ఎన్ని తీగె సాగె కలల్ని
నిర్మోహంగా తుంచేసి
ఎన్ని ఆలోచనా అలల్ని
నిర్దయగా అదుపుచేసి
ఎన్ని వంకర చూపుల తూపుల్ని
విరాగిలా భరించి
ఎన్ని వికృత చేష్టల వలయాల్ని
వేదాంతిలా జయించి
ఆడపిల్లగా ఎదిగావో…
ఎన్ని నైపుణ్యాల పందిళ్ళను
నిరాశగా నేలకూల్చి
ఎన్ని ఆశల రెక్కల్ని
నిర్ద్వంద్వంగా కత్తిరించి
ఎన్ని ఉద్విగ్నతల ఉప్నెనల్ని
ఉక్కు పిడికిట బంధించి
ఎన్ని ఉవ్వెత్తు స్పందనల్ని
ఉదయించగానే చిదిమేసి
పెళ్ళిపీటలెక్కావో…
ఎన్ని ఒడిదుడుకుల ప్రకంపనల్ని
ఒద్దికగా ఓర్చుకుని
ఎన్ని పౌరుషాల లావాల్ని
పుట్టగానే పూడ్చేసి
ఎన్ని సర్దుబాట్ల సంద్రాల్ని
సులువుగా ఈదేసి
ఎన్ని బంధాల బరువుల్ని
బాధ్యతగా మోసి
అమ్మవయ్యావో…
ఎన్ని ఆనందపు హరివిల్లుల్ని
ఆదిలోనే అడ్డుకుని
ఎన్ని ఆటవిడుపు సుమగంధాల్ని
ఆస్వాదించకనే త్యజించి
ఎన్ని విశ్రమించే రాత్రులను
వినయంగా సేవలకర్పించి
ఎన్ని మనసైన ఇష్టాలను
పిందెలుగానే రాల్చేసి
నీ ఔన్నత్యాన్ని నిలుపుకున్నావో…
అనితర సాధ్యం నీ జన్మ!
అందుకో తొలివందనం అమ్మా!!
(మే 2, మాతృదినోత్సవం సందర్భంగా…)