భయం లేదు
ఈ పెను చీకటి ముళ్ళ దారినీ
దాటి తీరుతాం మనం
భయం లేదు నా చేయి పట్టుకో
చెరసాలల ఊచల్ని మీటుతూ
ఉరికొయ్యలు తెగిపడక తప్పవని
చీకట్లను ఇక తరిమేద్దామని
జన గీతం పాడుతున్నారు వాళ్ళు
గొంతు కలుపుదాం మేమున్నాం మీకని
భయం లేదు నా చేయి పట్టుకో
దాటితీరుతాం ఈ చీకటి సాగరాల్ని
నర హంతక నియంతల పాలన
చిరకాలం సాగదు అంటూ
అనాధ జీవులు అతి సామాన్యులు
తెగబడి చేసిన సాహసపోరాట గాధలు
లోకమంతటా వినిపిస్తున్నాయి
భయంలేదు నా చేయి పట్టుకో
చీకటి రాజ్యపు సింహాసనాల్ని కూల్చగ
కలియదొక్కుతూ కవాతు చేద్దాం
చీకటి పరిచిన రాహు కేతువులు
ఒకరిద్దరులే
సూర్యుని మింగిన దుష్ట పాలకుల్నిక
శిరచ్ఛేదం చేద్దాం కలిసి కట్టుగా
చీకటి ఆకాశంలోకి ఎగరేద్దాం
మళ్ళీ, మళ్ళీ మండే మన సూర్యుడిని
భయం లేదు నా చేయి పట్టుకో
దాటేద్దాం ఈ చీకటి అగడ్తను సైతం
ఎన్నటికన్నా, ఎవడేం అన్నా, ఎవడేం చేసినా
సమస్త సుందర లోకం అభాగ్యజీవులదే
వెలిగిద్దాం చీకటి దారుల నిండా
నువ్వో దీపం, నేనో దీపం
నిర్మిద్దాం మహా మానవ కుడ్యం
ప్రపంచమంతా
కలసిన మన చేతుల గుండా
ప్రవహిస్తుందిక ధైర్యం విద్యుత్ తేజమై
భయం లేదు నా చేయి పట్టుకో
దాటి తీరుతాం ఈ చీకటి కాలాన్నిక
మనం గెలిచి తీరుతాం ఈ చీకటి రాజ్యాన్నిక
భయం లేదు భయం లేదు నా చేయి పట్టుకో