భూమిక ఉమెన్స్ కలెక్టివ్ 16 రోజుల యాక్టివిజమ్ పూర్తయిన సందర్భంలో హోటల్ అక్షర గ్రాండ్లో భూమిక మిత్రలు, వాలంటీర్లు మరియు సిబిఓ లీడర్లతో కలిసి 10 డిసెంబర్ 2020న సమావేశం నిర్వహించడం జరిగింది. భూమిక ఉమెన్స్ కలెక్టివ్ ఛీఫ్ ఫంక్షనరీ కొండవీటి సత్యవతి మాట్లాడుతూ భూమిక సంస్థ ఎప్పుడు ప్రారంభమయింది, దాని ప్రస్థావం గురించి వివరించారు. తర్వాత 16 రోజుల యాక్టివిజమ్ సందర్భంగా భూమిక సంస్థ నిర్వహించిన కార్యక్రమాల గురించి తెలుపుతూ కొత్తగా ప్రారంభించిన మొబైల్ లైబ్రరీ గురించి వివరించారు. పిల్లలు, పెద్దలు అందరూ ఈ లైబ్రరీని ఉపయోగించుకోవాలని ఆమె కోరారు. అలాగే భూమిక సంస్థ అందరూ ఒకచోట చర్చించుకునే అవకాశం కల్పించింది కాబట్టి అందరూ చర్చల్లో భాగస్వాములు కావాలని ఆమె కోరారు.
ఈ కార్యక్రమానికి రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భాగవత్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. కొండవీటి సత్యవతి గారు ఆయనను వేదిక మీదికి ఆహ్వానిస్తూ స్త్రీల పట్ల ఆయనకు ఉన్న సెన్సిటివిటీని గురించి ప్రత్యేకంగా తెలిపారు. భూమిక యొక్క ముఖ్య ఉద్దేశ్యం కేవలం మహిళల హక్కులే కాకుండా బాలల హక్కులను కూడా కాపాడడమని ఆమె తెలిపారు. భూమిక ప్రయాణం గురించి తెలుపుతూ ఈ ప్రయాణంలో సహాయపడిన ప్రతి ఒక్కరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. నేడు అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా యుఎన్ డిక్లరేషన్ గురించి వివరిస్తూ భారతదేశం ఏయే ఒడంబడికలను పొందుపరిచిందో తెలిపారు. అలాగే మహిళల హక్కుల గురించి, రాజ్యాంగంలో పొందుపరచిన ప్రాథమిక హక్కుల గురించి తెలుసుకోవలసిన ఆవశ్యకత ఎంతగానో ఉందని, కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ వాటి గురించి తెలుసుకోవాలని ఆమె చెప్పారు.
ముఖ్య అతిధిగా పాల్గొన్న రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భాగవత్ మాట్లాడుతూ భూమిక సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమాలన్నీ మహిళలకు, బాలలకు సంబంధించినవి కావడం, పోలీసులకు, ఇతర కార్పొరేట్ సంస్థలకు ‘జెండర్’ అంశంమీద అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం శ్లాఘనీయమని పేర్కొన్నారు. తర్వాత జస్టిస్ వర్మ కమిటీ ప్రతిపాదించిన సిఫారసుల గురించి ఆయన క్లుప్తంగా వివరించారు. పని ప్రదేశంలో జరిగే లైంగిక వేధింపుల గురించి తెలుపుతూ దాని కోసమే ప్రత్యేకమైన చట్టం ఉందని, ఆ చట్టంలోని కమిటీల గురించి వివరించారు. స్టాకింగ్ గురించి తెలుపుతూ సభ్యులను స్టాకింగ్ అంటే ఏమిటని అడిగారు. సమావేశంలో పాల్గొన్న సభ్యులు తెలియదని చెప్పడంతో ఏ వ్యక్తయినా ఒక మహిళను ఆమె అభీష్టానికి విరుద్ధంగా వెంబడిస్తూ, పదే పదే ఆమెతో సంబంధం పెంచుకోవడానికి చేసే ప్రయత్నాన్ని స్టాకింగ్ అంటారని, ఇది కూడా చట్ట వ్యతిరేక చర్య అని తెలిపి, దానికి సంబంధించి చట్టం, అందులోని శిక్షల గురించి క్లుప్తంగా వివరించారు. ఎప్పుడైనా ఏ మహిళ/బాలిక అయినా షాపింగ్‌కి వెళ్ళినపుడు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి కూడా వివరించారు. తర్వాత ఓయరిజమ్ గురించి తెలుపుతూ ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడినట్లైతే వారి నేరం రుజువులతో పాటు నిరూపణ అయితే చట్టం వారిని దోషులుగా నిర్ణయిస్తూ తగిన జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ కూడా విధించబడతాయని ఆయన తెలిపారు.
ఉద్దేశ్యపూర్వకంగా యాసిడ్‌తో దాడి చేసినచో సదరు వ్యక్తికి 10 సంవత్సరాల నుండి యావజ్జీవ ఖైదుతో పాటు జరిమానా కూడా విధించబడుతుందని తెలిపారు. చట్టం దృష్టిలో అందరూ సమానమే కాబట్టి భయపడకుండా నేరాల గురించి ఫిర్యాదు చేయాలని ఆయన కోరారు. ఒకవేళ ఫిర్యాదు చేయడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే ఫోన్ ద్వారా కానీ, మెసేజ్ ద్వారా కానీ సంఘటనను తెలియజేయమని చెప్పారు. ఈ సందర్భంగా మహేశ్ భాగవత్ తన ఫోన్ నంబర్‌ను అందరితో పంచుకొని, ఎటువంటి సమస్య వచ్చినా తెలపాలని కోరారు. మనమందరం కలిసి హింసలేని సమాజంతో పాటు నేర రహిత సమాజం నిర్మించాల్సిన అవసరం ఎంతగానో ఉందని, దానికోసం అందరం కలిసి కృషి చేయాలని ఆయన కోరారు. తాను నల్లగొండలో ఎస్పీగా పనిచేసిన సందర్భంలో అక్కడ పిల్లల విక్రయం, కొనుగోలు చాలా పెద్ద ఎత్తున జరుగుతుండేవని, అది చాలా పెద్ద నేరమని అన్నారు. చిన్నపిల్లలతో అశ్లీల చిత్రాలు చిత్రించడం, బాల్య వివాహాలు కూడా నేరమేనని తెలుపుతూ, వీటన్నింటినీ కట్టడి చేయాలంటే విద్య చాలా పెద్ద పాత్ర పోషిస్తుందని, కాబట్టి అందరూ బాలికల విద్యను ప్రోత్సహిస్తూ మహిళల సాధికారతకు ముందడుగు వేయాలని ఆయన కోరారు. ఇటీవల జరుగుతున్న నేరాలలో అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోంది కాబట్టి మహిళలు, బాల బాలికలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు. రంగారెడ్డి జిల్లా ణకూూూ సెక్రటరీ, ఉదయ్ కుమార్ ప్రసంగిస్తూ మన కమిషనర్ గారు చెప్పిన చట్టాలన్నీ కూడా చాలా ముఖ్యమైనవని, చాలా అవసరమైనవని చెప్పారు. వాటి గురించి తెలుసుకొన్న సమాచారం ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. అలాగే ప్రతి మహిళకు, బాలికకు కూడా సమాన హక్కులు ఉన్నాయని, కానీ గర్భంలో ఉండగానే లింగ నిర్ధారణ జరిపి, గర్భస్రావం చేయిస్తున్నారని, ఇది చాలా పెద్ద నేరమని, దీన్ని అరికట్టడానికే ‘ూజ ూచీణు’ చట్టం వచ్చిందని వివరించారు. అలాగే నిర్బంధ విద్యా చట్టం క్రింద 14 సంవత్సరాల లోపు బాలలందరూ కూడా ఖచ్చితంగా విద్యను అభ్యసించాలని ఆయన సూచించారు. పోక్సోచట్టం గురించి చెబుతూ ఇది చాలా ఖచ్చితమైన చట్టమని, ఒకవేళ ఎవరైనా బాలలు, ముఖ్యంగా 18 సం||లలోపు మగ పిల్లలు లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నిరూపణ అయితే శిక్షలు చాలా కఠినంగా ఉంటాయని, కాబట్టి తల్లిదండ్రులందరూ తమ మగ పిల్లలకు చట్టం మీద అవగాహన కల్పించాలని ఆయన కోరారు. తర్వాత ఆయన మహిళల చట్టాల గురించి క్లుప్తంగా వివరించారు. అనంతరం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ విజయభవాని మాట్లాడుతూ 1991లో యూఎన్‌లో జరిగిన జజుణూఔ ఒడంబడికల గురించి క్లుప్తంగా వివరించారు. అందరం కలిసి హింసలేని, నేర రహిత సమాజాన్ని నిర్మించాలని, అలాగే మహిళా సాధికారతకు కృషి చేయాలని ఆమె కోరారు.
ట్రైనింగ్ కో-ఆర్డినేటర్ అనూరాధ మాట్లాడుతూ ఇంత చక్కగా మహిళలకు సంబంధించిన చట్టాల గురించి తెలుసుకునే అవకాశం కల్పించారని, కాబట్టి అందరూ వినడమే కాక తమ చుట్టుపక్కల ఎవరైనా మహిళలకు/బాలికలకు హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే భూమిక మిత్రలుగా, వాలంటీర్లుగా మరియు సిబిఓ లీడర్లుగా అందరూ ఏకమై తిరిగి వారి హక్కులను పొందే విధంగా చేయవలసిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.
అనంతరం సత్యవతి గారు మాట్లాడుతూ బాలల హక్కుల ఉల్లంఘన జరగకుండా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉంది కాబట్టి ఈ రోజు అందరం ప్రతిజ్ఞ చేద్దామని కోరుతూ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. తర్వాత కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులను మాట్లాడవలసిందిగా ఆమె కోరారు. భగత్ సింగ్ నగర్, ఫేజ్-1 నుండి సిబీఓ లీడర్ మాట్లాడుతూ ఇంతకుముందు బాధితులతో ఎలా మాట్లాడాలో తెలిసేది కాదని, కానీ భూమికలో చేరిన తర్వాత బాగా మాట్లాడగలుగుతున్నామని, అవసరమైతే భూమిక హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేస్తున్నామని చెప్పారు. బతుకమ్మ కుంట నుంచి వచ్చిన భూమిక మిత్ర, వారి బస్తీలో యూత్ గ్రూప్ ఏర్పాటు జరిగిందని, దానిద్వారా బస్తీలో ఎక్కువగా ఉండే త్రాగునీటి సమస్య మరియు ఈవ్ టీజింగ్‌ను పరిష్కరించుకోగలిగారని చెప్పింది. ‘భూమిక అంటే ధైర్యం’ అని ఆమె పేర్కొంది.
న్యూ అచ్చయ్య నగర్ నుంచి రేణుక మాట్లాడుతూ భూమిక సంస్థ తమకు అన్ని క్లిష్ట సమయాల్లో ఆదుకుంటోందని, భూమిక సంస్థలో పనిచేస్తున్న ఫీల్డ్ కో-ఆర్డినేటర్ మంజుల తమకు తమ తల్లిదండ్రులు కూడా ఇవ్వలేని సహాయ సహకారాలను అందజేస్తున్నారని తెలిపింది.