చెట్టు కొమ్మలు నరుకుతుంటేనే
ఆకులన్నీ దుఃఖంతో గడ్డ కట్టుకుపోయి
ముడుచుకుపోయి భూమి కనురెప్పల్లో కాల్వలవుతాయి
పత్ర హరితమంతా రంగులు మార్చుకుని
చెట్టును చుట్టుకొని బావురుమంటాయి
మరి ఏమిటిలా?
మనుష్యులంతా గొడ్డళ్ళయిపోతున్నారు
పుట్టిన పసి కందు నుంచీ
పండు ముదుసలి వరకూ
ఏ వయస్సయినా ఫర్వాలేదనుకుంటూ
శరీరాన్ని నరుక్కుంటూ గాయాల మయం చేస్తున్నారే
ఎందుకిలా? ఎన్నాళ్ళిలా?
ఆడదంటే అవయవం మాత్రమే ననుకుంటూ
వావి వరుసలు మరిచి గుంపులు గుంపులుగా
గొంగళి పురుగుల్లా పాక్కుంటూ పోతున్నారే
జుగుప్సావహ దృశ్యాలే వార్తలే నలువైపులా
మానవత్వం ఏడ దాగుందో తెలియడం లేదు
వెతుకుదాం… బయలుదేరుదాం…
స్త్రీ పురుషులు కలిసి సహజీవనం చేయడానికి
ఆడ, మగ వ్యక్తులుగా బతకడానికి
సమస్థితి, సమ న్యాయం, సమ భాగం
సాధించడానికి ప్రయత్నిద్దాం…
అమ్మ కడుపు లోంచే విశ్వాసపు బీజాలు నాటుదాం
ఆత్మ బలాన్ని గౌరవాన్ని ప్రోది చేద్దాం
శరీరపు దాడుల్ని ఎదుర్కొనే స్థితిని తీసుకొద్దాం
స్త్రీలంటే చులకనగా చూసే చూపుల్ని కత్తిరిద్దాం
ఇన్నాళ్ళు ఇగోల పంచాంగం విప్పుతున్న అందర్నీ నిలదీద్దాం
ఇది కేవలం వరీర గాయమే కానీ
మానసిక గాయం, పాపం కానేకాదని ఉద్భోదిద్దాం
మన చిన్నారి లేత కూనలన్నీ
బలోపేతమై
వరిగడ్డి కాదు వాళ్ళు వరి తాళ్ళు అని తెలియజేద్దాం
ఉరికొయ్యలు, ఆత్మాహుతులు
అవమాన జ్వాలలు వారివి కానేకావని నినదిద్దాం
నేరస్థులు ఎంతటి వారైనా
ఎవరైనా
శిక్ష క్షణాల్లో అమలయ్యే స్థితిని కల్పిద్దాం
తప్పు చేస్తే తల ఉండదింక అనే నిజాన్ని చెబుదాం
నేరం చేయాలంటే వణికే రోజును సృష్టిద్దాం
ఇవన్నీ… ఇవన్నీ… మనం చేయగలం
మనమే చేయగలం
మనమే భవిష్యత్తులో నేరాలు లేని రోజునే నెలకొల్పగలం
మనకు మనమే ఆయుధాలం
మనకు మనమే ఆత్మ గౌరవ పతాకాలం!