గౌరవనీయులైన భూమిక సంపాదకురాలు కె.సత్యవతి గారికి,
వి.సరస్వతీ ఆంజనేయులు, హనుమమ్మ బసవయ్య పౌరగ్రంథాలయం, వేములవాడ నుండి హృదయపూర్వక సాహితీ వందనాలు… శుభాకాంక్షలు… శుభాశీస్సులతో…
ఏప్రిల్-జూన్ 2020 భూమిక సంచిక అందింది. మీ యొక్క బృందం మానవత్వం పరిమళించిన వేళ మేడ్చల్ ఆహార మరియు ప్రయాణ శిబిరాలలో చేసిన సేవల గురించిన ఐదున్నర పుటల సంపాదకీయం అత్యద్భుతం. మీకు, మీ బృందానికి సహకరించిన యువతీ యువకులు, పెద్ద మనుషులకు అందరికీ మా వందనాలు,
శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ యొక్క మానవీయ సహకారానికి ధన్యవాదాలు. మిమ్ములను మనస్ఫూర్తిగా అభినందిస్తూ మున్ముందు మంచి సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్ష.
కృతజ్ఞతలతో మీ శ్రేయోభిలాషులు… – వి. సరస్వతీ ఆంజనేయులు
…. ఙ ….
డియర్ సత్యవతి గారు,
చాలా రోజుల తర్వాత వచ్చిన జూన్ భూమికలో మీ సంపాదకీయం చదివిన తర్వాత ఉత్తరం రాయాలని పించింది. మేడ్చల్ దగ్గర మీరు చేసినటువంటి సేవలు మరువలేనివి. ప్లాస్టిక్ కాగితంలో పసిపాపను చుట్టుకున్న స్త్రీని మీరు వర్ణించిన తీరు నాకు ఇంకా గుర్తుంది. అనేక కారణాల వల్ల భూమికలో సాహిత్యపరంగా పాల్గొనలేకపోయినా చదవడం మాత్రం తీరిక చూసుకుని చేస్తూనే ఉంటాను. మీరు నాకు ఉత్తరం చాలా ఏళ్ళ క్రితం రాశారు. అది పదిలంగా దాచుకున్నాను. ఫోటో తీసి పంపించుదామని అనుకుంటున్నాను. ఉత్తరాలు రాయడంలో మీది అందెవేసిన చెయ్యి! మీ ఉత్తరం ఎంత బాగుందంటే ఇది మీతో పూంచుకోకుండా ఉండలేనటువంటి ఒక అనుభూతి అలలా పొంగుకొచ్చింది. జులై నెల సంచికలో మీ ఊరి గురించి రాశారు. ఎవరికైనా అక్కడకు వచ్చి ఉండాలని అనిపించేంత అందంగా, ఆహ్లాదంగా రాశారు. చాలా జాగ్రత్తగా దాచుకున్నవి అంత తొందరగా కనిపించవు. ఈ మధ్యలో కూడా మీ ఉత్తరం ఒకసారి చదువుకున్నాను. అది కనిపించగానే తప్పకుండా మీకు ఫోటో తీసి పంపుతాను. ఈ లోపల ఆగలేక ఈ ఉత్తరం రాస్తున్నాను.
– డా|| కుప్పా విజయశ్రీ మీ పాత ప్రేయసి