కరోనా మృత్యుఘోష ` పట్టని ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణులు – కొండవీటి సత్యవతి

కరోనా సెకండ్‌ వేవ్‌ సృష్టిస్తున్న కల్లోలం, విధ్వంసం గమనిస్తుంటే, పిట్టల్లా రాలిపోతున్న మనుషుల్ని చూస్తుంటే, గుండెల్లోంచి పొంగుకొస్తోన్న దుఃఖం గొంతులో సుడులు తిరుగుతుంటే ఓదార్పు కోసం ఏ దిక్కు చూడాలి, ఎవరి భుజాన్ని అడగాలి, ఎవరి గుండెమీద వాలి భోరున ఏడవాలి? సంవత్సర కాలంగా జరుగుతున్న దారుణ పరిణామాలు, మనిషికి మనిషి కాకుండా పోతున్న వైనాలు ఎంత గుండె నిబ్బరం ఉన్న మనిషైనా ఎలా తట్టుకోగలుగుతాడు.

బంధుమిత్రుల మరణాలు, మీడియా చూపిస్తున్న అమానవీయ దృశ్యాలు, భయభ్రాంతులను చేస్తున్న అంశాలెన్నో. ఆక్సిజన్‌ కరువు, మందులు కరువు, హాస్పిటల్‌లో పడకల కరువు. కరువుల కాలం. సామాన్య మానవులకు ఉపాధి లేదు. చిన్న ఉద్యోగస్తులకు జీతాల్లేవు. వలస కార్మికులు త్రిశంకుస్వర్గంలో వేలాడుతున్నారు. సొంత రాష్ట్రాల్లో పనుల్లేక వేరే రాష్ట్రాలకు వలసొచ్చి మళ్ళీ లాక్‌డౌన్‌ పెడతారనే వదంతులతో మళ్ళీ తిరుగు వలసలు మొదలయ్యాయి. ముఖ్యంగా ఇటుకల బట్టీలలో పనిచేసే ఒడిస్సా వలస కార్మికుల పరిస్థితి దయనీయంగా మారడం ఎన్నో సంఘటనల్లో చూస్తున్నాం. నిన్నటికి నిన్న నిజామాబాద్‌లో ఇటుకల బట్టీల్లో పనిచేస్తున్న ఒరిస్సా వలస కార్మికులను యజమాని జీతాలీయకుండా వెళ్ళగొట్టాడు. ఇలాంటి మరెన్నో దారుణాలను చూడబోతున్నాం.
ప్రపంచమంతా కరోనా సెకండ్‌ వేవ్‌ ప్రమాదం పొంచి ఉందని మొత్తుకుంటున్నా తలకెక్కించుకోని పొగరుబోతు పాలకులు దేశమంతా ఎలక్షన్‌ ర్యాలీల పేరుతో ప్రజల్ని బహిరంగ సభల్లో జమచేసి కరోనాకు రాచబాట వేసింది. కరోనా ఉనికే లేదన్నట్లు ప్రవర్తించిన ప్రభుత్వాల చేతకానితనం వల్లనే ఈ రోజు దేశంలో ఆక్సిజన్‌ సంక్షోభం తలెత్తింది. ఆనాడే లక్నో ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్‌ కొరత గురించి మాట్లాడిన డా॥కఫీల్‌ఖాన్‌ను జైలు పాల్జేసిన యోగి ప్రభుత్వం, ఆక్సిజన్‌ దొరకక చనిపోయిన కోవిడ్‌ రోగుల మరణాలకు బాధ్యత తీసుకుతీరాలి. కానీ ఈ ప్రభుత్వాలకు రాజకీయ ఎజెండాలు, ఎన్నికలు, ఓట్లు, సీట్ల మీదున్న ప్రేమ ప్రజల మీద ఎక్కడుంది? ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నా సరే కరగని పాషాణాలు ఈనాటి నేతలు.
జాతర్ల పేరుతో ప్రజల ప్రాణాలను మహా రిస్క్‌లో పడేసిన ప్రభుత్వం… కరోనా సెకండ్‌ వేవ్‌ గురించి ప్రజలకు ఎలాంటి హెచ్చరికలూ చేయలేదు. ప్రభుత్వాలకు ఎలాంటి సంసిద్ధతా లేదు. కరోనా మాయమైపోయిందన్న చందాన రిలాక్స్‌ అయిపోయారు. పెను ఉపద్రవం మీద పడబోతోందని తెలిసినా పట్టించుకోని ప్రభుత్వాల అలసత్వం, నిర్లక్ష్యం వల్లనే ఈ రోజు మనందరికీ ఈ దుస్థితి దాపురించింది. తనకి సంసిద్ధత లేదు. ప్రజల్ని హెచ్చరించిందీ లేదు. అందుకే ప్రజలు విందులు, వినోదాలు, జాతర్లు… అన్నింటా పెద్ద సంఖ్యలో గుమిగూడి ప్రాణాల మీదకి తెచ్చుకోవడమే కాక తమ చుట్టూ ఉన్నవాళ్ళనీ ప్రమాదంలో పడేశారు. మతం పేరుతో జరుగుతున్న జాతర్లు, గుళ్ళ దగ్గర జరిగే బ్రహ్మోత్సవాలు, వీటన్నింటికీ లక్షల్లో హాజరైన ప్రజలకి ఎలాంటి కనీసావగాహనాన ఇవ్వకుండా రాబోయే ప్రమాదాన్ని అంచనా వేయలేని ప్రభుత్వాలు ఈ రోజు వేలల్లో చనిపోతున్న సామాన్య ప్రజల మరణాలకు బాధ్యత వహించాలి.
అన్నింటికన్నా ఘోరమైన విషయం కరోనా విస్ఫోటనం జరుగుతున్న సమయంలోనే లక్షల్లో జనం గుమిగూడే కుంభమేళా లాంటి మత క్రతువులకు అనుమతి ఇవ్వడం. గంగలో మునగకపోతే పుట్టగతులుండవని నూరిపోసి జనాన్ని కుంభమేళా వరకు నడిపించిన మత మూఢులు, అఖాడాలు, సన్యాసులు ప్రజలు కరోనా కాటుకు బలవ్వడానికి కారకులయ్యారు. ముప్ఫై మూడు కోట్ల దేవతలెగబడ్డ ఈ దేశంలో ఏ దేవుడైనా కరోనా వైరస్‌ వ్యాప్తిని ఆపగలిగాడా? లాక్‌డౌన్‌ టైంలో తాళాలేసుకుని కూర్చున్న దేవుళ్ళు ప్రజల నమ్మకం మాత్రమే. ఏ దేవుడూ ఎవరినీ రక్షించిన దాఖలాల్లేవు. ప్రజల్ని భ్రమల్లో ముంచి, మభ్యపెట్టడమే దేవుళ్ళ పేరుతో ఆలయాల్లో తిష్టవేసిన పనీపాటా లేని పురోహిత వర్గం చేసే పని. దేశ ప్రజల్లో హేతువాద దృక్పథానికి బదులు మత మౌఢ్యాన్ని, మత అసహనాన్ని ప్రేరేపిస్తూ గుళ్ళమీద, విగ్రహాల మీద కోట్లు ఖర్చుచేసే పాలకులు కరోనా బాధిత ప్రజలకు కనీసం ఆక్సిజన్‌ అందించలేకపోయాయి. గుళ్ళమీద కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే ప్రభుత్వాలు ఆసుపత్రుల నిర్మాణాన్ని గాలికొదిలేశాయి. ప్రజారోగ్య వ్యవస్థ కుప్పకూలేలా చేశాయి. గొప్పలకు పోయి తన ప్రజలకు అందించకుండానే వాక్సిన్‌ను బయట దేశాలకు పందేరం చేశారు. ఫలితం వాక్సిన్‌ల కరువు, విపరీతంగా పెరిగిపోతున్న కరోనా మరణాలు. ప్రజలు తీవ్ర భయాందోళనలో, మానసిక ఆరోగ్యం కోల్పోయి బతుకుతున్నారు.
కరోనా సెకండ్‌ వేవ్‌ ఉధృతికి కారణం పాలకుల నిష్క్రియాపరత్వం, ఉదాశీనత, వాళ్ళ రాజకీయ ఎజెండా. ఎలాంటి ముందు జాగ్రత్తలు లేకుండా ప్రవర్తించిన ప్రజలు ఫలితాన్ని అనుభవిస్తున్నారు. కరోనా విస్ఫోటనం నుండి కోలుకునేది ఎన్నడో, ఎప్పుడో ఎవరికీ అంతుపట్టని ప్రశ్నగానే మిగిలి ఉంది. మన జాగ్రత్తలో మనముండడమే మనం చెయ్యాల్సిన పని.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.