కరోనా కష్ట కాలంలో సమంత సాహసం – కొండవీటి సత్యవతి

దేశం మొత్తానికి తాళం పడిన రోజులు. మార్చి 22 జనతా లాక్‌డౌన్‌ అంటూ మొదలైన సుదీర్ఘ లాక్‌డౌన్‌ పీరియడ్‌. ఎవ్వరం గడపదాటని, దాటలేని పరిస్థితి. ఎలాంటి హెచ్చరికలూ లేకుండా, ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా రేపటినుండి మీరంతా మీ ఇళ్ళకు తాళాలేసుకుని ఇంట్లో కూర్చోండి అంటూ ప్రభుత్వం తాఖీదులు జారీ చేసిన సమయం. అర్థరాత్రి నోట్లు బందు చేసిన లాంటి పరిస్థితన్నమాట. కరోనా వైరస్‌ గురించిన వార్తలు, విమానాశ్రయాలు, విదేశాల్నుంచి వచ్చిన వాళ్ళ గురించి మాత్రమే వింటున్నాం అప్పుడు. అలాంటిది ఎలాంటి హెచ్చరికలూ లేకుండా 130 కోట్లమంది జనం రేపటినుండి ఇంట్లో కూర్చోండి అంటే ప్రతిరోజు పనిచేస్తేనే గానీ పూట గడవని పేద ప్రజలు 80% ఉన్న దేశంలో అలా ఇంట్లో కూర్చోవడం ఎలా సాధ్యమౌతుంది? కనీసం రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేదల గురించి ఏ మాత్రం ఆలోచించకుండా వారి సంక్షేమం కోసం ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు చేయకుండా ఉరమని పిడుగులా మీదపడి ఉక్కిరిబిక్కిరి చేసిన లాక్‌డౌన్‌ పాడుకాలం.

ప్రతిదినం పనిచేసుకుంటూ బతుకులు గడుపుకునే పేద ప్రజలు లాక్‌డౌన్‌ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిండిలేక పస్తులున్నారు. ఆ సమయంలో ఎంతో మంది వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు తిండి గింజలు, నిత్యావసర వస్తువులు నిరంతరంగా పంచడం జరిగింది. నగరంలో వందలాది బస్తీలలో నివసిస్తున్న పేద కుటుంబాలు పని కోల్పోయి, చిన్న చిన్న వ్యాపారాలు మూతబడి ఆదాయం కోల్పోయి అష్టకష్టాలు పడిన రోజులు లాక్‌డౌన్‌ రోజులు. నిజానికి ఇప్పటికీ కొనసాగుతున్న కష్టకాలం.

ఇలాంటి భయంకరమైన కష్టకాలంలో సమాజపు అట్టడుగున, ఎన్నో వివక్షతలను ఎదుర్కొంటూ జీవనం సాగించే ట్రాన్స్‌జెండర్ల పరిస్థితి మరింత విషాదకరంగా తయారైంది. భిక్షాటన, సెక్స్‌వర్క్‌ తప్ప వేరే ఎలాంటి ఉపాధి, సంపాదనా అవకాశాలు లేని ట్రాన్స్‌జెండర్ల పరిస్థితి దయనీయంగా తయారైంది. పస్తులుండేలాంటి దుర్భర పరిస్థితిలోకి ట్రాన్స్‌జెండర్లు నెట్టేయబడ్డారు. బయటకు వెళ్ళలేరు. తమకి అలవాటైన వృత్తుల్లోకి వెళ్ళి కొంత ఆదాయం పొందగలిగిన పరిస్థితుల్లేవు.

అలాంటి సమయంలో ‘సమంత’ అనే ట్రాన్స్‌జెండర్‌ మహిళ చేసిన సాహసం గురించి ఎంత రాసినా తక్కువే. ఆమె తన ఆటోలో 3000 కిలోమీటర్లు తిరిగి 2500 మంది ట్రాన్స్‌జెండర్లకు బియ్యం, నిత్యావసర వస్తువులను పంచి శభాష్‌ అనిపించుకుంది. ఎవరీ సమంత? ఆటోలో ఇన్ని వేల కిలోమీటర్లు ఎలా తిరిగింది? అంతమంది ట్రాన్స్‌జెండర్లకు డ్రై రేషన్‌ ఎలా పంచగలిగింది?

ఈ వివరాల్లోకి వెళ్ళేముందు సమంత నాకు ఎలా పరిచయమైందో చెప్పాలి కదా! చాలా కాలం నుంచి నేను ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ వారి సమావేశాలకు వెళ్ళడం, వారి కార్యక్రమాలలో భాగస్వామినవ్వడం జరుగుతోంది. ట్రాన్స్‌జెండర్‌ యాక్టివిస్టులు రచన, అంజలి, వైజయంతి, బిట్టు, మీరా… వీరందరితోనూ ఎప్పటినుండో పరిచయాలున్నాయి. సమంత పరిచయం లాక్‌డౌన్‌ సమయంలోనే జరిగింది.

అందరం ఇంట్లో బందీగా ఉన్న సమయంలో ఒకరోజు రచన ఫోన్‌ చేశారు. సమంత గురించి చెప్పి తను షేర్‌ ఆటో నడుపుతుందని, తనకి కోవిడ్‌ రిలీఫ్‌ పాస్‌ కావాలని అడిగారు. లాక్‌డౌన్‌లో ట్రాన్స్‌జెండర్‌ మహిళలు చాలా కష్టాలు పడుతున్నారని, తన ఆటోకి పాస్‌ ఇప్పిస్తే డ్రై రేషన్‌ డిస్ట్రిబ్యూషన్‌ చెయ్యాలనుకుంటోందని చెప్పారు. నేను, ప్రశాంతి రాచకొండ కమీషనరేట్‌లో చాలా ప్రయత్నం చేసి కోవిడ్‌ రిలీఫ్‌ పాస్‌ను ఇప్పించగలిగాము.

ఆ రోజు నుంచి సమంత రెండు నెలలపాటు హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ ప్రాంతాల్లో మూలమూలలకు వెళ్ళి ట్రాన్స్‌జెండర్లకు రేషన్‌ సరుకులు పంచింది. ఉదయం నుండి రాత్రి వరకు ఆటో నడుపుతూ, సరుకులు పంచుకుంటూ తిరిగింది.

ఇబ్రహీంపట్నంలో ఒక గ్రామానికి చెందిన సమంత ఎల్‌బి నగర్‌లో షేర్‌ ఆటో నడిపేది. మొదట్లో చాలా అవమానాలు, ఇబ్బందులు ఎదుర్కొంది. మీ వాళ్ళంతా భిక్షాటన చేస్తూ మస్తు పైసలు సంపాదిస్తారు కదా! నువ్వెందుకు ఆటో నడుపుతున్నవ్‌? అని ప్రశ్నించేవాళ్ళట. అందులో మస్తు పైసలొస్తాయి కదా అనేవారట. అప్పుడు సమంత లేదు నాకు ఆ పనులు చెయ్యడం ఇష్టంలేదు. నాకు కష్టపడి పనిచేయడం ఇష్టం. కష్టం చేసి మా అమ్మను పోషించుకుంటా. అందుకే ఆటో నడుపుతున్నాను అని చెప్పేదట. అంతేకాదు, ఆమె ట్రాన్స్‌జెండర్‌ మహిళ అని తెలిసి ఎవరూ ఆటో ఎక్కేవారు కాదట. ఈ పోరి సక్కగా తీసుకెళతదా అని వెక్కిరించి అవమానించే వారట. అయినా సమంత వాటన్నింటిని ఎదిరించి తన ఆటో ప్రయాణాన్ని కొనసాగిస్తూనే ఉంది. లాక్‌డౌన్‌ సమయంలో తన స్ఫూర్తిదాయకమైన పనితో అందరికీ ఆదర్శంగా నిలిచింది.

ఇటీవల ట్రాన్స్‌విజన్‌ అనే యూట్యూబ్‌ ఛానల్‌కి తనిచ్చిన ఇంటర్వ్యూలో సమంత తన గురించి ఇలా చెబుతుంది. ”చిన్నప్పటి నుండి మస్తు కష్టాలు పడిన. బడిలో, గుడిలో… నాకన్నీ కష్టాలే ఎదురయ్యాయి. మా నాయిన నన్ను పొలం పనులకు రమ్మనేది. నాకు పొలం పనులు చేయడం ఇష్టం లేకుండేది. ఇంట్లో పనులు చెయ్యబుద్దయ్యేది. అమ్మచేసే పనులు చెయ్యాలనిపించేది. నాయిన తిట్టేది. అయినా పొయ్యేదాన్ని కాదు. అతి కష్టంమీద పదో తరగతి పాస్‌ అయ్యాను. నాన్న ఎంత చెప్పినా పొలం పనులకు వెళ్ళకపొయ్యేది. నాగలి పట్టకపొయ్యేది. నాన్న చాలా కోప్పడి తిట్టినప్పుడు ఇంట్లోంచి పారిపోయి హైదరాబాద్‌కొచ్చేసినా. కొంతమంది ఫ్రెండ్స్‌ సహకారంతో బొంబైకు పోయాను. బొంబాయిలోనే సర్జరీ చేయించుకున్నాను. అమ్మాయిగా మారిపోయాను. రెండు సంవత్సరాలు అక్కడే ఉన్నాను.

ఆ తర్వాత మా నాన్న పాణం బాగుండలేదని తెలిసి మా ఊరొచ్చాను. అనారోగ్యంతో మా నాన్న చనిపోయిండు. మస్తు ఏడ్చినా. మా అమ్మ, తమ్ముడు అందరం చాలా దుఃఖపడినాం. నేను అబ్బాయిగా ఇంటినుండి పారిపోయా కదా! ఇప్పుడేమో అమ్మాయిగా తిరిగొచ్చాను. చుట్టుముట్ల అందరూ ఎవరీమె, ఎవలు అంటూ చర్చలు చేశారు. ఓ నాలుగు రోజులు ఇవన్నీ జరిగాయి. ఆ తర్వాత ఆరు నెలలు నేను మా ఇంట్లోనే ఉండిపోయాను. మా తమ్ముడు ఆటో నడుపుతాడు. నేను కూడా ఆటో నడపడం నేర్చుకున్నాను. సరదాగా తమ్ముడితో కలిసి నేర్చుకున్నాను.

కొన్ని నెలల తర్వాత నాకు ఊర్లో ఉండబుద్దవ్వలేదు. హైదరాబాద్‌కు వచ్చేశాను. కొన్ని సంవత్సరాల పాటు భిక్షాటన చేసి జీవించాను. ఓ రోజు మా ఊరినుంచి ఎవరో ఫోన్‌ చేసి మీ తమ్ముడు చనిపోయాడని చెప్పారు. నేను వెంటనే మా ఊరికి పోయి మా తమ్ముడి కార్యక్రమాలు చేశాను. పదిరోజుల తర్వాత మా అవ్వనడిగాను. అవ్వా! మనం హైదరాబాదుకు పోదాం, ఆడనే బతుకుదాం అంటే ఆడైనా, మగైనా నువ్వే నాకు మిగిలావ్‌. నేను ఊరు విడిచి హైదరాబాదుకు రాను, ఈడనే ఉంటా అంది. అప్పుడు నేను మా తమ్ముని ఆటో తీసుకొని నడపడం మొదలుపెట్టాను. అయితే పాసింజర్లు నా ఆటో ఎక్కకపొయ్యేది. ఈ పోరికి ఆటో నడపడం వస్తదా. సరిగా తీసుకపోతదా అని ఎవరూ ఎక్కకపొయ్యేది. చానా కష్టాలు పడ్డా. నన్ను హిజ్రా అని గుర్తించకపొయ్యేది. అమ్మాయినే అనుకునేటోల్లు. రెండు సంవత్సరాల కష్టం తర్వాత అందరూ నన్ను అంగీకరించారు. అందరికీ తెలిసిపోయాను. ‘ఆటో సమంత’ అని పిలిచేవారు.

నా ఆటోలో అందరూ ఎక్కడం, దిగడం మంచిగనే ఉండింది. ఇప్పటికి ఐదు సంవత్సరాలుగా ఆటో నడుపుతూనే జీవిస్తున్నాను. మా అవ్వని పోషిస్తున్నాను. మా అవ్వ కారణంగనే నేను భిక్షాటన మానేశాను. మా అవ్వ ఏమన్నదంటే ‘భిక్షాటన వద్దు బిడ్డా. ఆటో నేర్చుకున్నవ్‌. నడపగలుగుతావ్‌. దీనిమీదనే బతుకుదమ్‌. ఊర్లోనే ఉందాం’ అని చెప్పింది. మా అవ్వ మాట మీదనే నేను ఐదు సంవత్సరాలుగా ఆటో నడుపుతూ జీవిస్తున్నాను. మా అవ్వని మంచిగ చూసుకుంటున్నాను.

అయితే కరోనా వచ్చినంక మా ట్రాన్స్‌జెండర్ల పరిస్థితి చాలా కష్టంగా తయారైంది. భిక్షాటన లేదు. వేరే ఏ పనీ లేదు. తిండికి కూడా ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు నేననుకున్నాను ‘నాకు ఆటో ఉంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఆహార ధాన్యాలు, పప్పులు,

ఉప్పులతో ఒక కిట్‌ను డొనేట్‌ ఇవ్వడానికి ముందుకొచ్చాయి. కానీ మా వాళ్ళంతా ఎక్కడెక్కడో ఉన్నారు. కొందరు హైదరాబాద్‌, మరికొందరు సికింద్రాబాద్‌లలో దూర దూర ప్రాంతాలలో ఉంటున్నారు. నాకు ఒక పాస్‌ దొరికితే.. కోవిడ్‌ రిలీఫ్‌ పాస్‌… అనుకుని రచనమ్మకి చెప్పాను. ప్రశాంతి, సత్యవతి గార్ల సహాయంతో నాకు పాస్‌ దొరికింది. రోజంతా రాచకొండ కమిషనరేట్‌లో ఎదురుచూశాక పాస్‌ దొరికింది. ఇంక నా పని మొదలుపెట్టాను. పొద్దున్నే లేచి పొలంకాడికెళ్ళి పొలం పనులు చూసుకుని ఆటోలో బయలుదేరేదాన్ని. రోజూ వందల కిలోమీటర్లు తిరిగేదాన్ని. ఒక్కోసారి రాత్రి పది, పదకొండయ్యేది ఇంటికొచ్చేసరికి. ఇంట్లో అవ్వ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు.

దాదాపు 2500 మంది ట్రాన్స్‌జెండర్‌లను కలిశాను. వారికి నిత్యావసరాలు అందించాను. వాళ్ళందరితో మాట్లాడే క్రమంలో నాకు అర్థమైంది ఏమిటంటే ట్రాన్స్‌జెండర్లందరికీ భిక్షాటన, సెక్స్‌వర్క్‌ మాత్రమే చేసి పొట్టపోసుకోవాలని లేదు. వారికి ఉద్యోగాల్లేవు.

ఉపాధి లేదు. ఆదాయం లేదు. ఉద్యోగాలు కల్పిస్తే చేసుకుంటాము. కుట్టుమిషన్‌, సెల్‌ఫోన్‌ రిపేరింగ్‌ లాంటి జీవనోపాధులు కల్పిస్తే మేము కూడా గౌరవంగా బతకాలనుకుంటున్నాము అని చెప్పారు. ఏవైనా సంస్థలు సహాయం చేస్తాయేమోనని ప్రయత్నం చేస్తున్నాను” అంటూ ముగించింది సమంత.

సమంత ఇంటర్వ్యూ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. మహా కష్టకాలంలో తన ట్రాన్స్‌జెండర్‌ కమ్యూనిటీ కోసం విశేషంగా కష్టపడిన సమంతకి తప్పకుండా అభినందనలు చెప్పాలి. నిజానికి తనకి ఆత్మీయంగా సన్మానం చెయ్యాలి. సమంతకి క్యాష్‌ అవార్డు ఇవ్వాలని నేను నిర్ణయం తీసుకున్నాను. త్వరలోనే ఈ పని పూర్తిచేస్తాను. శభాష్‌ సమంతా శభాష్‌.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.