భూమిక వాలంటీర్, బతకమ్మకుంట
భుక్తి కరువైన వారి నోట మెతుక
పాతిపెట్టినా పైకి లేచే ధిక్కారపు మొలక
దురాగతాల దునుమాడి దిగంతాల ప్రకటించే పత్రిక – భూమిక
లోకమంతా డౌనైనప్పుడు – కరోనా కష్టకాలంలో
పనులు లేక… పూట గడవక… ధరల ధాటికి సంచినిండా సరుకులు రాక
సగం కడుపుకు సరిపెట్టుక… కాళ్ళు ముడుచుకు… పడుకున్నాక
మురికివాడల కూలిగడపల మోగిన తలుపు కట్టా…
బడుగుల నోట బుక్క…సాయమిచ్చిన సేవిక…భూమిక
వారిచ్చిన దినుసులే తిన్నాము లొట్టలేసుకుని… భూమిక
ఆసాముల మీసాలది పెత్తనం…సేవ చేసే సిగలదేమో బానిసత్వం ఎంత కాలం?
అంధ విశ్వాసం… ఆధిపత్యాలపై ఎలుగెత్తిన దీపిక
అసమానత… అణచివేతపై నినదించిన పొలికేక
దొంగ రాజ్యం… దొరస్వామ్యంపై తిరగబడ్డ కాళిక
హింసలేని సమాజంకై ఎగరేసిన పతాక
సమత కోసం…స్వేచ్ఛ కోసం ఆలపించిన గీతిక
నారీలోకపు విముక్తి కోసం నడుము కట్టిన నాయిక
నేడు పాలకులు కోస్తున్నారు అన్నదాతల కుత్తుక
మహిళపై సాగిస్తున్నారు అత్యాచారాలు ఎడతెగక
సాగదింక సాగదంటూ మనువాదుల ఏలిక
సమైఖ్య సమరానికి కదులుతున్న నావిక
ఆశావహుల ఆదరించే అభ్యుదయపు వేదిక
వివక్షతను ప్రశ్నించే గొంతుక, కలకత్తా కాళిక నాళిక, రుద్రాళిక నయ జ్వాలిక
భూమిక చూపుతుంది పక్కా ప్రణాళిక
జాగు చేయక సాగుదాం ఇక వెనకడుగేయక