ఆమె –
తనను… అడ్డుకుంటున్న అవరోధాల్ని అధిగమించి
చుట్టూ పరుచుకున్న సంక్షోభతెరల్ని దాటుకొని
అక్షరాల్ని ప్రాణప్రదంగా చూసుకొని… శ్రద్ధగా నేర్చుకుని
తన మదిలో ఆలోచనా దీపాల్ని వెలిగించుకున్నపుడు
బానిస సంకెళ్ళను… త్రెంచుకున్నప్పుడు!
దృశ్యమానమవుతున్న జీవనగమనపు… అనుభవాల్ని
చదువుకున్న వేదనాభరిత అధ్యాయాల్ని
ఈ విశాల ప్రపంచపు
సంవేదనల… సయోధ్యల మధ్య
పారదర్శకం చేస్తున్నప్పుడు-
ఒక పథం…పడిలేచే కెరటం!
ఒక జీవితం… అంతరంగ సంఘర్షణం!!
ఆమెలో –
రూపుదిద్దుకున్న చరణం… వ్యాకుల భరణం
కలతలతో కల్లోలమైన… మనసు కథనం
రోజూ రగులుతున్న… ధిక్కార గీతం
ఆమె-
ఉదయించిన విలక్షణ వర్తమాన కావ్యం
ఉద్యమిస్తున్న వివిధ రీతుల విలక్షణత్వం
కనుగొన్న నూతన ప్రజాపథం
పయనిస్తున్న ప్రగతి కాంతుల స్వప్నం!