నిత్యం భయాందోళనలతో కాలం గడిపే వాళ్ళ కోసం నా అనుభవం మీ ముందుకు తెస్తున్నాను.
జూన్ పదవ తేదీ మధ్యాహ్నానికి కొద్దిగా ఒళ్ళు నొప్పులు మొదలయ్యాయి. (అంతకు రెండు మూడు రోజుల క్రితమే కరోనా భయంతో రాలిపోతున్న వాళ్ళ గురించి ఇంట్లో మాట్లాడుకున్నాం… ప్రజలకు భరోసా కల్గించాల్సిన వ్యవస్థలు ప్రజలను మరింత భయాందోళనలకు గురిచేస్తున్నాయని, చేతులెత్తేస్తున్నాయని, నిజంగా ఇది అంత భయపడాల్సిన బూచి కాదని ఇద్దరో ముగ్గురో చనిపోవడం పెద్ద భూతంలా చూపడం, ప్రజలని భయపెట్టడం సరైనది కాదని మేం ఇంట్లో అనుకున్నాం)
మూడో రోజుకి జలుబు, తలనొప్పి తోడయ్యింది. దాంతోపాటు కొద్దిగా ఒళ్ళు వెచ్చబడడం మొదలైంది. ఎప్పుడైతే నాకు జలుబు మొదలైందో నగరంలో తొలకరి వర్షాలు పలకరించాయి. ఆ క్రమంలో వాతావరణం మార్పుల వల్ల వచ్చిన జలుబు అనుకున్నాను. అప్పటినుంచి వేడి ఆవిరి పట్టడం, వేడి నీరే తాగడం మొదలుపెట్టాను. తర్వాత జ్వరం మొదలైంది తీవ్రంగా లేదు. దగ్గు, గొంతు, శ్వాస ఇబ్బందులు ఏమీ లేవు. 14వ తేదీన విపరీతమైన నీరసం మొదలైంది. తింటూనే ఉన్నప్పటికీ అంత అలసట, నీరసం ఎందుకొస్తున్నాయో అర్థం కాలేదు. ఎక్కువసార్లు టాయిలెట్‌కి వెళ్ళాల్సి వచ్చింది. శ్వాస ఇబ్బందిగా లేదు కానీ కళ్ళు తిరిగిపోవడం, ఎక్కడ పడిపోతానో అన్నట్లుగా ఉండేది. అలా ఉన్నప్పుడు కాసిని వేడినీళ్ళు తాగి పడుకున్నాను. సాధారణ జ్వరం లేదా వైరల్ ఫీవర్ కావచ్చుననుకున్నాను. ఆస్తమాటిక్ అయిన నాకు శ్వాస ఇబ్బందులు ఏమీ లేకపోవడం వలన సీరియస్‌గా తీసుకోలేదు. అల్లం, మిరియాలుతో చేసిన కషాయం తీసుకున్నాను. సాధారణ జ్వరాలకు, జలుబులకు వీలయినంతవరకు మందులు వాడను. అదే విధంగా ఇప్పుడూ వాడలేదు.
అంతలో మా పక్క అపార్ట్‌మెంట్‌లో కోవిడ్ పేషెంట్స్‌ని యశోద ఆస్పత్రికి తరలించారని తెలిసింది, ఆ తర్వాత మరొకరిని తరలించడం మా బాల్కనీలోంచి చూశాను. అప్పుడు కూడా అదేనేమోనన్న అనుమానమే లేదు. మా పక్కకు కరోనా వచ్చిందని ఫేస్బుక్ పోస్టు పెట్టాను. జాగ్రత్తలు చెప్పారు ఎందరో శ్రేయోభిలాషులు. కానీ అప్పటికే అది నా చెంత చేరిందని తెలియదు. 15వ తేదీ ఉదయానికి కొద్దిగా జ్వరం తగ్గింది కానీ వీపులో నొప్పిగా ఉంది. నిలబడడం కష్టంగా ఉందని అనిపించింది. శరీరంలో ఏదో తెలియని అలసట, నీరసం, నిద్ర వచ్చినట్లుగా కొద్దిగా మగత. ఆ రోజు సాయంత్రానికి నడుము నొప్పి మొదలయింది. మూడు రోజులు అటూ ఇటూ కదలడం చాలా కష్టమైంది. అదే రోజు మా అబ్బాయికి ఒళ్ళు నొప్పులు, జలుబు, జ్వరం మొదలయింది. అప్పుడు అనుమానం వచ్చింది. నీది అనుమానమే. టెస్ట్‌ల కోసం బయటికి వెళ్ళడం అస్సలు మంచిది కాదు. చూద్దాం పొడిదగ్గు, శ్వాస ఇబ్బందులేమీ లేవు కదా, అవి ఉంటే అప్పుడు చూద్దామన్నారు మా ఆయన. ఎందుకైనా మంచిదని అమ్మని చెల్లి దగ్గరికి పంపిద్దామని ఆలోచించాం. మళ్ళీ అంతలోనే ఆ ఆలోచన సరైంది కాదేమోనని మిన్నకున్నాం. చెల్లి వాళ్ళ ఊళ్ళో అప్పటివరకూ ఒక్క కేసు కూడా లేదు. ఒకవేళ మాకు పాజిటివ్ అయితే మాతో ఉన్న మా అమ్మకి కూడా ఆ లక్షణాలు రావచ్చు. అక్కడికన్నా వైద్య సదుపాయాలు ఇక్కడే ఉన్నాయని ఉంచేశాం.
104 వాళ్ళకి ఫోన్ చేశాను. వాళ్ళు వివరాలు తీసుకుని శ్వాసపరమైన ఇబ్బందులు ఏమీ లేవుకదా, టెస్ట్ అవసరం లేదు అన్నారు. ఇంట్లోనే ఉండండి, శ్వాస ఇబ్బందిగా ఉంటే చెప్పండి అన్నారు. సరేనని మిన్నకుండిపోయాను. ఆ రాత్రి కొద్దిగా దగ్గు మొదలయింది. పొడి దగ్గు కాదు. శ్లేష్మం ఉంది. నిద్ర పట్టలేదు. గోరువెచ్చటి నీటిలో కొద్దిగా ఉప్పు వేసి పుక్కిలించాను. ఆ రాత్రి మధ్య మధ్యలో అలా మూడుసార్లు చేశాను. ఆవిరి పట్టడం, వేడినీళ్ళు తాగడం కొనసాగుతూనే ఉంది. పారాసెటమాల్ టాబ్లెట్స్ తెచ్చారు, కానీ వాడలేదు. జ్వరం బాగా ఎక్కువయితే అప్పుడు చూద్దామని అనుకున్నా. విటమిన్ సి కోసం నిమ్మరసం తాగాను. బి కాంప్లెక్స్ టాబ్లెట్ వాడాను. ప్రతిరోజూ ఉడకబెట్టిన గుడ్డు, ఎక్కువ ప్రొటీన్ ఉన్న ఆహారం తీసుకున్నాను.
అంతలో అమ్మకి ఒళ్ళు నొప్పులు రెండు రోజులు ఉన్నాయి. కొద్దిగా జలుబు, ఒకరోజు జ్వరం వచ్చి తగ్గాయి. జ్వరం ఏదో ఒక సమయంలో కాసేపు చుట్టపు చూపుగా వచ్చి పోయింది. తర్వాత అందరీకీ జ్వరం పూర్తిగా తగ్గింది కానీ నాకు మాత్రం రెండు వారాలయినా నీరసం, నడుము నొప్పి వదల్లేదు. ఆక్సిజన్ తగ్గుతున్నట్లనిపించి పల్స్ ఆక్సిమీటర్ తెప్పించాం. ూూూ2% రీడింగ్ 76 చూపించింది. ఆ రోజు నుంచి బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయడం మొదలుపెట్టాను.
రెండు వారాలు గడిచిపోయాయి కాబట్టి డౌట్ ఎందుకు అని యాంటీ బాడీ టెస్ట్ చేయించుకుందామనుకున్నాము. నెట్టింట్లో గాలించా. దగ్గర్లోనే ఉండే ల్యాబ్స్‌కి ఫోన్ చేశా. ఎవరికి చేసినా కోవిడ్-19 అయితే ఇంటికి వచ్చి శాంపిల్ కలెక్ట్ చేసుకుంటాం కానీ యాంటీ బాడీ టెస్ట్ మేం అసలు చేయడం లేదన్నారు. జులై నుండి మొదలు పెడుతుండవచ్చు అన్నారు. అంతలో చెల్లి చెప్పింది. థైరో కేర్ వాళ్ళు చేస్తారని తనకు వచ్చిన మెసేజ్ పంపింది. థైరో కేర్ వాళ్ళకు చేశాను. కొందరు చేయడం లేదని చెప్పారు. నారాయణగూడ, మెహిదీపట్నం వాళ్ళు చేస్తామని చెప్పారు. నాకు నారాయణగూడ దగ్గర అని వాళ్ళకి రమ్మని చెప్పాను. మరుసటిరోజు పంపిస్తామని చెప్పారు. కానీ రాలేదు. ఆదివారం కావడం వల్ల రాలేదనుకున్నాను. తర్వాత రోజు కూడా రాలేదు. పంపిస్తాం అని చెప్తున్నారు కానీ రాలేదు. తర్వాత ఫోన్ ఎత్తడం మానేశారు. ఇక వాళ్ళకి ఫోన్ చేయడం మానేసి మెహదీపట్నం వాళ్ళకి చేశాను. వాళ్ళూ అంతే. కేసు వివరాలు, అడ్రస్ అన్నీ తీసుకున్నారు. కానీ రాలేదు. ఎందుకలా చేశారో నాకిప్పటికీ అర్థం కాలేదు. ఒకవేళ వాళ్ళకి కుదరకపోతే కుదరదని చెప్పాలి. మన వివరాలు, ఇంటి అడ్రస్ అన్నీ తీసుకుని ఫలానా టైంకు పంపిస్తామని చెప్పి పంపకపోవడం ఏమిటో?! మామూలుగా నాకు వైద్యపరమైన సలహాలు, సూచనలు ఇచ్చే డాక్టర్ కజిన్స్‌కి ఫోన్ చేద్దామనుకున్నాను. కానీ, అదే సమయంలో అన్న పోయిన విషాదంలో ఉన్నవాళ్ళకి ఇవన్నీ చెప్పడం ఎందుకని ఆగాను. ఎమర్జెన్సీ ఎలాగూ తప్పదు. ఈ లోగా వాట్సాప్‌లో మిత్రులు పంపించిన హెల్ప్‌లైన్ నంబర్స్ చూశాను. ఒక హెల్ప్‌లైన్ నంబర్‌కి ఫోన్ చేశా. యాంటీ బాడీ టెస్ట్ ఎక్కడ చేస్తారో తెలుసుకుందామని. వాళ్ళు వివరాలన్నీ రాసుకున్నారు. రేపు మా డాక్టర్స్ మీతో మాట్లాడతారని చెప్పారు. అన్నట్లుగానే మాట్లాడారు. ఆ డాక్టర్ వివరాలన్నీ అడిగారు. సందేహం లేదు మీకు వచ్చింది కరోనానే. చెస్ట్ స్కాన్ చేయించమని, యాంటీ బాడీ టెస్ట్ విజయ లాబ్స్‌లో కూడా త్వరలో మొదలుపెడతారని చెప్పారు. అదేరోజు మా కజిన్ వాళ్ళ మిత్రులు ఖIవీూ డాక్టర్‌తో కూడా మాట్లాడాను. వివరాలన్నీ విన్న తర్వాత మీ ఇంట్లో అందరికీ వచ్చి ఉండాలే అంటూ పల్స్ ఆక్సీమీటర్‌లో ఆక్సిజన్ సాచురేషన్ పాయింట్ ఎంతుందో చూడమన్నారు. మా అబ్బాయి, మా అమ్మ గురించి కూడా చెప్పి మాతో పాటే ఉన్న మా ఆయనకి ఎలాంటి లక్షణాలు లేవని చెప్పాను. ఆయనకి లక్షణాలు కనిపించకపోవచ్చు. మైల్డ్‌గాను, మోడరేట్‌గాను మీ అందరికీ వచ్చి తగ్గిపోయిందిగా… ఇంకా ఎందుకు యాంటీ బాడీ టెస్ట్. ఏం చేస్తారు దాంతో, అవసరమా. మరోసారి వైరస్‌కి ఇన్‌ఫెక్ట్ కారని చెప్పలేం కాబట్టి టెస్టుల కోసం బయటికి వెళ్ళడం మంచిది కాదని చెప్పారు.
నడుమునొప్పి, కండరాల నొప్పులకు ఖకూు=ూజజుు టాబ్లెట్ ఉదయం ఒకటి, రాత్రి ఒకటి చొప్పున ఐదు రోజులు వాడమని ప్రిస్క్రైబ్ చేశారు. ఆక్సిజెన్ పాయింట్ 90కి తగ్గకుండా చేసుకోమని చెప్పారు. లేదంటే ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద దుష్ప్రభావం చూపిస్తుందని, కోలుకోవడం కష్టమని చెప్పారు. ఇద్దరు డాక్టర్స్ ఆక్సిజన్ తగ్గినప్పుడు, తప్పనిసరిగా ఆక్సిజన్ వాడమని సలహా ఇవ్వడంతో ఆక్సిజన్ క్యాన్ తెప్పించాం.
మూడో వారంలో వచ్చిన నిద్రలేమి, మానసిక ఒత్తిడిని శరీరం భరించలేకపోయింది. నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపడం మొదలుపెట్టింది. నన్ను నేను నిలబెట్టుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. అయినా ఆక్సిజన్ స్థాయిలు బాగా తగ్గడం మళ్ళీ మొదలయింది. ఈ క్రమంలో రెగ్యులర్ ఇంటర్వెల్స్‌లో ఆక్సిజన్ మానిటర్ చేస్తూ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాను. అందులో భాగంగా బోర్లా పడుకోవడం ద్వారా లంగ్ కెపాసిటీ పెంచుకోవచ్చని చెప్పారు. వెంటిలేటర్ కంటే 70 శాతం బాగా పనిచేస్తుందని చెప్పారు. ప్రతిరోజూ రెండుసార్లు 30 ని. బోర్లా పడుకోవడం చేశాను. 80-90 మధ్య రజూశీ2 చూపిస్తున్నది. సాధారణంగా 95-100 మధ్య ఉండాలట. అవసరమైనప్పుడల్లా ఆక్సిజన్ తీసుకుంటూ శ్వాస సంబంధమైన ఎక్సర్‌సైజ్ చేస్తూ వచ్చాను. ప్రస్తుతం అంటే గత నాలుగు రోజులుగా 90-95 కి చేరింది. లాక్‌డౌన్ పెట్టినప్పటినుండీ ఇంట్లో ఉన్నా భౌతిక దూరం పాటించాం. అందువల్ల మా వాళ్ళకి మైల్డ్ సింప్టమ్స్ మాత్రమే వచ్చి ఉంటాయి. మా ఇంట్లో వాళ్ళకి, నా చెల్లెళ్ళు, మరో కజిన్‌కి తప్ప ఎవరికీ నా ఆరోగ్య స్థితి తెలియదు. వాళ్ళంతా నాకు మంచి మోరల్ సపోర్టునిచ్చారు. నా మనసుకి ఒత్తిడి కలిగించే విషయాల నుండి నన్ను దూరం పెట్టారు. ఆస్ట్రేలియాలో ఉండే నా కూతురికి కూడా చెప్పలేదు కంగారు పడుతుందని (ఇప్పుడు తెలుసు). 15వ తేదీ మా ఆయన కజిన్ దగ్గరకు వెళ్ళాల్సి ఉంది. 16వ తేదీన కజిన్ చనిపోయారు. అయినా ఎక్కడికీ వెళ్ళలేదు. మా ఇంటికి వస్తామన్న వాళ్ళకి రావద్దని ఖచ్చితంగా చెప్పేశాం. మేమూ ఇంట్లోనే ఉండిపోయాం. ఎక్కడికీ వెళ్ళలేదు. నిజానికి నాకు వచ్చింది కరోనా అని ఖచ్చితంగా చెప్పలేను. ఎందుకంటే టెస్ట్ జరగలేదు కాబట్టి. కానీ నాకున్న లక్షణాలను బట్టి డాక్టర్స్ నిర్ధారించిన దాని ప్రకారం అది కరోనానే అని మీ ముందుకు వచ్చి విషయాలు చెప్తున్నాను. ఆ సమయంలోనే రుద్రమ ప్రచురణల కోసం కరోనాపై కథ రాసి ఇచ్చాను. శాస్త్రజ్ఞులు, కొందరు డాక్టర్లు భయపడాల్సినంత అవసరమేమీ లేదనీ, కొన్ని జాగ్రత్తలు పాటిస్తే చాలనీ చెప్పినప్పటికీ ఇంత గందరగోళం ఎందుకు అవుతోంది? భయంకరమైన వ్యాధిగా ప్రపంచం ఎందుకు చిత్రిస్తోంది? ప్రజలను ఎందుకు భయభ్రాంతులకు గురి చేస్తోంది? కరోనా ఉన్నప్పటికీ చాలామందిలో ఏ లక్షణాలు కనిపించవు అని మొన్నా మధ్య డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది. మళ్ళీ అదే ఇలాంటి వారి ద్వారా వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుందని బెంగపడింది. మళ్ళీ అదే డబ్ల్యూహెచ్‌ఓ aరవఎజ్‌ూaఎa్‌ఱష వాళ్ళతో వైరస్ వ్యాప్తి జరగదని ప్రకటించింది. అసలు చాలామందిలో ఏ లక్షణాలు కనిపించకుండానే ఎంతోమందికి వచ్చిపోయే కరోనా గురించి అంత బెంగ ఎందుకు? ఈ లాక్‌డౌన్‌లు ఎందుకు? ప్రజల్ని వ్యాధి నిరోధక శక్తి పెంచుకునే విధంగా అప్రమత్తం చేస్తే, ఒకరినుంచి మరొకరికి సంక్రమించకుండా తీసుకునే జాగ్రత్తలు పాటించమని మొదటినుండీ చెబితే సరిపోదా… ప్రజలలో ఉన్న భయాందోళనలను పోగొడుతూ ప్రజలను కాపాడే వ్యవస్థలు ఉన్నాయని ప్రభుత్వం భరోసా ఇవ్వాలి కదా… అప్పుడు కిక్కిరిసిన హాస్పిటళ్ళు, భయంతో హరీమనే రోగులు, మందుల పేర, ట్రీట్‌మెంట్ పేర జరుగుతున్న వ్యాపారం, అస్తవ్యస్థమైన జీవనం, ఛిన్నాభిన్నమైన వ్యవస్థలు, సంబంధాలు… అంతా మరో విధంగా ఉండేది కదా…
నేనిప్పుడు మిత్రులందరినీ కోరేది ఒక్కటే… కరోనా విషయంలో అతిగా స్పందిస్తున్న బంధుమిత్రులెందరినో చూస్తున్నాను. అతిగా స్పందించడం ఎట్లా మంచిది కాదో, స్పందన లేకపోవడం కూడా అంతే మంచిది కాదు, అది మరో రకంగా దెబ్బ తీయవచ్చు. వచ్చిన దాన్ని ఎదుర్కోవడానికి మన శరీరాన్ని, మనసుని మనం సన్నద్ధం చేసుకుంటూ ఉండడం చాలా అవసరం. ఒకవేళ వస్తే శత్రువుపై యుద్ధం చేయడమే. విజయం మనదేననే విశ్వాసంతో ముందుకు సాగడమే…