భూమిక ఎడిటర్ గారికి,
భూమిక మార్చి సంచికలో ప్రచురించిన ‘అసహజమనిపించే సహజం’ కథ స్త్రీల అస్తిత్వాన్ని తెలియజేస్తుంది. రచయిత్రి శాంతి బెనర్జీగారికి అభినందనలు. ఈ కథలో కేవలం మూడు పాత్రలు… కమిలిని (ప్రధాన పాత్రధారి), నీరజ (తల్లి), రాగిణి (సహచరిణి)తో పాఠకులకు గొప్ప అనుభవాన్ని కలిగించారు. మరో విషయం నీరజ (తల్లి) క్రిందటి తరానికి చెందినదైనా వర్తమాన పరిస్థితుల్ని అర్థం చేసుకొని, తనని తాను సంస్కరించుకొని గొప్ప ముగింపు పల్కుతుంది. సుమారు రెండు సంవత్సరాల క్రిందట రెంటాల కల్పన గారు ‘సొనాటా’ అనే కథలో ఆడ మగ మధ్య ఉన్న బంధానికి దీటుగా లెస్బియన్ బంధాన్ని నిరూపించారు. అలాగే ఫ్రెంచ్ చిత్రం ‘బ్లూ ఈజ్ ది వార్మెస్ట్ కలర్’ (1913) లెస్బియనిజానికి కొత్త భాష్యం చెబుతుంది. ప్రపంచ మేటి స్త్రీవాది సైమన్ ది బోవా గారి ‘ది సెకండ్ సెక్స్’ గ్రంధం నించి కొన్ని విషయాలు భూమికలో ప్రచురిస్తే బాగుంటుందని నా అభిప్రాయం. శలవు
– వెంకటస్వామినాయుడు, చిత్రదర్శకుడు
భూమిక ఏప్రిల్-జూన్, 2020 సంచిక ఇప్పుడే వచ్చింది. చూడగానే, ”మనం ఇంకా ఊపిరి పీల్చుకుంటున్నామా ?” అని ఫీలయ్యాను. ‘భూమిక’తోపాటు ‘ఉద్యోగక్రాంతి’, మరో పత్రిక రావడంతో మనం ఇంకా బతకవచ్చు అనిపించింది. దాదాపుగా 4 నెలలుగా ఆగిపోయిన పత్రికా పఠనంతో కాళ్ళకింది నేల కనుమరుగైనట్లు తోచింది. ‘మేడ్చల్ ఫుడ్ అరడ్ ట్రావెల్ క్యాంప్’పై మీ ఎడిటోరియల్, మంటగల్సిన మానవత్వానికి ఓ ప్రతీక ! ఎదలో ఏర్పడిన గాయానికి నవనీతంలా ఉంది. డెబ్భై ఏండ్ల (అ)స్వాతంత్య్ర భారత్‌లో దగాపడ్డ దేశ నిర్మాతలకు, శ్రమనే పెట్టుబడిగా భావిస్తూ ఉత్పత్తి చేస్తూ, ఇంటికే పరిమితం కావాలంటూ కునికిపాట్లు పడుతూ, కూనిరాగలు తీస్తూ, సందేశాలిస్తున్న సుఖలాలస జీవులకై సమిధలయ్యే అభాగ్యులకు మీ టీమ్ అందించిన చేయూత అభినందనీయం.
డా|| జి.లచ్చయ్య