మనిషిగా పుట్టాక.. వివేకం నేర్చాక అడుగడుగునా సమస్యలన్నవి మనల్ని పలకరిస్తూనే ఉంటాయి. మరి సమస్య ఎదురయినప్పుడల్లా పారిపోతే ఏమవుతుంది. ఏమవుతుందో చదివితే ఒక్కసారి మనసు జలదరిస్తుంది. ఇప్పుడు చెప్పబోయేది అలా పారిపోయిన వ్యక్తి కథ ఉన్న పుస్తకం గురించే.
మనకి నచ్చిన పుస్తకాలు చాలా ఉంటాయి. అయితే, కొన్ని పుస్తకాలు మాత్రం చదివాక వెంటాడతాయి. ఆలోచింపచేస్తాయి. ‘విరాట్’ అలాంటి పుస్తకమే. ఈ మధ్యనే చదివాను. స్తెఫాన త్సయిక్ అనే జర్మన్ రచయిత రాసిన ఓ నవలిక ఇది. చాలా చిన్న పుస్తకం. కేవలం 48 పేజీలు. జీవితం గురించి, జీవన తత్వం గురించి త్సయిక్ లేవనెత్తిన చర్చ భలే ఉంటుంది.
ఒక్కసారి కథలోకి వెళ్లి చూద్దాం…
బుద్ధుడు భూమి మీద అవతరించడానికి ముందు జరిగిన కథ ఇది. విరాట్ గొప్ప యోధుడు. రాజుగారి కుడి భుజం. ఉన్నట్లుండి రాజు గారి మీద అతని స్వంత బావమరిది తిరుగుబాటు చేస్తాడు. చిన్న తప్పులకు కూడా పెద్ద పెద్ద శిక్షలు వేసే రాజుగారి వ్యవహారశైలికి అందరూ దూరం అవుతారు.
ఒంటరిగా నిలబడ్డ రాజు విరాట్ సహాయం కోరతాడు. అర్ధరాత్రి శత్రువులపై దాడిచేసి అందరినీ హతమార్చిన విరాట్, తెల్లవారి శవాల గుట్టలలో తన స్వంత సోదరుడు కూడా ఉండడం చూసి తల్లడిల్లిపోతాడు. ఇక కత్తి పట్టను అని శపథం చేస్తాడు.
అతని నిర్ణయం విన్న రాజు, అతన్ని వదులుకోలేక న్యాయాధికారిగా నియమిస్తాడు. విరాట్ మంచి న్యాయాధికారిగా పేరు తెచ్చుకుంటాడు. అక్కడ కూడా నిజమేదో నీకెలా తెలుస్తుంది? ఇతురుల మాటలు విని నిజాలు తెలుసుకుంటాననుకుంటున్నావ్. నాకు తోచినది నేను చేశాను.
అది నేరంగా నీకు తోస్తే తోచనీ. నా మీద ఆరోపణ చేసిన వాళ్లనీ, నీ తీర్పునీ నేను ద్వేషిస్తాను” అని ఒక యువకుడు వేసిన ప్రశ్నకి, అతనిలో అంతర్మధనం మొదలవుతుంది. అతనికి వేసిన శిక్ష తానే అనుభవించి చూస్తాడు విరాట్. ఇక తీర్పులు తానివ్వలేనని న్యాయాధికారి నుంచి, సలహాదారుగా కొత్త జీవితం మొదలెడతాడు.
మంచి సలహాదారుగా పేరు తెచ్చుకుంటాడు. కానీ, బానిసల్ని విడుదల చేసిన క్రమంలో తన కొడుకులు వేసిన ప్రశ్న అతన్ని మరలా సందిగ్ధంలో పడేస్తుంది. ఆ యుగంలో బానిసలు ఉండడం సమంజసమే. అందుకే విరాట్ కూడా చిన్నప్పటి నుంచి బానిస చేత ఊడిగం చేయించుకోవడం తప్పుగా భావించలేదు. కానీ యీ రోజు రక్తపాతం చూడలేక జాలి చూపించబోతే ఇన్ని రోజులు సౌఖ్యాలు అనుభవించిన యితరులు ప్రశ్నించారు. నిజమే ఎవరూ చేయకపోతే పనులెలా అవుతాయి? చేయించుకోకపోతే పనివారికి మాత్రం తిండి ఎక్కన్నుంచి వస్తుంది?
ఇక, అన్నీ వదిలి అడవిలో పక్షులు, జంతువులతో సాన్నిహిత్యం పెంచుకుని సాధువుగా మారతాడు. అక్కడా ఒక ప్రశ్న. అతన్ని అనుసరించి, భార్యాపిల్లల్ని వదిలి చేసాడు ఒకడు. ఆకలితో అతని పిల్లలు చనిపోయినప్పుడు, అతని భార్య లేవనెత్తిన ప్రశ్నలు అతన్ని మరలా పారిపోయేటట్లు చేస్తాయి.
చివరికి కుక్కల కాపలాదారుడయ్యాడు. అలానే చనిపోయాడు. విరాట్ అనామకుడు అయిపోయాడు. చనిపోయినపుడు బానిసలను దహనం చేసే శ్మశానంలోనే ఆయన్నూ దహనం చేశారు. కుక్కలు మాత్రం రెండు రోజులు తిండీ తిప్పలు మానేసి రాత్రింబవళ్లు మొరిగాయి. అంతే ఆ తరువాత యజమానిని మర్చిపోయాయి. అంతటితో విరాట్ కథ సమాప్తమైరది.
ఇలా విరాట్ జీవితంలో ఎన్నో జటిలమైన ప్రశ్నలు, ధర్మసంకటాలు. ఏది మంచి? ఏది చెడు? ఏది సత్యం? ఏది అసత్యం? అన్న మీమాంస అతన్ని జీవితాంతం వెంటాడింది. ఈ సష్టిలో ఏదీ ూపరశీశ్రీబ్‌వ ుతీబ్‌ష్ట్ర లేదు. అన్నీ సాపేక్షమైనవే! రెలెటివ్‌గానే ఉంటాయి. మరొకదానితో ముడిపడే ఉంటాయి. సమస్య ఎదురైనప్పుడల్లా విరాట్ తప్పుకుంటూ పోయాడు. అమేయమైన శక్తియుక్తులు, బుద్ధికుశలత ఉండి కూడా చివరకు అనామకుడిగా, సమాజానికి ఉపయోగపడకుండా అయిపోయాడు.
విరాట్ తనవల్ల తన చర్యలవల్ల ఎవరూ బాధకి గురి అవ్వకూడదు అని అనుకుంటూ ఉంటాడు. కానీ తను కొత్త జీవితం ప్రారంభించిన ప్రతిసారీ, అక్కడి కర్తవ్య నిర్వహణ వల్ల ఎవరో ఒకరు బాధకి గురి అవ్వడం జరుగుతూనే ఉంటుంది. అవతలి వారి కళ్ళల్లో ఆ బాధ ప్రతిఫలించినప్పుడల్లా తనకి చనిపోయిన తన సోదరుని కళ్ళలోని భావమే కనిపిస్తూ మరో మజిలీకి తను నడిచేలా చేస్తుంది.
ఇందులో అన్నిటికన్నా గొప్ప విశేషం ఏమిటంటే రచయిత కథలు చెప్పటానికి మాత్రమే తనని పరిమితం చేసుకున్నట్లు అనిపిస్తూ చదివిన వాళ్ళల్లో అనేక ఆలోచనలు పుట్టేలా చేసాడు. రచయిత అసలేం చెప్పదలుచుకున్నాడు అనేది ఎవరికి వారు ఆలోచనల నుండి రాబట్టుకోవాల్సిందే. పుస్తకం నుండి తెలుసుకునేది ఏమిటన్నది మనకి మనంగా అర్థం చేసుకోవాలి తప్ప రచయిత మాటల్లో ఏమీ ఉండదు.
పతనమవుతున్న నాగరిక విలువల నడుమ, ఎవరినీ ఇబ్బంది పెట్టని ఒక వ్యక్తిగత జీవితం కోసం ఒక మనిషి సాగించిన అన్వేషణగా ఈ కథని తీర్చిదిద్దారేమో రచయిత అని అనిపిస్తుంది.
ఒకరిని ఇబ్బంది పెడుతుంది ఒక పనిని త్యజించడం ద్వారా ఆనందం లభిస్తుంది అని అనుకోవడం ఒక భ్రమ… మనం మొదలు పెట్టే మరో పనిలో ఇంకో ఇబ్బంది ఏదో ఒకటి పొంచి ఉండి దాని నుండి మనం పారిపోయేలా మన జీవితాన్ని మలచుకుంటే మన అస్తిత్వమన్నది అనామకత్వమే అవుతుందేమో అని అనిపిస్తుంది పుస్తకాన్ని ఆసాంతం చదివాక.
నిజంగా ఇందులో కథానాయకుని మీద తనకు దయ లేదు. తనకున్న దష్టి అంతా తన విధిలో పాపం అనిపించిన దాన్ని నిర్మూలించడం మీదే తప్ప, చుట్టూ ఉన్న సమాజంలో ప్రేమనీ… మంచితనాన్ని పెంచేలా లేదు.
మనం చేసే ప్రతి పనిలో విభిన్న పార్శ్వాలు ఉండటం సహజం. ఒకరి మంచి అనిపించింది మరొకరి నచ్చకపోవడం కూడా సహజం. ఏది ఎవరికీ ఎందుకు నచ్చలేదో తెలుసుకుని దానికి ప్రత్యామ్నాయం వెదకాలి తప్ప… ఒక ప్రశ్నకి సమాధానంగా ఆ ప్రశ్న నుండి దూరంగా వెళ్లిపోవడం వల్ల ఏం ఉపయోగం? సమాధానం వెతుక్కోవాల్సిన ప్రశ్నలతోనే కదా మనిషి విచక్షణ అన్నది అక్కరకు వచ్చే సందర్భాలు ముడిపడి ఉండేది. ఆ విచక్షణ ప్రతిసారీ ప్రతిమాన్య జీవితాన్నే కోరుకుంటుంటే అప్పటి వరకూ తానేం నేర్చుకున్నట్లు?
మనకొక అస్తిత్వం అక్కరలేదు… మన అనామకత్వం వల్ల మన మనసుకీ… ఎదుటి వారి మనసుకీ ఎలాంటి ఇబ్బంది… బాధ లేకుండా అచ్చంగా ఆనందం మాత్రమే దక్కుతుందా?
ఒక వాదనకి సమాధానంగా ఆ జీవితం నుండి పక్కకి తప్పుకోవడమే సరియైన చర్య అయితే మనిషి ఇంకా రాతియుగంలోనే ఆగిపోయి ఉండేవాడేమో కదా?