తప్పు చేస్తే శిక్ష పడడమే గగనమనే రోజుల్లో
కానీ అక్కడ చేయని తప్పుకు శిక్ష పడుతుంది
కట్టుకున్నవాడు కాలగర్భంలో కలిసిపోయాడని
కన్నీళ్ళు కష్టాలు బాధ్యతలు మిగిల్చిపోయాడనే కనికరం లేక
సంబరాల వేడుకల నుండి వెలివేసే శిక్ష పడుతుంది
కలతలు కన్నీళ్ళే కలకాలం తోడుండే నేస్తాలవుతాయి
పుట్టుకతోనే ధరించిన బొట్టు కాటుక గాజులు పూలు
అర్థాంతరంగా నిషేధించబడతాయి
శుభకార్యాలకు ఎగ్జిట్ కార్డ్ పడుతుంది
దీవెనలు ఆశీస్సులు అందించడంలో అంటరానివాళ్ళవుతారు
నిరాశ నిస్పృహ కబళించి లోబరుచుకుంటాయి
ఆకాశంలో విహరించిన ఊహలు, కలలు కల్లలవుతాయి
కైలాసపటంలో పాము మింగినట్లు
అర్థ భాగాన్ని అకాలమరణమనే పాము మింగి
మహారాణి స్థానం దాసీ స్థానానికి దిగజార్చబడుతుంది
ఇరుగు పొరుగు లోకుల మాటలు ఈటెలై గుచ్చుకుంటాయి
అవమానాలు అష్టకష్టాలు నిత్యకృత్యాలవుతాయి
ఆది దంపతులని కితాబిచ్చినవాళ్లు ముఖం చాటేస్తారు
అన్ని నిర్ణయాల్లో అగ్రస్థానంలో ఉంచి ఆధిపత్యం ఇచ్చినవాళ్ళే
కనీసం విషయం చెప్పడమే అనవసరమనుకుంటారు
చేయని తప్పుకు తీరని రోదన మానసిక వేదన తోడునీడౌతాయి
అందరూ ఆలోచించాల్సిన తరుణమిది
బంగారు భవితను సర్వనాశనం చేసే సంప్రదాయాల్ని నిర్మూలిద్దాం
విధవ, ముండరాలనే వేదనా పదాల్ని బహిష్కరిద్దాం
వాళ్ళనూ మనతో సమానంగా గౌరవిద్దాం
వారిలో ఆత్మస్థైర్యం పెంపొందిద్దాం
భావితరాలకు బాట చూపి ఆదర్శమవుదాం