ఏంది వయా
గీ కుంభమేళా అంటే…!?
ఆహా…!
నాకు తెల్వక అడుగుతా…
ఇదింకా మహాకుంభమేళానటా
నూటా నలభై నాలుగేండ్ల కొక్క సారంట…
అదే నదీ ప్రవాహం
అవ్వే నీళ్ళూ
అదే… భూగోళం
అవ్వే… భ్రమణ పరిభ్రమణాలు…
ఇగ కొత్తగా గిదేంది వయా…!
పగలూ రేయీ… వారాలూ వత్సరాలూ
కాలాలూ… మాసాలూ… ఋతువులూ అన్నింటికీ
మనమే పేర్లు పెట్టుకున్నం.
కడుపున పుట్టిన పిల్లలని పిలిచినట్లు
పావురంగ…పిలుసుకుందామనీ
గా సునామీలకూ తుఫాన్లకూ పెడుతలేం…కాటకలవకుంట
గట్లనే ఇవ్వి కూడా…!
ఇంకెక్కడివి వయా
ఇంతకు మించి
రాసులూ రాహు కాలాలూ రాశి ఫలాలు
వర్జాలూ దుర్మూహుర్తాలూ
అవన్నీ నీ బుద్దిల పుట్టిన అభూత కల్పనలు
ఖగోళాన్ని వస్త్రగాలం పట్టినా కానరావు
ఎవలు పుట్టిచ్చిండ్రో గానీ
వాళ్ళ బతుకుతెరువు కోసమో
నిన్ను భయపెట్టడం కోసమో అయ్యుంటది…!
ఒగాల ఉన్నా…
ఓ దేశానుంటయ్ ఇంకో దేశానుండయా…!?
పవిత్ర స్నానాలకి పుణ్యం వత్తదట
అయితే…
పాపం చేసినట్టు ఒప్పుకున్నవ్ గదా…!
ఇదో అడ్డదారి…
ఎన్నన్నా చెయొచ్చా ఏందీ..!?
సాధు…సన్నాసులకు
ఇండ్లుండవు…
తావులుండవ్ అంటే అదో అర్థం పర్థం…!
మరి నీకేందివయా…!?
దినామ్… నీళ్ళు ఓసుకుంటలెవ్వా…
మురికి కడుక్కుంటా లెవ్వా…
సూడ పోయినప్పుడు చెయ్యాలిగానీ
తానానికే పోతారువయ్యా…గింత కరోనా గత్తరల…!!!
గతాన్ని మరిస్తే… ఎట్లా
ఎన్ని కలరాలూ మరెన్ని తొక్కిసలాట మరణాలూ
చూడలేదూ…!?
అవునూ
ఒక్కటడుగుతా… నిజం చెప్పుండ్రి…!?
అది పవిత్ర మేళానే కదా
కుప్పలు తెప్పలుగా
కరోనా ఎట్లా సోకవట్టే
సావులెట్లా పెరుగవట్టే…!?
దీని మర్మమేందో సోంచాయించుండ్రి జెర…!