ఒక మనిషిలో మరో మనిషి
వుంటడంటే నమ్మలేదామె
అతిదగ్గరైతే గాని
తెలియలే అసలు రూపు
అయినా సరే…!
అర్థనారీశ్వరుడని తలచి
ఆరాధనతో అలుముకొని
పాదదాసిగా ప్రణమిల్లుతూ
ఆమె ఆశలు ఊసులు కోరికలు కోపాలు
బంధాలు అనుబంధాలు ఆత్మాభిమానాలన్ని
హృదయాంధకారంలో బంధించి
చిరునవ్వై చిగురించి
బాహ్య మనిషి చేతిలో భాగ్యరేఖై ఎదిగి
లక్ష్మీదేవిగా ఎదలో ఒదిగి
అతని అరచేతిలో
హారతి కర్పూరంలా కరిగి
విద్యా జ్యోతిగా వెలిగి
లోకమంతా ప్రసరించి
అతని త్యాగాలకు తార్కాణంగా నిలిచి
అభినందనల వెల్లువలో
తడిసి ముద్దవుతున్న తరుణంలో
మనిషిలోని మరో మనిషి
అపరిచితుడై పలకరిస్తే…!
అల్లాడి పోదా అలుపెరుగని ధాత్రి…!!