ఆ అధికారి జులుంతో ముందుకు వచ్చి ఊరేగింపు ముందు వరుసలో ఉన్న మహిళలపై విరుచుకుపడ్డాడు. తన బలగంతో అటూ ఇటూ వాళ్ళను నెట్టివేశాడు.పోలీసుల గుర్రాలు కదం తొక్కే విన్యాసాలు చేస్తున్నాయి. ప్రజలు కకావికులైపోతున్నారు. నేలకు ఒరిగిపోతున్నారు, తలలు బద్దలైపోతున్నాయి, చేతులు విరిగి వేళ్ళాడిపోతున్నాయి. జమదగ్ని అనే ఒక దేశభక్తుణ్ణి స్పృహ తప్పి పడిపోయేటట్లు పోలీసులు చావబాదారు. మద్రాసు పౌరులు ఆ క్షతగాత్రులను, రక్తం ఓడికలై ప్రవహిస్తున్నవారిని, తమ కార్లలో, ఇతర వాహనాలలో ఆస్పత్రులకు, ఇళ్ళకు, సత్యాగ్రహ శిబిరాలకు తీసుకొని పోతూ ఉన్నారు. జమదగ్నిని ఉప్పు సత్యాగ్రహ శిబిర స్థలానికి చేర్చారు. అతడి వెంట దుర్గాబాయి ఉన్నది.
అతడి తలను తన ఒళ్ళోచేర్చి ఉపచారాలు చేస్తున్నదామె. ఇంతలో అతడికి కొంచెం స్పృహ వచ్చింది. కష్టం మీద దుర్గాబాయిని చూసి ‘అమ్మా! ప్రపంచంలో తల్లి ప్రేమ అన్నింటికీ మించినది. ఆ ప్రేమే ఇప్పుడు మమ్మల్ని కాపాడుతున్నది’ అని మళ్ళీ అతను స్పృహ తప్పినట్లు ఆకూరి అనంతాచారి ఆ రోజులను వర్ణిస్తూ రాసిన గ్రంథంలో ఉన్నట్లు సీతాదేవి ఉ దహరించారు (పుట, 79)
కాని అప్పట్లో ఆ సత్యాగ్రహ సేవాదళ సభ్యుడైన వాలాజా సుందర వరదన్గారు దుర్గాబాయి అలా సత్యాగ్రహ శిబిరం చేరలేదనీ, ఆమె పోలీసుల దాడికి భయపడక వాళ్ళను మరింత సాహసంతో ప్రతిఘటించిందనీ, అప్పుడు స్వయంగా పోలీసు బలగం రాష్ట్ర అత్యున్నతాధికారి కన్నింగ్హోమ్ వచ్చి అశ్వికదళంతో స్త్రీ సత్యాగ్రహులను చుట్టుముట్టాడనీ వర్ణించినట్లు సీతాదేవి చెబుతున్నారు. (పుట.79) స్త్రీలని కూడా చూడకుండా పోలీసులు భయంకరంగా లాఠీఛార్జి జరిపినట్లు ఆ ప్రత్యక్ష సాక్షి వర్ణించినట్లు కథనం.
ఈ సత్యాగ్రహం వారాలపాటు జరిగింది. ఒకరి తర్వాత మరొకరు సత్యాగ్రహ సమూహాలకు నాయకత్వం చేపట్టేవారు. ”తిలక్ ఘాట్ దగ్గరో, శాంథోమ్ దగ్గరో… ఆ రోజుల్లో ఒకసారి ఉప్పు వండుతున్న దుర్గాబాయమ్మ గారిపై పోలీసులు విరుచుకు పడ్డారనీ, అప్పుడు ఉప్పు పిడికిట పట్టుకొని ఆమె ఆ దారుణ హింసకు ఎదురు తిరిగిందనీ, పోలీసుల పట్టుదల ఏమిటంటే ఆమె పిడికిటిలో ఉప్పును ఎలాగైనా జారిపోయేట్లు చేయాలని. అందువల్ల వాళ్ళు ఆ పిడికిలి మీద కొట్టిన దెబ్బల భయంకర దృశ్యం వర్ణించనలవి కాదు, అప్పటికే దుర్గాబాయి శరీరం రక్తసిక్తమైంది. ధరించిన వస్త్రాలు చిరిగిపోయాయి. జుట్టు చిందరవందర అయింది. కానీ పోలీసులు ఆమె పిడికిట నుంచి ఉప్పు విడిపించలేకపోయారు. వాళ్ళు ఓటమి భరించలేక ఆమెను కాళ్ళూ చేతులూ పట్టి ఒక ‘వ్యాను’లో పడేసి తీసుకొనిపోయారు” అని ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షి అయిన శ్రీమతి కె.సుగుణమణి గారి కథనం అని శ్రీమతి నేతి సీతాదేవి తమ దుర్గాబాయి జీవిత చరిత్రలో చెప్పారు. (పుట.80)
దుర్గాబాయి నడిపిన ఉప్పు సత్యాగ్రహోద్యమం భారతదేశ స్వాతంత్య్రోద్యమ చరిత్రలో ఉజ్వల ఘట్టం. వేళ్ళు చితికిపోయి, చిట్లిపోయి నెత్తురు కారుతున్నా ఆమె పిడికిటి నుంచి ఉప్పు విడిపించలేకపోయారని చరిత్రకారులు రాశారు.
ఈ విషయాన్నే అంటే ఉప్పు సత్యాగ్రహ భయంకర వాతావరణాన్ని గాంధీజీకి అత్యంత ప్రేమపాత్రుడు, వ్యక్తిగత కార్యదర్శి అయిన మహాదేవ దేశాయి కూడా చెప్పినట్లు లూయీఫిషర్…మహాత్మాగాంధీ జీవిత చరిత్రలో ప్రసక్తం చేశాడు. పోలీసులు హింసాత్మక ప్రతిక్రియలతో విరుచుకుపడ్డారనీ, సత్యాగ్రహులను పెద్దసంఖ్యలో అరెస్టు చేశారనీ, అరెస్టులను ప్రజలు ఏ మాత్రం ప్రతిఘటించలేదనీ, అయితే తాము తయారుచేసిన ఉప్పును హింసాత్మకంగా లాక్కోవడం మాత్రం వాళ్ళు సహించలేదనీ చెపుతూ మహాదేవ దేశాయ్ ఆ విధంగా ఉప్పును తమ నుంచి ఊడపెరుక్కోవడం ఒప్పుకోని సత్యాగ్రహులను పోలీసులు వాళ్ళ చేతివేళ్ళు చితికి నుజ్జునుజ్జయిపోయేటట్లు కొట్టిన సంఘటనలు కూడా ఉన్నాయనీ, అంతేకాక ఆ వేళ్ళను కొరికి వేసేవారనీ కూడా దేశాయ్ అన్నట్లు లూయీఫిషర్ రాశారు.
“The Police began to use violence. Civil registers never resisted arrest; but they resisted the confiscation ofthe salt they had made, and Mahadeva Desai reported cases, where such Indians were beaten and bitten in the fingers by constables”. (The life of Mahatma Gandhi, New York, harper, 1950, pp-268-69)
ఏప్రిల్ చివరి వారంలో చెన్నై నగరంలో మొదలైన ఉప్పు సత్యాగ్రహం మూడు వారాలు సాగినా ప్రభుత్వం దుర్గాబాయిని అరెస్టు చేసి జైలుకు ఎందుకు తరలించలేదు? అంటే బహిరంగంగా ఆమెను అరెస్టు చేయడానికి ప్రజలు తిరగబడి ఆటంకం కలిగిస్తారనీ, పెద్ద ప్రతిఘటన బయలుదేరుతుందని పోలీసులు భయపడ్డారనటం నిజంగానే వాస్తవమే. చెన్నపట్నంలో ఉప్పు సత్యాగ్రహ శిబిరాలకు సత్యాగ్రహులు చేరుతున్నారు కానీ, రోజురోజుకు వారిని ఉపచరించడానికీ, అన్న పానాదులు అమర్చడానికీ ఘోరంగా గాయపడిన వారికి ప్రథమ చికిత్సలు చేయడానికీ ఐచ్చికంగా సిద్ధపడే సేవాపరాయణులు తగ్గిపోతున్నారనీ, భయపడుతున్నారనీ నాయకులు గ్రహించారు. అందువల్ల మద్రాసు నగరం చుట్టు పక్కల గ్రామాలలో ఉద్బోధించి, ఉద్యమంలో వారు చేరేలా ప్రేరేపించాలని చుట్టుపక్కల జిల్లాలో నాయకులు పర్యటించడం, అక్కడ కూడా ఉద్యమ వ్యాప్తిని ఉత్తేజపరచడం అవశ్యకమైంది. ఈ విధంగా కొందరు తమిళ, తెలుగు సత్యాగ్రహోద్యమ పరులతో కలిసి దుర్గాబాయి చిత్తూరు, ఉభయార్కాడు జిల్లాలలో పర్యటనకు బయలుదేరింది. ఆమెను రాత్రింబవళ్ళు పోలీసులు వెన్నంటి ఉండేవారు. ఆమెకు ఆయా ఊళ్ళల్లో లభిస్తున్న ఆదరణ, ఆరాధనా చూసి బహిరంగంగా ఆమెను అరెస్టు చేయడం పోలీసుల వల్ల కాకపోయింది.
చిత్తూరు నుంచి చెన్నపట్నం దారిలోని ప్రతి గ్రామంలోనూ ప్రబోధిస్తూ సాగింది దుర్గాబాయి. దారిలోనే కాక ఆ చుట్టుపక్కల ప్రాంతాలైన పెరియలకట్టూరు, ఆరణి, ఆర్కాటులలో కూడా పెద్ద ఎత్తున ఆమె బహిరంగ సభలలో ప్రసంగించింది. ప్రతిరోజు దినపత్రికలలో ఆమెను గురించి చదివిన వార్తలు ప్రజలు ఉత్తేజితులయ్యేవారు. దుర్గాబాయిని చూడడమే వాళ్ళ జీవిత సార్ధక్యం అన్నంతగా వాళ్ళు ఉద్వేగ భరితులయ్యేవాళ్ళు. ఆమె ప్రసంగం విన్నవాళ్ళు ఎకాఎకి ఉద్యమంలో చేరిపోయేవారు.
అరణిలో ఒకరోజు బహిరంగ సభ జరిగింది. అయితే అరణిలో సభ జరగకుండా 144వ సెక్షన్‌ను విధించింది సర్కారు. ఆమె ఎలాగూ ఉల్లంఘిస్తుందని వాళ్ళకు తెలుసు. ఆ మిషమీద ఆమెను అరెస్టు చేయవచ్చని భావించారు. అరణిలో సభ తర్వాత ఆమె అర్కాటు చేరింది. అక్కడ నుంచి రాణీపేట చేరింది. ఆ రాత్రి అక్కడే ఉంటుందో లేదా మద్రాసు వెళ్తుందో పోలీసులకు అర్థం కాలేదు. ఆ రాత్రి మద్రాసు వెళ్ళే రైలు వేళకి ఆమె అంబూరు స్టేషన్‌కి చేరుకుంది. ఈ రైల్వేస్టేషన్నే వాలాజాపేట స్టేషన్ అంటారు. అది చాలా చిన్నస్టేషను. పైగా అది అర్థరాత్రి సమయం. జనసందోహం ఎలాగూ లేదు. అందువల్ల పోలీసులామెనక్కడ అరెస్టు చేశారు. అది రాత్రి సమయం కనుక ఉత్తరార్కాడు జిల్లా మేజిస్ట్రేటు భాస్కరరావుగారి బంగళాకు చేర్చారు. 1930 మే 25వ తేదీన ఆమెను అరెస్టు చేయగా 26వ తేదీన కలెక్టర్ బంగళాలోనే విచారణ జరిపి, ఆమెకు ఒక సంవత్సరం విడి ఖైదు శిక్ష విధింపచేసి రాయవెల్లూరు స్త్రీల సత్యాగ్రహుల నిర్బంధ విభాగానికి చేర్చారు. దుర్గాబాయి అరెస్టు విషయం ప్రజలకెట్లా తెలిసిందో, విచారణ జరుగుతున్నంత సేపు మేజిస్ట్రేట్ బంగళా ముందు నినాదాల హోరు ఆకాశాన్ని అంటుతూనే ఉంది. (ఇంకా ఉంది)