దాంపత్య జీవితం మూడే మూడు ముడులతో
మొదలైనా అనేకానేక పీఠముళ్ళూ చిక్కుముళ్ళూ పడి
కాలకొలమానం హీనాతిహీనంగా ఒకవైపుకే
కలతల కొలతల కలలన్నీ తులతూగుతుంటే
సంసార నదిపై కుసంస్కార చిల్లు పడిన నావలా
కడదాకా ఒడ్డుకు ఎలా చేరుకోగల్గుతుంది?
సంసారం వ్యాపారమై అసాంఘికమైనప్పుడు
జీవన వన కష్టం నీది లాభం నాదని విభాగింపబడితే
ఆధునిక సమ సుమధరహాసాలు పుష్పిస్తాయా?
చిన్ని మర్రి విత్తు గోడ సందుగొందుల్లో దూరి
గొడవగా మొలకెత్తి గంభీరంగా తలెత్తి ఎదిగి
కొంపను నిట్టనిలువునా కూల్చినట్టి పటుబీప్టన
సంసార నదీ స్ధావరం దుఃఖసంద్రాన మునుగుతుంది!
జగతికంతటికీ చీకటి వెలుగులు పంచేనిదే
కానీ ప్రాణులందర్నీ నిలబెట్టేది నేలతల్లే కదా!!
చీకటినాక్రమించే వెలుగుకు చోటిచ్చేది చీకటే
వెలుగుకు వెలలు కట్టబెట్టే వెలిగించేదీ చీకటే
వెలుగు చీకట్ల కలయికలోని నిఘాడత
ఎన్నటికీ ఎప్పటికీ ఎడతెగని బాంధవ బంధమే!!
కలల కథావృక్ష కిరణజన్మ సంయోగిత వేళ్ళలోలో
నిండుగా కౌగిలించుకున్నప్పుడే జీవనదీ సాఫల్యం!!
అమ్మ గర్భపు ఉమ్మనదీ ఈదులాటల మూల్యంతో
ఎన్నెన్నో ఉప్పు కన్నీటి సంద్రాలు అధాటుగ దాటగల
చిర్నవ్వుల వేకువపూతల రంగురంగులుప్పొంగుల
సుమ పరిమళాలు ఫలించే సమస్పర్శల ఆస్వాదించే
ప్రతిఫలనాలు సగం సగం ఒక్కటిగా సంగమించినప్పుడే
నింగికీ నేలకూ పండే నిత్య పండుగ నిండుదనం అమూల్యం!!