చిన్నప్పుడు ఆటల్లో దెబ్బలు తగిలి రక్తం కారుతుంటే గాయపాకు పసరు వేస్తే చటుక్కున రక్తం కారడం ఆగిపోయేది. గాయం మెల్లగా మానిపోయేది. ఆ కాలానికి అది వైద్యమే. నల్లేరు కాడల చారు కడుపును చక్కగా శుభ్రపరుస్తుంది. అదీ ఒక వైద్యమే. ఇన్ని రకాల టూత్‌పేస్టులు దండెత్తని రోజుల్లో వేపపుల్ల, సరుగుడు పుల్లలు, ఉత్తరేణి పుల్లలు
బ్రహ్మాండంగా పళ్ళను శుభ్రపరిచేవి. ఇటికావల నుంచి వచ్చే బూడిద పళ్ళను తళతళ మెరిపించేది. తులిసాకు దగ్గు తగ్గిస్తుందని, లవంగం బుగ్గన పెడితే దగ్గును ఆపుతుందని, గసాలు తింటే విరోచనాలు ఆగిపోతాయని తరతరాలుగా ఈ జ్ఞానం మనకి అందుబాటులో ఉంటూ వస్తోంది. మనం రోజువారీ కొన్ని శారీరక ఇబ్బందులకు వాడుకునే చెట్ల మందులు కానీ, ఆయుర్వేద మందులు కానీ, మరో రకమైన మందు కానీ శాస్త్రీయంగా పరిశోధించి నిర్ధారించినవి కావు. ఇంట్లో ఉండే వస్తువులు, ప్రతిరోజూ వాడుకునే వస్తువులు, అందరికీ అందుబాటులో దొరికే వాటిని వైద్యంగా వాడుకోవడం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు.
చెట్ల మందులు, ఆయుర్వేద, నేచురోపతీ మందులు భారతీయుల జీవన విధానంలో ముడిపడి ఉన్నాయి. వీటిని అంగీకరించడం అంటే అల్లోపతిని వ్యతిరేకించడం కాదు. ఇప్పుడు జరుగుతున్న చర్చ భారతీయ వైద్యం వర్సెస్ ఇంగ్లీష్ వైద్యంగా చిత్రించడం తప్పు. ఆయుర్వేదాన్ని సమర్ధించడమంటే అల్లోపతిని వ్యతిరేకించడం కాదు. రోగికి మేలు చేసే మందు ఏదైనా మంచిదే. ‘‘మీకు రోగమొస్తే ఇంగ్లీషు వైద్యమే దిక్కు’’ అంటూ వెక్కిరించడం సమర్ధనీయం కాదు. ఇక్కడ నేనొక ఉదాహరణ చెబుతాను. నాకు చాలా చిన్నవయస్సులోనే మోకాళ్ళ నొప్పులొచ్చాయి. బస్సు ఎక్కడం, దిగడం చాలా కష్టమయ్యేది. మోకాళ్ళ దగ్గర టక్‌టక్‌మంటూ శబ్దాలొచ్చేవి. చాలా కాలం ఇబ్బందిపడ్డాను. ఒక ఫ్రెండ్ కోఠిలోని ఒక ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది. ఆయన నెలరోజులకు మందులిచ్చారు. నాకిప్పటికీ ఆ మందు పేరు గుర్తే. ‘‘సింహనాద గుగ్గిళ్ళు’’. నెలరోజులు వాడిన తర్వాత మోకాళ్ళ నొప్పులు తగ్గిపోయాయి. తర్వాత కూడా కొంత కాలం వాడాను. ఆ మందు వాడి ముప్ఫై ఏళ్ళయింది. ఇప్పటివరకూ నాకు మోకాళ్ళ నొప్పులు రాలేదు. ఇది నా అనుభవం.
ఆ మందు శాస్త్రీయమైందా? పరిశోధనలు జరిగాయా? అందులో ఏమి వాడారు? ఈ విషయాలేవీ నాకు తెలియదు. నా మోకాళ్ళ నొప్పులు ఖచ్చితంగా తగ్గాయి. ఇప్పుడైతే మందులు వాడడం ఉండదు. మోకాలి చిప్పల మార్పిడి ఆపరేషన్లు చేయించుకోవడమే. నేను దీన్నేమీ తక్కువ చేయడం లేదు. మోకాలి చిప్పలు అరిగిపోయి, నడవలేని వాళ్ళకు ఈ ఆపరేషన్ గొప్ప రిలీఫ్. అలాగని నేను వాడి నొప్పుల్ని తగ్గించుకున్న ఆయుర్వేదం మందును చిన్నచూపు చూసి జోకులెయ్యడం తగదని చెబుతున్నాను. ఆయుర్వేదాన్ని సమర్ధించినంత మాత్రాన నేను సైన్సుకి వ్యతిరేకమని ముద్ర వేయడం మూర్ఖత్వమే అవుతుంది.
ఇంకో విషయం ఏమిటంటే ఇంగ్లీషువాడు లేదా తెల్లతోలు వాడు చెప్పిందే ప్రామాణికమని మన బుర్రల్లో ముద్రపడిపోయింది. వాళ్ళల్లా బతకడమే కల్చర్ అనే భ్రమలు కూడా చాలా ఎక్కువే. భారతీయ వస్త్రధారణని, భారతీయ ఆహార పద్ధతుల్ని, వైద్య పద్ధతుల్ని, అన్నింటినీ వెక్కిరించి, హేళన చేసి ‘‘అన్ సైంటిఫిక్’’ అని తీసిపారేసిన ఆంగ్లేయులే ఇక్కడ మనకు ఆదర్శం. భారతదేశ వాతావరణ పరిస్థితులకు ఏ మాత్రం సూటవ్వని సూట్లు, బూట్లు, కోట్లు, డైనింగ్ టేబుళ్ళు, కట్లరీ, తిండి వేళల నిర్ణయాలు బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, టీ స్నాక్స్ వీటన్నింటితో పాటు ఇంగ్లీషు వైద్యమే వైద్యమనే నమ్మకాలు. వీటన్నింటినీ అనుసరించే వాళ్ళు మాత్రమే ‘‘కల్చర్డ్ పర్సన్స్’’ అనే చెత్త నీతి కూడా భారతీయుల్లో బాగానే ప్రబలింది. నిజానికి భారతీయ సంస్కృతి, వస్త్రధారణ, తిండితిప్పలు, వైద్యం… ఇవన్నీ కూడా పాశ్చాత్య దేశాలకంటే చాలా భిన్నమైనవి. భిన్నమైన ప్రాంతాలున్న భారతదేశంలో విభిన్నమైన సంస్కృతులున్నాయి. జీవన విధానాలున్నాయి. వాటన్నింటినీ తోసిరాజని పాశ్చాత్య పద్ధతులే గొప్పవని, పాశ్చాత్య వైద్యాన్ని మించిన వైద్యం లేదంటే మాత్రం నేనొప్పుకోను.
ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణం లేని ఒక వైరస్‌కు మొదట్లో మందు లేదు. వ్యాధి లక్షణాలను బట్టి వైద్యం చేయడమే జరిగింది. జ్వరానికి డొలో, దగ్గుకు కాఫ్ సిరప్, ఇంకో దానికి ఇంకోటి మాత్రమే మందులిచ్చేవారు. అప్పటికి వాక్సిన్ లేదు. స్పష్టమైన మందులు లేవు. ప్లాస్మా థెరపీ అన్నారు. కొన్నాళ్ళు జనం దాని చుట్టూ తిరిగారు. స్టిరాయిడ్స్ అన్నారు. రెమ్‌డెసివిర్ అన్నారు. అవన్నీ ఇప్పుడు అవసరం లేదు, పనికిరావని అంటున్నారు. ఇష్టం వచ్చినట్లు స్టిరాయిడ్స్ వాడుతున్నారు. దాన్నుంచి బ్లాక్ ఫంగస్, వైట్ ఫంగస్, ఇంకేదో ఫంగస్ వస్తోంది అంటున్నారు. సో… అన్నీ ప్రయోగశాల మందులే. రోగుల మీద ప్రయోగిస్తున్న మందులే. ఇవన్నీ శాస్త్రీయంగా జరుగుతున్నాయనే నమ్ముతున్నాం. వాక్సిన్ కూడా ఖచ్చితమైన రక్షణనిస్తుందనే గ్యారంటీ లేకపోయినా తప్పకుండా అందరూ వాక్సిన్ వేసుకోవాలనే భావిస్తున్నాం. రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళు కూడా కోవిడ్ ఇన్‌ఫెక్షన్‌కి గురయ్యారు. చాలామంది చనిపోయారు. అయినా సరే ఎవ్వరూ వ్యాక్సిన్‌ని వెక్కిరించడంలేదే. చులకన చేసి మాట్లాడటం లేదే.
ఒక ఆయుర్వేద వైద్యుడు ఎలాంటి దుష్ఫలితాలను ఇవ్వని ఒక మందును కనుక్కున్నాను, ఇది కరోనా వైరస్‌ని అరికడుతుంది అని ప్రకటించగానే ప్రపంచమెందుకు అంతలా ఉలిక్కిపడిరది. ముఖ్యంగా కార్పొరేట్ వైద్య రంగం. ఒక్క పైసా కూడా ఆశించకుండా ఆయన వైద్యం చేస్తాననడం, లక్షలు గుంజే కార్పొరేట్ వైద్యరంగానికి ఎలా అంగీకారమౌతుంది. కార్పొరేట్ ఆసుపత్రుల్లో చేరిన వాళ్ళు ఎందుకు చనిపోతున్నారో లెక్కలు తియ్యాలి. వైద్యం లేని వైరస్‌కు వాళ్ళిస్తున్న వైద్యమేంటో ఎవరికి తెలుసు?
కానీ ఖర్చులేని మందు విజయవంతమైతే, కరోనా వైరస్‌ని కట్టడి చేస్తే ఫైవ్‌స్టార్ కార్పొరేట్ ఆసుపత్రులేమైపోవాలి. అందుకే ఆ వైద్యుడి మందును దుంపనాశనం చెయ్యాలని కుట్రలు జరుగుతున్నాయి. సైడ్ ఎఫెక్ట్ లేని, ఎవ్వరిమీదా ఎలాంటి దుష్ప్రభావమూ చూపని మందును ప్రయత్నించనిద్దాం, మానవాళికి ఉపశమనం కలగనిద్దాం అనే పెద్దమనసు కార్పొరేట్ క్రూరత్వం నుంచి ఆశించలేం కానీ తమకిష్టమైన వైద్యం పొందే హక్కు ప్రజలందరికీ ఉందనేది మాత్రం అంగీకరించాల్సిన విషయం.
వ్యక్తిగా నేను సైన్సును మాత్రమే అంగీకరిస్తాను. హేతువాద దృక్పథమే నేను అనుసరిస్తాను. శాస్త్రీయ పరిశోధనలే ఏ రంగాన్నైనా ఉన్నతీకరిస్తాయి. వైద్యానికి పరిశోధనే ప్రాణవాయువు. ఈ పరిశోధనలు అన్ని వైద్య విధానాల మీదా సశాస్త్రీయంగా జరగాలన్నదే నా డిమాండ్. ఒక్క అల్లోపతి మాత్రమే శరణ్యం అని ఎందుకనుకోవాలి? ఏమో! మిగిలిన వైద్య పద్ధతుల్లో కూడా మానవాళికి మంచి చేసే వైద్యం దొరకొచ్చేమే. ‘‘నాటు’’ అని కొట్టేయకుండా పరిశోధించడంలో తప్పులేదు కదా!