ఏప్రిల్ 3. కాఫీ కప్పుతో బాల్కనీలో కూర్చుని విచిత్రమైన నిశ్శబ్దాన్ని ఆశ్చర్యంగా వింటోంది శాంతి. పది రోజులుగా అదే వింటున్నా పట్టణ రణగొణ ధ్వనులకి అలవాటు పడ్డ ప్రాణం అర్థంతరంగా లాక్‌డౌన్‌తో ముంచుకొచ్చిన అసహజపు నిశ్శబ్దం అసౌకర్యాన్నిస్తోంది. కానీ మరోపక్క రకరకాల పక్షుల రాగాలు, కువకువలు, కీటకాల ధ్వనులతో పాటు గాలి సరాగాలూ వినిపిస్తుంటే రెండు రకాల భావాల్నీ ఆస్వాదిస్తూ కాఫీ సిప్ చేస్తున్న శాంతి ఫోన్ మోగడంతో చేతిలోకి తీసుకుని ‘హలో’ అంది.
‘దీదీ బాల్‌బచ్చోంకో బచావో… ఏదైనా చేసి మాకు తినడానికి దారి చూపించు. పొద్దున్నే చేస్తున్నానని ఏమనుకోకు. బ్రెడ్ తప్పించి ఏమీ లేదు. కాసేపటికి ఎవరో ఒకళ్ళొచ్చి అన్నం పొట్లాం ఇచ్చెళ్తారు. దయున్నోళ్ళు… మా ఆకలి తీర్చడానికి ఎతుక్కుంటూ వస్తున్నారు. కానీ ఇలాంటి తిండి అలవాటు లేదు. తిన్నా అరగట్లేదు. పిల్లలు తినట్లేదు. రొట్టె కావాలని ఏడుపు. బియ్యం కానీ, పిండి కానీ కొంచెం పప్పు, ఉప్పుతో కలిపి ఇస్తే మా పద్ధతిలో వండుకుంటాం దీదీ.. వారం రోజులుగా మూడు పూటలూ బిర్యానీ, పులిహోర తినలేక పస్తులుంటున్నాం… ఎన్నాళ్ళుండ గలం ఇలా… ఏదైనా చెయ్యి దీదీ… వేడుకుంటున్నా’.
మానసి మాట వింటూనే చేదు కాఫీని మించి చేదైపోయింది శాంతి మనసంతా. ముందురోజు సాయంత్రం మొదటిసారి మాట్లాడిన మానసికి మాటిచ్చింది శాంతి మర్నాడు రేషన్ అందేలా ఏర్పాటు చేస్తామని. రేషన్ అందటం కొంచెం ఆలస్యమైనా మధ్యాహ్నానికి భోజనం పంపిస్తామని కూడా చెప్పింది. ఆ ప్రకారం రాత్రే మాట్లాడి 80 మందికి 100 ప్యాకెట్లు వెజిటబుల్ కిచిడి పురమాయించింది. రేషన్ కూడా సాయంత్రానికంతా అందేలా ప్రయత్నిస్తూనే ఉంది. లాక్‌డౌన్ వల్ల సమయానికి జరగడం కష్టమౌతోంది.
షాపుల్లేవు, లారీలు ట్రక్కులు సరుకు తేవట్లేదు. గోడౌన్లలో సరుకు తెప్పించి ప్యాక్ చేయించడం… బ్యాంకుల్లేవు, ఏటీయమ్‌లలో పైసల్లేవు, చేతిలో డబ్బు లేదు… అంతా ఆన్‌లైన్!!! అగ్గిపుల్ల, ఉప్పుకళ్ళు, పప్పు బద్ద, ఉల్లిపాయ, బియ్యం గింజ, మిరపకాయ… ఇవేగా కావాలి! ఎంత సామాన్యమైనవి! కానీ జాడలేవు!
అయినా సరే… వేసిన తాళాలు (లాక్‌డౌన్) బద్దలుకొట్టి, పనుల్లేక పైసలాడక, పస్తులతో అలసిపోయిన ప్రాణాలకి తాళాలో లెక్కా!! కానీ నిర్మానుష్యపు వీథుల్లో, వెలవెలబోతున్న మార్కెట్లలో, మాస్కులు మూసేసిన ముఖాలు తెలియని మనుషులు చేసేందుకు పనీపాటూ లేక, అత్యవసరమై వీథుల్లోకి వచ్చినా ఖాకీల లాఠీలను తాళలేక, ఏ మూల నుండి ఏ దిక్కునుండి కరోనా వచ్చిపడుతుందోనన్న ఆందోళనతో కొంత… బైటికి రాకపోయినా… కడుపుకి తాళాలేసుకునే మర్మం తోచక, విధిలేక గతిలేక అవకాశమున్న చోట ఆశగా ఆబగా… అడిగి చూడ్డమే తప్ప ఛేదించ వీలులేని తాళాలు మాత్రం ప్రతి పీకకి చుట్టుకున్నట్లుంది.
‘దీదీ నిన్ను ఇబ్బంది పెడుతున్నాను. సారీ… మనసులో బాధ పంచుకోవడానికి ఒక దిక్కు దొరికిందన్న సంబరం నిలవనియ్యలేదు. ఉంటా దీదీ… ఎదురుచూస్తుంటాం…’ అన్న మానసి మాటకి ‘ఏం లేదు మానసి…అవునూ, మీ ఏరియాలో ఇంకా కొంతమంది ఉన్నారన్నావు కదా! వారి వివరాలు కూడా సేకరించి పంపగలవా’ అని అడిగింది శాంతి. ‘దీదీ ఇప్పుడే వెళ్తాను, చేసే పనేముంది? ఇంట్లో పొయ్యెలిగించే పనీ లేదు, బైటికెళ్ళి సంపాదించే పనీలేదు కదా! దయతో ఎవరో ఇచ్చినదాంతో పిల్లల ఆకలి తీర్చడం… వాళ్ళని ఏమార్చి పగలూ రాత్రీ తేడా లేకుండా మొగుడి ఆకలి తీర్చడం… చెయ్యడానికి ఇంకేం ఉంది. కనీసం ఈ వంకనన్నా కాస్త ఊపిరి పీల్చుకోవచ్చు. మధ్యాన్నానికంతా నీకు ఫోన్ చేస్తా దీదీ’ అంటూ పెట్టేసింది.
‘ఏంటి మానసి అంటున్నది… లాక్‌డౌన్‌లో ఆడవాళ్ళకి ఇదో హింసా!! తప్పించుకునే అవకాశాలు తక్కువే. అయ్యో…’ అనుకుంటూ కుర్చీలో కూలబడింది. అంతలో తేరుకుని భోజనం తయారుచేస్తున్న వారికి ఉడకబెట్టిన గుడ్డు కూడా ఇవ్వమని చెప్పి, రేషన్ సమకూర్చడానికి ఫోన్‌లు చేసే పనిలో పడింది.
పదిన్నరకంతా మళ్ళీ మానసి ఫోన్. ‘దీదీ మా పక్క బిల్డింగ్‌లో 68 మంది తేలారు. నేను పేర్లు రాస్తున్నానని తెలిసి ఆ ప్రక్క బిల్డింగ్ వాళ్ళు, వెనక గల్లీలో ఉన్న అస్సామీ, బీహారీ వాళ్ళు వచ్చి వాళ్ళ పేర్లు రాసుకోమంటున్నారు. ఏం చెయ్యను?’ ‘ఒక్కొక్క బిల్డింగ్‌లో అంతేసిమంది ఉన్నారా?’ ఆశ్చర్యంతో పైకే అనేసింది శాంతి.
‘దీదీ ఒక్కో గదిలో నలుగు రైదుగురు ఉంటున్నారు. ఇదంతా నాక్కూడా తెలియదు. మీరొకసారి వచ్చి చూస్తే బాగుంటుంది…’ చెప్పుకుపోతోంది మానసి తను కొత్తగా కనిపెట్టిన విషయాన్ని. పుట్టలో చీమల్లా, తుట్టెలోని తేనెటీగల్లా, కలుగుల్లాంటి ఇళ్ళల్లో అంతేసిమంది… దూరదూర ప్రాంతాల నుంచి పని వెతుక్కుంటూ వచ్చిన వారు కొందరైతే, పనిపేరుతో ముఠామేస్త్రీల వలలో పడి బానిసల్లా బతుకుతున్న వారు ఇంకొందరు… మొత్తానికి వలస వచ్చి చిక్కుకుపోయి పోను దారిలేక, చెయ్యను పనిలేక, తినను సరైన తిండి లేక దిక్కుతోచని పరిస్థితిలో ఇరుక్కుపోయారు.
సాయంత్రం 4కి మళ్ళీ ఫోన్ చేసింది మానసి. మొత్తం 418 కుటుంబాలు ఒరిస్సా, బెంగాల్, బీహార్, అస్సాం, ఝార్ఖండ్ రాష్ట్రాల నుంచి వచ్చినవాళ్ళని. కేవలం 5 బిల్డింగులలో ఇన్ని కుటుంబాలు ఉంటే మొత్తం బస్తీలో ఎన్ని కుటుంబాలు ఉండొచ్చు. ఇంత సాంద్రతతో ఉన్న ప్రాంతాల్లో మరి కోవిడ్ ప్రోటోకాల్స్ ప్రకారం భౌతికదూరం పాటించమంటే సాధ్యమయ్యేదేనా? అసలు తిండికి తాళం పడి, అయినవారి దగ్గరికి ప్రయాణాలకి తాళంపడి, పనికి తాళం పడి శ్రామికుల జీవితాలే తలక్రిందులైపోయిన ఈ లాక్‌డౌన్ కరోనా కన్నా పెద్ద ఉత్పాతం కాదా!
మిత్రులందరి సహకారంతో మర్నాటికి 450 రేషన్ కిట్‌లను సిద్దం చేసి మానసి వాళ్ళున్న ప్రాంతానికెళ్తే అదో రణరంగంలా మారబోయిన పరిస్థితిని గమనించి వందమందికి కూడా అందించకుండానే వెనుతిరగాల్సొచ్చింది. ఆశ్చర్యాన్ని కలిగించిన విషయం- ఇతర రాష్ట్రాల వలస కార్మికులను వెనక్కు నెట్టి ఇక్కడి వారు… అప్పటికే రేషన్ షాపుల ద్వారా కొంతైనా సహాయాన్ని పొందినవారు తోసుకొచ్చి దౌర్జన్యం చేయడం. అది కూడా ఒక రాజకీయమే… ప్రాంతీయ బలం!
ఇక మానసి ఆందోళనకి హద్దే లేదు. అన్ని కుటుంబాల వివరాలన్నీ తీసుకుని వారికేమీ అందకపోతే అక్కడ చెలరేగే అసహనం… తాను ముందుపడి ప్రయత్నం చేసినది విఫలమైతే తనపై ఉండే చిన్నచూపు… ఇంట్లో వారి మాట వినకుండా అన్ని బిల్డింగ్‌లకి వెళ్ళి పెద్ద ఘనకార్యం చేసుకొచ్చిందని అంటారేమో అన్న అసంతృప్తి… ఈ ప్రాంతీయ బలాన్ని కాదని తమదాకా చేరేదేమో అన్న ఆందోళన… అన్నీ వెరసి తిండీ, నిద్రా మాని దీదీ చెప్పిన మర్నాటి ప్లాన్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది.
అనుకోకుండా తటస్థించిన విజయ్ వాలంటీర్‌గా రాకపోయుంటే, తన వ్యూహం అమలుకి మిగతా వాలంటీర్లు సహకరించకపోయుంటే ఏమయ్యేదో… మర్నాడు ఉదయాన్నే మొత్తం కిట్లన్నీ ట్రక్కులో ఉంచి తడవకి 20 చొప్పున మోటార్‌సైకిల్‌పై ఇద్దరిద్దరు తీసుకెళ్ళి ఒక్కో తడవకి ఒక్కో స్పాట్ మారుస్తూ, ఇరవయ్యేసి మందికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని, వారొచ్చి లైనుకట్టి, ఏం జరుగుతోందా అని అక్కడున్న వారు ఆలోచించేలోపే ఆ ఇరవై మందికి కిట్లు అందించి అక్కడ్నుంచి వెళ్ళిపోయిన వాలంటీర్లను ఆశ్చర్యంగా తలచుకోవడం తప్పించి చేయగలిగిందేమీ లేదు. అలా కేవలం మూడు గంటల్లోపే 400 మందికి రేషన్ కిట్లు అందించేసిన సంతృప్తి, ఆనందం, ఎగ్జైట్‌మెంట్… చెప్తే అర్థమయ్యేది తక్కువే.
ఇంత ప్రణాళిక, రణవ్యూహం, టీం వర్క్ అన్నీ కలిసి సాధించిన విజయం పది రోజులకే పరిమితం. పదిహేనో రోజుకీ కొనసాగుతున్న లాక్‌డౌన్… ముందుసారి మానసి తీసుకున్న చొరవ వల్ల మళ్ళీ ఆకలి కడుపుల్తో అందరూ ఆమెవైపు చూస్తుంటే ‘దీదీ ఏం చేయమంటావు? మా కడుపులకి తినబెట్టడానికే మీరున్నట్లు మళ్ళీ మళ్ళీ అడుగుతున్నానని అనుకోకు… మమ్మల్ని మా ఊళ్ళకి పంపెయ్యవా… అయిన వారి పంచన.. మా ఇళ్ళ ముంగిట్లో… ఆ మట్టిలో కలిసిపోయినా సరే… ఎలాగైనా మమ్మల్ని పంపించవా..’ ఆగని మనసులు, తీరం చేరేవరకూ సాగే అలలా… నడక, ఒకటే నడక. ఎటు చూసినా… ఇంతమందిని పట్నం గర్భంలో ఇన్నాళ్ళూ ఎక్కడ దాచేసిందో… తాళాలు బద్దలు కొట్టి అయిన వారి దగ్గరికి, పుట్టిన మట్టి వాసన పీల్చుకొని ప్రాణాలు నిలుపుకోవడానికి, కాల్చుతున్న రోడ్లమీద పాదాలు రక్తమోడుతున్నా తాళాలు బద్దలు కొట్టి ఎగసి పడుతున్న శ్వాసని మాత్రం నిలుపుకుంటూ… కడదాకా చేరేనా.. చేరినవారి ఆత్మీయ పిలుపులు చాలు మరిన్ని కాలాలు ఎదిరించి నిలవడానికి!