చిట్టెమ్మల చింతలు తీరేదెలా! -పి. ప్రశాంతి

తెలతెలవారుతున్నట్టు తెలుస్తోంది. పిట్టల కిలకిలా రావాలు… చేలుదాటి చెరువు మీదుగా వీస్తున్న పిల్ల తెమ్మెరలు… మబ్బుల్ని చీల్చుకుని బైటపడాలని చూస్తున్న భానుని తొలికిరణాలు.. వీటితోపాటు బరువుగా వేలాడబడుతున్న తన డైపర్‌… తెల్లవారబోతోందని తెలియచేస్తున్నాయి.

చీకట్లు పూర్తిగా తొలిగిపోకముందే తన డైపర్‌ మార్చితే బాగుండని గంటనుంచి ఎదురుచూస్తోంది చిట్టెమ్మ. నెల రోజులుగా మంచంమీంచి లేవలేని పరిస్థితిలో శరీరమున్నా మెదడు చురుగ్గానే పనిచేస్తోంది. హఠాత్తుగా ఒక్కోసారి గుండెకి, మెదడుకి అనుసంధానం తప్పుతోంది. అలాంటి ఓ క్షణంలో అదుపు తప్పి కింద పడ్డప్పటి నుంచి మంచానికి పరిమితమైపోయింది 78 ఏళ్ళ చిట్టెమ్మ. మొదట్లో ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లేది తన పరిస్థితికి. ఎప్పుడూ చురుగ్గా తిరుగుతూ, చలాకీగా మాట్లాడుతూ అందరినీ పలకరించు కుంటూ ఊరందరికీ తల్లో నాలికలా ఉండే చిట్టెమ్మ… మంచానికి పరిమితమవడం జీర్ణించుకోలేకపోతోంది. అదీ ముఖ్యంగా కాలకృత్యాలప్పుడు…

మొదట్లో పిలిస్తే కూతురో, కోడలో వచ్చి పాన్‌ పెట్టేవారు. కడుపు బరువెక్కినా ఈ ప్రహసనం నచ్చకపోవడంతో కడుపు ఖాళీ అయ్యేది కాదు. మోషన్‌ అవ్వకూడదని తిండి కూడా మానేస్తే పిల్లలు కోప్పడి, నచ్చచెప్పి, బతిమాలి ఎన్ని చేసినా వినకపోయేసరికి ఒకరోజు అడల్ట్‌ డైపర్‌ని తెచ్చి చూపిస్తే ఇది బానే ఉందనిపించి అప్పట్నుంచి డైపర్‌ వాడకాన్ని అలవాటు చేసుకుంది. కోడల్ని ఒకటే కోరుకుంది… దయచేసి ఇంట్లో ఎవరూ లేవకముందే తన ‘డైపర్‌’ని మార్చమని. అందుకే కోడలు ఎప్పుడు లేస్తుందా అని ఎదురుచూస్తోంది.

చిట్టెమ్మ మునిమనవడికి డైపర్‌ వెయ్యడం నేర్చుకున్నప్పుడు అబ్బో ఇదెంత సుఖం వాడికి, మనకి కూడా అని మనవరాలిని మెచ్చుకుంది. ఆరుగురు పిల్లలకి, తర్వాత వాళ్ళ పిల్లలకి పాత చీరలతో మెత్తటి మందపాటి లంగోటీలు కుట్టేది. వాటిని తడిపేస్తే ఎప్పటికప్పుడు

శుభ్రం చేసి, వేడినీళ్ళలో బాగా ఉతికి, డెటాల్‌ నీళ్ళల్లో పిండి, ఎండకి ఆరబెట్టి వాడేది.

కూతుళ్ళు పెద్దయ్యాక వాళ్ళు నెలసరి అవసరాలకి కూడా ఇలాగే మెత్తటి చీరతో నాలుగు పొరలు వేసి మళ్ళీ మధ్యలో ఒక మూలనుంచి మరో మూలకి కొంచెం మందపాటి లంగా బట్టని వేసి జాగ్రత్తగా కుట్టి ఇచ్చేది. రోజుకి మూడుసార్లన్నా మార్చు కోవాలని ఒక్కొక్కరికీ పదేసి చొప్పున నలుగురు కూతుళ్ళ కోసం కుట్టేది. మనవరాళ్ళకి కూడా మొదట్లో అలాగే కుట్టిచ్చేది. కానీ కాలం మారి శానిటరీ నాప్కిన్లు అందుబాటులోకి రావడంతో ఆ అవసరం తర్వాత్తర్వాత లేకపోయింది.

తనకి 65 ఏళ్ళు దాటాక ప్రయాణాల్లో ఒక్కోసారి బాత్రూంకి వెళ్ళాల్సి వచ్చినా వీలుకాని పరిస్థితుల్లో మాత్రం ఆగక ఇబ్బంది పడేది. ఆరు కాన్పులయ్యి పెద్దాపరేషన్‌ అయ్యి, బరువులెత్తి, బండపనులు చేయాల్సొచ్చినా ఇంటి పంట, పాడి, గుడ్లు, పండ్లు ఎప్పుడూ అందుబాటు

ఉండడంతో శారీరకంగా పటిష్టంగా ఉండేది. కానీ వయసుతో వచ్చే మార్పుల వల్ల శరీరం, అవయవాలు పటుత్వం తగ్గినా ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకపోవడంతో ఎప్పుడూ చలాకీగా ఎక్కడ ఏ శుభకార్యం జరిగినా పిలిస్తే మాత్రం దూరాభారం అనుకోక భర్తతో కలిసి తప్పకుండా వెళ్ళేది.

ఇలా ప్రయాణాల్లో బాత్రూం సమస్య ఎదురైనప్పుడు మొదటిసారి పెద్ద మనవరాలితో చెప్పింది. ఏదో ఒక మార్గం చూపించమని అడిగింది. నెలసరిలో వాడే ప్యాడ్‌ వాడొచ్చా అని ఆగిఆగి అడిగేసింది. మొదట ఆశ్చర్య పోయినా విషయం అర్థం చేసుకుని ఎక్స్‌ట్రా లార్జ్‌ విస్పర్‌ నాప్కిన్స్‌ తెచ్చిచ్చింది. అది ఎలా వాడాలో విని ‘అయ్యో నాకెలా పనికొస్తుందే…’ అని బాధపడింది. ‘ఈ వయసులో నేను చెడ్డీలేసుకోవాలా’ అని వాపోయింది. చివరికి అత్యవసరం అనుకుంటే వాడతాలే అని మనవరాలు కొనుక్కొచ్చిన ప్యాంటీలతో పాటు నాప్కిన్స్‌ని దాచుకుంది. ఎప్పుడన్నా వాడిందో లేదో మాత్రం తెలీదు. ఆర్నెల్లకో, పదినెల్లకో ఒకసారి ‘పాతవి వాడకపోతే వాటిని పడేసెయ్‌, కొత్తవి తెచ్చా తీసుకో’ అని మనవరాలు ఇచ్చే ప్యాకెట్‌ని మాత్రం బీరువాలో తన అరలో జాగ్రత్తగా బట్టల మాటున దాచుకునేది.

ఇప్పటి పరిస్థితుల్లో తనూ డైపర్‌ వాడాల్సి రావడంతో బాగా సిగ్గుపడింది. అదీ కోడలి తోనో, కూతురితోనో మార్పించుకోవలసి రావడం ఇంకా ఇబ్బంది పెడ్తోంది. ప్రతిసారి మనసు ముడుచుకుపోతోంది. కూతుళ్ళొచ్చి నప్పుడు అదే మాటంటే, వాళ్ళు కోప్పడి ‘ఇప్పుడు నువ్వు మాకు మా మనవలతో సమానం. ఊరికే నసపెట్టకు. వయసుడిగినా దీనికేమీ తక్కువలేదు’ అన్న చిన్నకూతురి మాటకి చిన్నబుచ్చుకుంది. అది విన్న మిగతా కూతుళ్ళు మౌనంగా ఉన్నా కోడళ్ళు ‘అదేం మాట వదినా… తన అనుభవంలో ఇన్నేళ్ళూ అందరికీ చేయడమే కానీ చేయించుకున్నది లేదు కాబట్టి అత్తమ్మ ఫీల్‌ అవుతోంది. నువ్వలా అంటే ఇంకా బాధపడదూ…’ అన్న మాటలకి ‘మరేం చెయ్యమంటావు. మేమెప్పుడో నాల్రోజులు ఉండి పోతాం… ఇలా అంటుంటే మీకు విసుగ్గా ఉండదూ! చెయ్యక తప్పదు కదా!’ అన్న కూతుళ్ళని ఒక నిట్టూర్పుతో చూసింది చిట్టెమ్మ. రోజుకి రెండుసార్లు యాంత్రికంగా డైపర్‌ మార్చే కోడళ్ళని దీర్ఘంగా చూసింది. మనసులో మాత్రం పదే పదే అనుకుంటోంది… అనారోగ్యాలు రాకుండా, వచ్చినా తగ్గించేలా వైద్యం పెరిగి నాలాంటోళ్ళు బతికే కాలం పెరిగింది. కానీ మరి వయసుడిగి వచ్చే నా సమస్యలాంటి సమస్యలకి వైద్యంతో కుదరదు కదా! ప్రేమ, వాత్సల్యం, మమకారం, బాధ్యత, గౌరవం, సహానుభూతి, మానవీ యత వంటివి మాత్రమే దీనికి విరుగుడు. మరి ఈ ఆధునిక ప్రపంచంలో ఎవరి దారిని వారు వెతుక్కుంటూ పోతున్న రోజుల్లో వయసుడిగిన తనలాంటి వృద్ధులకు గౌరవం గా, ఆత్మాభిమానంతో బతికే దారేది? ఎవరు ఏం చేస్తే ఇది తీరుతుంది? శరీరం సహకరిం చక పోయినా పరిపరి విధాల ప్రయాణించే ఆలోచనలని కట్టడి చేయడం సాధ్యమేనా??? చిట్టెమ్మ ప్రశ్నలకి జవాబేది?!?!

Share
This entry was posted in పచ్చి పసుపు కొమ్ము. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.