ఆమె…
స్వర్గంలో ఉండనీ
నరకంలో ఉండనీ…
ఆకాశంలో ఉండనీ
పాతాళంలో ఉండనీ…
ఆమె…
ఎడారుల్లో ఉండనీ
మైదానాల్లో విహరించనీ…
శిఖరాలనధిరోహించనీ
లోయల్లో కూరుకుపోనీ…
ఆమెది
చక్రంతిప్పే నేర్పే కానీ
చీపురుపట్టే చెయ్యేకానీ…
లోకాలను పాలించే ఏలికే కానీ
పాకీపనుల బాలికే కానీ…
ఆమె…
పథాన్ని నిర్దేశించే
రిమోట్ మాత్రం అతని చేతుల్లోనే…!
ఆమె చుట్టూ
పరిభ్రమిస్తున్న కంట్రోలింగ్ మాత్రం
అతని ఆధీనంలోనే…!
కనురెప్ప
రోజుకెన్నిసార్లు కొట్టుకుందో…
కాలి పాదం
ఎక్కడెక్కడ అడుగిడిందో…
లెక్కలన్నింటినీ ఆరాతీసే
కాపీరైట్స్ ఆ రిమోట్ గుప్పిట్లోనే…!
రెటీనామీది చిత్రాలే కాదు
రేఖామాత్రపు అంతర్ ఫుటేజీ కూడా
తెరచి తరచి విశ్లేషించనిదే
అది రిమోట్ ఎట్లా అవుతుంది…!
అన్నట్లు…
ఏ రిమోటూ నియంత్రించని
మరే రింగుమాస్టారూ ఆడించని
ఆ మరో లోకం ఎక్కడుందో…!
అసలుందో… లేదో…!?
ఉంటే…
ఎప్పుడు సాకారమవుతుందో
ఆ స్వప్నలోకం…
మరెప్పుడు ఆకారానికొస్తుందో…!!