సుధామూర్తి గారు తన ”ఓల్డ్ మాన్ అండ్ హిజ్ గాడ్” పుస్తకంలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్న శీర్షికలో తనకెదురైన ఒక అనుభవాన్ని పంచుకున్నారు.
తన బాల్య స్నేహితురాలి పేరు అల్కా. చిన్నప్పటి నుండి ఆమె మంచి ఉపన్యాసకురాలు. తన వాదనలకు ఎవరూ ఎదురు చెప్పలేనంత పదును ఉండేది ఆమె వాదనలలో. అల్కా వద్ద పనిచేసే ఆమె పేరు తులసి. ఒకరోజున సుధామూర్తి గారు తన పనిమీద తన స్నేహితురాలి ఇంట్లో ఉన్నప్పుడు ఒక సంఘటన జరిగింది.
ఆ రోజున అల్కా ఒక కాన్ఫరెన్స్‌లో ఉపన్యాసం ఇవ్వవలసి ఉంది. త్వరగా బయటికి వెళ్ళాల్సి
ఉంది. కానీ ఎప్పుడూ ఆలస్యం చేయని తులసి పనిలోకి రాలేదు. ఇలాంటి టైంలో ఆమె రాకపోవడం వల్ల అల్కా చాలా చిరాగ్గా ఉంది. సుధామూర్తిగారు అల్కాకి సర్దిచెప్పి, తులసి ఎందుకు రాలేదా అని కనుక్కుందామని అక్కడికి దగ్గర్లోనే ఉన్న ఆమె ఇంటికి వెళ్ళారు స్నేహితులిద్దరూ.
అక్కడికి వెళ్ళేసరికి తులసి వాళ్ళాయన మీద కేకలు వేస్తూ అతని మీద చేయి చేసుకుంటూ కనిపించింది. వీళ్ళు ఆమె కోపాన్ని కంట్రోల్ చేసి, ఏమైంది అని అడిగితే తాను కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొనుక్కున్న చేతి గాజులని, గొలుసుని, పాన్ షాప్ పెట్టడం కోసం వాళ్ళాయన తాకట్టు పెట్టాడని చెప్పింది. వీళ్ళిద్దరూ ఆమెకు సర్దిచెప్పి వచ్చేశారు. ఇంటికి వచ్చాక అల్కా అదోలా ఉండడం చూసిన సుధామూర్తి గారు ఎందుకలా ఉన్నావ్ అని అడిగితే, నాకు ఈ రోజే అర్థమైంది నేను తులసికంటే దారుణమైన పరిస్థితిలో ఉన్నానని అన్నారు. ఎందుకలా అని అడిగితే, మనమున్న ఈ ఖరీదైన ఫ్లాట్ నా స్వంత సంపాదనతో కొన్నాను. ప్రతి పైసా నాదే. కాకపోతే ఇన్‌కమ్ టాక్స్ కారణాల వల్ల మా ఆయన పేరుమీద పెట్టాను. కానీ ఆయన తన బిజినెస్ సరిగ్గా లేదని చెప్పి ఈ ఫ్లాట్‌ను తాకట్టు పెట్టి వచ్చిన డబ్బుని తను వాడుకున్నారు. కనీసం ఆ సంగతి నాకు చెప్పలేదు కూడా. ఇప్పుడు ఈ ఫ్లాట్‌ని కోల్పోతే నడిరోడ్డున పడతాను నేను. ఇంత జరిగినా ఆయన్ని నేను ఏమీ అనలేకపోయాను. తులసి వాళ్ళాయన మీద చేయి చేసుకున్నట్లు కేకలు వేస్తూ చేయి చేసుకోలేకపోయినా, నేను మా ఆయన్ని కనీసం ప్రశ్నించలేకపోయాను. ఆ ప్రశ్న ఏ యుద్ధానికి దారితీస్తుందో పక్కింటి వాళ్ళు ఏమనుకుంటారో అన్న ఆలోచనలు… సామా జిక మర్యాదలు… నన్ను ఆ పని చెయ్యనివ్వ లేదు. కానీ మనసుకు తగిలిన గాయం ఎప్పటికీ ఉండిపోతుంది కదా అంది అల్కా.
ఈ అనుభవాన్ని చదవగానే మనసు మీద ముళ్ళకొరడాతో ఛళ్ళున చరిచినట్లు అనిపిం చింది. ఎందుకంటే మనలో చాలా మంది ‘అల్కా’లమే. తనలాగే మనం కూడా సామాజిక వేదికలమీద ఎన్నో రకాలుగా మనకు జరుగు తున్న అన్యాయాల గురించి, మన సాంఘిక హక్కుల గురించి ప్రశ్నిస్తాం, చర్చిస్తాం.
స్త్రీ సమాజంలో చైతన్యం తేవడానికి మన వంతు ప్రయత్నం చేస్తున్నామని మురిసిపోతూ ఉంటాం… కానీ నిజంగా జరిగేదేమిటి? సమూహ సమస్యలు చర్చించి సలహాలిచ్చి నంత సులభంగా మన వ్యక్తిగత సమస్యలు చర్చించగలుగుతున్నామా?
ఊహు… అవి చర్చించాలంటే మనకి భయం. మనకి భయం అంటే మళ్ళీ మనం ఒప్పుకోము. వ్యక్తిగత సమస్యలు ఇంకొకళ్ళతో చర్చించడం మనకి ఇష్టం లేదు అంటాం… అదీ నిజమే అనుకుందాం. మరి ఇంట్లో మన ఇష్టాలకి వ్యతిరేకంగా, ఆఫీసులో నియమాలకి విరుద్ధంగా జరిగే వాటిని ఎందుకు ప్రశ్నించలేకపోతున్నాం?
ఎందుకంటే… ‘ఆకాశంలో సగం మనం’ అని నినదించే మనమే సంప్రదాయపు పరువు పరదాల మాటున, సామాజిక మర్యాదల మాటున మన గొంతుని దాచేసుకుంటున్నాం.
చాలాసార్లు దిగువ మధ్యతరగతి స్త్రీలే నయమనిపిస్తుంది. తమ హక్కుల కోసం బలంగా నిలబడతారు. అవతలి వాళ్ళని చొక్కా పట్టుకుని అయినా నిలదీస్తారు. తమకు జరిగిన అన్యాయం తప్ప ఎవరైనా ఏమైనా అనుకుంటా రన్న వెరపు వాళ్ళలో కనిపించదు.
కానీ మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి మహిళల సంగతి ఏమిటి? అందరూ చదువుకునే ఉంటాము. మనకి సామాజిక స్పృహ చాలా ఎక్కువ అనే భ్రమలో ఉంటాము. సామాజిక స్పృహలో వ్యక్తిగత స్పృహ లేకపోవడం భ్రమ కాకపోతే మరేమిటి.
పక్కవాళ్ళ సమస్యలకి సమాధానం దొరికినంత సులభంగా మన సమస్యలకి పరిష్కారాలు దొరకవు. ఎందుకంటే దాన్ని సమస్య అని గుర్తించడం మనకు ఇష్టముండదు. సమస్య అని అనిపిస్తే ప్రశ్నించాల్సి వస్తుంది. అలా ప్రశ్నించబడాల్సిన వాళ్ళంతా మన ఆత్మీయ గణంలోనే ఉంటారు.
ప్రశ్నించడం వల్ల వాళ్ళతో రిలేషన్స్ దెబ్బతింటాయేమో అన్న ఆలోచనలు ఒక పక్క దగ్గరి వాళ్ళంతా ఏమనుకుంటారో అన్న ఆలోచన మరో పక్క దాడిచేస్తూ ఉంటాయి.
మనకి వాళ్ళతో రిలేషన్స్ కావాలి. అదే సమయంలో మన సమస్యలు తీరాలి. కానీ అదెలా సాధ్యం? కాస్తంత ఆలోచిస్తే సాధ్యమ వుతుంది. ప్రశ్నించడం అంటే పరువు పోవడమే అన్న సంస్కృతి నుండి బయటికి రాకపోవడం వల్లనే ఇదంతా…
ప్రశ్నించడం వల్ల మన ఇంటి సమస్యలు రచ్చకెక్కడం తప్ప ఉపయోగం ఏముంది అనుకుంటారేమో…?
మరి ప్రశ్నల సమూహంగా స్త్రీ జాతి మారాకే కదా స్త్రీల విషయంలో ప్రపంచ దృక్పథం మారుతూ వచ్చింది.
ఆ ప్రశ్నని మన వ్యక్తిగత జీవితాల్లో బలంగా ఎందుకు ప్రవేశపెట్టలేం. మన ప్రశ్నలో న్యాయం ఉన్నప్పుడు దాన్ని గట్టిగా అడగటం వల్ల మన పరువెందుకు పోతుంది?
అలా అని పైన చెప్పిన అనుభవంలో తులసి చెప్పినట్లు చేయమని కాదు. అల్కాలాగా మనసులో పెట్టుకుని ఎవరి పద్ధతిలో వాళ్ళు అడగాలి. వాళ్ళు చేసే దాంట్లో తప్పేముందో విప్పి చెప్పాలి. ఒకవేళ వాళ్ళ వాదనలో నిజముంటే మనమూ ఒప్పుకోవాలి. మహా ఐతే ఏమవుతుంది కాసేపు తీవ్రమైన వాదన. కాకపోతే ప్రశ్నించకపోవడం వల్ల భవిష్యత్తులో వచ్చే వేదనకంటే ఈ రోజు వాదనలో నుండి వచ్చే పరిష్కారం మంచిదే కదా.
అవును… పరిష్కారం దొరుకుతుంది…!
ఎందుకు దొరకదు?
మనమెంత పరువు తక్కువ అనుకుంటామో… అవతలి వాళ్ళు కూడా అదే అనుకుంటారు. వాళ్ళవీ మనలాంటి ఆలోచనలే ఉంటాయి. ఏదో ఒక సమయంలో అహం ఎక్కువవుతుందేమో కానీ చివరికి ఎవరి అంతరాత్మ అయినా న్యాయమేదో చెబుతూనే ఉంటుంది.
ఏ ప్రశ్న అయినా వ్యక్తిగతంగా మొదలైనప్పుడే… సమాజానికి చేరేసరికి బలమైన ఆయుధంగా మారుతుంది. సమాజాన్ని చైతన్యం చేస్తుంది.